విజయనగరం (్ఫర్టు), జనవరి 20: జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా ఈ రబీసీజన్‌లో 96 కోట్ల రూపాయల పంటరుణాలను ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ముఖ్య కార్యనిర్వహణాధికారి వంగపండు శివశంకర ప్రసాద్ తెలిపారు. సోమవారం తన కార్యాలయంలో రబీపంటరుణాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా శివశంకర ప్రసాద్ మాట్లాడుతూ గత ఖరీఫ్‌సీజన్‌లో 151 కోట్ల రూపాయల పంటరుణాలను అందించామన్నారు. ఈ రబీసీజన్‌లో 96 కోట్ల రూపాయలను ఇవ్వాలని నిర్ణయించగా, ఇంతవరకు 28 కోట్ల రూపాయల అందించామన్నారు. సహకార సంఘాల సభ్యులు తమ పంటరుణాలను రెన్యువల్ చేయించకుంటే జీరో పర్సంట్ వడ్డీ వర్తిస్తుందన్నారు. ఈ ఏడాది ఏడుకోట్ల రూపాయల దీర్ఘకాలిక రుణాలను అందించామన్నారు. జిల్లాలో వాయిదామీరిన రుణబకాయిల వసూళ్లపై ప్రత్యేకంగా దృష్టి సారించామన్నారు. రుణగ్రస్తుల జాబితా తయారు చేశామని, 200 కోట్ల రూపాయల మేరకు రుణాలు వసూలు కావాల్సి ఉందని శివశంకర ప్రసాద్ తెలిపారు. ప్రస్తుతం బకాయిల వసూళ్లపై ప్రత్యేకంగా దృష్టి సారించామన్నారు. ఇంతవరకు 30శాతం బకాయిలను వసూలు చేయగా, జూన్ నెలాఖరులోగా 90శాతం బకాయిలను వసూలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించామన్నారు. బకాయిల వసూళ్లకోసం ప్రత్యేకంగా బృందాలను నియమించామన్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు అసిస్టెంట్‌జనరల్‌మేనేజర్లు సిహెచ్.ఉమామహేశ్వరరావు, రామారావు కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
‘గిరిజన ప్రాంతాల్లో వైద్య సౌకర్యాలు
మెరుగుపరచాలి’
ఆంధ్రభూమి బ్యూరో
విజయనగరం, జనవరి 20: గిరిజన ప్రాంతాల్లో వైద్య సౌకర్యాలు మరింత మెరుగుపరచాలని కేంద్ర గిరిజన వ్యవహారాల కార్యదర్శి రిష్‌కేశ్ పండా జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండేను ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో మహిళలకు, బాలింతలకు అందించే వ్యాధి నిరోధక టీకా కార్యక్రమాలపై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలన్నారు. ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా ఆయన ఇక్కడకు విచ్ఛేసారు. ఈ సందర్భంగా కార్యదర్శి మాట్లాడుతూ షెడ్యూల్డ్ ప్రాంతంలో చేర్చవలసిన ప్రాంతాల జాబితాను అందజేయాలన్నారు. జిల్లాలో గంట్యాడ, ఎస్.కోట, మెంటాడ మండలాల్లోని కొన్ని గిరిజన గ్రామాలను ఐటిడిఎలో విలీనం చేయాల్సి ఉందని జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే ఆయనకు వివరించారు. అలాగే ఇతర రాష్ట్రాల్లో ఎస్టీలుగా ఉండి, ఇక్కడ ఎస్టీలుగా గుర్తించబడని కులాల వివరాలను తనకు నివేదిక అందజేయాలని కలెక్టర్‌ను కోరారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సమగ్ర కార్యాచరణ ప్రణాళిక, అదనపు కేంద్ర సాయం పథకాల కింద చేపడుతున్న పనుల వివరాలు, ప్రగతిని సమీక్షించారు. ఈ సమావేశంలో ఐటిడిఎ పివో రజత్‌కుమార్ షైనీ, ఆర్డీవో వెంకట్రావు, సిపిఒ బి.మోహనరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.