
ఇస్లామాబాద్, జనవరి 19: కేంద్ర మంత్రి శశిథరూర్, ఆయన భార్య సునందా పుష్కర్‌ల వైవాహిక బంధం విచ్ఛిన్నం కావడంలో తన ప్రమేయం ఏమీ లేదని పాకిస్తానీ జర్నలిస్టు మెహర్ తరార్ స్పష్టం చేసింది. శశిథరూర్‌తో తరార్ సంబంధాన్ని కొనసాగించడమే కాకుండా ఆయనను నిరంతరం ‘నీడలా అనుసరిస్తోందని’ ఆరోపించిన సునందా పుష్కర్ శుక్రవారం సాయంత్రం ఒక ఫైవ్‌స్టార్ హోటల్‌లో అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యవహారంలో తనకు ఏ పాపం తెలియదని, ఈ కుట్రలో తాను బాధితురాలినని తరార్ శనివారం రాత్రి పాకిస్తానీ టెలివిజన్ చానల్‌తో వాపోయింది. లాహోర్‌కు చెందిన తరార్ (45) శుక్రవారం సునందా పుష్కర్ మృతిచెందిన అనంతరం ‘ట్విట్టర్’లో తన ప్రొఫైల్ ఫొటోను మార్చేసింది. గతంలో తాను రెండుసార్లు శశిథరూర్‌ను కలుసుకున్నానని, ఈ ఏడాది ఏప్రిల్‌లో భారత్‌లోనూ, గత ఏడాది జూన్‌లో దుబాయ్‌లోనూ ఈ భేటీలు జరిగాయని, ఆ సమయంలో తనతో పాటు చాలా మంది అక్కడ ఉన్నారని తరార్ పేర్కొంది. ‘గతంలో నేను ఒక వ్యాసం రాస్తూ అందులో శశిథరూర్ పేరును ప్రస్తావించా. తనకు తెలియని మరో మహిళ శశిథరూర్‌ను విశేషంగా ప్రశంసించడం ఆయన భార్యకు నచ్చి ఉండకపోవచ్చు. దీంతో ఆమె నాతో మాట్లాడవద్దని శశిథరూర్‌ను కోరింది. అయినప్పటికీ ఆయన (శశిథరూర్) ట్విట్టర్ ద్వారా నాతో సంబంధాలను కొనసాగిస్తూనే ఉన్నాడు. శశిథరూర్‌తో నేను ఫోను ద్వారానో లేక ఇ-మెయిల్ ద్వారానో మాట్లాడటం వల్ల సునందా పుష్కర్‌కు వచ్చిన సమస్య ఏమిటో అర్థం కావడం లేదు. ప్రపంచంలో అందరితో మాట్లాడినట్టుగానే నేను శశిథరూర్‌తో మాట్లాడా. ఇందులో తప్పేముంది? అని తరార్ ప్రశ్నించింది. శశిథరూర్-సునందా పుష్కర్ మధ్య ఎప్పటి నుంచో సమస్యలు ఉన్నట్టు ‘గూగుల్’ ద్వారా స్పష్టమవుతోందని, ఈ సమస్యలు ప్రారంభమయ్యే నాటికి తాను ఎవరో కూడా సునందా పుష్కర్‌కు తెలియదని, ఆమె తనను ఎప్పుడూ నిందించలేదని, వారి వైవాహిక జీవితంలో తాను ఎన్నడూ జోక్యం చేసుకోలేదని తరార్ పేర్కొంది.