భీమడోలు, జనవరి 23 : సులభవాయిదాల్లో గృహోపకరణాలను అందజేస్తామంటూ సుమారుగా 30 లక్షల రూపాయలు వసూలు చేసి బోర్డు తిప్పేసిన సంఘటన భీమడోలులో జరిగింది. వివరాలు ఈ విధంగా వున్నాయి. భీమడోలు జంక్షన్ సమీపంలోని విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట సంవత్సరంన్నర క్రితం శ్రీ లక్ష్మీగణపతి ఎంటర్‌ప్రైజెస్ పేరిట గృహోపకరణాల దుకాణాన్ని ప్రారంభించారు. రెండువేల మంది సభ్యులుగా నెలకు వంద రూపాయలు చొప్పున 14 నెలల పాటు స్కీమును ప్రారంభించారు. ప్రతి నెలా డ్రా తీస్తూ డ్రాలో విజేతలకు వారు కోరిన గృహోపకరణాలు అందజేసేవారు. ఇదే రీతిలో భీమడోలు, ద్వారకాతిరుమల మండలాల పరిధిలోని 14 గ్రామాల్లో రెండు గ్రూపులుగా ఒక్కొక్క గ్రూపులో వెయ్యి మంది చొప్పున రెండు వేల మంది సభ్యత్వం పొందారు. వీరి వద్ద నుంచి నెలకు వంద రూపాయలు చొప్పున వసూలు చేస్తూ వస్తున్నారు. గురువారం బంపర్ డ్రా వుందంటూ సభ్యులకు సమాచారం అందజేయడంతో వారు భీమడోలులోని కార్యాలయానికి చేరుకున్నారు. అయితే మీరు ఆలస్యంగా వచ్చారని, డ్రా తీయడం పూరె్తైందంటూ అక్కడ వున్న ఏజెంట్లు సభ్యులకు చెప్పడం జరిగింది. అయితే సభ్యులు తాము సకాలంలోనే వచ్చామని, డ్రా ఏ విధంగా ముగిసిందంటూ ప్రశ్నించడంతో ఏజెంట్లు, సభ్యుల మధ్య వాగ్వివాదం జరిగింది. సమాచారం అందుకున్న ఇతర సభ్యులు కూడా కార్యాలయం వద్దకు చేరుకున్నారు. దీంతో కార్యాలయం వద్ద వున్న ఇద్దరు ఏజెంట్లను తమకు గృహోపకరణాలను ఇప్పించాలంటూ సభ్యులు నిలదీశారు. ఇదే సమయంలో కొందరు సభ్యులు కార్యాలయం ఏర్పాటు చేసిన దుకాణం ఇంటి యజమానులను సంప్రదించగా తమకు కిరాయిగా చెల్లించాల్సిన మొత్తాన్ని బుధవారమే చెల్లించి దుకాణాన్ని ఖాళీ చేశారంటూ చెప్పడంతో సభ్యులు దిమ్మెరపోయారు. తక్షణమే కార్యాలయం వద్దకు చేరుకుని అక్కడ వున్న నిర్వాహకులను నిలదీసి తమకు గృహోపకరణాలు ఇప్పించాలంటూ నిర్బంధించారు. ఏలూరులో ఇప్పిస్తామంటూ వారు కొందరు సభ్యులను తమతో తీసుకుని ఏలూరు చేరుకున్నారు. బిర్లాభవన్ సెంటర్‌లో ఏజెంట్లు తమతో వచ్చిన సభ్యులపై దౌర్జన్యం చేసి పరారయ్యారు. దీంతో లబోదిబోమంటూ సభ్యులు భీమడోలులోని ఇతర సభ్యులకు సమాచారం అందజేశారు. అందరూ కలిసి భీమడోలు పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని తాము మోసపోయామని, తమకు చెల్లించాల్సిన గృహోపకరణాలను ఇప్పించాలంటూ ఫిర్యాదు చేశారు. భీమడోలు, ద్వారకాతిరుమల మండలాల్లోని ఇతర సభ్యులు కూడా శుక్రవారం భీమడోలు జంక్షన్‌లోని కార్యాలయానికి చేరుకుని తదుపరి కార్యాచరణను చర్చించుకునే అవకాశం కనిపిస్తోంది.
రాష్ట్ర విభజన తగదు
అసెంబ్లీలో గళమెత్తిన ఎమ్మెల్యే ఉషారాణి
పాలకొల్లు, జనవరి 23: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును వ్యతిరేకిస్తూ ఎమ్మెల్యే బంగారు ఉషారాణి గురువారం అసెంబ్లీలో మాట్లాడారు. భాషాప్రయుక్త రాష్ట్రంగా నాటి పెద్దలు ఏర్పాటుచేసిన తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉందని ఆమె అన్నారు. జై ఆంధ్ర ఉద్యమం చేసిన సమయంలో ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ రాష్ట్ర విభజన కూడదని, రాజ్యాంగంగా దీన్ని మార్పు చేయకుండా 171 డిని రాజ్యాంగంలో చేర్చారని ఆమె వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులుగా ఉన్న ఏ ఒక్కరు రాష్ట్ర విభజన కోరుకోలేదని ఆమె అన్నారు. బిల్లులో భద్రాచలం డివిజన్ తూర్పుగోదావరికి చెందినదని పేర్కొనకపోవటం, 371 డి అధికరణ మార్పు చేయకపోవటం, కృష్ణా, గోదావరి నదీ జలాలపై సంపూర్ణ విశే్లషణ లేకుండా వేర్పాటును ప్రోత్సహించటం, విడిపోయే వారికి రాష్ట్ర రాజధాని ఇవ్వటం వంటి రాజ్యాంగ విరుద్ధమైన సంఘటనలు ఈ బిల్లులో ఉన్నాయని ఆమె అసెంబ్లీలో పేర్కొన్నారు. సమైక్య రాష్ట్రంగానే రాష్ట్భ్రావృద్ధి సాధ్యమని ఆమె అన్నారు. ఆంధ్రప్రదేశ్ సంపూర్ణ వికాసం కోసం కలిసి ఉండాలని ఆమె గట్టిగా కోరారు. బిల్లుకు ఓటింగ్ పెట్టి అసెంబ్లీ నిర్ణయాన్ని ప్రకటించాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రజలు కోరుకున్నది జరగాలని కానీ, రాజకీయ అవసరాల కోసం రాష్ట్ర విభజన చేయాలనుకోవటం పెద్ద తప్పిదమని ఆమె చెప్పారు.
గిరిజనుల ప్రగతి నిధులు సకాలంలో వినియోగించకపోతే
కఠిన చర్యలు
అధికారులకు కలెక్టర్ హెచ్చరిక
ఏలూరు, జనవరి 23 : జిల్లాలో గిరిజనుల ప్రగతికి నిర్ధేశించిన నిధులను సక్రమంగా సకాలంలో వినియోగించకపోతే సంబంధిత అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ సిద్ధార్ధ్‌జైన్ జిల్లా అధికారులను హెచ్చరించారు. స్థానిక కలెక్టరేట్‌లో గురువారం సాయంత్రం గిరిజన ఉప ప్రణాళిక అమలు తీరును ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఎన్నో దశాబ్ధాల నుండి పేద గిరిజనుల జీవితాల ఆర్ధిక పురోభివృద్ధికి ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులు వెచ్చిస్తోందని ప్రస్తుతం గిరిజనులకు చెందాల్సిన నిధులను చట్టబద్ధం చేసి సక్రమంగా సకాలంలో వినియోగించేందుకు ప్రభుత్వం నిర్మాణాత్మకమైన చర్యలు చేపట్టిందని వాటిని సద్వినియోగం చేసి గిరిజనుల జీవితాల్లో వెలుగు కిరణాలు ప్రసరింప చేయాలని కోరారు. గిరిజన ఉప ప్రణాళిక, ఎస్సీ సబ్‌ప్లాన్ క్రింద నిర్ధేశించిన లక్ష్యాలను సంపూర్ణంగా అమలు చేయవల్సిందేనని ఈ విషయంలో ఎటువంటి జాప్యం సహించబోనని చెప్పారు. ఎస్‌టి, ఎస్‌సి స్పెషల్ ప్లాన్ క్రింద మంజూరైన నిధులతో చేపట్టిన పనులు మార్చి 31 నాటికి పూర్తి చేయాలని, మంజూరు చేసిన యూనిట్లను ఫిబ్రవరికల్లా స్థాపన జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. లేనిపక్షంలో సంబంధిత అధికారులు జవాబుదారీ వహించవలసి వుంటుందన్నారు. ఇందిర జల ప్రభ క్రింద మంజూరు చేసిన మోటార్లకు విద్యుద్దీకరణ చేసే పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ట్రాన్స్‌కో ఎస్‌ఇ సూర్యప్రకాష్‌ను కలెక్టరు ఆదేశించారు.
ఏలూరులో త్వరలో ప్రైవేటు సిటీ సర్వీస్
జిల్లా ప్రధాన కేంద్రానికి నిత్యం వేలాది మంది ప్రజలు నలుమూలల నుండి వస్తున్నారని వారికి సరైన సిటీ బస్ సర్వీసు లేక ఇబ్బందులు పడుతున్న తీరును గుర్తించానని త్వరలో ప్రైవేటు సిటీ సర్వీసును ప్రజలకు అందుబాటులో ఉండేలా తగు చర్యలు తీసుకోవాలని ఉప రవాణా శాఖ కమిషనర్ శ్రీదేవిని కలెక్టర్ ఆదేశించారు. నగరంలో సిటీ సర్వీస్ ఏర్పాటు చేస్తే ప్రజలకు తక్కువ ఛార్జీలతో ప్రయాణించడానికి వీలు కలుగుతుందని ఈ మేరకు ఎన్ని బస్సులు అవసరం అవుతాయో తగు రూట్‌ల వివరాలను సిద్ధం చేసి ప్రతిపాదనలు పంపించాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ టి బాబూరావునాయుడు తదితరులు పాల్గొన్నారు.
2.75 లక్షల ఓటర్ల నమోదు
కలెక్టర్ సిద్ధార్ధ్‌జైన్
ఏలూరు, జనవరి 23 : జిల్లాలో ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా 2.75 లక్షల మంది ఓటర్లు కొత్తగా నమోదయ్యారని జిల్లా కలెక్టర్ సిద్ధార్ధ్‌జైన్ చెప్పారు. స్థానిక పాతబస్టాండ్ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమంలో భాగంగా గురువారం విద్యార్ధినీ విద్యార్ధులు, పోలీస్, వివిధ శాఖల సిబ్బందితో ఓటర్ల ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా సుమారు 60 వేల మంది యువ ఓటర్లు కొత్త ఓటర్లుగా నమోదు కావడం అభినందనీయమన్నారు. ఓటరుగా నమోదు కాబడిన ప్రతీ ఒక్కరూ ఎన్నికల సమయంలో ఓటు హక్కును వినియోగించుకుని బలమైన ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడేందుకు దోహదపడాలన్నారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రాముఖ్యతను తెలియజేస్తూ ఓటర్లు అందరుకూ ఎన్నికల పట్ల అవగాహన కల్పించడం, ఈ నెల 25వ తేదీన సెయింట్ థెరిస్సా జూనియర్ కళాశాలలో జాతీయ ఓటర్ల దినోత్సవం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న ప్రతీ ఒక్కరితో కలెక్టరు ఓటర్ల ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో జెసి డాక్టర్ టి బాబూరావునాయుడు, ఎ ఎస్‌పి ఎన్ చంద్రశేఖర్, డి ఆర్వో కె ప్రభాకరరావు, జడ్పీ సి ఇవో వి నాగార్జునసాగర్, ఖజానా శాఖ ఉపసంచాలకులు మోహనరావు, ఆర్‌డివో బి శ్రీనివాసరావు, డి ఇవో ఆర్ నరసింహరావు, గృహ నిర్మాణ శాఖ పిడి సత్యనారాయణ, డ్వామా పిడి రామచంద్రారెడ్డి, సిపివో కె సత్యనారాయణ, డి ఎస్‌పి సత్తిబాబు, వ్యవసాయ శాఖ జెడి కృపాదాస్, ఐసిడి ఎస్ పిడి వసంతబాల, సెట్‌వెల్ సి ఇవో ఎండిహెచ్ మెహర్రాజ్, ఏలూరు నగరపాలక సంస్థ కమిషనర్ జి నాగరాజు, మెప్మా పిడి శేషారెడ్డి, డి ఎస్‌డివో శ్రీనివాసరావు, మండల తహశీల్దార్లు ఎజి చిన్నికృష్ణ, బి సోమశేఖర్, రాజు, ప్రముఖ సంఘ సేవకులు ఆర్ సూర్యారావు, జి ఆనందరావు, జిల్లా మర్చంట్స్ ఛాంబర్ అధ్యక్షులు నేరెళ్ల రాజేంద్ర, తదితరులు పాల్గొన్నారు. సి ఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాల, సెయింట్ థెరిస్సా మహిళా కళాశాల, కెపిడిటి హైస్కూలు, ఎస్‌పిడిపిటి జూనియర్ కళాశాల, సర్ సి ఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాల ఎన్ ఎస్ ఎస్ యూనిట్, రామచంద్ర ఇంజనీరింగ్ కాలేజీ, ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన విద్యార్ధినీ విద్యార్ధులతోపాటు పెద్ద ఎత్తున పోలీస్, హోమ్‌గార్డ్స్, రిజర్వు పోలీస్, అగ్నిమాపక సిబ్బంది, వివిధ ప్రభుత్వ కార్యాలయాల ఉద్యోగులు, అధికారులు పాల్గొన్నారు.
చట్టాలపై అవగాహన కల్పించాలి
- జిల్లా అదనపు జడ్జి కల్యాణ్
యలమంచిలి, జనవరి 23: విద్యార్థి దశలోనే చట్టాలపై అవగాహన కల్పించాలని జిల్లా అదనపు జడ్జి పి.కల్యాణ్‌రావు అన్నారు. గురువారం యలమంచిలి మండలం ఏనుగువానిలంకలో గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద న్యాయ విజ్ఞాన సదస్సులో ఆయన మాట్లాడారు. సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాల మేరకు తాము గ్రామీణ ప్రాంతంలో వార్డులలో సంచార వాహనంపై న్యాయ విజ్ఞానం అందిస్తున్నామని ఆయన చెప్పారు. గ్రామీణులు శాంతియుత వాతావారణంలో సోదర భావంతో జీవనం చేయవలసిన అవసరం ఉందని ఆయన అన్నారు. సీనియర్ సివిల్ జడ్జి టి.మల్లికార్జునరావు, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కె.అరుణ, అదనపు జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ ఎస్.వరలక్ష్మి, గ్రామ సర్పంచ్ పాలపర్తి కుమారరత్నం, తహసీల్దార్ సి.గురుప్రసాద్, కో-ఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడు పొత్తూరి రామాంజనేయులు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అడబాల సుబ్రహ్మణ్యం, న్యాయవాదులు టి.ఆంజనేయులు, ఉపసర్పంచ్ నారిన ప్రతాప్, ఎన్.కుమారరత్నం, టి.ఆంజనేయులు, ఉప సర్పంచ్ వినుకొండ రత్తయ్య పాల్గొన్నారు.
మావుళ్లమ్మ స్వర్ణవస్త్ర నిధికి రూ.11,01,000 విరాళం
భీమవరం, జనవరి 23: భీమవరం ఇలవేల్పు శ్రీశ్రీశ్రీ మావుళ్లమ్మ అమ్మవారి స్వర్ణ వస్తన్రిధికి అమెరికాకు చెందిన ఆరేటి సుబ్బారావు, అనంతలక్ష్మీ భాను దంపతులు రూ.1,01,000లు విరాళాన్ని గురువారం అందజేశారు. స్వర్ణవస్తన్రిధి కమిటీ సభ్యులు గన్నాబత్తుల శ్రీనివాస్, గొంట్లా నారాయణకు ఈ విరాళాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధానార్చకులు మద్దిరాల రామలింగేశ్వరశర్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు అందజేశారు. మావుళ్లమ్మ అమ్మవారి ఉత్సవ కమిటీ అధ్యక్షులు మానే పేరయ్య, కొప్పుల సత్తిబాబు, రామాయణం గోవిందరావు తదితరులు ఉన్నారు.
ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవాలి:కలెక్టర్
ఏలూరు, జనవరి 23 : ఓటర్ల అవగాహన ర్యాలీకి అనూహ్య స్పందన లభించిందని, ఇదే విధమైన స్ఫూర్తితో ప్రతీ ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకుని ప్రజాస్వామ్య వ్యవస్థ పునాదులు పటిష్టవంతం కావడానికి సహకరించాలని జిల్లా కలెక్టర్ సిద్ధార్ధ్‌జైన్ పిలుపునిచ్చారు. జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకల సందర్భంగా గురువారం స్థానిక సి ఆర్ రెడ్డి కళాశాల నుండి ఓటర్ల అవగాహనా ర్యాలీని కలెక్టర్ బెలూన్లు ఆకాశంలోకి విడిచిపెట్టి ప్రారంభించారు. చేయి చేయి కలుపుతూ వేల సంఖ్యలో విద్యార్ధినీ విద్యార్ధులు, ఉద్యోగులు, మమిళలు, కార్మిక, కర్షక, వ్యాపార వర్గాలు వేలాదిగా జిల్లా కలెక్టరు వెంట తరలిరావడంతో ఏలూరు నగర రోడ్లు అన్ని జనంతో కిక్కిరిసి పోయాయి. ట్రాఫిక్‌కు ఎక్కడా కూడా అవరోధం కలుగకుండా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వాహనాలను మళ్లించారు. ఎన్నడూ లేని విధంగా ఓటర్ల అవగాహనా ర్యాలీకి పది వేల మందికి పైగా తరలిరావడం జిల్లా చరిత్రలో ఇదే ప్రప్రధమం. పాతబస్టాండ్ నుండి ఓవర్ బ్రిడ్జి వరకూ రోడ్లు అన్నీ జనసంద్రంగా మారాయి. జిల్లా కలెక్టర్ సిద్ధార్ధ్‌జైన్ పిలుపు మేరకు జాయింట్ కలెక్టర్ డాక్టర్ టి బాబూరావునాయుడు, డి ఆర్‌వో ప్రభాకరరావు, ఆర్‌డివో బి శ్రీనివాసరావు, తహశీల్దారు ఎజి చిన్నికృష్ణలు నిరంతర కృషి ఫలితంగా ఈ ర్యాలీ ఏలూరు నగరంలో విజయవంతంగా జరిగింది. ఓటర్ల నమోదు విషయంలో కూడా జిల్లా యంత్రాంగం చూపిన చొరవ, కృషి వల్ల తక్కువ సమయంలో అత్యధిక ఓటర్ల నమోదు జరిగింది. జిల్లా కలెక్టర్ సిద్ధార్ధ్‌జైన్ సి ఆర్ రెడ్డి కళాశాల నుండి పాత బస్టాండ్ వరకూ ఈ ర్యాలీలో నడిచి రావడంతో జిల్లా అధికార యంత్రాంగం కూడా ఆయనను అనుసరించింది. ఈ ర్యాలీలో ఎక్కడికక్కడ తాగునీరు, జామకాయలు, ఇతర తినుబండారాలను జిల్లా యంత్రాంగం అందించడంతో విద్యార్ధినీ విద్యార్ధులు మరింత రెట్టింపు ఉత్సాహంతో ఈ ర్యాలీలో పాల్గొన్నారు. సి ఆర్ రెడ్డి కళాశాల నుంచి ప్రారంభమైన ర్యాలీ ఫైర్‌స్టేషన్‌కు చేరుకుంది. అనంతరం అక్కడ మానవహారం నిర్వహించారు. అక్కడ నుంచి పాతబస్టాండ్ వరకు ర్యాలీ సాగింది. జిల్లా కలెక్టర్ వెంట జెసి డాక్టర్ టి బాబూరావునాయుడు, జడ్పీ సి ఇవో వి నాగార్జునసాగర్, గృహ నిర్మాణ శాఖ పిడి సత్యనారాయణ, డ్వామా పిడి రామచంద్రారెడ్డి, సిపివో సత్యనారాయణ, అడిషనల్ ఎస్‌పి ఎన్ చంద్రశేఖర్, డి ఎస్‌పి సత్తిబాబు, డి ఇవో ఆర్ నరసింహరావు, జిల్లా ఖజానా శాఖ డిడి మోహనరావు, వ్యవసాయ శాఖ జెడి కృపాదాస్, డి ఎస్‌డివో శ్రీనివాసరావు, ఏలూరు నగరపాలక సంస్థ కమిషనర్ జి నాగరాజు, మెప్మా పిడి శేసారెడ్డి, జిల్లా మర్చంట్స్ ఛాంబర్ అధ్యక్షులు నేరెళ్ల రాజేంద్ర, సి ఆర్‌రెడ్డి ఇంజనీరింగ్ కళాశాల, సెయింట్ థెరిస్సా మహిళా కళాశాల, కెపిడిటి హైస్కూలు, ఎస్‌పిడిపిటి జూనియర్ కళాశాల, సర్ సి ఆర్ రెడ్డి కళాశాల ఎన్ ఎస్ ఎస్ యూనిట్, రామచంద్ర ఇంజనీరింగ్ కాలేజీ, ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన విద్యార్దినీ విద్యార్ధులతో పాటు పెద్ద ఎత్తున పోలీస్, హోమ్‌గార్డ్స్, రిజర్వ్ పోలీసు, అగ్నిమాపక సిబ్బంది, వివిధ ప్రభుత్వ కార్యాలయాల ఉద్యోగులు, అధికారులు పాల్గొన్నారు. ర్యాలీ అగ్రభాగాన పోలీసు బ్యాండు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
వివాదాస్పద పోలింగ్ కేంద్రాలు గుర్తించాలి
రెవెన్యూ, పోలీసు శాఖలను ఆదేశించిన ఆర్డీవో
జంగారెడ్డిగూడెం, జనవరి 23: కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పోలవరం, చింతలపూడి నియోజకవర్గాలలోని వివాదాస్పద పోలింగ్ కేంద్రాలను గుర్తించి సకాలంలో నివేదిక సమర్పించాలని పోలీసు, రెవెన్యూ అధికారులను ఆర్డీఒ వి.నాన్‌రాజ్ ఆదేశించారు. గురువారం స్థానిక రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో ఎన్నికల కమిషన్ ఆదేశాలపై జరిగిన రెండు నియోజకవర్గాల స్థాయి రెవెన్యూ, పోలీసు శాఖల అధికారుల సమావేశంలో ఆర్డీఒ ప్రసంగించారు. ఓటర్లు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోలేని పోలింగ్ కేంద్రాలను గుర్తించాలని ఆదేశించారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడం, ప్రభావితం చేయడం, భయబ్రాంతులను చేయడం వంటి సంఘటనలు జరిగే పోలింగ్ కేంద్రాలను గుర్తించేందుకు నిశితంగా పరిశీలించాలన్నారు. ఇటువంటి పోలింగ్ కేంద్రాలు ఈ రెండు నియోజకవర్గాలలో లేనప్పటికీ పరిశీలన అవసరమన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగే పోలింగ్ కేంద్రాలు ఉన్న గ్రామాలను గుర్తించాలని, నక్సలైటు ప్రభావిత ప్రాంతాలు, కమ్యూనిస్టు పార్టీల వల్ల ప్రభావితం అయ్యే ప్రాంతాలు సత్వరమే గుర్తించాలన్నారు. రాజకీయ వివాదాలు, గతంలో క్రిమినల్ కేసులు నమోదైన గ్రామాలు, రాజకీయ వివాదాలు చోటు చేసుకునే అవకాశం ఉన్న గ్రామాలను తాజాగా గుర్తించాలని ఆదేశించారు. అందుకు స్టేషన్ హౌస్ ఆఫీసర్లు, తహశీల్థార్లు సమన్వయంతో వ్యవహరించాలన్నారు. కుల వివాదాలు, నాటు సారా తయారు చేసే ప్రాంతాలు గుర్తించాలని, నాన్ బెయిలబుల్ వారెంట్లు ఆరు నెలల పైబడి పెండింగ్‌లో ఉంటే వారిని అదుపులోకి తీసుకోవాలని, లైసెన్స్ ఆయుధాలు డిపాజిట్ చేయించాలని ఆదేశించారు. ఏ పోలింగ్ కేంద్రంలోనైనా ఓటర్లను బెదిరింపులకు, భయబ్రాంతులను చేసేందుకు ప్రయత్నిస్తారని అనుమానం వచ్చిన వారిని బైండోవర్ చేయాలన్నారు. గతంలో 80 శాతం దాటి పోలింగ్ జరిగిన పోలింగ్ కేంద్రాల జాబితా కూడా అందజేయాలన్నారు. 60 శాతం కంటే తక్కు ఓటరు గుర్తింపు కార్డులు జారీ అయిన పోలింగ్ కేంద్రాల వివరాలు కూడా అందజేయాలన్నారు. వీటిని జిల్లా కలెక్టర్ కేంద్ర ఎన్నికల కమిషన్‌కు నివేదిక పంపనున్నట్టు తెలిపారు. డియ్యస్పీ ఎ.వి.సుబ్బరాజు మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా చింతలపూడి, పోలవరం నియోజకవర్గాలలో అత్యంత సమస్యాత్మక గ్రామాలు, సమస్యాత్మక గ్రామాలు, వివాదాస్పద గ్రామాలు ఇప్పటికే పోలీసు శాఖ గుర్తించినట్టు తెలిపారు. చింతలపూడి నియోజకవర్గంలోని జంగారెడ్డిగూడెం మండలంలో జంగారెడ్డిగూడెం పట్టణం, రూరల్ మండలంలో తాడువాయి, వేగవరం, మైసన్నగూడెం గ్రామాలు, చింతలపూడి మండలంలో శివపురం, గుళ్ళపాడు, తిమ్మిరెడ్డిపల్లి, చింతంపల్లి, చింతలపూడి, ప్రగడవరం, యర్రగుంటపల్లి గ్రామాలు, లింగపాలెం మండలంలో కలరాయనగూడెం, మఠంగూడెం, భోగోలు, నరసన్నపాలెం, ములగలంపాడు గ్రామాలు, కామవరపుకోట మండలంలో ఈస్ట్‌యడవల్లి, ఆడమిల్లి, కామవరపుకోట గ్రామాలు అత్యంత సమస్యాత్మక (హైపర్ సెన్సిటివ్) గ్రామాలని వివరించారు. పోలవరం నియోజకవర్గంలో కొయ్యలగూడెం మండలంలో బయ్యన్నగూడెం, కిచ్చప్పగూడెం, కన్నాపురం, పరింపూడి, కొయ్యలగూడెం, రాజవరం, వంకబొత్తప్పగూడెం, మర్రిగూడెం, యర్రంపేట గ్రామాలు, పోలవరం మండలంలో పోలవరం, గూటాల, కొత్తపట్టిసీమ, పట్టిసీమ, కోండ్రుకోట, తెల్లవరం, ఎల్‌ఎన్‌డి పేట, చేగొండపల్లి గ్రామాలు, బుట్టాయగూడెం మండలంలో గుమ్ములూరు, కొమ్ముగూడెం, రెడ్డిగణపవరం, జైనవారిగూడెం, కె.ఆర్.పురం గ్రామాలు, జీలుగుమిల్లి మండలంలో కామయ్యపాలెం, దర్భగూడెం గ్రామాలు అత్యంత సమస్యాత్మక గ్రామాలని తెలిపారు. టి.నరసాపురం మండలంలో అత్యంత సమస్యాత్మక గ్రామాలు లేవని చెప్పారు. ఈ సమావేశంలో స్థానిక తహశీల్థార్ ఎం.శ్రీనివాసరావు, స్థానిక ఎస్సై బి.ఎన్.నాయక్, పలువురు తహశీల్థార్లు, పోలీసు అధికారులు పాల్గొన్నారు.
గుణాలలో సింధుడు పరమేశ్వరుడు
* భీమవరంలో ద్వాదశ జ్యోతిర్లింగాల దర్శనం ప్రారంభం
భీమవరం, జనవరి 23: గుణాలలో సింధుడు పరమేశ్వరుడు అని మాజీ మంత్రి యర్రానారాయణ స్వామి పేర్కొన్నారు. పరమేశ్వరుడికి ఊరుకో పేరుందని, భక్తులు ఆయన్ని అనేక పేర్లతో ప్రపంచవ్యాప్తంగా కొలుస్తున్నారని అన్నారు. ప్రజాపిత బ్రహ్మకుమారీ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం పరమేశ్వరుడి గురించి తెలియచేసేందుకు భీమవరంలో ద్వాదశ జ్యోతిర్లింగాల దివ్యదర్శనం ఏర్పాటుచేయడం అభినందనీయమన్నారు. గురువారం రాత్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆవరణలో ప్రజాప్రిత బ్రహ్మకుమారీ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం భీమవరం శాఖ ఆధ్వర్యంలో మావుళ్ళమ్మ అమ్మవారి స్వర్ణోత్సవాలను పురస్కరించుకుని ద్వాదశ జ్యోతిర్లింగాల దివ్యదర్శనాన్ని, చైతన్య దేవతల అలంకారాలను ఏర్పాటుచేశారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు మానేపల్లి సూర్యనారాయణగుప్తా, ఉపాధ్యక్షుడు గన్నపురెడ్డి గోపాలకృష్ణ, మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం పాలకమండలి సభ్యులు తోరం సూర్యనారాయణ, విజ్ఞానవేదిక కన్వీనర్ చెరుకువాడ రంగసాయి, అల్లు శ్రీనివాస్ మాట్లాడారు. పరమేశ్వరుడి గురించి భక్తులకు వివరించారు. రాజయోగిని బ్రహ్మకుమారీ కె.రేవతి అధ్యక్షతన ప్రారంభమైన ఈ కార్యక్రమంలో వరంగల్ సబ్‌జోన్ ఇన్‌చార్జి సవితా బెహన్జీ, బిఆర్ సుధాకర్, రామాయణం శివబాబు, సిహెచ్.బాబూరావు, ఐ.కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు. చైతన్య దేవతల అలంకారంలో భాగంగా వైకుంఠ శ్రీలక్ష్మీనారాయణుల పట్ట్భాషేక దివ్యదర్శనాన్ని ఏర్పాటుచేశారు. ఇది వీక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
హిందూధర్మ ప్రచారంతో దేశ గొప్పతనం చాటిన వివేకానంద
నిడమర్రు, జనవరి 23: స్వామి వివేకానంద ప్రపంచ వ్యాప్తంగా హిందూ ధర్మాన్ని ప్రచారం చేసి భారతదేశ గొప్పతనాన్ని చాటిచెప్పారని మాజీ ఎమ్మెల్సీ, మాజీ డిసిసి ఛైర్మన్ వట్టి వెంకట పార్ధసారథి అన్నారు. గురువారం స్థానిక మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో స్వామి వివేకానంద విగ్రహావిష్కరణ చేసి అనంతరం జిల్లా పరిషత్ హైస్కూల్‌లో జరిగిన వివేకానంద 150వ జయంతి ఉత్సవాలు ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సమావేశానికి ఎంఇఒ కె రాంబాబు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఇంటి ఉదయ భాస్కర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం నిడమర్రు హైస్కూల్ నుండి త్రిఫుల్ ఐటికి విద్యార్థులు ఎంపికయ్యేలా ఉపాధ్యాయులు విశేష కృషి చేస్తున్నారన్నారు. ఈ నెల 21న మండల హైస్కూల్, ఎంపిపి స్కూల్ విద్యార్థులకు వివిధ రకాల పోటీల్లో గెలిపొందిన వారికి మూడు రకాల బహుమతులు పార్థసారథి చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమంలో ఎంపిడివో కె కోటేశ్వరరావు, తహసీల్దార్ ఎ గాంధి, కాంగ్రెస్ నాయకులు పుప్పాల మెహర్ కుమార్, వేగేశ్న వెంకట సుబ్బరాజు, పలువురు నాయకులు పాల్గొన్నారు.