న్యూఢిల్లీ, జనవరి 19: రిజర్వ్ బ్యాంక్ తాజాగా జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం వినియోగదారులు షాపింగ్ చేసినప్పుడు తమ డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డుతో ఆన్‌లైన్‌లో చెల్లింపులు చేసేప్పుడు తమ పిన్ నెంబర్‌ను టైప్ చేయడం తప్పనిసరి. అయితే ఇలా డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డును స్వైప్ చేసే వినియోగదారులను లక్ష్యంగా చేసుకొని ఒక వైరస్ ఇంటర్నెట్‌లోకి ప్రవేశించిందని సైబర్ సెక్యూరిటీ పరిశోధకులు కనుగొన్నారు. ట్రోజాన్ కుటుంబానికి చెందిన ‘డెక్స్‌టర్, బ్లాక్ పిఓఎస్, మెమరీ డంప్, గ్రాబర్’ అనే పేరు గల ఈ వైరస్ వేగంగా వ్యాపిస్తోందని కనుగొన్నారు. అమ్మకాల (పాయింట్ ఆఫ్ సేల్) కౌంటర్లలో ఉండే టెర్మినళ్లలోకి ఈ వైరస్ ప్రవేశించి సదరు వినియోగదారుల డెబిట్, క్రెడిట్ కార్డుల సమాచారాన్ని దొంగిలిస్తుంది. ఈ వైరస్ ఒక్కసారి సెక్యూరిటీ ప్రొటోకాల్స్‌ను ఛేదించుకొని విజయవంతంగా సిస్టమ్‌లోకి చొరబడిందంటే ఇక డెబిట్, క్రెడిట్ కార్డుదారుల పేరు, ఖాతా నెంబరు, ఎక్స్‌పైరేషన్ తేది, సివివి కోడ్ వంటి గుప్తమైన సమాచారాన్నంతా సేకరిస్తుంది. తర్వాత కాలంలో ఆ కార్డులపై దాడి చేస్తుంది. అందువల్ల రిటైల్ టెర్మినళ్ల వద్ద జాగ్రత్తగా ఉండాలని ఆ టెర్మినళ్ల నిర్వాహకులను, వినియోగదారులను కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సెర్ట్-ఇండియా) అప్రమత్తం చేసింది. ఇండియన్ సైబర్‌స్పేస్, సాఫ్ట్‌వేర్ ఆధారిత వౌలిక సౌకర్యాలు ఎలాంటి విధ్వంసక, హ్యాకింగ్ కార్యకలాపాలకు గురి కాకుండా కాపాడేందుకు నోడల్ డిపార్ట్‌మెంట్‌గా సెర్ట్-ఇండియా పనిచేస్తోంది.
డెబిట్, క్రెడిట్ కార్డు వినియోగదారులూ జాగ్రత్త!
english title:
o
Date:
Monday, January 20, 2014