
భువనేశ్వర్, జనవరి 19: ఎలాంటి విచారణ లేకుండా జైళ్లలో మగ్గుతున్న మైనార్టీ యువతను విడుదల చేసే అంశానికి సంబంధించి రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మరో లేఖ రాస్తానని కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే స్పష్టం చేశారు. మైనార్టీ కేసులకు సంబంధించి సత్వర నిర్ణయాలు తీసుకునే విధంగా ప్రత్యేక కమిటీలను ఏర్పాటుచేయాలని ముఖ్యమంత్రులకు తన మొదటి లేఖలో సూచించానని, దీనిపై మరో రెండు మూడు రోజుల్లో ఇంకో లేఖ కూడా రాస్తానని ఆయన పేర్కొన్నారు. కటక్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ ‘పోటా’ నిబంధనలతో నిమిత్తం లేకుండా ఈ కమిటీలను ఏర్పాటుచేయాలని సూచించినట్లు తెలిపారు. మైనార్టీలంటే కేవలం ముస్లింలే కాదని, ఇతర మతాలకు చెందినవారు కూడా మైనార్టీ నిర్వచన పరిధిలోకి వస్తారని ఆయన స్పష్టం చేశారు. ఎలాంటి విచారణకు నోచుకోకుండా ఐదు నుంచి పదేళ్ల కాలంగా జైలు శిక్ష అనుభవిస్తున్న మైనార్టీ యువతకు మోక్షం కలిగించేందుకు వీలుగా సత్వర నిర్ణయాలు తీసుకోవాలని ముఖ్యమంత్రులకు సూచించినట్లు తెలిపారు. విచారణ జరగకుండానే తమ పిల్లలు ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గుతున్నారంటూ సమాజంలోని అనేక వర్గాలనుంచి తమకు ఫిర్యాదులు అందుతున్నాయని షిండే తెలిపారు. దీన్ని దృష్టిలో పెట్టుకునే ముఖ్యమంత్రులకు లేఖ రాశానని, అకారణంగా జైళ్లలో మగ్గుతున్న నిర్దోషులను తక్షణం విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించినట్లు పేర్కొన్నారు. కులమతాల ప్రాతిపదికగా ఎన్నికల్లో లబ్ధి పొందాలని బిజెపి భావిస్తే అది ఆ పార్టీ ఇష్టమని, ఆ విషయమై మాకెలాంటి ఆసక్తి లేదని స్పష్టం చేశారు. సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధి మా లక్ష్యమన్నారు. మావోయిస్టుల హింసను తగ్గించడంలో కేంద్ర, రాష్ట్రాల ఉమ్మడి కృషి ఎంతో ఉందని, దాని ఫలితంగానే వామపక్ష తీవ్రవాదం తగ్గిపోయిందని షిండే తెలిపారు.
కటక్‌లో ఆదివారం ఎన్‌డిఆర్‌ఎఫ్ ట్రైనింగ్ సెంటర్‌లో నిర్వహించిన ప్రదర్శనను తిలకిస్తున్న హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే.