Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

ఏసీబీ వలలో ఫారెస్ట్ డిఆర్వో

$
0
0

ఖమ్మం(గాంధీచౌక్), జనవరి 22: ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ గుడవనేని వెంకటరామకృష్ణ 8వేల రూపాయల లంచం తీసుకుంటూ బుధవారం ఏసిబికి చిక్కాడు. సంఘటనకు సంబంధించి ఏసిబి అధికారి సాయిబాబా కథనం ప్రకారం... తల్లాడ మండలం బిల్లుపాడు వెంకటగిరి గ్రామానికి చెందిన మట్టా శ్రీనివాస్ బుట్టల వ్యాపారం నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 4వ తేదీన బుట్టలతో ఆటోలో ఖమ్మం తరలిస్తుండగా, అధికారుల తనిఖీల్లో భాగంగా స్థానిక బైపాస్‌రోడ్డు ఆటోను అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయంలో సంబంధిత వెంకటరామకృష్ణ 7వేల రూపాయల జరిమానా విధించి మొత్తం 15వేల రూపాయలు చెల్లించాలని, అప్పుడే ఆటోను వదిలేస్తామని పేర్కొనటంతో బాధితులు తమను సంప్రదించారన్నారు. తమ సూచన మేరకు బుధవారం లంచం ఇస్తుండగా తాము పట్టుకున్నామని తెలిపారు. ఈ దాడుల్లో ఏసిబి అధికారులు వెంకటేశ్వరరావు, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.

అవినీతి కాంగ్రెస్‌కు బుద్ధిచెప్పండి
* ప్రజా సమస్యలు పరిష్కరించే పార్టీని ఎన్నుకోండి
* జనచైతన్యయాత్రలో ఎంపి నామ నాగేశ్వరరావు
పాల్వంచ, జనవరి 22: తొమ్మిదిన్నర ఏళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో రాష్ట్ర అభివృద్ధి పూర్తిగా కుంటుపడిపోయిందని, అవినీతి కాంగ్రెస్‌కు బుద్ధిచెప్పి, ప్రజాసమస్యలు పరిష్కరించే పార్టీని స్వాగలించాలని ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు నామా అన్నారు. పాల్వంచ మండలం, పట్టణాల్లో మూడురోజుల పాటు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చేపట్టనున్న జనచైతన్యయాత్రలను మండల పరిధిలోని రంగాపురం గ్రామంలో బుధవారం ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన సభల్లో నామా మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవినీతి పాలనను ప్రజలకు అందిస్తుండడం వలనే కేంద్రరాష్ట్రంలో ఎక్కడా కూడా అభివృద్ధి జరగలేదన్నారు. చంద్రబాబునాయుడు పేద, బడుగు, బలహీనవర్గాల అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు వారికి అందించడమే తమ ప్రధాన లక్ష్యమన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం 2014ఎన్నికల్లో విజయం సాధిస్తే రైతులకు రుణమాఫీతో పాటు డ్వాక్రా మహిళల రుణాలను కూడా మాఫీ చేయనున్నట్లు ఆయన తెలిపారు.జనచైతన్యయాత్రలో భాగంగా మొదటిరోజు రంగాపురం, కొత్తకాలనీ, జగన్నాథపురం, తోగ్గూడెం, కేశవపురం, బసవతారకకాలనీ, సీతానగర్‌కాలనీ, బిక్కునాయక్‌తండా, సోములగూడెం, లక్ష్మిదేవిపల్లి, అంబేద్కర్‌కాలనీ, విద్యానగర్‌కాలనీల్లో పర్యటించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకొని వాటిని పరిష్కరించే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కొత్తగూడెం నియోజకవర్గ ఇన్‌చార్జ్ కోనేరు సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈకార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కొండబాల కోటేశ్వరరావు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కిలారు నాగేశ్వరరావు, కొత్తగూడెం మండల అధ్యక్షుడు మాలోత్ రాందాస్‌నాయక్, ఎస్‌కె మసూద్, మల్లెల రవిచంద్ర, బరపటి వాసుదేవరావు, తారాచంద్, వీరునాయక్, రమణమూర్తినాయుడు, కనగాల అనంతరాములు, చందర్‌రావు, రేగడి మధు, కాపా కృష్ణమోహన్, రత్నాకర్, బైరెడ్డి వసంతకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా మండలంలో అక్కడక్కడ ఏర్పాటుచేసిన తెలుగుదేశం పార్టీ జెండాలను నామా ఆవిష్కరించారు.

ప్రజా కోర్టులో తేలుస్తాం

ఇల్లెందు, జనవరి 22: సుదీర్ఘచరిత్ర ఉన్న న్యూడెమోక్రసీ పార్టీ నుంచి కొందరిని బయటకు పంపామని, వారు పార్టీ పేరును వాడుకుంటున్న తీరు సరైందికాదని ప్రజాకోర్టులో వారి సత్తాతేలుతుందని సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ అనుబంధంగా ఉన్న ఐఎఫ్‌టియు జాతీయ ప్రధాన కార్యదర్శి పటోలి అన్నారు. ప్రజాసమస్యలు పరిష్కరించాలని, ఓపెన్‌కాస్ట్‌లు రద్దుచేసి భూగర్భబొగ్గుగనులు ఏర్పాటుచేయాలని, పోడుభూములకు హక్కుపత్రాలు ఇవ్వాలని, ఎలాంటి సవరణలు లేకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని కోరుతూ సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ విప్లవపార్టీ ఆధ్వర్యంలో బుధవారం ఇల్లెందు విధుల్లో వేలాది మంది భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం పార్టీ సీనియర్ నాయకులు రాయల చంద్రశేఖర్ అధ్యక్షతన ఆర్టీసి బస్టాండ్ ఆవరణలో భారీ బహిరంగసభ నిర్వహించారు. సభలో ఐఎఫ్‌టియు జాతీయనేత పటోలి, పార్టీ ఢిల్లీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అపర్ణ మాట్లాడుతూ పార్టీ విధానాలు, సిద్ధాంతాలను ఉల్లంఘించినందున కొందరిని బహిష్కరించామని వారు న్యూడెమోక్రసీ పార్టీ, అనుబంధ ప్రజాసంఘాల పేర్లను వినియోగించుకుంటూ తమదే అసలైన పార్టీనని ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటన్నారు. ప్రజాబలం ఎవరికివుందనే విషయం అందరికి తెలుసునని, ప్రజాపోరాటాల ద్వారా ఎవరిబలం ఏమేరకు ఉందనేది తెలుస్తుందని అన్నారు. రానున్న రోజుల్లో ప్రజాకోర్టులో చీలిక నేతల బలం తేటతెల్లం అవుతుందన్నారు. తెలంగాణ విషయంలో ప్రధాన రాజకీయ పార్టీలు ప్రజలను మానసిక వ్యథకు గురిచేస్తున్నారని, సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో రెండురాష్ట్రాల ఏర్పాటు అంశంలో స్పష్టత లేదని, పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు తక్షణమే ప్రవేశపెట్టి ఆమోదించాలని డిమాండ్ చేశారు. కేంద్రంలోని యుపిఎ సంకీర్ణ ప్రభుత్వం ప్రజాసమస్యలను ఏనాడు పట్టించుకోలేదని విమర్శించారు. అవినీతి అక్రమాలు, కుంభకోణాలు కాంగ్రెస్ పాలనలో అధికమయ్యాయని ధ్వజమెత్తారు. ఆర్థిక సంక్షోభం రోజురోజుకు పెరుగుతున్నందున అన్నివర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, నూతన ఆర్థిక విధానాలే అందుకు కారణమన్నారు. ఉపాధి హామీ పథకం, ఆహారభద్రత, అటవీహక్కుల చట్టం, ఇతర పలు చట్టాలకు పాలకప్రభుత్వాలు తూట్లు పొడుస్తున్నారని విమర్శించారు. ప్రజాపోరాటాలతో సాధించుకున్న హక్కులను కాలరాసే ప్రయత్నాలు జరుగుతున్నందున ఎన్నికలతో సంబంధంలేకుండా ప్రజలు ఉద్యమాలు నిర్వహించి హక్కులను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రాంతాల్లోని కోల్‌బెల్ట్ ఏరియాల్లో సింగరేణి యాజమాన్యం ఓపెన్‌కాస్ట్ మైన్‌ను ఏర్పాటుచేసేందుకు ఆసక్తిగా ఉందని దానివలన నామమాత్రంగానే ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. భూగర్భబొగ్గుగనులు ఏర్పాటు చేస్తేనే వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అందుకోసం కార్మికవర్గం పోరాటాలు నిర్వహించాలని కోరారు. పదవులతో పనిలేకుండా ప్రజాసంక్షేమాన్ని కాంక్షించి నిరంతరం ఉద్యమాలు నిర్వహిస్తున్నది న్యూడెమోక్రసీ పార్టీ ఒక్కటేనని పేర్కొన్నారు.
తెలంగాణ ఖాయం
రాష్ట్ర శాసనసభలో తెలంగాణ బిల్లును అడ్డుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఎవరూ ఎన్ని కుట్రలు, కుతంత్రాలు జరిపినప్పటికి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడడం ఖాయమని న్యూడెమోక్రసీ పార్టీ జిల్లా కార్యదర్శి పోటు రంగారావు అన్నారు. బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తీవ్రస్థాయిలో ప్రతిఘటించేందుకు అన్నివర్గాల ప్రజలు ఉద్యమాలకు సిద్ధంకావాలని కోరారు. ప్రజాసమస్యల పరిష్కారం కోసం న్యూడెమోక్రసీ నిర్వహిస్తున్న సమరశీల పోరాటాల్లో ప్రజలు రాజకీయాలకు అతీతంగా పోరాడాలన్నారు. అరుణోదయ కళాకారులు సభలో ప్రదర్శించిన నృత్యాలు, కళాప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. పార్టీ రాష్టన్రాయకులు వేములపల్లి వెంకటరామయ్య, కృష్ణ, గుమ్మడి నర్సయ్య, జిల్లా నాయకులు చండ్రా అరుణ, జగ్గన్న, జి రామయ్య తదితరులు పాల్గొన్నారు.

ఆందోళనలతో అట్టుడికిన సత్తుపల్లి
పెనుబల్లి, జనవరి 22: సత్తుపల్లి, సింగరేణి భూ నిర్వాసితుల ఆందోళనలతో బుధవారం సత్తుపల్లి అట్టుడికి పోయింది. అఖిలపక్ష నేతల అరెస్ట్‌తో సత్తుపల్లి పట్టణంతో పాటు కిష్టారం, కొమ్మేపల్లి గ్రామాల్లో తీవ్ర ఉద్రిక్తతలు పరిస్థితి చోటు చేసుకుంది. గత 20 రోజులుగా కొత్త భూ సేకరణ చట్టం అమలు చేయాలనే డిమాండ్ చేస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు సోమవారం రాత్రి కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఉడతనేని అప్పారావు, వైఎస్‌ఆర్‌సిపి నియోజకవర్గ కన్వీనర్ మట్టా దయనంద్‌లతో పాటు తొమ్మిది మందిని అరెస్ట్ చేసి దమ్మపేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న కొమ్మేపల్లి, కిష్టారం, లంకపల్లి గ్రామస్థులు సింగరేణిని ముట్టడించేందుకు సమాయత్తం అయ్యారు. ఈ నేపథ్యంలో ఆందోళనను నిలువరించేందుకు స్థానిక డీఎస్పీ అశోక్‌కుమార్, సిఐలు వెంకన్నబాబు, చంద్రయ్య కొమ్మేపల్లి, కిష్టారం గ్రామాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముమ్మరంగా తనిఖీలు నిర్వహించి ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు కొంత మంది ఆందోళనకారులను అదుపులోకి తీసుకొని సత్తుపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ నేత జిల్లా కో ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ మువ్వా విజయబాబు కిష్టారం చేరుకోగా ఖమ్మం పార్లమెంటరీ వైఎస్‌ఆర్‌సిపి ఇంచార్జ్ పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు కొమ్మేపల్లి చేరుకున్నారు. ఇరువురు నాయకులు ఆయా గ్రామస్థులు, బాధితులను వెంటబెట్టుకొని సింగరేణిని ముట్టడించేందుకు ప్రదర్శనగా బయల్దేరారు. అక్కడే ఉన్న పోలీసులు కిష్టారంలో మువ్వా విజయబాబును అరెస్ట్ చేసి సత్తుపల్లి తరలించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఆందోళనకారులు, రైతులు వలయంలా ఏర్పడి పోలీసుల ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య వాగ్వివాదం జరిగింది. ఒక దశలో ఇరువురి మధ్య తోపులాట చోటు చేసుకుంది. పోలీసులు అడ్డుకుంటున్నా ఆందోళనకారులు వారిని తోచుకుంటూనే కిష్టారం నుండి సింగరేణి క్రాస్‌రోడ్డు వరకు చేరుకున్నారు. అక్కడి పోలీసులు భారీగా మోహరించి సింగరేణి ముట్టడిని అడ్డుకున్నారు. ఇదే సమయంలో కొమ్మేపల్లి నుండి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గ్రామస్థులతో భారీ ప్రదర్శనతో అక్కడికి చేరుకున్నారు. న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో సత్తుపల్లి నుండి ప్రదర్శనగా ఆందోళనకారులు సింగరేణి క్రాస్ రోడ్డు వరకు వచ్చారు. అక్కడే రోడ్డుపై బైఠాయించి ఆందోళనకారులు సుమారు రెండు గంటల పాటు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల పాలిట శత్రువులా మారిందని విమర్శించారు. కొత్త భూ సేకరణ చట్టం అమలు చేయకుండా రైతులను దోచుకుంటుందని ఆయన ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వంపై పోరాడేందుకు కోర్టులను ఆశ్రయిస్తామని, ఇందుకై ఖర్చును వైఎస్‌ఆర్‌సిపి భరిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. జిల్లా బ్యాంక్ చైర్మన్ మువ్వా విజయబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలను స్మశానాలుగా మరుస్తోందని అన్నారు. రైతులకు న్యాయం జరిగే వరకు తెలుగుదేశం పార్టీ బాధితులకు అండగా ఉంటుందని తెలిపారు. సింగరేణి నిర్వసితులకు కొత్త భూ సేకరణ చట్టం అమలు చేయనందు వల్ల ఇక్కడి బాధితులకు 29 కోట్ల రూపాయల నష్ట వాటిలుతుందని ఆయన అవేదన వ్యక్తం చేశారు. ఆందోళనకారులు పోలీసులతో చర్చల ఫలితంగా అరెస్ట్ చేసిన ఆందోళనకారలను విడుదల చేస్తామని డీఎస్పీ అశోక్‌కుమార్ హామీచ్చారు. ఇక్కడి ఆందోళన సమాచారం అందుకున్న సిపిఎం జిల్లా కార్యదర్శి పోతినేని సుదర్శన్ ఖమ్మం నుండి సత్తుపల్లి వస్తుండగా మార్గమధ్యలో విఎం బంజర్ పోలీస్‌స్టేషన్ వద్ద రూరల్ సిఐ చంద్రయ్య అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆందోళన కార్యక్రమంలో న్యూడెమోక్రసీ నేతలతో పాటు, తెలుగుదేశం, వైఎస్‌ఆర్‌సిపి నేతలతో పాటు, గ్రామస్థులు తమ అవేదనను విన్నవించారు.

హద్దులు నిర్ణయించి ఆక్రమణలు తొలగించండి

ఖానాపురం హవేలి, జనవరి 22: ప్రభుత్వ స్థలాల హద్దులు నిర్ణయించి, ఆక్రమణలు వెంటనే తొలగించాలని జాయింట్ కలెక్టర్ సురేంద్రమోహన్ అధికారులను ఆదేశించారు. బుధవారం స్థానిక మమత ఆసుపత్రి రోడ్డులోని ఆక్రమిత స్థలాలను తొలగించాలని కోర్టు ఇచ్చిన ఆదేశాలను తప్పకుండా పాటించాలన్నారు. జెసి, ఎస్పీ ఏవి రంగనాథ్, డిఆర్వో శివ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, తహశీల్దార్ అశోక్‌చక్రవర్తి, సిఐలు భారీ పోలీస్ బందోబస్తుతో సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా పేదలు తాము అనేక సంవత్సరాలుగా నివశిస్తున్న, తమ గుడిసెలను తొలగిస్తే తాము ఉండేందుకు కనీసం నీడ కూడా ఉండదని, దీన్ని దృష్టిలో ఉంచుకొని తమ నివాసాలను తొలగించాలని ఉండాలని వేడుకున్నారు. అయితే అధికారులు మాత్రం కోర్టు ఆదేశాల అనుసారం తాము విధులు నిర్వహిస్తామని స్పష్టం చేసి ఆక్రమిత స్థలంలో ఉన్న హార్వెస్ట్ స్కూల్ ప్రహారీగోడను తొలగించటంతో పాటు మమత ఆసుపత్రి వద్ద వేసిన పెన్షింగ్‌ను సైతం తొలగించారు. అనంతరం జెసి మాట్లాడుతూ అధికారులు, సిబ్బంది త్వరితగతిన ప్రభుత్వ స్థలాల యొక్క హద్దులను నిర్ణయించి, ఆక్రమిత స్థలాల్లో ఉన్న గృహాలను తొలగించాలని సూచించారు. తొలుత ఆక్రమిత స్థలాలను తొలగించవద్దంటూ బాధితులు ఆందోళన నిర్వహించగా వీరికి సిపిఐ జిల్లా కార్యదర్శి బాగం హేమంతరావు, ఆ పార్టీ నాయకులు మద్దతు ప్రకటించారు.
మహాజన సోషలిస్టు పార్టీ
అందరికీ అండగా ఉంటుంది
ఖానాపురం హవేలి, జనవరి 22: కులమతాలకు అతీతంగా మహాజన సోషలిస్టు పార్టీ అందరికి అండగా ఉంటుందని, సమ సమాజ స్థాపన కోసం రాజ్యాధికారం దక్కించుకునేందుకు చేసే పోరాటానికి ప్రతి ఒక్కరు మద్దతునివ్వాలని ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. బుధవారం నగరంలో పార్టీ జెండాను ఆవిష్కరించి, కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సమాజంలో ఎస్సీ,బిసి, ముస్లిం, మైనార్టీలకు తీవ్రంగా అన్యాయం జరుగుతుందని, ఆ అన్యాయాలను ప్రతిఘటించేందుకు తన ప్రజా సమస్యల పరిష్కారం కోసం పార్టీని స్థాపించానన్నారు. తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు ఆయా సామాజిక వర్గాలకే ప్రాధాన్యతనిస్తూ ఇతర కులాలను ఎన్నికలప్పుడు ఏజెంట్లుగా మారుస్తున్నారని ఆరోపించారు. అన్ని జిల్లాల్లోనూ ఎస్సీ, బిసి, ముస్లిం, మైనార్టీలకు ప్రాధాన్యతనివ్వకుండా మాయమాటలతో మోసం చేస్తున్నారన్నారు. అంబేద్కర్ కోరుకున్న రా జ్యాన్ని ప్రస్తుత పాలకులు తుంగలో తొక్కుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్వాతంత్య్రం సిద్ధించి 62 సంవత్సరాలు పూర్తయినప్పటికీ అందరు అగ్రవర్ణాలే ముఖ్యమంత్రులు, మంత్రులుగా పని చేశారని, ఏనాడు ఇతర వర్గాలకు ప్రాధాన్యతనివ్వలేదన్నారు. నూ తన సమాజం రావాలంటే రాజ్యాధికారం తమ చేతిలోకి రావాలని, ఆనాడే ప్రజల సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. తొలుత నగరంలో ఆ పార్టీ ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. సమావేశంలో పార్టీ జిల్లా కన్వీనర్ నల్లమోతు విజయరాజు మాదిగ, భాస్కర్, శ్రీను, అంజయ్య, ఏపూరి వెంకటేశ్వర్లు, సత్య నారాయణ, విమల, బేగం, నర్సింహారావు, రామనాథం, కృష్ణ, కూరాకుల నాగభూషణం, మేకల సుగుణరావు, మదార్‌సాహెబ్ తదితరులు పాల్గొన్నారు.

పరీక్షలకు అభ్యర్థులు సకాలంలో హాజరుకావాలి : జేసీ
ఖానాపురం హవేలి, జనవరి 22: వచ్చే నెల 2వ తేదీన జరిగే విఆర్వో, విఆర్‌ఏ పరీక్షలకు అభ్యర్థులు పరీక్ష సమయానికి హాజరుకావాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సురేంద్రమోహన్ సూచించారు. బుధవారం తన కార్యాలయంలో పరీక్షలు రాసే అభ్యర్థులకు పలు సూచనలు, సలహాలు అందించారు. అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి నిర్ధేశించిన సమయంలోగా హాజరుకావాలని , నిమిషం ఆలస్యమైనా అభ్యర్థులను పరీక్షకు అనుమతించమన్నారు. హాల్ టిక్కెట్, ఫోటో, సంతకం లేని వారు అస్పష్టంగా,్ఫటో, సంతకం ముద్రించబడిన అభ్యర్థులు రెండు ఫాస్‌పోర్టు సైజ్ ఫోటోలు, ఒక గెజిటెడ్ అధికారతో సంతకం చేయించుకొని వచ్చి ఇన్విజిలేటర్‌కు అందించాలన్నారు. అభ్యర్థి ఇన్విజిలేటర్ సంతకం చేయించుకోవాలన్నారు.

వైరాతో అక్కినేని అనుబంధం
వైరా, జనవరి 22: స్థానిక ప్రజలతో అక్కినేని నాగేశ్వరావుకు విడదీయరాని బంధం ఉందని ఎన్టీఆర్ కళా పరిషత్ సంఘ సభ్యులు అన్నారు. బుధవారం ఆ సంఘం ఆధ్వర్యంలో అక్కినేని ఆత్మకు శాంతి కలగాలని వౌనం పాటించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపిపి కట్టా కృష్ణార్జునరావు మాట్లాడుతూ 2001 ఫిబ్రవరి 21న వైరాలో జరిగిన కెవిసిఎం కళాశాల కార్యక్రమంలో పాల్గొనడానికి ఆయన వచ్చి స్థానికులతో మంచి సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారన్నారు. ఆయన ఎంత ఎదిగినా అంత ఒదిగి ఉండే వారని స్థానికులు ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. అనంతరం జరిగిన సభలో ఆయన అభిమాన సంఘం సభ్యులు అక్కినేని కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాకారులు బుచ్చి రామారావు, షేక్ సోందుసాహెబ్, డివిఎస్ నారాయణ, దాసరాజు కుటుంబరావు, సత్యం, వూరుకొండ వెంకటేశ్వరావు, సంపసాల వరదరాజు తదితరులు ఉన్నారు.
లక్షా 8వేల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు
జూలూరుపాడు, జనవరి 22: గృహనిర్మాణశాఖ కొత్తగూడెం డివిజన్‌లోని కొత్తగూడెం, ఇల్లెందు, వైరా నియోజకవర్గాల పరిధిలో 29మండలాలకు ఇందిరమ్మ పథకం కింద ఒకలక్ష 8వేల 846 పక్కాగృహాలు మంజూరు చేయడం జరిగిందని కొత్తగూడెం గృహనిర్మాణశాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తారాచంద్ తెలిపారు. మండలంలోని రామచంద్రాపురం, నల్లబండబోడు గ్రామాల్లో బుధవారం లబ్ధిదారులతో జరిగిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. అనంతరం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ డివిజన్‌లో అర్హులైన లబ్ధిదారులకు పక్కాగృహాలను మంజూరుచేయగా వాటిలో 68వేల 358ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయన్నారు. 17251గృహాల నిర్మాణాలు వివిధ దశల్లోవుండగా 8,998గృహాలు నిర్మాణానికి నోచుకోలేదని తెలిపారు.
వీటితో పాటు ఒక్కొ మండలానికి 500చొప్పున డివిజన్‌లో 14,500మరుగుదొడ్లు అర్హులైన పేదలకు మంజూరు చేయడం జరిగిందని ప్రజలు ఈఅవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అయితే ఇళ్లనిర్మాణాలను ప్రారంభించిన లబ్ధిదారులకు నిబంధనల ప్రకారం మూడుదశల్లో బిల్లులు మంజూరు చేస్తామన్నారు.
రామచంద్రాపురంలో 75ఇళ్లు మంజూరు చేయగా కేవలం ఆరుగురు మాత్రమే ఇళ్లు కట్టుకున్నారని పూర్తిస్థాయిలో గిరిజనులకు అవగాహన కల్పించేందుకు మండల అధికారుల సమన్వయంతో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. ఈకార్యక్రమంలో వైరా డివిజన్ గృహనిర్మాణశాఖ డిఇ జివిఎన్ మల్లిఖార్జున్‌రావు, మండల ఎఇ వెంకటేశ్వరరావు, ఎంపిడిఓ భారతి, హౌజింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ గుడవనేని
english title: 
acb

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>