వరంగల్, జనవరి 25: సమ్మక్క జాతరతోపాటు ఎన్నికలు..ఇతర పోటీపరీక్షలు జరగనున్న నేపథ్యంలో అర్బన్ పరిధిలో పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండాలని అర్బన్ ఎస్పీ వెంకటేశ్వర్‌రావుసూచించారు. డిఎస్పీలు, సర్కిల్‌ఇన్స్‌పెక్టర్లతో ఆయన శనివారం సమావేశమై వివిధ అంశాలపై సమీక్ష జరిపారు. మేడారంలో జాతర జరిగే రోజుల్లో అర్బన్ పరిధిలోని అగ్రంపహాడ్, అమ్మవారిపేట, లింగంపల్లి గ్రామాలలో జరిగే సమ్మక్క-సారలమ్మ జాతరలకు వచ్చే భక్తుల కోసం అధికారులు భద్రతాచర్యలు తీసుకోవడంతోపాటు జాతర ప్రాంతంలో వౌళిక సదుపాయాల కల్పనకు సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని సూచించారు. భక్తులు ఇబ్బందులకు గురికాకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. మరోవైపువచ్చే నెల రెండవ తేదీన జిల్లాలో విఆర్వో, విఆర్‌ఎ ఉద్యోగాల పోటీ పరీక్ష నిర్వహిస్తున్నారని, దీనికోసం అర్బన్ పరిధిలో ఎంపిక చేసిన 200కేంద్రాలలో సుమారు 81వేల మంది అభ్యర్థులు హాజరవుతారని తెలిపారు. ఇందుకోసం అధికారులు తమ పరిధిలోని పరీక్షాకేంద్రాలలో బందోబస్తు నిర్వహించడంతోపాటు అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు నిర్థేశించిన సమయంలో చేరేలా రోడ్లపై ట్రాఫిక్ జామ్ కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. రానున్న ఎన్నికలను అర్బన్ పరిధిలో విజయవంతంగా నిర్వహించేందుకు సంబంధిత విభాగం అధికారులకు కావలసిన సమాచారాన్ని అందజేయడంలో పోలీసు అధికారులు సత్వరమే స్పందించాలని అన్నారు.
బిజెపితోనే పురోగమనం
వంశపారంపర్య పాలనను అంతమొందించడమే ధ్యేయం * మందాడి సత్యనారాయణరెడ్డి
నర్సంపేట, జనవరి 25: బిజెపితోనే దేశం పురోగభివృద్ధి సాధిస్తుందని బిజెపి రాష్ట్ర నాయకుడు, హన్మకొండ మాజీ ఎమ్మెల్యే మందాడి సత్యనారాయణరెడ్డి స్పష్టం చేశారు. ఇదే సమయంలో వంశపారంపర్య పరిపాలనను అంతమొందించడమే ధ్యేయంగా బిజెపి ముందుకు సాగుతుందని చెప్పారు. నర్సంపేట ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో శనివారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో మందాడి సత్యనారాయణరెడ్డి మాట్లాడారు. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో దళితులు తీవ్ర వివక్షకు, అణచివేతకు గురయ్యారని వాపోయారు. దళితులను ఓటు బ్యాంకుగా కాంగ్రెస్ పార్టీ వాడుకుని మోసం చేసిందన్నారు. దళితుల అభ్యున్నతి కోసం ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టలేదని, చివరకు సబ్ ప్లాన్ చట్టం కింద మంజూరు అయిన ఎస్సీ, ఎస్టీ నిధులను సైతం ఇతర కార్యక్రమాలకు వెచ్చించారని ఆరోపించారు. సబ్ ప్లాన్ నిధులను సామాజిక, ఆర్థిక అంశాలపైనే వారికి ఖర్చు చేయాలే తప్ప రోడ్ల కోసం ఖర్చు చేయడం సరి కాదన్నారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్, గోవా తదితర బిజెపి పాలిత రాష్ట్రాల్లో దళితుల సంక్షేమం కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు అవుతున్నాయని చెప్పారు. ఇటీవల జరిగిన రాజస్థాన్ ఎన్నికల్లో 39 ఎస్సీ పార్లమెంట్ స్థానాలు బిజెపికే దక్కాయంటే బిజెపి దళితుల కోసం ఎంత స్థాయిలో కృషి చేస్తుందో అర్థం అవుతుందన్నారు. వచ్చేనెల 2న హన్మకొండలోని హయగ్రీవాచారి మైదానంలో జరిగే వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ దళిత సదస్సుకు రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డితో పాటు పలువురు దళిత ఎంపిలు, జాతీయ నాయకులు హాజరు అవుతున్నారని వెల్లడించారు. సమావేశంలో బిజెపి జిల్లా, మండల నాయకులు బుర్రి ఉమాశంకర్, రావు అమరేందర్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, వీరమళ్ల రవీందర్‌రెడ్డి, ఠాకూర్ నాగరాజ్‌సింగ్, కూనమళ్ల పృథ్వీరాజ్, వనపర్తి మల్లయ్య, జగన్, శరత్‌కుమార్, ఆంజనేయులు, కవిత, రేసు శ్రీనివాస్, గుమ్మడి వేణు పాల్గొన్నారు.
యువతకు దారి..
ప్రబోధ్ కేంద్రాలు
శాయంపేట, జనవరి 25: రాబోయే రోజుల్లో యువత దశ, దిశ నిర్ధారించేది ప్రబోధ్ కేంద్రాలని రూరల్ ఎస్పీ కాళీదాస్ పేర్కొన్నారు. శాయంపేట మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ సముదాయ భవనంలో ఏర్పాటు చేసిన ప్రభోద్ కేంద్రాన్ని ఎస్పీ కాళీదాస్ శనివారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ఆలస్యంగా వచ్చినందుకు మన్నించాలని కోరారు. పోలీసులు ప్రజలతో సున్నితంగా మెలగాలని పేర్కొన్నారు. కేంద్రంలో యువకులు చదువుకొని ఉద్యోగం సాధించాలని అన్నారు. పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలన్ని ఇక్కడ లభిస్తాయని చెప్పారు. గ్రామీణ యువతను పోటీ ప్రపంచంలో రాణించి ఉపాధి బాటలో ప్రోత్సహించాలనే సంకల్పంతో ప్రతి పోలీస్‌స్టేషన్ పరిధిలో ప్రబోధ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునే విధంగా ఈ కేంద్రాలు ఎంతగానో ఉపయోగపడుతాయని తెలిపారు.
కాంగ్రెస్‌తోనే అభివృద్ధి
జఫర్‌గడ్, జనవరి 25: కాంగ్రెస్ పార్టీతోనే తెలంగాణ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని వరంగల్ ఎంపి సిరిసిల్ల రాజయ్య అన్నారు. శనివారం మండలంలోని తీగారం, సూరారం, హిమ్మత్‌నగర్, షాపెల్లి, తిమ్మాపూర్, తమ్మెడపెల్లి (జి) గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ జెండా పండగను స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గ ఇన్‌చార్జి రాజారపు ప్రతాప్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపి రాజయ్య మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రకటించిందని అన్నారు. తెలంగాణ ప్రాంతం మరింత అభివృద్ధి చెందాలంటే చిన్న, చితకా పార్టీలతో కాదని, జాతీయ పార్టీ కాంగ్రెస్‌తోనే సాధ్యమవుతుందని తెలిపారు. ఎవరు ఎన్ని అడ్డంకులు, కుట్రలు పన్నినా తెలంగాణను అడ్డుకోలేరని, కేవలం వారి స్వలాభం కోసం స్వార్థంతో తెలంగాణను అడ్డుకునేందుకు యత్నిస్తున్నారని అన్నారు.