గుంటూరు (కల్చరల్), జనవరి 22: కృష్ణా జిల్లాలోని వెంకట రాఘవపురంలో 1923 సెప్టెంబర్ 20వ తేదీన మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన తాను కేవలం 5వ తరగతి మాత్రమే చదువుకున్నానని, నిరక్షరాస్యుడినైన నన్ను సమున్నత స్థితికి చేర్చడంలో, అక్షరాస్యుడిగా తీర్చిదిద్దడంలో సినీరంగమే బాటవేసిందని నటసామ్రాట్, పద్మవిభూషణ్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు అన్నారు. 75 వసంతాల పాటు సినీరంగంలో మకుటం లేని మహారాజుగా కీర్తిపొంది, 9 పాత్రలను ఒకే సినిమాలో ధరించిన ఏకైక నటుడిగా విఖ్యాతిగాంచిన అక్కినేని నాగేశ్వరరావు తన 90 సంవత్సరాల జీవితంలో గుంటూరు నగరానికి 11 పర్యాయాలు విచ్చేశారు. అనేక సందర్భాల్లో ఈ పట్టణానికి వచ్చి తాను నటించిన చిత్ర విజయోత్సవాల వేడుకల్లోనూ, పలు విద్యాసంస్థల వార్షికోత్సవాల్లోనూ ముఖ్య అతిథిగా పాల్గొని ఉత్తేజకరమైన ప్రసంగాలు చేశారు. 1980వ సంవత్సరంలో బాక్సాఫీసు రికార్డులను బద్దలుకొట్టిన ‘ప్రేమాభిషేకం’ చిత్రం గుంటూరు విజయటాకీస్‌లో విజయోత్సవ వేడుకలు జరుపుకుంది. ఆ సందర్భంగా దాసరి నారాయణరావుతో కలిసి ప్రేక్షకులనుద్దేశించి అక్కినేని మాట్లాడుతూ ప్రేక్షకుల అభిమానమే తనను ఇంతవాడిని చేసిందన్నారు. అప్పటికీ, ఇప్పటికీ తాను ఆరోగ్యవంతుడిగా ఉన్నానంటే అది కేవలం తనను అభిమానిస్తున్న ప్రేక్షక జనావళిది, తన ఉన్నతికి కారకులైన నిర్మాత, దర్శకులదేనని ఆయన వినమ్రంగా చెప్పారు. ఆనాటి కార్యక్రమంలో దాసరి కల్చరల్ అకాడమీ అధ్యక్షుడు పొత్తూరి రంగారావు, గుంటూరు అక్కినేని నాగేశ్వరరావు అభిమాన సంఘ సభ్యులు, విజయాటాకీస్ యాజమాన్యం పాల్గొంది.
ధూళిపాళ్ల కళావాహిని ప్రారంభోత్సవ సభలో...
తనతో పాటుగా అనేక చిత్రాల్లో మూడు దశాబ్దాలకు పైగా విభిన్న పాత్రలు పోషించిన ధూళిపాళ్ల సీతారామశాస్ర్తీ (శకుని ఫేం) ఆహ్వానం మేరకు అక్కినేని నాగేశ్వరరావు 1991 ఆగస్టు 8న గుంటూరు విచ్చేశారు. ఆ సందర్భంగా ధూళిపాళ్ల కళావాహిని సంస్థను తన చేతుల మీదుగా అక్కినేని ప్రారంభించారు. పెద్దసంఖ్యలో విచ్చేసిన అభిమానులనుద్దేశించి నాగేశ్వరరావు మాట్లాడుతూ కళాకారుడు తాను నిత్యం విద్యార్థిగానే ఉండాలన్నారు. సీతారామశాస్ర్తీ కళావాహినిని ఏర్పాటు చేసి కళాకారులను సత్కరించడం ఎంతైనా అభినందనీయమన్నారు. ఆనాటి సభలో సీనియర్ రంగస్థల నటీమణి మద్దెల సింహాచలాన్ని విశ్వశాంతి ఆర్ట్స్ అకాడమీ పక్షాన అక్కినేని సత్కరించారు. అకాడమీ అధ్యక్షుడు ఎం బాలచంద్రరావు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు.
వికాస్ విద్యాసంస్థలో...
వికాస్ విద్యాసంస్థలో కనుల పండువగా జరిగిన వార్షికోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు విద్యకున్న ప్రాముఖ్యతను తెలియజేస్తూ వి ద్యార్థికే కాకుండా మానవుడి సంపూర్ణ జీవన ఔన్నత్యానికి సంస్కారవంతమైన జీవనాన్ని పెంపొందించడానికి విద్య ఎంతగానో దోహదం చేస్తుందని అన్నారు. తాను పెద్దగా చదువుకోలేదని, అయితే విద్యావంతులు, మేధావులంటే తన కెంతో గౌరవమన్నారు. విద్య ప్రాముఖ్యతను తాను గుర్తెరిగి గుడివాడలో కళాశాల స్థాపనకు ఇతోధిక సహాయాన్ని అందించానని నాగేశ్వరరావు గుర్తుచేశారు. గుంటూరు నగరానికి పలు సంస్థల ఆహ్వానం మేరకు విచ్చేసి అందరినీ పులకింపజేసిన ఆ మహానటుడు బుధవారం తెల్లవారు ఝామున భాగ్యనగరంలో కన్నుమూయడం పట్ల ఆయనతో అనుబంధమున్న పలు సంస్థలు, అక్కినేని అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. విశ్వశాంతి ఆర్ట్స్ అకాడమి పక్షాన జరిగిన సంతాప సభలో ఎం బాలచంద్రరావు, రంగస్థల కళాకారుల ఐక్యవేదిక ఉపాధ్యక్షుడు ఎంవిఎల్ నరసింహారావు, ధూళిపాళ్ల కళావాహిని అధ్యక్షుడు ఎ సోమరాజు, ఉపాధ్యక్షుడు డి పూర్ణానందశాస్ర్తీ, కార్యనిర్వాహక కార్యదర్శి తంగిరాల శ్రీనివాస్, జైభవాని నాట్యమండలి అధ్యక్షుడు ఎ వాసుదేవశర్మ, కార్యదర్శి కావూరి సత్యనారాయణ, సహాయ కార్యదర్శి బివిఎస్ ప్రసాద్ తదితరులు నివాళులర్పించారు. ప్రముఖ రంగస్థల, టివి నడుడు చిట్టినేని లక్ష్మీనారాయణ బుధవారం హైదరాబాద్‌లో అక్కినేని భౌతిక దేహాన్ని సందర్శించి నివాళులర్పించడమే కాకుండా తెలుగు సినీ పరిశ్రమను చేసిన సేవలను శ్లాఘించారు.
తెలుగు సినీ పరిశ్రమకు నిఘంటువు అక్కినేని
గుంటూరు (పట్నంబజారు), జనవరి 22: అసమాన నటన, అద్వితీయ ప్రతిభతో అక్కినేని నాగేశ్వరరావు భావి తరాలకు నిఘంటువుగా శాశ్వతంగా నిలిచిపోతారని ప్రాంతీయ ఫిలిం సెన్సార్ బోర్డు సభ్యుడు వెచ్చా కృష్ణమూర్తి కొనియాడారు. బుధవారం స్థానిక అరండల్‌పేటలోని ఇవివి కళావాహిని కార్యాలయంలో జరిగిన సంతాప సభలో కృష్ణమూర్తి మాట్లాడుతూ అక్కినేని మరణంతో తెలుగు సినీపరిశ్రమే కాకుండా యావత్ భారతదేశం ఒక మంచి నటుడిని కోల్పోయిందన్నారు. అక్కినేని భౌతికంగా అశువులు బాసినా, అమరజీవిగా తన నటనతో శాశ్వతంగా నిలిచిపోతారన్నారు. ఇలా ఉండగా అక్కినేని మృతికి సంతాపంగా నగరంలోని అన్ని సినిమా థియేటర్లలో ఉదయం ఆటను రద్దు చేసినట్లు గుంటూరు పట్టణ సినీ థియేటర్ల యాజమాన్య సంఘం అధ్యక్షుడు మజహర్‌ఖాన్, కార్యదర్శి కె సునీల్‌కుమార్, సహ కార్యదర్శి జిఆర్‌ఎస్ భావన్నారాయణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అక్కినేని మరణం యావత్ సినీ రంగానికి తీరనిలోటని పేర్కొన్నారు.
రైలు దిగుతూ జారిపడి వ్యక్తి మృతి
పొన్నూరు, జనవరి 22: మండల పరిధిలోని మాచవరం రైల్వేస్టేషన్‌లో బుధవారం మధ్యాహ్నం రైలు దిగుతూ కాలుజారి కిందపడి కోటపాటి బుజ్జి (35) అనే వ్యక్తి మృతిచెందాడు. స్థానికుల కథనం ప్రకారం... గుంటూరు నుండి వలస వచ్చిన కోటపాటి బుజ్జి, అంజమ్మ దంపతులు గత ఐదేళ్లుగా కూలిపనులు చేసుకుంటూ మాచవరం గ్రామంలో జీవిస్తున్నారు. సొంత పనులపై బుధవారం ఉదయం తెనాలికి వెళ్లిన బుజ్జి ప్యాసింజర్ రైలులో మాచవరం తిరిగి వస్తూ రైలు దిగే యత్నంలో కాలుజారి పడి మృతిచెందాడు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు.
రసవత్తరంగా జోనల్ ఆటల పోటీలు
అచ్చంపేట, జనవరి 22: జిల్లా సెకండరీ పాఠశాలల బాలుర సెంట్రల్ జోనల్ ఆటల పోటీలు అచ్చంపేట జడ్పీ హైస్కూల్ క్రీడా ప్రాంగణంలో రసవత్తరంగా సాగుతున్నాయి. 2వ రోజైన బుధవారం క్రీడాకారులకు వాలీబాల్, బాల్ బ్యాడ్మింటన్, సాఫ్ట్‌బాల్, కబడ్డీ, ఖోఖో క్రీడా విభాగాల్లో పోటీలు నిర్వహించారు. ఖోఖోలో ముట్టుకూరు జడ్పీ హైస్కూల్ విన్నర్‌గా, యాజిలి జడ్పీ హైస్కూల్ రన్నర్‌గా, వరుసగా కబడ్డీలో ఉల్లిపాలెం జడ్పీ హైస్కూల్, చిలకలూరిపేట ఎఎంజి జట్లు నిలిచాయ. వాలీబాల్‌లో నిజాంపట్నం జడ్పీ హైస్కూల్, నూతక్కి విజ్ఞాన్ విహార్, బాల్ బ్యాడ్మింటన్‌లో చావలి జడ్పీ స్కూలు, జడ్పీ పాలపాడు స్కూలు, సాఫ్ట్‌బాల్‌లో మోదుకూరు జడ్పీ స్కూల్, తుమ్మలచెరువు జడ్పీ స్కూలు నిలిచాయి. గురు, శుక్రవారాల్లో అథ్లెటిక్స్ క్రీడా విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నట్లు జోనల్ సెక్రటరీ మస్తాన్‌రెడ్డి తెలిపారు.
మానవాళి రక్షణార్థమే క్రీస్తుజననం
మేడికొండూరు, జనవరి 22: ప్రపంచ మానవాళికి ఏసుక్రీస్తు తన ప్రేమామృతాన్ని అందించేందుకు తన విలువైన రక్తాన్ని శిలువపై కార్చి తనకు తానే బలి ఇచ్చుకున్నాడని గుంటూరు పీఠాధిపతి బిషప్ గాలిబాలి అన్నారు. మండలంలోని పేరేచర్లలో గల పునిత ఆగ్నేసమ్మ పండుగ మహోత్సవాలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. పేరేచర్ల విచారణ గురువులు ఫాదర్ ఇసుకపల్లి పవన్‌కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రత్యేక దివ్యపూజాబలిలో 32 మంది మత గురువులు, 25 మంది కన్యలు, పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గాలిబాలి మాట్లాడుతూ ఏసుప్రభువు కరుణామయుడన్నది సత్యమన్నారు. పండుగను పురస్కరించుకుని చర్చిని విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. సిఐ సుధాకర్‌బాబు బందోబస్తు నిర్వహించారు.
అక్కినేని మృతి సినీ రంగానికి తీరని లోటు: కోడెల
నరసరావుపేట, జనవరి 22:సినీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు మృతి పట్ల మాజీ మంత్రి డాక్టర్ కోడెల శివప్రసాదరావు బుధవారం సంతాపం తెలిపారు. ఆయన మృతి సినీ రంగానికి తీరనిలోటని పేర్కొన్నారు. సినిమా రంగానికి ఆయన అందించిన సేవలను కొనియాడుతూ వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.
వివిధ కళాసంఘాల సంతాపం
చలన చిత్ర దిగ్గజం, సినీ నటుడు, కళాప్రపూర్ణ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు మృతిపట్ల రంగస్థలి కార్యవర్గం బుధవారం ఒక ప్రకటనలో సంతాపం తెలిపింది. కిలారి వెంకట్రావు, షేక్ మహబూబ్ సుభాని, కెవికె రామారావు, ఎఆర్‌పియస్ కృష్ణమూర్తి, గిరిధర్ కుమార్, షేక్ బాజీ, నల్లపాటి బోసు, మస్తాన్‌రావు తదితరులు ఉన్నారు. అదే విధంగా రంగస్థల కళాకారుల ఐక్యవేదిక సభ్యులు జన్నాభట్ల లక్ష్మీనారాయణ, రత్నాకరం రాము, యాజ్ఞవల్క్యశర్మ, ఫరీద్, విజయకుమార్, డాక్టర్ మడకా సత్యనారాయణ సంతాపం ప్రకటించారు. మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ యన్నం వెంకట నర్సిరెడ్డి అక్కినేని మృతి పట్ల సంతాపం తెలిపారు.
బిజెపి దళిత మోర్చా నివాళి
తెనాలి రూరల్: పద్మశ్రీ, డాక్టర్ అక్కినేని నాగేశ్వరావు మృతిపట్ల భారతీయ జనతాపార్టీ దళిత మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మందా జనార్ధన్ సంతాపం తెలిపారు. బుధవారం తెనాలి మండలం అంగలకుదురు గ్రామంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన అక్కినేని చిత్ర పటానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు. ఈసందర్బంగా మందా మాట్లాడుతూ నాగేశ్వరావు మరణం చలనచిత్ర రంగానికి తీరనిలోటన్నారు. అక్కినేని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈకార్యక్రమంలో బిజెపి దళిత యువమోర్చా నాయకులు, యువకులు, అక్కినేని అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
ప్రజా సమస్యలను విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వం
నరసరావుపేట, జనవరి 22: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికుల, ప్రజల సమస్యల పరిష్కారాన్ని విస్మరించి, సొంత లాభం వేటలో, రాజకీయాల్లో మునిగి తేలడం శోచనీయమన్నారు. ఇలాంటి ప్రభుత్వాన్ని ప్రజలు, కార్మికులు తొలగించడం ఖాయమని సిఐటియు డివిజన్ కార్యదర్శి రవిశంకర్ హెచ్చరించారు. ఏపీ మున్సిపల్ వర్క్‌ర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో జరుగుతున్న నిరాహారదీక్ష శిబిరాన్ని ఉద్దేశించి బుధవారం మాట్లాడారు. నిత్యావసర వస్తువుల ధరలను, గ్యాస్, విద్యుత్, పెట్రోల్ ధరలను ఇష్టారాజ్యంగా పెంచుతున్న పాలకులు, కార్మికులకు ధరల పెరుగుదలకు అనుగుణంగా వేతనాలు పెంచకుండా, అనేక ఆందోళనలు చేసినా పట్టించుకోకుండా, నిర్లక్ష్యంగా, మోసపూరితంగా వ్యవహరించడం శోచనీయమన్నారు. మున్సిపల్ కార్మికులు అక్టోబర్‌లో సమ్మె చేసిన సందర్భంగా చేసుకున్న ఒప్పందాలను అమలు చేయకుండా జాప్యం చేస్తోందన్నారు. ఈకార్యక్రమంలో లలితాప్రసాద్, చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.
ఎఐటియుసి అధ్వర్యంలో
స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదుట రాష్ట్ర మున్సిపల్ కార్మిక సంఘం ఐక్యవేదిక పిలుపులో భాగంగా మున్సిపల్ శానిటరీ వర్కర్స్ యూనియన్ ఎఐటియుసీ అధ్వర్యంలో బుధవారం రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈదీక్షల్లో అంకయ్య, ఎలీషా, విజయలక్ష్మి, రమణమ్మ, హుస్సేనమ్మ, దయామణి, ఎలీశమ్మ, దీనమ్మ, కోట ఇస్సాకు, మరియదాసు తదితరులు పాల్గొన్నారు. శిబిరాన్ని సిపిఐ సీనియర్ నాయకులు షేక్ బుడే ప్రారంభించారు.
అధికార దుర్వినియోగంతో అర్హులకు అగచాట్లు
తెనాలి, జనవరి 22: నియోజక వర్గంలో పేదల సంక్షేమం సంక్షోభంలో పండిందని గడచిన 10 ఏళ్లలో పేదలకు సెంట్ భూమి ఇళ్ల స్థలంగా ఇవ్వని నాయకులు మరలా ప్రజలను మభ్యపెడుతున్నారని మాజీమంత్రి ఆలపాటి కాంగ్రెస్ నేతలపై తీవ్రంగా స్పందించారు. తెలుగు దేశం పార్టీ చేపట్టిన ఇంటింటికి తెలుగు దేశం కార్యక్రమంలో భాగంగా బుధావారం మాజీ మంత్రి ఆలపాటి పార్టీశ్రేణులు వెంటరాగా పట్టణ పరిధిలోని 32వ వార్డు యడ్లలింగయ్య కాలనీని సందర్శించారు. వార్డు నాయకులు, ప్రజలు ఆలపాటికి సాదర స్వాగతం పలుకగా వార్డులోని మహిళలు పలు సమస్యలు ఆలపాటి దృష్టికి తీసుకు వచ్చారు. అర్హులైన తమకు రేషన్ కార్డులేదని, ఇళ్ల స్థలాల సమస్యను దాటవేస్తున్నారని మహిళలు ప్రస్తావించారు. పెరిగిన గ్యాస్ బండ ధరలు తగ్గించాలని కోరారు. ఈక్రమంలో ఆలపాటి ప్రజల నుద్దేశించి మాట్లాడుతూ పట్టణంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన కాలనీలు మినహా ప్రస్తుత ప్రభుత్వం పేదల ఇళ్ల స్థలాల కోసం 40వేల దరఖాస్తులు స్వీకరించి బుట్టదాఖలు చేసి, మరలా కొత్త నాటకం అడుతున్నారని ఆరోపించారు. స్పీకర్ సతీమణి అనుమతులు లేనిదే అర్హులైన వారికి కూడా సంక్షేమ పథకాలు అందుబాటులోకి రాని పరిస్థితి దారుణమని ఆయన విమర్శించారు. అధికారులు ఆమె ఇంటి చుట్టూ ప్రదక్షిణలు చేయడం ప్రజలు గమనించాలన్నారు. అధికార దుర్వినియోగం వల్ల పేద ప్రజలకు అనేక అగచాట్లు పడుతున్నారు. మరలా ఇళ్ళ స్థలాల కోసం, రేషన్ కార్డుల కోసం స్పీకర్ సతీమణి కనుసన్నలలో దరఖాస్తుల స్వీకరణ, మహిళలు బారులు తీరడం మరో కొత్తనాటకమని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ, అవినీతి రాజకీయాలు, స్వార్ధప్రయోజనాలకు రాష్ట్రాన్ని కూడా రెండు ముక్కలు చేసే దుస్థితి చోటు చేసుకుందన్నారు. ప్రజలు వాస్తవాలు గుర్తించి మేల్కొనకపోతే భవిష్యత్ అంధకారమే అన్నారు. అనంతరం కాలనీలోని ప్రతి వీధికి వెళ్లి ప్రతి ఇంటి సమస్యలను ఆలపాటి తెలుసుకున్నారు.
గ్యాస్‌కు ఆధార్ లింకు తొలగించాలి
రేపల్లె, జనవరి 22: కేంద్ర ప్రభుత్వం వినియోగదారులకు వంటగ్యాస్‌పై ఇస్తున్న సబ్సిడీని బ్యాంకు ఖాతాలను ఆధార్ కార్డులతో లింక్ లేకుండా వర్తింపచేయాలని రాష్ట్ర రైతు నాయకులు కేసన శంకరరావు డిమాండ్ చేశారు. పట్టణంలోని బుధవారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్యాస్ రాయితీ పొందాలంటే బ్యాంకులో ఖాతా ప్రారంభించి ఆకౌంటు నెంబరుకు ఆధార్ కార్డు జతపరిచి, కనక్షన్‌తో అనుసంధానం చేయాలని ప్రభుత్వం ఆంక్షలు విధించడం విడ్డూరమని వ్యాఖ్యానించారు. నిరుపేదలకు దీపం పథకం అమలుచేస్తున్నామంటూ గ్యాస్ ధర రాయితీతో కలిపి 1340 రూపాయలు చెల్లించాలని, రాయితీ బ్యాంకు ఖాతాలో జవౌతుందంటూ గ్రామీణ మహిళలపై పెనుభారం మోపటం అన్యాయమని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. సబ్సిడీ పొందకుండా గ్యాస్ తీసుకుంటే భవిష్యత్తులో మీకు రాయితీ వర్తించదని ఆంక్షలు జారీ చేయటం, సబ్సిడీలో వ్యాట్ పేరుతో 70రూపాయలు వరకు దోపిడీ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఆధార్ కార్డులతో లింక్ చేయటంవల్ల కార్డులులేని 30శాతం పేదలు రాయితీలు కోల్పోయి అధిక మొత్తం చెల్లించాల్సి వస్తుందని తెలిపారు. వినియోగదారులకు నెలలు గడిచినా రాయితీ లభించడం లేదని , గ్యాస్ తీసుకోనివారికి బ్యాంకు ఖాతాలో రాయితీ సొమ్ము జమైందని ఎస్‌ఎంఎస్‌లు రావటం వినియోగదారులను విస్మయానికి గురిచేస్తోందన్నారు. సాంకేతిక పరమైన లోపాలతో బ్యాంకుసిబ్బంది, గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులుగాని వినియోగదారులకు న్యాయం చేయలేక పోతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే పాలకులు ఈవిధానం రద్దుచేసి వినియోగదారులకు గ్యాస్ సరఫరాలో ఎలాంటి లోపభూయిష్టం లేకుండా వర్తింపచేయాలని ఆయన ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజలు నిర్వహించే ఉద్యమాలకు ప్రభుత్వాలు బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు.
అక్కినేని జీవనశైలి అజరామరం
తెనాలి, జనవరి 22: అక్కినేని నాగేశ్వరరావు భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన విలక్షణ నటన, క్రమశిక్షణకు మారుపైన జీవన శైలి జనజీవన స్రవంతిలో ఆజరామరమని పలువురు కళాకారులు, కళాభిమానులు అక్కినేనికి ఘన నివాళి అర్పించారు. సినిమా రంగానికి సీనయర్ నటుడుగా వెలుగొందుతున్న అక్కినేని నాగేశ్వరరావు మృతి వార్త కళాభిమానులను, కళాకారులను కలిచివేసింది. బుధవారం తెనాలి పట్టణంలో పలు చోట్ల కళా సంఘాలు అక్కినేనికి ఘనంగా నివాళి అర్పించి, ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశాయి. స్థానిక పెమ్మసానీస్ థియేటర్‌లో అక్కినేని చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. థియేటర్ మేనేజర్ పెమ్మసాని పోతురాజు మాట్లాడుతూ సినీరంగానికి ఎన్‌టిఆర్, ఎఎన్‌ఆర్ రెండు కళ్ళు వంటి వారన్నారు. ఆమహానటులు భౌతికంగా లేకున్నా వారి జీవన శైలి, నట విశ్వరూపాలు కళాభిమానులు ఉన్నంతకాలం నిలిచి ఉంటాయన్నారు. తెలుగు చలన చిత్ర రంగం పెద్దదిక్కును కోల్పోయిందన్నారు. పలువురు అభిమానులు ఘనంగా నివాళి అర్పించారు.
కళాకారుల సంఘం ఆధ్వర్యంలో...
పద్మవిభూషన్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు 75వసంతాలకు పైగా తెలుగు చిత్ర సీమ ద్వారా ప్రేక్షక లోకానికి అందించిన ఆణిముత్యాల్లాంటి చిత్రాలే మునుముందు రోజుల్లో వారి జ్ఞాపకాల నీడలుగా అభిమానులకు హృదయాల్లో నిలిచిపొతాయని పట్టణ రంగస్థల కళాకారుల సంఘం అధ్యక్షుడు షేక్ జానిబాషా అక్కినేనికి ఘన నివాళి అర్పించారు. స్థానిక ఇస్కస్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో కళాకారులు అక్కినేని నాగేశ్వరరావు మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. అక్కినేని నట ప్రస్తానంలోని ఆనేక ఆణిముత్యాల్లాంటి చిత్రాలను గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో కళాకారుల సంఘం ప్రధాన కార్యదర్శి ఎం.సత్యనారాయణశెట్టి, పద్మజాప్రభాకర్, కళాకారుల సంఘంలోని పలువురు కళాకారులు, కళాభిమానులు పాల్గొన్నారు.
ఇంటింటికీ మంచినీటి సరఫరాకు ఉద్యమం
* వైఎస్సార్సీపీ నేత అప్పిరెడ్డి
గుంటూరు, జనవరి 22: ఎంతో ఆర్భాటంగా సాక్షాత్తు సిఎం కిరణ్ రెండున్నర సంవత్సరాల క్రితం గుంటూరుకు సమగ్ర మంచినీటి పథకం మంజూరైందంటూ శిలాఫలకాలను ఆవిష్కరించినా నేటికీ బిందెడు నీరు కూడా పెరగని పరిస్థితి ఉందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి పేర్కొన్నారు. బుధవారం అరండల్‌పేటలోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో అప్పిరెడ్డి మాట్లాడుతూ 480 కోట్ల రూపాయలతో తాగునీటి పథకాన్ని ప్రారంభిస్తున్నామంటూ ప్రజాప్రతినిధులు, స్థానిక మంత్రి, అధికారులు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రెండవ ప్యాకేజీకి సంబంధించి 120 కోట్ల రూపాయల పనులను ఆమోదింపజేసుకుని పైపులైన్ల నిర్మాణం కోసం రోడ్లను అడ్డంగా నరుకుతున్నారని, ఎవరి కన్నీళ్లు తుడవడానికి ఈ పనులు చేస్తున్నారంటూ మండిపడ్డారు. కృష్ణానది నుంచి పైపులైను నిర్మించకుండా, బిందెడు నీళ్లు పెరగకుండా కేవలం లంచాల కోసమే నగరంలో పైపులైన్ల నిర్మాణం జరుగుతుందంటూ ఆరోపించారు. నగరంలో అధికారిక లెక్కల ప్రకారమే 190 మురికి వాడలుండగా ఏ ఒక్క ప్రాంతంలోనూ సరిపడా, సమయానికి తాగునీరు రాని పరిస్థితి ఉందన్నారు. గురువారం నుంచి ఇంటింటికీ తాగునీరు అనే నినాదంతో నగరమంతటా పర్యటిస్తామని తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన సమస్యలను కార్పొరేషన్ అధికారులకు విన్నవిస్తామని, స్పందించకుంటే నగరపాలక సంస్థను ముట్టడించేందుకూ వెనుకాడబోమని అప్పిరెడ్డి స్పష్టం చేశారు. విలేఖర్ల సమావేశంలో పార్టీ నాయకులు ఆతుకూరి ఆంజనేయులు, మేడా సాంబశివరావు, గులాం రసూల్, ఉప్పుటూరి నర్సిరెడ్డి, వై విజయకిషోర్, పానుగంటి చైతన్య తదితరులున్నారు.
ఎసీబీ వలలో ఆర్జేడీ ప్రసాద్
4వేల లంచం తీసుకుంటూ దొరికిన వైనం
గుంటూరు (క్రైం), జనవరి 22: ఓ అధ్యాపకునికి బిల్లుల మంజూరు కో సం లంచం కావాలని వేధిస్తూ నాలుగు వేల రూపాయల లంచం తీసుకుంటూ ఇంటర్మీడియట్ ప్రాంతీ య అధికారి ప్రసాద్ అవినీతి నిరోధక శాఖ అధికారులకు బుధవారం పట్టుబడ్డాడు. ప్రకా శం జిల్లాలో ఓ కళాశాలలో జూనియర్ లెక్చరర్‌గా పనిచేస్తున్న కెవి నారాయణ గతంలో వృత్తివిద్యా కార్యాలయంలో పనిచేశారు. ఆ సమయంలో అతను అనారోగ్యానికి గురై లక్ష రూపాయల వరకు ఖర్చు చేసి నగదు తిరిగి రాబట్టడం కోసం గుంటూరులోని ఇంటర్మీడియట్ బోర్డు ప్రాంతీయ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా డు. ఈ కార్యాలయానికి ఇన్‌ఛార్జిగా ఉన్న రీజనల్ జాయింట్ డైరెక్టర్ ప్రసాద్ లక్ష రూపాయల బిల్లు రావాలంటే తనకు 10 వేలు కావాలని నారాయణను వేధించసాగాడు. ఈ నేపథ్యంలో 5 వేల రూపాయల లంచాన్ని నారాయణ ఇచ్చాడు. అనంతరం వైద్య ఖర్చులకు సంబంధించిన వ్యయం మొత్తం తిరిగి వచ్చింది. అయితే ఇందుకు సంబంధించిన ఫైల్‌ను నారాయణ పనిచేస్తున్న కళాశాలకు పంపకుండా మిగిలిన 5 వేలు ఇస్తే ఫైలు పంపిస్తామని మరో మెలిక పెట్టాడు. దీంతో విసిగి వేసారిన నారాయణ ఎసిబి అధికారులను ఆశ్రయించాడు. బుధవారం మధ్యాహ్నం ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో 4 వేల రూపాయల లంచాన్ని ప్రసాద్‌కు ఇచ్చాడు. అప్పటికే అక్కడ కాపుకాసి ఉన్న ఎసిబి అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని అరెస్ట్ చేశారు.
అట్టహాసంగా వివిఐటి 7వ వార్షికోత్సవం
పెదకాకాని, జనవరి 22: మండల పరిధిలోని నంబూరులో గల వాసిరెడ్డి వెంకటాద్రి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 7వ వార్షికోత్సవ వేడుకలు బుధవారం అట్టహాసంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జవహర్ నాలెడ్జ్ సెంటర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అమర్‌నాధ్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి నైపుణ్యంతో పాటు సామాజిక స్పృహ కలిగి ఉండాలన్నారు. చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్ తదితరులు మాట్లాడారు. ప్రముఖ టివి యాంకర్ ఫణి ధ్వన్యనుకరణ, విద్యార్థినుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను అలరించాయి. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ వై మల్లిఖార్జునరెడ్డి, కార్యదర్శి బదరి ప్రసాద్, జాయింట్ సెక్రటరిలు ఎం శ్రీకృష్ణ, ఎస్‌ఆర్‌కె పరమహంస, అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
తాడేపల్లిలో ట్రావెలర్స్ బస్సుల హాల్ట్...!
తాడేపల్లి, జనవరి 22: ప్రైవేట్ ట్రావెలర్స్ బస్సులు ఈ మధ్యకాలంలో తాడేపల్లిలో హాల్ట్ అవుతున్నాయి. ఆర్‌టిఎ అధికారులు పర్మిట్లు లేని ప్రైవేటు బస్సులను సీజ్ చేస్తున్న నేపథ్యంలో విజయవాడ నుండి చెన్నై, బెంగుళూరు, తిరుపతి, కోయంబత్తూరు, కన్యాకుమారి తదితర ప్రాంతాలకు వెళ్ళి వచ్చేటప్పుడు ప్రైవేట్ ట్రావెలర్స్ బస్సు యాజమానులు ప్రయాణికులను కనకదుర్గమ్మ వారధి రాకముందే, పాత టోల్‌గేట్ వద్ద బస్సులను నిలిపి వేసి, వారిని ఆటోల్లో గమ్యస్థానాలకు చేర్చుతున్నారు. పగలంతా ప్రయివేట్ బస్సులు 6 లైన్ల జాతీయ రహదారి మార్జన్ల వద్ద, పట్టణంలోని వివిధ ప్రదేశాలలో ఎక్కడపడితే అక్కడ ఆగి ప్రజలకు కూడా ఇబ్బందులను కలిగిస్తున్నాయనే ఆరోపణలు విన్పిస్తున్నాయ.
వైభవంగా మల్లాది వెంకన్న వార్షిక తిరునాళ్లు
అమరావతి, జనవరి 22: మండల పరిధిలోని మల్లాది గ్రామంలో వేంచేసియున్న స్వయంభు వటవృక్షాంతర్గత శ్రీ వేంకటేశ్వర స్వామి 37వ జన్మదిన వార్షిక తిరునాళ్ల బుధవారం అత్యంత భక్తిశ్రద్ధలతో జరిగింది. పద్మావతీ ఆండాళ్ సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి కల్యాణం ప్రత్యేకంగా అలంకరించిన వేదికపై జరిగింది. ఆలయ అర్చకస్వామి వినుకొండ శ్రీనివాసాచార్యులు, యాగ్నిక స్వామి పరుచూరి శ్రీనివాసాచార్యుల పర్యవేక్షణలో వేద పండితులు స్వామివారి కల్యాణాన్ని నిర్వహించారు. భక్తులకు అర్ధమయ్యే రీతిలో జ్యోతిష విశారధ శనగవరపు రామ్మోహనశర్మ, పారేపల్లి బాలకృష్ణ ప్రత్యక్ష వ్యాఖ్యానం చేశారు. భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి స్వామిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో పొంగళ్లు చేసుకుని భక్తులు మొక్కుబడులు చెల్లించుకున్నారు. స్వామివార్లను మాజీ ఎంపిపి వెంపా జ్వాలా లక్ష్మీ నరసింహారావు, స్థానిక పెద్దలు, మండల తెలుగుదేశం నాయకులు కె వసంతరావు, షేక్ మాబు సుభాని తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. పెదకూరపాడు ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీ్ధర్ సహకారంతో పాటు భక్తుల సహకారంతో విశేష అన్నదానం జరిగింది. అమరావతి ఎస్‌ఐ జి సుబ్బారావు, రవికృష్ణ సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు. సాయంత్రం ప్రదర్శించిన భక్తిరస సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా అలరించాయి.
నృసింహుని హుండీ ఆదాయం 14 లక్షలు
మంగళగిరి, జనవరి 22: స్థానిక శ్రీ పానకాల లక్ష్మీనరసింహస్వామి ఎగువ, దిగువ సన్నిధుల్లోను, ఉపాలయమైన శ్రీ పద్మావతీ సమేత వేంకటేశ్వర స్వామి ఆలయంలో హుండీల ద్వారా భక్తులు సమర్పించిన కానుకలను బుధవారం దిగువ సన్నిధిలోని ముఖమండపంలో లెక్కించారు. మొత్తం 14,00050 రూపాయలు ఆదాయం లభించిందని ఇఓ నల్లకాల్వ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఎగువ సన్నిధిలో హుండీల ద్వారా 6 లక్షల 31వేల 017 రూపాయలు, దిగువ సన్నిధిలోని హుండీల ద్వారా 7లక్షల 32వేల 598 రూపాయలు, వేంకటేశ్వర స్వామి ఆలయంలోని హుండీల ద్వారా 36వేల 435 రూపాయలు, మొత్తం 14,00050 రూపాయలు ఆదాయం లభించిందని ఇఓ తెలిపారు. గతేడాది కంటే ఈ ఏడాది 4లక్షల 24వేల 632 రూపాయల అదనపు ఆదాయం లభించిందని ఇఓ శ్రీనివాసరెడ్డి తెలిపారు. సహాయ కమిషనర్ ఈమని చంద్రశేఖరరెడ్డి పర్యవేక్షణలో హుండీలను లెక్కించారు. ఆలయ సిబ్బంది, భక్తులు లెక్కింపులో పాల్గొన్నారు.