హైదరాబాద్, జనవరి 19: రాష్ట్ర విభజన అనివార్యం అన్న లోక్‌సత్తా జాతీయ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణకు రానున్న ఎన్నికల్లో శృంగభంగం తప్పదని ఎపి ఎన్జీవో సంఘం ప్రధాన కార్యదర్శి ఎన్. చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. ఉన్నత చదువులు, ఉద్యోగం నుంచి వచ్చిన జెపి అలా మాట్లాడడం గర్హనీయమన్నారు. సమైక్యవాదుల ఓట్లతో గెలిచిన విషయం మరచి ఆయన ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో ఉద్యోగుల నుంచి ఒకర్ని జెపిపై పోటీకి దించుతామని తెలిపారు. అసెంబ్లీలో సమైక్య తీర్మానం పెట్టాలన్న డిమాండ్‌తో ఈ నెల 22న నిర్వహిస్తున్న ‘చలో హైదరాబాద్’కు రాష్టవ్య్రాప్తంగా ఉన్న సమైక్యవాదులు పెద్ద సంఖ్యలో హాజరై, విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన ఎపి ఎన్జీవో హోంలో సంఘం నేత వీరేంద్రబాబు, మారంరెడ్డి వెంకటేశ్వర్‌రెడ్డి, బొప్పరాజు వెంకటేశ్వర్లు తదితరులతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సామూహిక ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ధర్నా విజయవంతం ద్వారా సీమాంధ్ర ఎమ్మెల్యేలపై మరింత ఒత్తిడి పెంచుతామన్నారు. పార్టీలకు అతీతంగా సీమాంధ్ర ఎంపి, ఎమ్మెల్యేలు ధర్నాకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా ధర్నాకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. ఉద్యోగుల హెల్త్‌కారులకు సంబంధించి ప్రభుత్వంతో చర్చలు జరుపుతూనే మరోపక్క జివోలు జారీ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.
పరిష్కారం చూపితే ఆగ్రహమా?: లోక్‌సత్తా ధ్వజం
రాష్ట్రంలో రాజకీయ సంక్షోభానికి వాస్తవిక, ఇరు ప్రాంతాల ప్రయోజనాలనూ పరిరక్షించే పరిష్కారాన్ని చూపిన లోక్‌సత్తాపై సమైక్యవాదులు ఆగ్రహం వ్యక్తం చేయడం సరికాదన్నారు. సమస్యను పెంచి పోషించిన వారిని వదిలేసి పరిష్కారం చూపుతున్న లోక్‌సత్తాపై విమర్శలు చేయడం తగదని చెప్పారు. విభజన అనివార్యం అన్నందుకు లోక్‌సత్తాకు వ్యతిరేకంగా కొన్ని సంఘాలు ఆందోళనలకు పిలుపునివ్వడంపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కటారి శ్రీనివాసరావు ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. విభజన అనివార్యమైన నేపథ్యంలో సీమాంధ్ర ప్రయోజనాల పరిరక్షణకు జెపి ఫార్ములా గ్యారెంటీ ఇస్తుందన్నారు. మా ఫార్ములా కంటే అన్ని ప్రాంతాల ప్రయోజనాలనూ కాపాడే పరిష్కారం ఉంటే చెప్పాలని కటారి సవాల్ విసిరారు.
సిపిఐ నేత నారాయణకు
మాతృ వియోగం
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 19: సిపిఐ రాష్ట్ర సమితి కార్యదర్శి డాక్టర్ కె. నారాయణ మాతృమూర్తి ఆదిలక్ష్మి (83) ఆదివారం కన్నుమూశారు. వివిధ పార్టీలకు చెందిన పలువురు నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. నారాయణకు ఫోన్ చేసి తమ సానుభూతి తెలిపారు. అమెరికాలో ఉంటున్న మనవడు, మనవరాళ్ళు రావాల్సి ఉన్నందున అంత్యక్రియలు మంగళవారం హైదరాబాద్‌లోని శ్మశాన వాటికలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.