ఆగిరిపల్లి, జనవరి 20: కృష్ణా జిల్లా, ఆగిరిపల్లి మండల పోలీసు స్టేషన్‌పై సోమవారం సాయంత్రం అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు చేశారు. ఎస్‌ఐ పి చంద్రశేఖర్ లంచం తీసుకుంటుండగా దాడులు చేసి పది వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలు అవినీతి నిరోధక శాఖ డిఎస్‌పి ఆర్ విజయపాల్ సోమవారం రాత్రి విలేఖరులకు వివరించారు. సంక్రాంతి పండగ పురస్కరించుకుని ఆగిరిపల్లి మండలంలోని పలు ప్రాంతాలలో భారీ స్థాయిలో కోడి పందాలు జరిగాయి. పోలీసులు నగదు తీసుకుని పండగ నాడు కోడి పందాలు వేసుకునేందుకు అనుమతులు ఇచ్చారనే పుకార్లు షికారు చేశాయి. ఈ తరుణంలో మండలంలోని కలటూరుకి చెందిన జాలిపర్తి సీతారామకృష్ణ గ్రామంలో కోడి పందాలు నిర్వహించేందుకు ఎస్‌ఐ చంద్రశేఖర్‌తో ఒప్పందం చేసుకున్నారు. 25 వేల రూపాయలు కావాలని ఎస్‌ఐ డిమాండ్ చేయగా పది వేల రూపాయలు ఇచ్చి కోడి పందాలు వేసుకున్నారు. రెండు రోజులపాటు వీరు పందాలు వేశారు. మూడు రోజుల నుండి మళ్ళీ డబ్బులు కావాలని ఎస్ ఐ చంద్రశేఖర్ డిమాండ్ చేస్తున్నారు. ఒకరోజు కోడి పందాలు వేసుకుంటామని చెప్పి రెండు రోజులపాటు నిర్వహించారు కాబట్టి మరో 15 వేల రూపాయల ఇవ్వమని, లేకుంటే రౌడీ షీట్ ఓపెన్ చేస్తానని హెచ్చరించాడు. దీంతో రామకృష్ణ అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించారు. వీరు ఎస్‌ఐ చంద్రశేఖర్‌తో బాధితుడు రామకృష్ణ జరిపిన సంభాషణ రికార్డు చేశారు. అనంతరం గ్రామంలో కూడా విచారించామని డిఎస్పీ విజయపాల్ వివరించారు. సోమవారం సాయంత్రం ఆరు గంటల సమయంలో బాధితుడు రామకృష్ణ వద్ద నుండి నగదు తీసుకున్న అనంతరం దాడులు చేశామని, రామకృష్ణ ఇచ్చిన పదివేల రూపాయలు ఎస్‌ఐ చంద్రశేఖర్ ప్యాంటు జేబు పెట్టుకున్నారని, వాటిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ దాడుల్లో అవినీతి నిరోధక శాఖ సిఐలు ఎస్ రవి, వి శ్రీనివాసరావు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
తిరుపతమ్మ రంగుల మహోత్సవానికి ఏర్పాట్లు పూర్తి
పెనుగంచిప్రోలు, జనవరి 20: ఈ నెల 23వ తేదీన జరిగే గోపయ్య సమేత శ్రీతిరుపతమ్మ అమ్మవారు, సహదేవతల రంగుల మహోత్సవానికి సంబంధించి ఏర్పాట్లు మొత్తం పూర్తి అయినట్లు కార్యనిర్వహణ అధికారి విజయ్‌కుమార్ తెలిపారు. ఆలయ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆనవాయితీగా రెండేళ్లకు ఒకసారి ఈ రంగుల మహోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుందని దీనికి సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేసినట్లు తెలిపారు. దీనిలో ముఖ్యంగా 23వ తేదీ గురువారం ఆలయంలో పూజల అనంతరం విగ్రహాలను రజకుల తల మీద పెట్టుకుని ఊరేగింపుగా రంగుల మంటపం వద్దకు చేరుకుంటాయని, ఈ ఊరేగింపు సందర్భంగా ఎటువంటి తోపులాటలు జరగకుండా పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నారు. అనంతరం రంగులమంటపం వద్ద నుండి రాత్రి 10 గంటల సమయంలో ఎద్దుల బండ్లపై విగ్రహాలను ఉంచి అక్కడ నుండి మక్కపేట, చిల్లకల్లు మీదుగా జగ్గయ్యపేట రంగుల మంటపం వద్దకు తీసుకువెళ్తామని, దీనికి సంబంధించి ఎద్దుల బండ్లు మొత్తానికి కలిపి రోప్‌వే ఏర్పాటు చేశామని, ప్రత్యేక జనరేటర్ ద్వారా విద్యుత్ సౌకర్యం, బండ్ల వెంట వచ్చే భక్తులకు భోజనం, మంచినీటి వసతి కల్పించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి భక్తులతో పాటు దీక్షా స్వాములు కూడా హాజరు అవుతారని అన్నారు. ఈ ఊరేగింపులో ప్రధాన ఆకర్షణగా కోలాటం, బేతాళ వేషధారణలు, తీన్‌వార్ వాయిద్యాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
లాటరీ పద్ధతి ద్వారా బండ్లు ఎంపిక
గురువారం జరగబోయే అమ్మవారి రంగుల మహోత్సవానికి సంబంధించి స్థానిక పోలీస్ స్టేషన్‌లో లాటరీ పద్ధతిన ఎద్దుల బండ్లను ఎంపిక చేశారు. పెనుగంచిప్రోలు రంగుల మంటపం వద్ద నుండి జగ్గయ్యపేట రంగుల మంటపం వరకూ ఎద్దుల బండ్లపై తీసుకువెళ్లే ఆనవాయితీ గత కొనే్నళ్లుగా జరుగుతోంది. దీనికి సంబంధించి పలువురు రైతులు తమ ఎడ్లబండ్లు కడతామని పోలీస్ స్టేషన్‌లో సుమారు 450మంది రైతుల పేర్లు నమోదు చేయగా వీటిలో నుండి సోమవారం కార్యనిర్వహణ అధికారి విజయ్‌కుమార్, ఎస్‌ఐ ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో లాటరీ ద్వారా 11బండ్లను ఎంపిక చేశారు. అలాగే మరో బండిని అదనంగా ఎంపిక చేశారు.
డ్రైవర్లు అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలి
గుడివాడ, జనవరి 20: ఆర్టీసి డ్రైవర్లు ఒత్తిళ్ళకు దూరంగా, అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వర్తించాలని గుడివాడ డీఎస్పీ జె సీతారామస్వామి సూచించారు. స్థానిక ఆర్టీసీ డిపోలోని గ్యారేజ్ ఆవరణలో సోమవారం డ్రైవర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. నిత్యం లక్షలాది మంది ప్రయాణికులు ఆర్టీసీ ప్రయాణం భద్రతతో కూడినదిగా నమ్ముతారన్నారు. డ్రైవర్లు నిర్లక్ష్యానికి తావులేకుండా వాహనాలు నడపాలన్నారు. పోలీసుల సమన్వయంతో ఆర్టీసి డ్రైవర్లు ప్రజలను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చాలన్నారు. ఆర్టీసీ డీఎం షర్మిలా అశోక్ మాట్లాడుతూ గత ఏడాది డిపో పరిధిలో 0.13 శాతం ప్రమాదాలు జరగ్గా ఈ ఏడాది 0.08శాతం మాత్రమే ప్రమాదాలు జరిగాయన్నారు.
రహదారి భద్రతతో జీవితం పదిలం
విజయవాడ (క్రైం), జనవరి 20: రోడ్డు ప్రమాదాల రహిత నగరంగా తీర్చి దిద్దాలని నగర పోలీసు కమిషనర్ బత్తిన శ్రీనివాసులు పిలుపునిచ్చారు. రోడ్డు భద్రతా అవగాహన వారోత్సవాలు-2014ని ఆయన సోమవారం నగరంలో ప్రారంభించారు. ఈనెల 26 వరకు జరిగే ఈ వారోత్సవాల సందర్భంగా నగర ప్రజలకు రోడ్డు ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ క్రమబద్దీకరణపై వివిధ కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. నగరంలోని ప్రజలకు, ప్రభుత్వ ప్రైవేటు కళాశాలలు, పాఠశాలల విద్యార్ధినీ విద్యార్థులకు, ఆటో, లారీ, ఆర్టీసి డ్రైవర్లకు అవగాహన కల్పించే దిశగా ప్రతి ఏడాది జరుపుకునే రోడ్డు భద్రతా వారోత్సవాల ర్యాలీని బందరురోడ్డుపై ఆయన ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వద్ద నుంచి జెండా ఊపి ప్రారంభించారు. కాగా నగరంలో ఇటు రవాణాశాఖ, కలెక్టర్, పోలీసు శాఖల ఆధ్వర్యాన వారోత్సవాలు ప్రారంభమైన రోజే మాచవరం పోలీస్టేషన్ పరిథిలోని ఏలూరు రోడ్డులో రోడ్డు ప్రమాదం చోటు చేసుకోవడం దురదృష్టకరం. ఈప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందగా ఈమృతితో వారోత్సవాలు ప్రారంభమం కావడం గమనార్హం. ఇదిలావుండగా ‘ముందు మీరు’ అనే నినాదంతో ర్యాలీ ప్రారంభం సందర్భంగా పోలీసు కమిషనర్ మాట్లాడుతూ వారంరోజుల పాటు నగరంలోని ముఖ్య కూడళ్ళలో మొబైల్ వాహనం ద్వారా రోడ్డు భద్రతకు సంబంధించి తయ