కాకినాడ, జనవరి 22: సమైక్యాంధ్రకు మద్దతుగా ఎపిఎన్‌జిలు చేపట్టిన చలో హైదరాబాద్ కార్యకమం విజయవంతం కావాలని కోరుతూ రంపచోడవరం మండల పరిషత్ అభివృద్ధి అధికారి(ఎంపిడిఓ) టిఎస్ విశ్వనాధ్ బుధవారం జిల్లా కలెక్టరేట్ ఎదురుగా ఉన్న రాష్ట్ర పరిరక్షణ సమితి కార్యాలయంలో వౌనదీక్షను నిర్వహించారు. రాష్ట్ర కలిసుండాలని కోరుతూ దీక్ష వెనుక బోర్డులు రాశారు. ఆంధ్రప్రదేశ్ అంటూ ఇంగ్లీషులో రాసి దాని మొదటి అక్షరాలుతో రాష్ట్ర అభివృద్ధిని తెలియజేసే విధంగా ఏర్పాటుచేసిన బోర్డును అందరినీ ఆకట్టుకున్నాయి.. బుధవారం సాయంత్రం వరకు విశ్వనాథ్ దీక్షను నిర్వహించారు.
అందాల రాముడికి అశృ నివాళి
ఆంధ్రభూమి బ్యూరో
కాకినాడ, జనవరి 22: తెలుగు సినీ అభిమానుల హృదయాలలో అందాలరాముడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, పద్మ విభూషణ్, నటసామ్రాట్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు 3ఇకలేరు2 అన్న వార్త జిల్లా ప్రజానీకాన్ని శోకసాగరంలో ముంచింది. ఈ వార్త ఆయన అభిమానులకు పిడుగుపాటే అయ్యింది. ఏడు దశాబ్దాల సుదీర్ఘ అక్కినేని అభినయ ప్రస్థానం ఆ తరం వారికే కాకుండా నేటి తరానికి కూడా సుపరిచితమే! బహుదూరపు బాటసారి ఒక్కసారిగా దూరమయ్యారన్న వాస్తవాన్ని జీర్ణించుకోలేక జిల్లాలోని ఆయన అభిమానులు తల్లడిల్లిపోయారు. ఆయనకు జిల్లాలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఆ రోజుల్లో భారీ స్థాయిలో ఉండేది. ఆయన వారసుడిగా సినీ రంగప్రవేశం చేసిన నాగార్జునకు అక్కినేనికి ఉన్న ఫాలోయింగ్ బాగా అందివచ్చింది. జిల్లాలో అక్కినేనికి సంబంధించి అనేక చిత్రాల షూటింగ్‌లు జరిగినట్టు అభిమానులు చెప్పారు. వాటిలో అలనాటి మూగ మనసులు చిత్రం షూటింగ్‌లో పాల్గొనేందుకు అక్కినేని జిల్లాకు వచ్చిన సందర్భంలో అభిమానులు బ్రహ్మరథం పట్టారు. గోదావరి పరివాహక ప్రాంతాలు, పట్టిసీమ, పాపికొండలు తదితర ప్రాంతాల్లో అక్కినేని సహా చిత్ర కథానాయికలు సావిత్రి, జమునలపై చిత్రీకరించిన దృశ్యాలు నేటికీ అభిమానులకు గుర్తుంటాయి. ఆ రోజుల్లో ఔట్‌డోర్ లొకేషన్స్‌లో సినిమాల చిత్రీకరణ అరుదుగా ఉండేది. అటువంటి సమయంలో అక్కినేని వంటి మేటి నటుడు జిల్లాలో విడిది చేయడం ఆయన అభిమానులకు సంబరాన్ని తెచ్చిపెట్టింది. తర్వాత అందాలరాముడు, మాధవయ్యగారి మనవడు, సీతారాముల కల్యాణం చూతము రారండి, ఏడంతస్థుల మేడ తదితర చిత్రాల చిత్రీకరణకై అక్కినేని జిల్లాకు వచ్చారు. కె విశ్వనాథ్ దర్శకత్వంలో నిర్మించిన సూత్రధారులు చిత్రంలో ఎఎన్‌ఆర్ ముఖ్యపాత్ర పోషించారు. ఈ చిత్రంలో సన్నివేశాలను అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణస్వామి దేవస్థానం పరిసరాల్లోను చిత్రీకరించారు. అక్కినేని నటించిన చిత్రాలలో అలనాటి దేవదాసు నుండి నేటి శ్రీరామదాసు వరకు అనేక చిత్రాలు జిల్లా ప్రజలకు ఆయనపై ఎనలేని అభిమానాన్ని పెంచాయి. మహాకవి క్షేత్రయ్య, మయాబజార్, ప్రేమనగర్, అందాల రాముడు, డాక్టర్ చక్రవర్తి, మేఘసందేశం, ప్రేమాభిషేకం, దసరాబుల్లోడు, అమరజీవి వంటి చిత్రాలు జిల్లాలోని రాజమండ్రి, కాకినాడ నగరాల్లో శతదినోత్సవాలు జరుపుకున్నాయి.
అక్కినేనికి ఘన నివాళి...
జిల్లా కేంద్రం కాకినాడలో జగపతిబాబు ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బుధవారం దివంగత అక్కినేని నాగేశ్వరరావు మృతికి ట్రస్ట్ సభ్యులు సంతాపం తెలియజేశారు. కార్యక్రమంలో ట్రస్ట్ ఛైర్మన్ వైదాడి శివ సత్యం మాట్లాడుతూ ఎన్నో విజయవంతమైన చిత్రాలతో అక్కినేని నటించారని, ఆయన జీవితం నేటి తరానికి మార్గదర్శకం కావాలని శ్లాఘించారు. బాలు-ఘంటసాల సంగీత స్రవంతి, ఎంగ్మెన్స్ హ్యాపీ క్లబ్ ఆధ్వర్యంలో ఎఎన్‌ఆర్‌కు శ్రద్ధాంజలి ఘటించారు. అక్కినేని అభిమాన సంఘం ఆధ్వర్యంలో కల్పన సెంటర్‌లో అక్కినేని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో అందే బుజ్జి, పివి రమణ, జెఎస్‌కె అచ్యుతరామయ్య, పెద్దిరెడ్డి గంగాధరం, ఉంగరాల బూరిబాబు, న్యాయవాది కె సత్యనారాయణ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఎటిఆర్ అభిమానుల సంఘం ఆధ్వర్యంలో కూడా స్థానిక కల్పన సెంటర్‌లో అక్కినేని మృతి పట్ల సంతాపం పాటించారు. కార్యక్రమంలో ఎస్‌కె అన్సర్, మంగరాజు, భాస్కర్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
ఇసుక దోపిడి
ఆంధ్రభూమి బ్యూరో
అమలాపురం, జనవరి 22: జిల్లా అధికారుల నిర్లక్ష్యం, అసమర్ధత కారణంగా ఏటా కోట్ల రూపాయల ఆదాయం సమకూరే ఇసుక ర్యాంపుల వేలం నిలిచిపోయింది. ఇసుక ర్యాంపుల వేలం మళ్లీ ఎప్పుడు జరుగుతుందో, అసలు జరుగుతుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీన్ని ఆసరాగా చేసుకుని జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న రావులపాలెం, ఊబలంకలో అర్ధరాత్రి ఇసుక ర్యాంపుల నుండి తెల్లవారేసరికి వందలాది లారీల ఇసుక అక్రమంగా తరలించేస్తున్నారు. ఇసుక రేటు లారీ 13 నుండి 15 వేల రూపాయల వరకూ పలుకుతుండటంతో ఖాళీగా ఉన్న రావులపాలెం, ఊబలంక ఇసుక ర్యాంపులపై కొందరు నాయకులు, కొంతమంది మీడియా, అధికారుల కన్ను పడింది. ఇసుక సిండికేట్ల స్థానంలో రావులపాలెంలో వీరే సిండికేట్‌గా ఏర్పడి ఇసుక తరలింపును బాహాటంగా నిర్వహిస్తున్నారు. దాదాపు 15 రోజులుగా ఊబలంక ర్యాంపు నుండి ఇసుకను తరలించుకుపోతున్న అక్రమార్కులు జాతీయ రహదారికి చెందిన రెండు ప్రధాన వంతెనల కింద ర్యాంపులు నిర్మించి నేడో,రేపో ఇసుక తవ్వేందుకు రంగం సిద్ధం చేశారు. చీకటి పడగానే ఇసుక తరలింపు సర్వసాధారణంగా మారిపోయింది. వందల కొద్దీ లారీలు, టిప్పర్లు, రావులపాలెం ఇసుక ర్యాంపులో క్యూ కడుతున్నాయి. తెల్లవార్లూ ఇష్టారాజ్యంగా ఇసుకను జెసిబిలతో తవ్వి లోడింగ్ చేసి తరలిస్తున్న ఈ సిండికేట్ రాత్రికి రాత్రే కోట్ల రూపాయలు విలువైన ఇసుకను అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ బాగోతం జిల్లా, డివిజన్ స్థాయి అధికారుల దృష్టికి వెళుతుందా, లేదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతీ సమస్య పరిష్కారానికి వారాలు, నెలల పాటు సాగదీస్తూ పరోక్షంగా దోపిడీదారులకు సహకారం లభిస్తున్న ఉన్నతాధికారుల నిర్ణయాలు కూడా ఈ దోపిడీదారులకు వరంలా మారాయని సమీప గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఎలాంటి వేలం లేకుండా, ప్రభుత్వానికి పైసా చెల్లించకుండా అర్ధరాత్రి అడ్డదారిలో కోట్లాది రూపాయల విలువైన ఇసుకను తరలించుకునిపోతున్న బాగోతంపై అధికారులు స్పందించకపోవటం విడ్డూరం.
ఆర్డీవో వివరణ:
అమలాపురం ఆర్డీవో సిహెచ్ ప్రియాంకను వివరణ కోరగా రావులపాలెం, ఊబలంక ర్యాంపుల్లో అక్రమంగా ఇసుకను తవ్వుతున్న వ్యవహారంపై తక్షణమే చర్య తీసుకుంటామన్నారు. అక్రమంగా ఇసుక తవ్వే వారెవరైనా ఉపేక్షించేది లేదన్నారు. అధికారుల పాత్ర ఉంటే వారిపైనా చర్యలు ఉంటాయని ఆర్డీవో హెచ్చరించారు.
తరలిపోతోంది... తస్మాత్ జాగ్రత్త!
హైదరాబాద్‌కు రాజమండ్రి ఫైలేరియా ఆసుపత్రి
ఆంధ్రభూమి బ్యూరో
రాజమండ్రి, జనవరి 22: పేద, మధ్యతరగతి వర్గాలకు చెందిన ప్రజలకు 35ఏళ్లుగా నిరాటంకంగా సేవలందిస్తున్న రాజమండ్రిలోని ఫైలేరియా ఆసుపత్రి హైదరాబాద్‌కు తరలిపోయే ప్రమాదం ఏర్పడింది. అధికారికంగా ఈ కేంద్రం పేరు జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం (నేషనల్ సెంటర్ ఫర్ డెసీజెస్ కంట్రోల్) అయినప్పటికీ ఉభయగోదావరి, కృష్ణ, ఖమ్మం, వరంగల్, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలతో పాటు ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, ఒరిస్సా రాష్ట్రాల్లోని లక్షలాది మంది సామాన్య, మధ్యతరగతికి చెందిన పేద రోగులు ఫైలేరియా ఆసుపత్రిగానే ఈ కేంద్రాన్ని పిలుస్తుంటారు. ఎందుకంటే ఈ కేంద్రంలో ప్రతి బుధవారం రాత్రి 8గంటల నుండి 9గంటల వరకు, కేంద్రానికి వచ్చిన వారి నుండి రక్తనమూనాలు సేకరించి, పరీక్షలు జరిపి అవసరమైన వారికి మందులు పంపిణీచేస్తారు. ప్రతి శుక్రవారం పాత రోగులకు వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీచేస్తుంటారు. మిగిలిన రోజుల్లో వివిధ జిల్లాలు లేదా జిల్లాలోని వివిధ ప్రాంతాలకు వెళ్లి ప్రజల నుండి రక్తనమూనాలు సేకరించి పరీక్షలు చేసి ఫైలేరియా నియంత్రణకు మందులు పంపిణీచేస్తుంటారు. రాజమండ్రిలోని ఫైలేరియా ఆసుపత్రి సిబ్బంది జనం ఇళ్ల వద్దకు వెళ్లి రక్తనమూనాలు సేకరించటం ఎలా ఉన్నాగానీ, రాజమండ్రిలోని ఫైలేరియా కేంద్రానికి పెద్ద సంఖ్యలోనే రోగులు వస్తుంటారు. ఇక్కడిచ్చే మందులు అన్ని చోట్లా లభిస్తున్నాగానీ, రోగులు ఇక్కడికి వచ్చి మందులు తీసుకుంటేనే సంతృప్తి చెందుతుంటారు. అలాంటి ఫైలేరియా ఆసుపత్రి రాజమండ్రి నుండి హైదరాబాద్ తరలివెళ్లిపోతోందన్న సమాచారంతో జనం తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. అసలే పదవీ విరమణ చేసిన, బదిలీపై వెళ్లిన సిబ్బంది స్థానంలో కొత్తవారిని నియమించకపోవటం వల్ల ప్రస్తుతం చాలీ చాలని సిబ్బందితో ఫైలేరియా ఆసుపత్రి(ఎన్‌సిడిసి) నిస్తేజంగా ఉంది. అయినా సరే ఉన్న కొద్దిపాటి సిబ్బంది వచ్చిన జనానికి సేవలందించటంతో పాటు, సాంఘిక సంక్షేమ హాస్టళ్లలోని విద్యార్ధులకు రక్త పరీక్షలు చేయటం మొదలుపెట్టారు. అలా చేయటం వల్ల ముగ్గురు విద్యార్ధులకు ఫైలేరియా లక్షణాలు కనిపించాయి. అంటే ఫైలేరియా వ్యాధికి గురవకుండా, ముందుగానే లక్షణాలను గుర్తించి ఆరోగ్యాన్ని కాపాడటంలో ఫైలేరియా ఆసుపత్రి ప్రధాన పాత్రను పోషిస్తోందన్న మాట. తాజా పరిణామాల్లో ఈ ఆసుపత్రిని హైదరాబాద్ తరలిస్తే, సీమాంధ్ర ప్రజలతో పాటు ఛత్తీస్‌ఘడ్, ఒరిస్సా రాష్ట్రాల ప్రజలు కూడా నష్టపోయే ప్రమాదం ఉంది. దాదాపు పూర్తిగా నియంత్రణలో ఉందనుకుంటున్న ఫైలేరియా మళ్లీ విజృంభించే ప్రమాదం ఉంటుందని, ఏదైనా కొత్త రకం వ్యాధి లక్షణాలు బయటపడితే, దానిపై దృష్టిపెట్టి పరీక్షలు చేయాలంటే ఎన్‌సిడిసి ఇక్కడే ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
మట్టి తవ్వకాలను పట్టించుకోండి
అయినవిల్లి, జనవరి 22: మండలంలోని అక్రమ మట్టి తవ్వకాలు అడ్డు అదుపులేకుండా పోతున్నాయి. ఇష్టానుసారంగా ఎవరికి వారు మట్టిని అమ్ముకునే పనిలో ఉన్నా రెవెన్యూ సిబ్బంది మాత్రం ప్రేక్షకపాత్ర వహించడం గమనార్హం. మండలంలోని రాయుడుపాలెం గ్రామంలో అక్రమంగా మట్టిని తవ్వి లారీలతో ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నా అక్కడ విఆర్వో మాత్రం పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఇటీవల మండలంలోని అక్రమమట్టి తవ్వకాలను అమలాపురం ఆర్డీవో ప్రియాంక అడ్డుకుని లారీలను సీజ్‌చేసినా అక్రమ మట్టివ్యాపారం యథేచ్చగానే సాగుతోంది. దీనికి కిందిస్థాయి ఉద్యోగులు సహకరిస్తున్నారని గ్రామస్థులే చెప్పడం గమనార్హం. ఇప్పటికైనా అధికారులు అక్రమ మట్టితవ్వకాలను నిలుపుదల చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.
శంఖవరంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు
శంఖవరం, జనవరి 22: మండల కేంద్రం శంఖవరంలోని ప్రభుత్వ కార్యాలయాలు, వసతి గృహాలు, అంగన్‌వాడీ కేంద్రం, ప్రభుత్వాసుపత్రి, కెజిబివిలను జిల్లా కలెక్టర్ నీతూప్రసాద్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తొలుత గ్రామ శివారున గల ఎస్సీ బాలుర వసతి గృహానికి చేరుకున్న కలెక్టర్ హాస్టల్‌లోని గదుల్లో శ్లాబ్ లీకేజీలను పరిశీలించారు. అలాగే మరుగుదొడ్లు, తాగునీటి పైపులైన్లు మరమ్మతులకు గురయ్యాయని, గత ఆరునెలల క్రితమే 50 వేలతో బాగుచేసినప్పటికీ వెంటనే మరమ్మతుకు వచ్చినట్టు వాచ్‌మెన్ ప్రసాద్ చెప్పడంతో కలెక్టర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పైపులైన్లను వెంటనే జెడ్‌పి నిధులతో సరి చేయించాలని ఎంపిడిఒ డిఎల్‌ఎస్ శర్మకు ఆదేశించారు. సమీపంలోగల కెజిబివి భవన నిర్మాణాన్ని పరిశీలించగా, నిర్మాణంలో నాణ్యత లోపించిందని పలువురు ఆరోపించారు. దీంతో క్వాలిటీ కంట్రోల్ అధికారులను పంపించి, నాణ్యత ప్రమాణాలు లోపించినట్టు రుజువైతే కాంట్రాక్టర్‌కు అపరాధ రుసుం విధిస్తామని, వచ్చే విద్యా సంవత్సరానికి భవనం అందుబాటులోకి వచ్చేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. స్ర్తి శక్తి భవనం నిర్మాణాన్ని నెలలోగా పూర్తిచేసి, అందుబాటులోకి రావాలని మండల జెఇను ఆదేశించారు. అద్దె భవనంలో కొనసాగుతున్న 106వ నెంబర్ అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ స్థలం చూపకపోవడంతో 2 లక్షల 10వేల నిధులు వెనక్కిపోయాయని, స్థలం చూపితే మరలా మంజూరు చేస్తానన్నారు. అంగన్‌వాడీ కేంద్రంలో పిల్లలు భోజనానికి ఎక్కువ హాజరు, చదువుకు తక్కువ హాజరు కనబడటంపై సిడిపిఒ నాగమణిని కలెక్టర్ ప్రశ్నించారు. భోజనానికి ఉపయోగిస్తున్న బియ్యం నాణ్యతను పరిశీలించి, కోడిగుడ్లు సక్రమంగా అందకపోవడంపై కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకొంటామన్నారు. అద్దె భవనంలో నిర్వహిస్తున్న బిసి బాలుర వసతిగృహాన్ని పరిశీలించి, సొంత భవన నిర్మాణానికి ప్రణాళికలు పంపించాలని ఎంపిడిఒను ఆదేశించారు. మెనూపై పిల్లలను ఆరా తీశారు. స్థానికంగా గల ఆసుపత్రికి చేరుకున్న కలెక్టర్ తొలుత సిబ్బంది హాజరుపట్టీ, డెలివరీ కేసుల నమోదు పుస్తకాలను పరిశీలించారు. సిబ్బంది పూర్తిస్థాయిలో ఉండి ప్రజలకు రాత్రి సమయంలో వైద్యసేవలు దూరం కావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బంది అంతా స్థానికంగా నివాసముండాలని, వారంలోగా అంతా సరిదిద్దుకోవాలని హెచ్చరించారు. సిబ్బంది చెప్పే వివరాలకు సంతృప్తి చెందని కలెక్టర్ పిహెచ్‌సిలోగల కంప్యూటర్‌లోని డేటాను పరిశీలించి, ప్రజలకు వైద్య సిబ్బంది రేయింబవళ్లు సేవలందిస్తూ భరోసాగా నిలవాలన్నారు. ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మాసిస్టులు లేకపోవడంతో ఉన్న సిబ్బందికే శిక్షణ ఇచ్చి భర్తీ చేసుకోవాలని వైద్యాధికారి దయానందరావును ఆదేశించారు. అనంతరం ఎస్సీ బాలికల వసతిగృహం, అందులో నిర్వహిస్తున్న కెజిబివిని పరిశీలించారు. కెజిబివి నిర్వహణకు సంతృప్తి వ్యక్తం చేసిన కలెక్టర్ హాస్టల్‌లో పాటిస్తున్న మెనూ ప్రకారం భోజనం, ఫలహారం అందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసి, వార్డెన్‌పై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. హాస్టల్ రహదారిపై బహుర్భూమికి ఉపక్రమించేవారిపై సెక్షన్ 33 ప్రకారం కేసు నమోదు చేయాలని తహసీల్దార్ రఘుబాబును ఆదేశించారు. హాస్టళ్లలో మరుగుదొడ్ల మరమ్మతులను త్వరితగతిన జెడ్‌పి నిధులతో తక్షణమే చేపట్టాలని ఎంపిడిఓ, జెఇలను కలెక్టర్ నీతూప్రసాద్ ఆదేశించారు. ప్రతీ నెలా ఏదొక వారంలో ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, వసతి గృహాల తనిఖీ నిర్వహించాలని ఎంపిడిఒ, తహసీల్దార్‌లను కలెక్టర్ ఆదేశించారు. ఆమె వెంట పెద్దాపురం ఆర్డీవో శివశంకర వరప్రసాద్, మండల జెఇ వెంకటేశ్వరరావు, హౌసింగ్ ఎఇ సుబ్బారావు, ఎంఇఒ కెవి రమణమ్మ, ఐకెపి ఎపిఎం శ్రీనివాస్, ఎపిఒ కుమారస్వామి, విఆర్వో చిన్నబ్బాయిరెడ్డి, అన్నబాబు తదితరులు పాల్గొన్నారు.
కలకలం సృష్టించిన విద్యార్థినుల అదృశ్యం
రాజమండ్రి, జనవరి 22: రాజమండ్రి, రాజానగరం ప్రాంతాలకు చెందిన ఐదుగురు విద్యార్థినులు అదృశ్యం కావడం కలకలం సృష్టించింది. అయితే 24గంటలు గడవక ముందే విద్యార్థినుల ఆచూకీని కనిపెట్టి తల్లిదండ్రులకు అప్పగించడంతో అదృశ్యం కథ సుఖాంతమైంది. పోలీసులు, తల్లిదండ్రుల కథనం ప్రకారం స్థానిక జయశ్రీ గార్డెన్స్‌లో ఒకే అపార్ట్‌మెంట్‌లో నివసించే గౌతమీస్మార్ట్ స్కూలులో 9వ తరగతి చదివే విద్యార్థిని, మోరంపూడిలోని శ్రీచైతన్య టెక్నో స్కూలులో 8,6వ తరగతి చదివే ఇద్దరు సోదరీమణులు, రాజానగరంలోని దివ్య పబ్లిక్ స్కూలులో చదివే 9వ తరగతి విద్యార్థిని, రాజానగరంనకు చెందిన శ్రీచైతన్య టెక్నోస్కూలు 8వ తరగతి విద్యార్థిని మంగళవారం సాయంత్రం ఇంటి నుంచి వెళ్లిపోయారు. సోమవారం రాత్రే పథకం ప్రకారం వీరంతా ఇంటి నుంచి కొంత సొమ్ములు తీసుకున్నారు. ఉదయం స్కూళ్లకు వెళ్లి రాజానగరంలోని ఒక ప్రదేశంలో కలుసుకుని, దుస్తులు మార్చుకుని ఎవరికీ చెప్పాపెట్టకుండా కాకినాడకు వెళ్లిపోయారు. తొలుత వీరంతా విశాఖపట్నం వెళ్లినట్లు అనుమానించారు. అయితే వీరు కాకినాడలోని ఒక లాడ్జిలో బస చేశారు. తాము క్రీడాపోటీల కోసం వచ్చినట్లు లాడ్జి నిర్వాహకులను నమ్మించారు. కాకినాడలోని బీచ్‌ను సందర్శించారు. తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదులు అందగానే ప్రకాష్‌నగర్, బొమ్మూరు పోలీసులు జిల్లావ్యాప్తంగా ఉన్న అన్ని పోలీసుస్టేషన్లతో పాటు, విశాఖపట్నం పోలీసులను కూడా అప్రమత్తం చేయడంతో అదృశ్యమైన విద్యార్థినుల ఆచూకీ బుధవారం మధ్యాహ్నం కాకినాడలో లభ్యమైంది. జయశ్రీగార్డెన్స్‌లో నివసించే 9వ తరగతి విద్యార్థినిని తల్లిదండ్రులు మందలించడంతో వీరంతా కూడబలుక్కుని అదృశ్యమయ్యారు. బుధవారం సాయంత్రం వారిని కాకినాడ నుంచి తీసుకుని వచ్చి రూరల్ తహశీల్దార్ సమక్షంలో పోలీసులకు అప్పగించారు. ఒకేసారి ఐదుగురు విద్యార్థినులు అదృశ్యం కావడంతో రాష్టవ్య్రాప్తంగా తీవ్ర కలకలం రేగింది. విజయవాడ, ముంబయ్ తదితర సంఘటన నేపథ్యంలో తల్లిదండ్రులు కూడా తీవ్ర ఆందోళన చెందారు. అయితే విద్యార్థినులు క్షేమంగా ఇంటికి చేరడంతో తల్లిదండ్రులు, పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు.
నర్సరీలకు రూ.40 లక్షల విద్యుత్ బకాయిలు మాఫీ
కడియం, జనవరి 22: కడియం నర్సరీ రైతులకు రూ.40 లక్షలు విద్యుత్ బకాయిలు మాఫీ చేస్తూ సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఆదేశాలిచ్చారని నర్సరీ మెన్ అసోసియేషన్ అధ్యక్షుడు పుల్లా అబ్బులు తెలిపారు. కడియపులంక సత్యదేవా నర్సరీలో బుధవారం అసోసియేషన్ సమావేశం జరిగింది. నర్సరీలకు కూడా వ్యవసాయరంగం మాదిరిగా ఉచిత విద్యుత్ అమలు చేయాలని నర్సరీ రైతులు 12 ఏళ్ళుగా పోరాడుతున్నారని, ఇందుకోసం ప్రభుత్వం హామీలు ఇస్తుందే తప్ప అందుకు తగిన జివో జారీ చేయలేదు. దీంతో గత 12 సంవత్సరాలుగా స్థానిక నర్సరీ రైతులు విద్యుత్ బిల్లులు చెల్లించలేదు. దీనిపై విద్యుత్ శాఖ అధికారులు బిల్లులు చెల్లించాలని ప్రతి ఏటా ఒత్తిడి చేస్తూనే ఉన్నారు. గత ఏడాది జూన్ నెలలో పలువురు నర్సరీల విద్యుత్ తీగలు తొలగించడంతో నర్సరీ రైతులు పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టారు. ఈ నేపధ్యంలో స్థానిక మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్ రాజమండ్రి ఎంపి ఉండవల్లి అరుణ్‌కుమార్ ద్వారా కలిసి వెళ్లి రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి సమస్యను వివరించారు. అప్పట్లో సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి విద్యుత్ బకాయిలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. సమైక్యాంధ్ర ఉద్యమాలతో ఆ హామీ కాస్తా మరుగున పడింది. తాజాగా నర్సరీ రైతులు తిరిగి వారి సమస్యలు రాజమండ్రి ఎంపి ఉండవల్లి ద్వారా సిఎంకు వివరించడంతో జివో జారీకి ఆదేశాలు జారీ చేశారని అబ్బులు తెలిపారు. రెండు, మూడు రోజుల్లో రూ.40 లక్షల విద్యుత్ బకాయిలు మాఫీ చేస్తున్నట్లు, అలాగే నర్సరీలకు ఉచిత విద్యుత్ అమలుచేస్తున్నట్లు జివో విడుదల చేయాలని సిఎం అధికారులను ఆదేశించారని అబ్బులు తెలిపారు. నర్సరీ రైతులకున్న దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించిన సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి ఎంపి ఉండవల్లి, మాజీ ఎమ్మెల్సీ దుర్గేష్‌లు నర్సరీమెన్ అసోసియేషన్ కృతజ్ఞతలు తెలిపింది. కార్యక్రమంలో నర్సరీ మెన్ అసోసియేషన్ ప్రతినిధులు తాడాల వీరాస్వామి, పల్లా సత్యనారాయణమూర్తి, మార్గాని సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
రాబందుకు అంత్యక్రియలు!
కొత్తపేట, జనవరి 22: అరుదుగా కనిపించే రాబందు విద్యుదాఘాతానికి గురై మరణించడంతో కొత్తపేట శివారు వీధిదివారిలంక గ్రామస్థులు ఖననం చేసి శాస్త్రోక్తంగా దానికి అంత్యక్రియలు నిర్వహించారు. బుధవారం ఈ ప్రాంతంలో సంచరించిన రాబందు హైటెన్షన్ విద్యుత్ వైర్లను తాకి వీధివారిలంకలోని ధనమ్మమర్రి ప్రాంతంలో నేలకూలడంతో గ్రామానికి చెందిన శ్రీనివాస్ దానిని బతికించేందుకు సపర్యలు చేసినప్పటికీ అది మృతిచెందింది. చేసేదేమీలేక లేక ఆ రాబందుకు గ్రామస్థుల సహకారంతో ఖననం చేశారు.
హామీలు అమలుచేయకపోతే సమ్మె
-మున్సిపల్ కార్మికుల సమావేశంలో సంఘం నేత కిర్ల
సామర్లకోట, జనవరి 22: గత ఏడాది అక్టోబర్‌లో సమ్మె చేపట్టిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన హామీలు అమలుచేయకుంటే ఈ ఏడాది ఫిబ్రవరి 3వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు, అవుట్‌సోర్సింగ్ కార్మికులు సమ్మెకు దిగకతప్పదని ఎపి మున్సిపల్ అండ్ పంచాయతీరాజ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిర్ల కృష్ణారావు చెప్పారు. మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా సమావేశం స్థానిక మున్సిపల్ ఐకెపి సమావేశ మందిరంలో బుధవారం జిల్లా అధ్యక్షుడు మీసాల అనంతరావు అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిర్ల మాట్లాడుతూ గత ఏడాది అక్టోబర్‌లో రాష్టవ్య్రాప్తంగా మున్సిపాల్టీలు, కార్పోరేషన్లలో మున్సిపల్ కార్మికులు నిర్వహించిన సమ్మెకు ప్రభుత్వం దిగివచ్చి అపరిష్కృత సమస్యల పరిష్కారానికి సర్క్యులర్లను విడుదలచేసి నెలలు గడుస్తున్నా సమస్యలు పరిష్కరించకుండా జాప్యం చేయడాన్ని నిరసిస్తూ మళ్లీ సమ్మెబాట పట్టనున్నట్లు చెప్పారు. సమ్మెకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలన్నారు. గత సమ్మె కాలంలో రాష్ట్ర మున్సిపల్ మంత్రి, ప్రిన్సిపల్ సెక్రటరీలు లిఖిత పూర్వకంగా ఇచ్చిన హమీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కరువు భత్యంతో కూడిన రూ.12,500 వేతనం, 27 శాతం మధ్యంతర భృతి, నైపుణ్య స్థాయిని బట్టి వేతనాలు, ఏడాదికి 71 రోజులు సెలవులు, అందరికి 1వ తేదీకి జీతాలు, కార్మికులకు ఇంక్రిమెంట్లు అమలుచేయకపోతే మున్సిపల్ కార్మికులంతా రాష్ట్ర వ్యాప్తంగా సంఘటితంగా పోరాటాలు చేపట్టనున్నట్లు ఆయన చెప్పారు. ఆందోళనలో భాగంగా ఈ నెల 23 నుండి 28వ తేదీ వరకూ సామూహిక నిరసన దీక్షలు, ధర్నాలు, నల్లబ్యాడ్జీలు ధరించి టూల్‌డౌన్ సమ్మె, దిష్టిబొమ్మ దగ్ధం వంటి ఆందోళనలు చేపట్టాలని ఆయన జిల్లా కార్యవర్గానికి పిలుపునిచ్చారు.