వరంగల్, జనవరి 25: గంటలకొద్దీ ట్రాఫిక్ అవస్థలు.. దుమ్ముతో మారిపోయే రూపురేఖలు.. కేరాఫ్ మేడారం జాతర ఆనవాళ్లు. కాస్త ఖర్చయినా సరే.. ఈ ఇబ్బందులు ఏవీ లేకుండా సమ్మక్క-సారలమ్మ జాతరకు వెళ్లి మొక్కులు చెల్లించుకుని తిరిగి రావాలనుకునే భక్తులకోసం ఈ పర్యాయం మళ్లీ హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. వచ్చేనెల 12వతేదీ నుండి నాలుగు రోజుల పాటు జరిగే మేడారం జాతరకు హెలికాప్టర్ నడిపేందుకు హైదరాబాద్‌కు చెందిన టర్బో ఏవియేషన్ సంస్థ ముందుకువచ్చింది. 2010లో జరిగిన జాతరలో కూడా ఈ సంస్ధ హెలికాప్టర్ నడిపినప్పటికీ జాతర గద్దెలకు దూరంగా ఉన్న ఇంగ్లీష్ మీడియం స్కూల్ వెనకవైపు హెలిప్యాడ్ ఏర్పాటు చేయడంతో భక్తులనుండి ఆశించిన స్పందన రాలేదు. దాంతో 2012లో జరిగిన జాతరకు హెలికాప్టర్ రాలేదు. తిరిగి ఈ జాతరకు మళ్లీ హెలికాప్టర్ నడిపించేందుకు సంస్థ ముందుకు వచ్చింది. జాతర గద్దెలకు దగ్గరగా ఉన్న ప్రాంతంలో తమకు హెలిప్యాడ్ కేటాయించాలని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వి.ఉమేశ్ శనివారం కలెక్టర్ జి.కిషన్‌ను కలసి విజ్ఞప్తి చేయడంతో.. కలెక్టర్ సానుకూలత వ్యక్తం చేశారు. వరంగల్, హైదరాబాద్, ములుగుప్రాంతాలనుండి భక్తులను హెలికాప్టర్‌లో మేడారం చేరవేసేందుకు ప్రతిపాదించారు. వరంగల్ మామునూరు విమానాశ్రయం నుండి మేడారంకు వెళ్లే భక్తులు ఒక్కరికి రానుపోను 18 వేల రూపాయలు చార్జీగా నిర్ణయించారు. ఇక్కడినుండి అరగంటలో జాతర ప్రాంతం చేరవచ్చు. హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుండి ఒక్కరికి రానుపోను 40వేల రూపాయలు చార్జీ కాగా గంట 15 నిమిషాల్లో చేరవచ్చు. ములుగునుండి మేడారంకు ఒక్కరికి రానుపోను 8వేల రూపాయల చార్జీకాగా 20 నిమిషాల్లో చేరుస్తారు. హెలికాప్టర్‌ను అద్దెకు తీసుకోవాలంటే ఐదు సీట్లకు 90వేల రూపాయలు చెల్లించవలసి ఉంటుంది. ఒక ట్రిప్‌లో ఐదుగురు హెలికాప్టర్‌లో వెళ్లవచ్చు. రోజుకు ఎనిమిది ట్రిప్పులు హెలికాప్టర్‌ను నడపవచ్చు. అయితే, కనీసం ఐదు ట్రిప్పులైనా మేడారంకు నడిపిస్తేనే తమకు గిట్టుబాటు అవుతుందని ఏవియేషన్ సంస్థ చెబుతోంది. కాగా మేడారంలో ట్రాఫిక్, భక్తుల రద్దీ నియంత్రణను పరిశీలించేందుకు తమ హెలికాప్టర్ సేవలను వినియోగించుకోవచ్చని కలెక్టర్‌కు సంస్థ హామీ ఇచ్చింది. హెలికాప్టర్‌లో మేడారం జాతరకు వెళ్లదలచిన భక్తులు ముందుగానే సీట్లను రిజర్వు చేసుకోవాలి. ఇందుకోసం ఏవియేషన్ సంస్థ ప్రతినిధులను 9908765554, 9676999683 నంబర్లలో సంప్రదించవలసి ఉంటుంది.
ఓటుహక్కు ఓ బాధ్యత
* యువతకు కలెక్టర్ పిలుపు
నక్కలగుట్ట, జనవరి 25: ఓటుహక్కును యువత బాధ్యతగా భావించాలని కలెక్టర్ జి.కిషన్ పిలుపునిచ్చారు. ఓటర్లుగా నమోదు చేసుకోవడంతోపాటు ఆ హక్కును తప్పక వినియోగించుకోవాలని అన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా శనివారం ఆర్ట్స్ కళాశాల ఆడిటోరియంలో జరిగిన సమావేశంలో కలెక్టర్‌తోపాటు జిల్లా ప్రిన్సిపల్ జడ్జి వెంకటరమణ పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ తుదిశ్వాస వరకు ప్రతిఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు. యువత ఓటుహక్కు బాధ్యత గురించి తెలుసుకోవాలని, మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి ఓటుహక్కు దోహదపడుతుందని తెలిపారు. ప్రభుత్వ నిర్మాణానికి ఓటుహక్కు వినియోగం కీలకమని చెప్పారు. తమ తల్లిదండ్రులను ఓటుహక్కు వినియోగించుకోవాలని పిల్లలు ప్రోత్సహించాలని అన్నారు. జిల్లా ప్రిన్సిపల్ జడ్జి వెంకటరమణ మాట్లాడుతూ సమానత్వ భావానికి ఓటుహక్కు ప్రతీక అని అన్నారు. మన వెన్నుతట్టి కర్తవ్యాన్ని గుర్తుచేయడానికి ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు. ఓటర్లలో చైతన్యం కలిగించడానికి ఎన్నికల సంఘం గత నాలుగు సంవత్సరాలుగా ఓటర్ల దినోత్సవం నిర్వహిస్తోందని గుర్తు చేశారు. జాయింట్ కలెక్టర్ పౌసమిబసు మాట్లాడుతూ ఓటుహక్కు వినియోగించుకోకపోతే సిగ్గుపడాలని వ్యాఖ్యానించారు. యువత ముఖ్యంగా ఓటుహక్కుపై అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. తొలుత హన్మకొండ జిల్లా విద్యాశాఖ కార్యాలయం నుండి ఆర్ట్స్ కళాశాల వరకు విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఆర్ట్స్ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో జెసి పౌసమిబసు రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ సువర్ణపాండాదాస్, ట్రైనీ కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు, డిఆర్వో సురేంద్రకరణ్, సెట్వార్ పిఓ పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.
రిపబ్లిక్‌డే పరేడ్‌కు పట్టీల్లేవని కలత చెంది విద్యార్థిని ఆత్మహత్య
అయ్యో.. ‘్భరతమాత’!
కేసముద్రం, జనవరి 25: కేసముద్రంలో ఆదివారం జరిగే రిపబ్లిక్‌డే పరేడ్‌లో భరతమాత వేషధారణలో కనిపించాల్సిన విద్యార్థిని అకస్మాత్తుగా విగతజీవిగా మారిపోయన వైనమిది. వేషధారణకు అవసరమైన వెండి పట్టీలను తల్లిదండ్రులు తీసుకురాలేదని ఆవేదన చెంది ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటనలో స్థానికులను కలచివేసింది. కేసముద్రం ఎస్‌ఐ అబ్దుల్ రహమాన్ కథనం ప్రకారం.. సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. బేరువాడ ప్రభుత్వ పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్న గుగులోతు అనూష (12) విద్యాభ్యాసంలో అత్యంత ప్రతిభావంతురాలిగా పేరుతెచ్చుకుంది. ఈ నేపథ్యంలో ఆదివారం నిర్వహించతలపెట్టిన రిపబ్లిక్ దినోత్సవ వేడుకల్లో గ్రామంలో జరిగే శోభాయాత్రలో ఆమె చేత భారతమాత వేషధారణ చేయించాలని ఉపాధ్యాయులు నిర్ణయించారు. ఇందుకు తగ్గట్టుగా అలంకరణకు అనువైన మేకప్ సామాగ్రితో ఆదివారం ముస్తాబై రమ్మన్నారు. ఇందుకోసం అనూష తన తల్లిదండ్రులు లచ్చు, హమాలీలను అవసరమైన మేకప్ సామాగ్రితో పాటు కాళ్లకు వెండి పట్టీలను తెప్పించమని కోరింది. తండ్రి తాను పండించిన పత్తిని శుక్రవారం కేసముద్రం మార్కెట్‌కు తరలించి విక్రయించి అనూష కోరిన విధంగా మేకప్ సామాగ్రి మాత్రమే తెచ్చి.. వెండి పట్టీలు తేవడానికి డబ్బుల్లేవన్నాడు. శనివారం కూడా ఈ విషయంపై తల్లిదండ్రుల వద్ద ప్రస్తావించినా పట్టించుకోక పోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన అనూష మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయం చూసుకొని ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. వ్యవసాయ బావి నుంచి ఇంటికి వచ్చిన తల్లిదండ్రులకు ఇంట్లో ఊరేసుకోని విగతజీవురాలైన కూతురు కనపించడంతో కన్నీరుమున్నీరయ్యారు. కాగా, గ్రామంలో రిపబ్లిక్ దినోత్సవ శోభాయాత్రలో భరతమాతగా చూడాల్సిన విద్యార్థిని ఆత్మహత్యతో పాఠశాలలో తీవ్ర విషాదం అలముకుంది. కాగా, లచ్చు, హమాలీ దంపతులకు ముగ్గురు అమ్మాయిలు మనీషా, అనూష, శీరీష సంతానం. రెండో కుమార్తె అనూష ఆత్మహత్య చేసుకోవడంతో తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.