ఏలూరు, జనవరి 25 : దూసుకువెళ్లిపోతోందని పార్టీ నేతలు జబ్బలు చరుచుకోవడం తప్ప వాస్తవంగా నియోజకవర్గాల్లో ఆ ఊపు కనిపించేలా చేయడం తెలుగుదేశం పార్టీ శ్రేణులకు కొంత ఇబ్బందికరంగానే మారినట్లు కనిపిస్తోంది. జిల్లాలో మొత్తం 15 నియోజకవర్గాలుంటే వాటిలో కొన్ని మినహా మిగిలిన వాటిలో ఎవరు వచ్చే ఎన్నికల్లో అభ్యర్ధిగా నిలబడతారన్న సందిగ్ధం వీడటం లేదు. కొన్ని చోట్ల మాత్రం అభ్యర్ధుల విషయంలో కొంత ఏకాభిప్రాయం రావడం, అదే సమయంలో అధిష్టానం కూడా ఆమోదముద్ర వేయడంతో ఆయా ప్రాంతాల్లో వారు ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టేశారు. కానీ మిగిలిన నియోజకవర్గాల్లో ఇప్పటికీ అయోమయం వీడటం లేదు. వున్న నాయకుల్లో ఎవరో ఒకరు అభ్యర్ధిగా నిలబడతారన్న భరోసా కూడా లేకుండా పోయింది. మరికొన్ని చోట్ల వలస నేతలే అభ్యర్ధులుగా మారతారన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఈ నేపధ్యంలో ఆయా ప్రాంతాల్లో అటు శ్రేణుల్లోనూ, ఇటు నేతల్లో కూడా ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే త్వరితగతిన అభ్యర్ధుల విషయాన్ని తేలిస్తేనే రానున్న రోజుల్లో పార్టీకి మేలు జరుగుతుందన్న అంశాన్ని కూడా నేతలు, శ్రేణులు అధిష్టానం దృష్టికి తీసుకువెళుతూనే వున్నారు. అయినప్పటికీ ఈ ప్రాంతాల్లో సమీకరణాలు ఒక కొలిక్కి రాకపోవడంతో అభ్యర్ధుల విషయం ఇంకా స్పష్టం కావడం లేదు. మరో ప్రత్యేకత కూడా ఇక్కడ లేకపోలేదు. కొన్ని నియోజకవర్గాల్లో ప్రత్యర్ధి పార్టీల అభ్యర్ధులు కూడా దాదాపు ఖరారైన పరిస్థితుల్లో టిడిపి అభ్యర్ధులకు ఆమోద ముద్ర పడినట్లుగా కూడా చెబుతున్నారు. మిగిలిన చోట్ల మాత్రం ప్రత్యర్ధుల బలం, బలగం బయట పడకుండా ముందుగా అభ్యర్ధిని ప్రకటిస్తే అది చివరకు వికటిస్తుందన్న అంచనా కూడా పార్టీ వర్గాల్లో వుందని చెబుతున్నారు. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా పార్టీ పరిశీలకులు శ్రేణుల అభిప్రాయాలను సేకరించారు. అయినప్పటికీ ఈ విషయంలో ఒక అడుగు కూడా ముందుకు పడలేదనే చెప్పుకోవాలి. ప్రధానంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి సంబంధించి నాయకులు, శ్రేణుల్లో కొంత ఉత్కంఠ ఉందనే చెప్పుకోవాలి. ఈ ప్రాంతంలో వలస నేతకే టిక్కెట్ లభిస్తుందన్న ప్రచారం ఇంతకుముందు నుంచి సాగుతూనే వుంది. అయితే ఆ వలస నేత వ్యవహార శైలిపై పార్టీ శ్రేణుల్లో తీవ్ర వ్యతిరేకత కూడా కనిపిస్తూనే వుంది. తమపై కేసులు పెట్టి వేధించిన నాయకుని ఆధ్వర్యంలో ఎలా పనిచేస్తామంటూ ఏలూరులో జరిగిన పార్టీ సమావేశంలోనే గూడెం తమ్ముళ్లు అసంతృప్తి స్వరాన్ని గట్టిగా వినిపించారు. ఈ నియోజకవర్గం నుంచి టిడిపిలోకి ఇద్దరు ప్రముఖ నాయకులు వచ్చేస్తారని ప్రచారం జరుగుతుండగా చివరకు ఆ సంఖ్య ఒక్కరికి పరిమితమైనట్లుగా చెబుతున్నారు. ఈ నేతపై కూడా అసంతృప్తి జ్వాలలు రగులుతుండటంతో ఈ విషయంలో పార్టీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందన్న ఉత్కంఠ అందరిలోనూ వ్యక్తమవుతోంది. ఇక మరో ప్రధానమైన నియోజకవర్గంగా నిలుస్తున్న భీమవరంలోనూ ఇదే పరిస్థితి. ఈ నియోజకవర్గంలో గతం నుంచి టిక్కెట్లు ఆశిస్తూ పార్టీ కార్యక్రమాలను భుజాన వేసుకుని నడిపిస్తున్న నాయకునికి ఆశాభంగం తప్పదన్న ప్రచారం జరుగుతోంది. ఈ నియోజకవర్గం నుంచి మరో నేతకు అవకాశం లభిస్తుందన్న ఊహాగానాల మధ్య నాయకుని పరిస్థితి అగమ్యగోచరంగా మారిపోయింది. ఇదే విషయంపై ఆ నాయకుడు తీవ్ర అసంతృప్తిని కూడా వ్యక్తం చేశారు. చివరకు అధిష్టానం దృష్టికి కూడా దీన్ని తీసుకువెళ్లి తాను ఇంత కాలం నుంచి పార్టీకి కట్టుబడి పనిచేస్తున్నానని, అయినప్పటికీ ఇటువంటి ప్రచారం జరగడం వల్ల పార్టీకి, తనకు కూడా ఏ మాత్రం లాభం వుండదని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఇక పోలవరం నియోజకవర్గాన్ని పరిశీలిస్తే గత ఎన్నికల్లో చోటు చేసుకున్న సమీకరణాల మార్పుల నేపధ్యంలో ఈ నియోజకవర్గానికి సరైన అభ్యర్ధిని ఎంపిక చేసే బాధ్యత అధిష్టానం పైనే వుందని చెప్పాలి. ఇంతకుముందు ఎన్నికల్లో పార్టీ అభ్యర్ధిగా పనిచేసిన నాయకుని వ్యవహార శైలిపై ఇప్పుడు ఆ ప్రాంత శ్రేణులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. అంతేకాకుండా దాదాపుగా అనుకూలంగా వుందన్న ప్రచారం జరిగిన నియోజకవర్గంలోనూ దెబ్బతినడానికి అభ్యర్ధే కారణమని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఇక్కడ కూడా బలమైన అభ్యర్ధి అనే్వషణ సాగుతూనే వుంది. ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీకి గతంలో కంచుకోటగా నిలుస్తూ వచ్చిన నర్సాపురం నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇక్కడ కూడా ప్రత్యర్ధులను ధీటుగా ఎదుర్కోగలిగే బలమైన అభ్యర్ధి అవసరం చాలా కనిపిస్తోంది. అయినప్పటికీ ఇక్కడ పార్టీ పరంగా రంగంలోకి దిగే అభ్యర్ధి విషయంలో ఇప్పటికీ తకరారు కొనసాగుతూనే వుంది. ఇక్కడ కూడా వలస నేతలు వుంటారన్న ప్రచారం జరుగుతున్నా అది ఎంత వరకు వాస్తవరూపం ధరిస్తుందన్నది తేలాల్సి వుంది. ఇక కొవ్వూరు నియోజకవర్గం విషయంలోనూ కొంత అయోమయం కొనసాగుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేకు ఇక్కడ మళ్లీ ఛాన్స్ ఇవ్వకపోవచ్చునన్న ప్రచారం జరగుతుండగా దీనిపై ఆయన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేయడం తెలిసిందే. అయినప్పటికీ సిట్టింగ్‌కు మళ్లీ ఛాన్స్ లభిస్తుందన్న భరోసా గానీ, మరో నాయకుడు వస్తాడన్న హామీ గానీ ఈ నియోజకవర్గ శ్రేణులకు లేకుండా పోయింది. దీంతో ఈ నియోజకవర్గాలే కాకుండా మరికొన్ని చోట్ల కూడా కొంత అయోమయం నెలకొంది. దీన్ని త్వరిగతిన పరిష్కరించాలన్న డిమాండ్లు శ్రేణుల నుంచి వినిపిస్తున్నాయి.
ఎన్నికలు స్వేచ్ఛగా నిర్వహించేందుకు ప్రణాళిక: కలెక్టర్
ఏలూరు, జనవరి 25 : రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని జిల్లాలో స్వేచ్ఛగా, ప్రశాంతంగా జరిగేందుకు క్లిష్టతరమైన పోలింగ్ కేంద్రాలను గుర్తించి అందుకు అనుగుణంగా ప్రణాళిక సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ సిద్ధార్ధ్‌జైన్ పోలీసు అధికారులను, ఆర్‌డివోలను ఆదేశించారు. స్థానిక కలెక్టరు కార్యాలయంలో శనివారం సాయంత్రం పోలీస్, రెవిన్యూ అధికారులతో ఆయన ఎన్నికల్లో శాంతిభద్రతలపై సమీక్షించారు. జిల్లాలో 3038 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని వీటిలోసమస్యాత్మక పోలింగ్ స్టేషన్లను గుర్తించాలన్నారు. అదే విధంగా ఆరు నెలలకు పైబడి నాన్ బెయిలబుల్ వారెంట్‌పై ఉన్న వారిని గుర్తించి సమాచారాన్ని అందుబాటులో ఉంచుకోవాలన్నారు. జిల్లాలో సమస్యాత్మక సమస్యలు సృష్టించే వారిని ముందుగానే గుర్తించి వారిపై బైండోవరు కేసులను నమోదు చేయాలని కలెక్టర్ చెప్పారు. ప్రజాజీవనానికి ఎవరు ఆటంకం కలిగించినా ఉపేక్షించవద్దని కలెక్టర్ చెప్పారు. ఈసారి జరిగే ఎన్నికలు చాలా కీలకం కాబోతున్నాయని చెప్పారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడక ముందే జిల్లాలో రౌడీషీటర్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని వారి కదలికలను గమనిస్తూ ప్రత్యేక చర్యలు తీసుకోవాలని చెప్పారు. అసెంబ్లీ నియోజకవర్గం వారీగా బైండోవర్ కేసులను కలెక్టర్ సమగ్రంగా సమీక్షించారు. జిల్లా ఎస్‌పి హరికృష్ణ మాట్లాడుతూ డివిజన్ స్థాయిలో బైండోవరు కేసులను ఇప్పటికే సమీక్షించడం జరిగిందని భవిష్యత్తులో శాంతిభద్రతలకు భంగం కలిగించే వారిని నియోజకవర్గల వారీగా జాబితాలను సిద్ధం చేస్తామని చెప్పారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ టి బాబూరావునాయుడు, అడిషనల్ ఎస్‌పి చంద్రశేఖర్, డి ఎస్‌పిలు సత్తిబాబు, రఘువీరారెడ్డి, ఆర్‌డివోలు బి శ్రీనివాస్, వసంతరావు, నాన్ రాజు, గోవిందరావు తదితరులు పాల్గొన్నారు.
రాజ్యసభ రేసులో సీతారామలక్ష్మి
పరిశీలిస్తున్న చంద్రబాబు:రాజధానిలో లాబీయింగ్
ఆంధ్రభూమి బ్యూరో
భీమవరం, జనవరి 25: జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి అనూహ్యంగా రాజ్యసభ టిక్కెట్టు రేసులోకి వచ్చారు. కాపు సామాజిక వర్గం, మహిళా కోటాలో తోట సీతారామలక్ష్మికి రాజ్యసభ టిక్కెట్టు ఇస్తే ఎలా ఉంటుందన్న అంశం పై ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కసరత్తులు చేస్తున్నారు. పార్టీ అధినేత చంద్రబాబుకు బయోడేటా కూడా అందచేసినట్లు తెలిసింది. ఏ పార్టీలోనైనా రాజ్యసభ సీటుకి విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ఎలాగైన సరే ఈ సీటును పొందేందుకు కోట్లాది రూపాయలు ఆశావహులు సమర్పించుకుంటూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో సమీకరణలు, సమతూకం ఉన్నా సరే చాలామందికి రాజ్యసభ సభ్యత్వం దక్కదు. దీనికి భిన్నంగా తోట సీతారామలక్ష్మికి చంద్రబాబు నాయుడు తరపు నుండి పిలుపురావడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. గతంలో ఇదే జిల్లా నుండి టిడిపి తరపున మెంటే పద్మనాభం, యర్రా నారాయణస్వామిలకు రాజ్యసభ సీట్లు దక్కిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా రాజ్యసభ రేసులో తోట సీతారామలక్ష్మి చేరారు. గతంలో భీమవరం మున్సిపల్ ఛైర్మన్‌గా తోట సీతారామలక్ష్మి పనిచేసి ప్రజల నుండి మన్ననలు పొందారు. పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి వెనె్నముకగా నిలిచారు. ఆ సేవలను గుర్తించిన పార్టీ తదనంతరం జిల్లా అధ్యక్షురాలుగా ఆమెను నియమించింది. డెల్టా పర్యటనకు వచ్చిన సందర్భంలో చంద్రబాబు నాయుడు తోట సీతారామలక్ష్మి ఇంటిలో బస చేసే వారు. తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో సీతారామలక్ష్మి పార్టీని ఆదుకున్నారు. కొత్తపల్లి సుబ్బారాయుడు లేనిలోటును భర్తీ చేశారు. జిల్లా పార్టీలో ఒకరిద్దరు నాయకుల మధ్య అంతర్గతంగా ఉన్న చిన్నచిన్న విభేదాలను కూడా ఇంచుమించు సర్దుబాటు చేయగలిగారు. జిల్లాలో విస్తృతంగా పర్యిటిస్తూ ఇంటింటికి తెలుగుదేశం పార్టీని తీసుకువెళ్ళారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను సమర్ధవంతంగా ఎండగట్టి నిత్యం ప్రజల్లో మమేకమయ్యారు. ఒక రకంగా చెప్పాలంటే జిల్లాలో తెలుగుదేశం పార్టీని బతికించారు. ఈ విషయాలను పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గుర్తించారు. భవిష్యత్తులో తెలంగాణ విడిపోతే సీమాంధ్రలో కాపుసామాజిక వర్గాన్ని దరిచేర్చుకునేందుకు రాజ్యసభ సభ్యత్వం ఈసారి తోట సీతారామలక్ష్మికి ఇచ్చేందుకు చంద్రబాబునాయుడు యోచిస్తున్నట్టు తెలిసింది. ఇప్పటికే ఈ టిక్కెట్టుకోసం పార్టీలోని పొలెట్‌బ్యూరో సభ్యులు కూడా ప్రయత్నాలు సాగిస్తున్నారు. నరసాపురం పార్లమెంట్ స్థానం గతంలో ఎంపిగా పోటీ చేసి ఓటమి పాలైన సీతారామలక్ష్మి రానున్న ఎన్నికల్లో మళ్ళీ ఇదే స్థానం నుండి పోటీ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే బిజెపితో తెలుగుదేశం పార్టీకి పొత్తు కుదిరితే నరసాపురం పార్లమెంట్ సీటు సినీనటుడు, మాజీ మంత్రి యువి కృష్ణంరాజుకు దక్కవచ్చుననే సాంకేతాలు బలంగా ఉన్నాయి. అదేగనక జరిగితే ఎంపి టిక్కెట్టు సీతారామలక్ష్మికి దక్కదు. విషయాన్ని ముందుగానే పసిగట్టిన ఆమె భీమవరం అసెంబ్లీ సీటుపై కనే్నశారు. భీమవరం అసెంబ్లీ టిక్కెట్టును తనకు కేటాయించవలసిందిగా చంద్రబాబు నాయుడుతో జరిగిన ఆంతరంగిక సమావేశాల్లో సీతారామలక్ష్మి అభ్యర్ధించినట్లు తెలిసింది. పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కూడా ముందుగానే సుముఖుత వ్యక్తం చేసినట్లు తెలిసింది. అయితే అధికారికంగా ప్రకటించలేదు. ఈలోపు రాజ్యసభ ఎన్నికల షెడ్యూలు విడుదల కావడంతో పార్టీలో వేడి పుట్టింది. ముఖ్యనేతలంతా దీనిపై కనే్నశారు. భీమవరానికి చెందిన వేగేశ్న వెంకటనాగరాజు (పోతుమర్రు రంగరాజు) కూడా పార్టీ అధినేత చంద్రబాబును కలిసి భీమవరం ఎమ్మెల్యే టిక్కెట్టుగాని, నరసాపురం ఎంపి టిక్కెట్టు గాని ఇవ్వాల్సిందిగా అభ్యర్ధించారు. అయితే చంద్రబాబు ఈ విషయంపై రంగరాజుకు ఎటువంటి భరోసా ఇవ్వలేదు. కాని క్షత్రియ సామాజికవర్గం కోటాలో రంగరాజు అభ్యర్థిత్వాన్ని కూడా చంద్రబాబు రాజ్యసభ రేసులో పరిశీలించినట్లు తెలిసింది. కాని ఇంకోవైపు కాపు సామాజికవర్గంలో తోట సీతారామలక్ష్మికి రాజ్యసభ సభ్యత్వం ఇస్తే ఎలా ఉంటుంది అనే అంశాన్ని చంద్రబాబు బేరీజు వేస్తున్నారు. ఒకవేళ తోట సీతారామలక్ష్మికి రాజ్యసభ సభ్యత్వం ఖరారైతే భీమవరం అసెంబ్లీ టిక్కెట్టును తనకు కేటాయించాల్సిందిగా చేకూరి వెంకట రంగరాజు ఇప్పటికే చంద్రబాబును కోరినట్లు తెలిసింది. మొత్తం మీద ఈసారి రాజ్యసభ సభ్యత్వం దక్కే అవకాశం తోట సీతారామలక్ష్మికి ఎక్కువగా ఉండటంతో ఆమె వర్గం రాజధానిలో గట్టిగా లాబీయింగ్ చేస్తున్నట్లు తెలిసింది. అయితే చంద్రబాబు తీసుకునే నిర్ణయం మీదే అభ్యర్ధి ఎవరనేది తేలనుంది
*టిడిపిలో అభ్యర్ధుల తకరారు*వీడని సందిగ్ధం*శ్రేణుల్లో ఆరాటం
english title:
m
Date:
Sunday, January 26, 2014