
న్యూఢిల్లీ, జనవరి 19: రాజధానిలో జరుగుతున్న బిజెపి జాతీయ మండలి సమావేశంలో ప్రసంగించిన సీనియర్ నాయకుడు అద్వానీ, ఓ వైపు పార్టీ ప్రధాన అభ్యర్థి నరేంద్ర మోడీపై ప్రశంసలు కురిపిస్తూనే మరోవైపు మితిమీరిన విశ్వాసం పనికి రాదని హితవు పలికారు. అంతేకాదు, 2004 లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఓటమికి ఈ మితిమీరిన విశ్వాసం కూడా ఒక కారణమని పేర్కొన్నారు. పదేళ్ల తర్వాత తిరిగి అధికారంలోకి రావడానికి పార్టీ చేస్తున్న కృషిలో ఎలాంటి లోపం ఉండకూదని ఆయన సలహా ఇచ్చారు. ‘2004 లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఓడిపోవడానికి మితిమీరిన ఆత్మవిశ్వాసం కూడా ఒక కారణం’ అని అద్వానీ అన్నారు. మనం మితిమీరిన విశ్వాసంతో ఉండకూడదు, అదే సమయంలో మనం పెట్టే కృషిలో ఎలాంటి లోపమూ ఉండకూడదని ఆయన పార్టీ నేతలకు సలహా ఇచ్చారు. ముస్లింలలో బిజెపి పట్ల అపనమ్మకాన్ని పోగొట్టాల్సిన అవసరం ఉందని కూడా అద్వానీ అన్నారు. తమను ఓట్లకోసమే ఉపయోగించుకుంటున్నారని, ఎవరు కూడా తమకు ఏమీ చేయలేదనే విషయం వాళ్లకు తెలుసు’ అని అద్వానీ అన్నారు.
పార్టీ ఇంత ఆత్మవిశ్వాసంతో ఉండడం తాను ఎప్పుడూ చూడలేదని అద్వానీ అంటూ, నరేంద్ర మోడీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించినందుకు పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్‌కు కృతజ్ఞతలు తెలియజేసారు. ‘లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ మెజారిటీ సాధిస్తున్న నమ్మకం ఉన్నందుకు, అలాగే నరేంద్ర మోడీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించినందుకు పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్‌కు కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను’ అని అద్వానీ అన్నారు.
...................
బిజెపి జాతీయ మండలి సమావేశంలో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీతో కరచాలనం చేస్తున్న ఆ పార్టీ సీనియర్ నేత అద్వానీ.