న్యూఢిల్లీ, జనవరి 19: సునంద మృతిపై దర్యాప్తును వేగవంతం చేసి, వీలయినంత త్వరగా నిజాలను వెలికితీయాలని ఆమె భర్త శశిథరూర్ కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండేను కోరారు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ సహాయ మంత్రి కూడా అయిన థరూర్ ఆదివారం ఈ విషయమై షిండేకు లేఖ రాశారు. దర్యాప్తును వేగవంతం చేయాల్సిందిగా దర్యాప్తు అధికారులను ఆదేశించాలని ఆయన షిండేను కోరారు. దర్యాప్తుకు తాను పూర్తిగా సహకరిస్తానని స్పష్టం చేశారు. సునంద మృతిపై మీడియాలో వస్తున్న నిర్లక్ష్యపూరితమైన ఊహాగానాలను చదవడానికే తాను భయపడుతున్నానని ఆయన తన లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. థరూర్ భార్య సునంద పుష్కర్ (52) శుక్రవారం సాయంత్రం ఢిల్లీలోని ఒక లగ్జరీ హోటల్ గదిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. భార్యను కోల్పోయిన ఈ దుఃఖసమయంలో మీడియాలో విచ్చలవిడిగా వస్తున్న ఊహాగానాలు తనను భయకంపితుడిని చేస్తున్నాయని థరూర్ పేర్కొన్నారు. ఈ విషాద సమయాన్ని మీడియా అర్థం చేసుకోవడం లేదని, తన, తన భార్య బంధువులు, ఆత్మీయులతో కూడా తన దుఃఖాన్ని పంచుకోనివ్వడం లేదని తెలిపారు. దర్యాప్తులో వెల్లడయ్యే నిజాలు మినహా మరేవీ తన, తన భార్య ప్రతిష్టకు భంగం వాటిల్లడాన్ని నివారించలేవని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. సునంద ఆకస్మికంగా, అసహజంగా మరణించిందని ఆమె భౌతికకాయానికి పోస్టుమార్టం చేసిన ఎయిమ్స్ వైద్యులు ప్రకటించారు. ఆమె శరీరంపై కొన్ని గాయాలున్నాయని, అయితే మృతికి ఆ గాయాలే కారణమా? కాదా? అనేది చెప్పలేమని వారు పేర్కొన్నారు.
సునంద మృతిపై హోంమంత్రి షిండేను కోరిన థరూర్
english title:
d
Date:
Monday, January 20, 2014