
లండన్, జనవరి 19: బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్-2 బాధ్యతలను తన కుమారుడు ప్రిన్స్ చార్లెస్‌కు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే, ఈ ఏడాది నుంచి ఆ ఇద్దరు అధికార బాధ్యతలను పంచుకోవటం జరుగుతుంది. ప్రిన్స్ చార్లెస్ రాజుగా బాధ్యతలు చేపట్టే రోజుకు దిశాపథాన్ని సూచించే నేపథ్యంలో 87 ఏళ్ల రాణి ఎలిజబెత్, ప్రిన్స్ ఆఫ్ వేల్స్‌లకు చెందిన ప్రెస్ కార్యాలయాలు కలిసిపోవాల్సి ఉంటుంది. అయితే కొత్త కార్యకలాపాలు ప్రిన్స్ అధికార ప్రతినిధి పేరుమీదుగా సాగుతాయి. వీటిపై బకింగ్‌హాం ప్యాలెస్ ప్రభావం ఉంటుంది. ‘పలు కార్యకలాపాల్లో వివిధ అధికార స్థాయిల్లో పరస్పర సహకారంకోసం ఈ రెండు ప్రెస్ కార్యాలయాలను మేము విలీనం చేస్తున్నాము’ అని బకింగ్‌హామ్ ప్యాలెస్ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ మేరకు ‘ది సండే టైమ్స్’లో ఒక నివేదిక ప్రచురితమైంది. జూన్ 6న ఫ్రాన్స్‌లోని నార్మండి బీచ్‌లో జరిగే ‘డి-డే’ (రెండవ ప్రపంచ యుద్ధంలో భాగంగా మిత్ర రాజ్యాలు ఫ్రాన్స్‌పై దాడిచేసిన రోజు) 70వ వార్షిక స్మారకోత్సవాల్లో తన తల్లి క్వీన్ ఎలిజబెత్-2తో 65 ఏళ్ల ప్రిన్స్ ఆప్ వేల్స్ చార్లెస్ అంతర్జాతీయ స్థాయిలో అధికారికంగా పాలుపంచుకోనున్నారు. ఈ డి-డే స్మారకోత్సవాల నిర్వహణకోసం చేస్తోన్న సన్నాహాల్లో ఫ్రెంచ్ ప్రభుత్వం సలహాదారు పాలుపంచుకుంటున్నారు. మరోవైపు ‘ఇది రాణి చివరి విదేశీ పర్యటన కావచ్చు అని అధికారులు తెలిపారు’ అని సండే టైమ్స్ పేర్కొంది. కాగా గత ఏడాది ప్రిన్స్ శ్రీలంకలో జరిగిన చోగమ్ దేశాల అధిపతుల సమావేశంలో తన తల్లి తరపున ప్రతినిధిగా హాజరయ్యారు. ఇప్పటివరకు తన 62 ఏళ్ల రాణి హోదాలో 261 విదేశీ పర్యటనల్లో పాల్గొన్న ఎలిజబెత్ నాజీల కబంధ హస్తాల్లో ఉన్న ఫ్రాన్స్‌పై మిత్రరాజ్యాలు దాడిచేసిన రోజున బాధ్యతలను ప్రిన్స్ చార్లెస్‌కు అప్పగించి బ్రిటిష్ వెటరన్‌ల జాబితాలో చేరనున్నారు. వచ్చే ఏప్రిల్‌లో ఎలిజబెత్ 88వ వడిలోకి ప్రవేశించనుంది. మరోవైపు గత వేసవికాలం నుంచి అనారోగ్యం పాలవడంతో తన బాధ్యతలను ఒక్కొక్కటిగా రాజ కుటుంబంలోని తన వారసులకు అప్పచెప్తున్నారు. ఈ స్మారకోత్సవాల్లో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హొల్లాండె, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతోపాటు మరో పనె్నండు దేశాధినేతలు పాల్గొంటున్నారు.
బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 ప్రిన్స్ చార్లెస్