మచిలీపట్నం (కల్చరల్), జనవరి 25: భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలను భావి తరాలకు అందించాల్సిన బాధ్యత రచయితలపై ఉందని కృష్ణా విశ్వవిద్యాలయం పూర్వ ఉప కులపతి ఆచార్య మైనేని కేశవ దుర్గాప్రసాద్ అన్నారు. స్థానిక మహతి లలిత కళావేదికపై శనివారం జరిగిన సాహితీ మిత్రుల 33వ వార్షికోత్సవ సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ప్రముఖ రచయిత్రి వారణాసి సూర్యకుమారి రచించిన ‘సప్తపది’ నవలను ఆవిష్కరించారు. ఈసందర్భంగా మైనేని మాట్లాడుతూ హిందూ వివాహ మంత్రాల రహస్యాలను, ప్రయోజనాలను ‘సప్తపది’ నవలలో పాత్రల ద్వారా ఆకర్షణీయంగా తెలియచెప్పిన రచయిత్రిని అభినందనీయురాలన్నారు. స్నాతకం, అంకురారోపణ, కన్యాదానం, మధుపర్కం తదితర అంశాల అర్ధాలను పాత్రల ద్వారా సూర్య కుమారి పలికించారన్నారు. గురజాడ రాజరాజేశ్వరి నవలా సమీక్ష చేశారు. కవితల సంకలనం సుకవి స్వరాలను జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి వై కృష్ణారావు ఆవిష్కరించగా సింహాద్రి పద్మ సమీక్షించారు. సాయంత్రం జరిగిన సభకు అధ్యక్షత వహించిన జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు గుత్తికొండ సుబ్బారావు మాట్లాడుతూ పద్యం అజరామరం, హృద్యమన్నారు. అర్ధం కాని కవిత వ్యర్ధమన్నారు. ఆధునిక కవిత్వం పేరుతో నేడు కవిత్వం వెర్రితలలు వేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒరిస్సాకు చెందిన కావలి కోదండరావుకు వామన కవిత ప్రతిభా పురస్కారం అందించారు. అనంతరం సంఘ సేవకులు ఉడత్తు శ్రీనివాసరావు, కళా సేవకులు మహ్మద్ అబ్దుల్ గఫార్‌లను సత్కరించారు. పురిగళ్ళ శ్రీరామచంద్ర శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆరు, ఏడు తరగతుల బాలికలు నిర్వహించిన విశేష పద్య ప్రజ్ఞావధానం ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో సాహితీ మిత్రుల అధ్యక్షులు డా. రావి రంగారావు, డా. బి ధన్వంతరి ఆచార్య, పుల్లారావు పాల్గొన్నారు.
ప్రశ్నించే చైతన్యం రాకపోతే సమాజంలో మార్పు ప్రశ్నార్థకమే
* మండలి బుద్ధప్రసాద్
మచిలీపట్నం (కల్చరల్), జనవరి 25: ప్రజల్లో ప్రశ్నించేతత్వం, చైతన్యం రానంతవరకు సమాజంలో మార్పు అనేది ప్రశ్నార్థకమేనని రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్ అన్నారు. స్థానిక బ్రహ్మ సమాజం భవనంలో శనివారం నిర్వహించిన ఆంధ్ర బ్రహ్మ సమాజం 72వ వార్షిక సమ్మేళనంలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. నేటి సమాజంలో జరుగుతున్న రుగ్మతలకు బ్రహ్మ సమాజం విధానాలే మార్గదర్శకమన్నారు. పరభాషా, సంస్కృతి వ్యామోహంలో మనం మన సంస్కృతి, సాంప్రదాయాలు, మహానుభావుల త్యాగాలను మరచిపోవడం శోచనీయమన్నారు. బ్రహ్మ సమాజం లాంటి సంస్థలు సంస్కృతి, సాంప్రదాయాలను సజీవాలుగా ఉండే విధంగా కృషి చేస్తున్నాయన్నారు. ఎంతో మంది కవులు ఆనాటి బ్రహ్మ సమాజం విధానాలను స్ఫూర్తిగా తీసుకుని సమాజ సేవకు అంకితమయ్యారని తెలిపారు. రాష్ట్రంలో రఘుపతి వెంకట రత్నం నాయుడు బ్రహ్మ సమాజం ఉన్నతికి ఎనలేని సేవలు అందించారని శ్లాఘించారు. వేమూరి రామకృష్ణారావు, అయ్యదేవర కాళేశ్వరరావు, ముట్నూరి కృష్ణారావు, డా. భోగరాజు పట్ట్భా సీతారామయ్య తదితర ఎందరో మహనీయులు రఘుపతి శిష్యులేనన్నారు. ఆంధ్ర బ్రహ్మ సమాజం ప్రవర్ధమానం చెందడానికి కందుకూరి వీరేశలింగం పంతం, రఘుపతి వెంకటరత్నం నాయుడు కారణమన్నారు. ఆంధ్ర బ్రహ్మ సమాజం అధ్యక్షుడు కేశవ చంద్ అధ్యక్షత వహించారు. అఖిల భారత బ్రహ్మ సమాజం కాన్ఫరెన్స్ అధ్యక్షుడు పూర్ణ రాజ్యలక్ష్మి శశిభూషణ్, పట్టణ శాఖ అధ్యక్షుడు కూరాళ్ళ రామచంద్రరావు, తదితరులు పాల్గొన్నారు.
విభజన వద్దంటూ సత్యాగ్రహం
మచిలీపట్నం టౌన్, జనవరి 25: మరో ఆరునెలల్లో సాధారణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్రాల విభజన పేరుతో కేంద్ర ప్రభుత్వం గలాటా సృష్టిస్తోందని పలువురు వక్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన వద్దంటూ శనివారం ప్రముఖ సంఘసేవకుడు నిడుమోలు వెంకటేశ్వర ప్రసాద్, న్యాయవాదుల గుమస్తాల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పివి ఫణికుమార్, న్యాయవాదులు ఎవిఆర్ రాజు, సిహెచ్ సూర్యనారాయణ, కె సాయి సుదర్శన్, మద్ది లీలాకుమారి, సామాజిక కార్యకర్త జంపాన శ్రీనివాస గౌడ్, మైనంపూడి సాయిబాబు, కొండవీటి రామకృష్ణ, తదితరులు శనివారం స్థానిక ఆర్ అండ్ బి గెస్టుహౌస్ వద్ద ఉన్న మహాత్మ గాంధీ కాంస్య విగ్రహం వద్ద ఒకరోజు సత్యాగ్రహం నిర్వహించారు. రాష్ట్రాల విభజన పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రజల్లో ప్రాంతీయతత్వాలను పెంచిపోషిస్తోందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు 3నుండి
మోపిదేవి, జనవరి 25: శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలకు సంబంధించిన పోస్టర్‌ను శనివారం చల్లపల్లి ఎస్టేట్ దేవాలయాల కమిషనర్ వివిఎస్‌ఎ ప్రసాద్ ఆవిష్కరించారు. ఫిబ్రవరి 3నుండి 7వ తేదీ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ బ్రహ్మోత్సవాల్లో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ మధుసూదనరావు, అధికారులు శ్రీకృష్ణ మల్లేశ్వరరావు, పెదకళ్ళేపల్లి దుర్గానాగేశ్వర స్వామి ఆలయ సూపరింటెండెంట్ చెన్నకేశవ, శ్రీకాకుళం కాకుళేశ్వర ఆలయ సూపరింటెండెంట్ రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
అనూహ్య హంతకుల్ని అరెస్టు చేయండి
అవనిగడ్డ, జనవరి 25: ముంబైలో దారుణ హత్యకు గురైన బందరు యువతి ఎస్తేర్ అనూహ్య కేసులో జరుగుతున్న జాప్యంపై శనివారం ఇక్కడ పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. హత్య జరిగి 15రోజులు గడుస్తున్నా మహారాష్ట్ర పోలీసులు దోషులను అరెస్టు చేయడంలో విఫలమయ్యారని మండిపడ్డారు. అనూహ్య హంతకులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ మాలమహానాడు, కుల వివక్షత వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో రాజీవ్ గాంధి చౌక్‌లో పలు విద్యాసంస్థలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులతో మానవహారం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా వక్తలు మాట్లాడుతూ మహిళలు రోడ్ల మీదకు రావాలంటేనే భయపడే పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయన్నారు. మహిళలపై దాడులు జరిగినప్పుడు పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటం వల్లే ఈ తరహా ఘటనలు జరుగుతున్నాయని విమర్శించారు. కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు మత్తి శ్రీనివాసరావు, అర్జా అర్జునరావు, బచ్చు వెంకటనాధ ప్రసాద్, సింహాద్రి రమేష్‌బాబు, ఎన్ పృధ్విరాజు, ఇల్లా రవి, దిడ్ల ప్రసాద్ పాల్గొన్నారు.
హెల్మెట్ వాడకంపై అవగాహనకు బైక్ ర్యాలీ
విజయవాడ (క్రైం), జనవరి 25: రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా నగరంలో మోటారు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. నగర పోలీసు శాఖ ఆధ్వర్యాన జరిగిన ఈర్యాలీని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి శనివారం నగర డెప్యూటీ పోలీసు కమిషనర్ రవిప్రకాష్ జెండా ఊపి ప్రారంభించారు. రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ శాతం తలకు దెబ్బ తగిలి చనిపోతున్న దృష్ట్యా హెల్మెట్ వాడకం ప్రాధాన్యత తెలియచేస్తూ ఈ బైక్ ర్యాలీ నిర్వహించినట్లు డిసిపి తెలిపారు. ఇక్కడి నుంచి బయలుదేరిన ర్యాలీ నగరంలోని అన్ని ప్రాంతాల్లో తిరుగుతూ హెల్మెట్లు ధరించాలని ప్రచారం సాగించారు. ఈ ర్యాలీలో పోలీసు సిబ్బందితోపాటు అదనపు ట్రాఫిక్ డిసిపి ఎవి రమణ, అధికారులు పాల్గొన్నారు. ఇదిలావుండగా ఈనెల 20 నుంచి ప్రారంభమైన ఈ వారోత్సవాల సందర్భంగా నగరంలోని వివిధ విద్యాసంస్థల విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన, డ్రాయింగ్ పోటీల్లో విజేతలకు ఆదివారం ముగింపు కార్యక్రమం సందర్భంగా బహుమతులు అందచేయనున్నారు.
ఆర్టీసీకి ప్రైవేట్ ట్రావెల్స్ పక్కలో బల్లెం
పాతబస్తీ, జనవరి 25: ఎపిఎస్ ఆర్టీసీకి ప్రైవేటు ట్రావెల్స్ పక్కలో బల్లెంలా తయారైందని, ఆర్టీసీని ప్రతి కార్మికుడూ కాపాడుకోవాలని డెప్యూటీ పోలీస్ కమిషనర్ (అడ్మినిస్ట్రేషన్) ఎఎస్ ఖాన్ పిలుపునిచ్చారు. పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ సమీపంలోని ఆర్టీసీ గ్యారేజీలో రోడ్డు భద్రతా వారోత్సవాల ముగింపు సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. తనవల్ల ఎవరికీ ప్రమాదాలు, ఇబ్బందులు కలుగకూడదనే ఉద్దేశంతో డ్రైవర్లు తగు జాగ్రత్తగా విధులు నిర్వహించాలన్నారు. నగరంలో పశ్చిమ బెంగాల్ దొంగల ముఠా సంచరిస్తోందని, సాటి ప్రయాణీకుల్లా నటించి పక్కనే ఉన్న సూట్‌కేస్‌లు, బ్యాగులు దొంగిలిస్తుందని తెలిపారు. అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. రీజనల్ మేనేజర్ సుదేష్‌కుమార్ సభాధ్యక్షులుగా మాట్లాడుతూ తమ రీజియన్‌లో ఆర్టీసీ ప్రమాదాలు గత ఏడాది కంటే ఈ ఏడాది గణనీయంగా తగ్గాయన్నారు. గత ఏడాది రోడ్డు ప్రమాదాల మృతుల సంఖ్య 57కాగా, ఈ ఏడాది 27కి తగ్గాయన్నారు. అదేవిధంగా గత ఏడాది 143 రోడ్డు ప్రమాదాలు ఆర్టీసీలో నమోదు కాగా ఈ ఏడాది 81కి తగ్గాయన్నారు. డ్రైవర్లు తగు జాగ్రత్తగా బస్సులు నడపడం వల్ల మున్ముందు ‘‘జీరో యాక్సిడెంట్’’ దిశగా ఆర్టీసీ పయనించాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. విశిష్ట అతిథిగా పాల్గొన్న డెప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ శివలింగయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో గత ఏడాది 40 వేల ప్రమాదాలు నమోదు కాగా 15 వేల మంది నిండు ప్రాణాలు బలయ్యాయన్నారు. వారిలో వెయ్యి మంది ఆర్టీసీ బస్ ప్రమాదాల వల్ల మృత్యువాత పడ్డారన్నారు. డ్రైవర్ల నిర్లక్ష్యం ఎదుటివారికి ప్రాణసంకటంగా మారుతుందన్నారు. నగరంలో సిటీబస్‌లు రోడ్డు మధ్యలో ఆగుతున్నాయని, ఆ అలవాటు మానుకోవాలన్నారు. ఇటీవల రామవరప్పాడు రింగు రోడ్డు వద్ద రోడ్డు ప్రమాదంలో ఐదుగురు విద్యార్థులు మృతి చెందడానికి పరోక్షంగా ఆర్టీసీ సిటీ బస్ డ్రైవర్లే కారణమన్నారు. కార్యక్రమంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కన్స్యూమర్ సేల్స్ మేనేజర్ కె.వెంకట్రామయ్య ఇంధనం ఎలా పొదుపు చేయాలో వివరించారు. 25వ రోడ్డు భద్రతా వారోత్సవాలు, అలాగే ఇంధన పొదుపు పక్షోత్సవాలు ముగింపు సందర్భంగా పలువురిని సత్కరించారు. నగరవ్యాప్తంగా నిర్వహించిన వ్యాసరచన పోటీల్లోని విజేతలకు బహుమతి ప్రదానం జరిగింది.
ఉత్తమ డ్రైవర్లకు మెడల్స్, నగదు బహుమతి
రోడ్డు భద్రతా వారోత్సవాలు ముగింపు కార్యకమంలో రీజియన్‌లో ఎలాంటి రోడ్డు ప్రమాదాలు లేకుండా బస్‌లను గమ్యస్థానానికి చేర్చిన ముగ్గురు ఉత్తమ డ్రైవర్లను సత్కరించారు. తిరువూరు డిపోకి చెందిన డ్రైవర్ జివిఆర్ రావు 25 సంవత్సరాల 9 నెలల కాలంలో ఎలాంటి రోడ్డు ప్రమాదాలు చేయకుండా ఆర్టీసీ బస్‌ని గమ్యానికి చేర్చి ప్రథమ బహుమతిని సొంతం చేసుకున్నారు. ఆయనకి మెడల్‌తో పాటు 3 వేల 500 నగదు అందించారు. అలాగే 26 సంవత్సరాల 5 నెలల కాలానికి ఇబ్రహీంపట్నంకి చెందిన జి.ఎం.రావు ద్వితీయ స్థానంలో ఉండగా మెడల్‌తో పాటు 3వేల నగదు అందించారు. నూజివీడు డిపోకి చెందిన ఎస్‌కె మసలాలి తృతీయ బహుమతి పొందారు. ఆయనకి మెడల్, 2వేల 500 నగదు అందించారు. అలాగే కృష్ణా రీజియన్ పరిథిలోని జగ్గయ్యపేట నూజివీడు, తిరువూరు, విజయవాడ, గన్నవరం, మచిలీపట్నం, గుడివాడ, అవనిగడ్డ, ఉయ్యూరు, గవర్నరుపేట 1,2 డిపోలు, అలాగే ఇబ్రహీంపట్నం, విద్యాధరపురం, ఆటోనగర్ డిపోల పరిథిలోని డ్రైవర్లకి మొత్తం 42 మందికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ గ్యారేజీ ఇన్‌ఛార్జిలు ఎం.పార్థసారథి, ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు.
స్పెషలాఫీసర్ పాలనలో కార్పొరేట్ సంస్థగా మారిన కార్పొరేషన్
అజిత్‌సింగ్‌నగర్, జనవరి 25: ప్రజలను పట్టిపీడించే కార్పోరేట్ సంస్థగా విజయవాడ నగర పాలక సంస్థ మారిందని, ప్రజలపై భారాలు మోపడమే పనిగా పెట్టుకున్న విఎంసి స్పెషలాఫీసర్ పాలనలో ప్రజలకు అందించాల్సిన మంచినీటి సేవలను సైతం వ్యాపారంగా మార్చి అధికశాతం ధరలను పన్నుల రూపంలో వసూలు చేస్తున్న వైనం గర్హినీయమని సిపిఎం నగర కార్యదర్శి సిహెచ్ బాబూరావు పేర్కొన్నారు. కార్పొరేషన్ పెంచిన మంచినీటి చార్జీలను రద్దు చేయాలని కోరుతూ సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో శనివారం ఉదయం నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయం వద్ద నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడుతూ ప్రజల వద్ద నుంచి పన్నుల రూపంలో అధిక వసూళ్ళు చేస్తున్న నగర పాలక సంస్థ నిశ్వార్ధంగా అందించించాల్సిన వౌలిక సదుపాయాల కల్పనను కూడా వ్యాపారంగా మార్చిందని, సజీవ నది కృష్ణానది చెంతనే ఉన్న విజయవాడ నగరానికి ఉచితంగా మంచినీటి సరఫరా చేయాల్సి ఉండగా మంచినీటి ఊటలేని ఏడారి ప్రాంతాల్లో వసూలు చేసిన మాదిరిగా అత్యధిక పన్నులు చేసూలు చేయడం తగదన్నారు. స్పెషలాఫీసర్ పాలనలో ప్రజామోదం లేకుండానే పన్నులు విధిస్తూ చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఇప్పటికైనా నగర పాలకులు కళ్ళు తెరిచి మంచినీటి పై విధించిన పన్నులను తగ్గించాలని లేని పక్షంలో ప్రజా ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తామని ఆయన హెచ్చరించారు. పెన్షనర్ల అసోసియేషన్ నాయకులు గాంధీ, లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కోనేరు వెంకటరమేష్, సిపిఎం నగర నాయకులు దోనేపూడి కాశీనాధ్, యూవి రామరాజు, డి విష్ణువర్ధన్, మాదాల వెంకటేశ్వరరావు, కె శ్రీదేవి, బోయి సత్యబాబు తదితరులు పాల్గొన్నారు.
వ్యభిచార నిర్వాహకుల అరెస్టు
విజయవాడ (క్రైం), జనవరి 25: వ్యభిచార నిర్వహకులను మాచవరం పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం... గుణదల ఇఎస్‌ఐ ఆస్పత్రి పరిసర ప్రాంతంలో ఒక ఇల్లు అద్దెకు తీసుకుని గత కొంతకాలంగా కొందరు వ్యభిచార కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు వచ్చిన ఆరోపణలపై పోలీసులు నిఘా ఉంచారు. ఎట్టకేలకు శనివారం దాడులు నిర్వహించి గల్లా శైలజ (22), పాల్వంచ రాధిక (19), వేమూరి శ్యాంకుమార్‌లను అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తేనే సత్ఫలితాలు
* జిల్లా కలెక్టర్ రఘునందనరావు
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, జనవరి 25: ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కలిగి ఉండటంతోపాటు వాటిని ఆచరించినప్పుడే సత్ఫలితాలు పొందగలుగుతామని జిల్లా కలెక్టర్ ఎం రఘునందనరావు అన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవం, రహదారి భద్రతా వారోత్సవాలను పురస్కరించుకుని రవాణా శాఖ ఆధ్వర్యంలో శనివారం ఉదయం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుండి నిర్వహించిన రోడ్డు భద్రతా అవగాహన నడకను జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించినప్పటికీ వాటిని ప్రజలు ఆచరించకపోవటం వలన ప్రమాదాలకు అస్కారం ఏర్పడుతున్నదన్నారు. మితిమీరిన వేగం, సెల్‌ఫోన్లు మాట్లాడుతూ వాహనాలు నడపటం, అడ్డదిడ్డంగా రోడ్లను దాటడం ఫుట్‌పాత్‌లను ఉపయోగించకుండా రోడ్లపై నడవటం వంటి ప్రధానమైన తప్పిదాలువలన ప్రమాదాలు జరిగి అమూల్యమైన ప్రాణాలను కోల్పోతున్న సంఘటనలు నిత్యం గమనిస్తున్నామన్నారు. నగర పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాసులు మాట్లాడుతూ ట్రాఫిక్ నియంత్రణలో పోలీసు యంత్రాంగం అనేక చర్యలు చేపడుతున్నప్పటికీ ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడంవలన ప్రమాదాలు సంభవిస్తున్నాయన్నారు. రోడ్డు భద్రతపై ఆంధ్రా ఆఫ్‌సెట్ ప్రింటర్స్ రూపొందించిన క్యాలెండర్‌ను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కె మురళీ, మున్సిపల్ కమిషనర్ సి హరికిరణ్, అడిషినల్ డిసిపి ఎవి రమణ, రవాణా శాఖ డిటిపి సిహెచ్ శివలింగయ్య తదితరులు పాల్గొన్నారు.
నవజీవన్‌కు తప్పిన ప్రమాదం
ముందుగానే గుర్తించిన సి అండ్ డబ్ల్యు సిబ్బంది
విజయవాడ (రైల్వే స్టేషన్), జనవరి 25: నవజీవన్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన ఎస్ 12 బోగీకి చెందిన యాక్సిల్ బాక్స్ (చక్రాలకు చెందిన ఇరుసు బాక్స్)లో నుంచి గ్రీజు కారిపోతున్న విషయం గమనించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. చెన్నై నుంచి అహ్మదాబాద్ వెళ్లు నెంబర్ 12655 నవజీవన్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ఆరవ నెంబర్ ప్లాట్‌ఫారం మీదకు శనివారం సాయంత్రం 16.50కు వచ్చింది. రైలు ప్లాట్‌ఫారం మీదకు రాగానే క్యారేజ్ అండ్ వ్యాగిన్ (సి అండ్ డబ్ల్యు) విభాగానికి చెందిన సిబ్బంది వారి విధుల్లో భాగంగా రోలింగ్ దగ్గర నుంచి వీల్స్ యాక్సిల్ బాక్స్‌ని తనిఖీ చేస్తుండగా ఎస్ 12 బోగికి చెందిన యాక్సిల్ బాక్స్‌లో నుంచి గ్రీజు కారిపోతోంది. ఇది గమనించిన టిఎక్స్‌ఆర్ (ట్రైన్ ఎగ్జామినర్) వెంటనే యాక్సిల్ బాక్స్‌ని పరిశీలించగా బాక్స్‌కు పెద్ద రంద్రం పడి అందులో నుంచి గడ్డగా ఉన్న గ్రీజు నీరులా కారిపోతోంది. వెంటనే సి అండ్ డబ్ల్యు సెక్షన్ ఇంజనీర్‌కి సమాచారం తెలియపరిచి బాక్స్ మార్చేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ విషయాన్ని ఇక్కడ ఏ మాత్రం గమనించకుండా రైలును ఇక్కడ నుంచి పంపించి ఉంటే రైలు వెళ్లే సమయంలో యాక్సిల్ (ఇరుసు) రాపిడి రాకుండా ఉండేందుకుగాను బాక్స్‌లో ఏర్పాటు చేసిన గ్రీజంతా కారిపోయిన కారణంగా అక్కడ నుంచి మంటలు ఏర్పడటంతో పాటు ఇరుసు అరిగి పోవడంతో అక్కడ వరకు ఇరిగిపోయేది. దీంతో బోగి పల్టీకొట్టే ప్రమాదముంది. అయితే సి అండ్ డబ్ల్యు సిబ్బంది అప్రమత్తతో యాక్సిల్ బాక్స్‌ని మార్చి అక్కడ మరో బాక్స్‌ను ఏర్పాటు చేసి పంపించారు. దీని కారణంగా రైలు 40 నిమిషాలు ఆలస్యంగా బయలుదేరింది. కాగా సిబ్బంది అప్రమత్తత కారణంగా పెద్ద ప్రమాదం తప్పిందని తెలియడంతో ప్రయాణీకులు భయాందోళనకు గురయ్యారు.
సమాజసేవకే అంకితం
పద్మశ్రీ పొందిన డాక్టర్ శ్రీరామారావు
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, జనవరి 25: సామాజిక సేవా కార్యకర్త, మారుతీనగర్‌కు చెందిన డాక్టర్ అనమోలు శ్రీరామారావు(74)కు భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం శనివారం అత్యున్నత పద్మశ్రీ అవార్డును ప్రకటించింది. ఈ ప్రకటనతో నగర వాసులు హర్షం వ్యక్తం చేశారు. పునాదిపాడు గ్రామంలో జన్మించిన వీరు కాకినాడలో ఎంబిబిఎస్ పూర్తి చేశారు. తొలిసారి 1975లో సత్యసాయిబాబాను కలిశారు. 1978లో మరోసారి కలువగా ఓ జ్ఞాపిక, వెండి గ్లాసు అందిస్తూ తనను ఎప్పుడు తలచుకున్నా ప్రత్యక్షమవుతానని చెప్పారు. అలాగే ఎన్నోసార్లు సాక్షాత్కరించారని డాక్టర్ రామారావు చెబుతున్నారు. 1977లో మదర్ థెరిస్సాను కలిశారు. 1999లో బిసి రాయ్ జాతీయ అవార్డు పొందారు. తనకు లభించే 11 వేల పెన్షన్‌ను పేదల కోసమే ఖర్చు చేస్తున్నారు. స్థానిక శ్రీ సత్యసాయి మందిరంలో రోజుకో 10 మందికి భోజన సౌకర్యం కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సమాజం ఎంతో ఖర్చు చేసి ఒక వైద్యుడిని తయారు చేస్తుంటే ఆ వైద్యుడు ఈ సమాజాన్ని పట్టించుకోకుండా ధనార్జన ధ్యేయంగా వృత్తి కొనసాగిస్తున్నాడంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తన జీవితం సమాజ సేవకే అంకితమంటూ పద్మశ్రీ అవార్డు లభించడంపై సంతోషం వ్యక్తం చేశారు.
అనూహ్య కుటుంబాన్ని ఆదుకోవాలి
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, జనవరి 25: మహిళలపై అత్యాచారాలు, లైంగిక వేధింపులకు పాల్పడే కిరాతకులను కఠినంగా శిక్షించి ముంబైలో హత్యకు గురైన సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఎస్తేర్ అనూహ్య కుటుంబానికి న్యాయం చేయాలని అర్బన్ తహశీల్దార్ ఆర్ శివరావు ప్రభుత్వాన్ని కోరారు. ఇటీవల ముంబాయి నగరంలో ముష్కరమూకల అమానుషానికి బలైన ఎస్తేర్ అనూహ్య కుటుంబ సభ్యులను ఆదుకోవాలని స్థానిక బిషప్ హజరయ్య పాఠశాలల విద్యార్థులు శనివారం ఉదయం నగరంలో వౌన ప్రదర్శన నిర్వహించారు. వౌన ప్రదర్శనలో పాల్గొన్న అర్బన్ తహశీల్దార్ ఆర్ శివరావు మాట్లాడుతూ ఈ నెల 16వ తేదీన ముంబాయి నగరంలో కిరాతకుల ఘాతుకానికి బలైన సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని అనూహ్య మృతి సభ్య సమాజానికి మాయని మచ్చన్నారు. స్ర్తిలపై హింసా, అత్యాచారాలు, నేర ప్రవృత్తి పెరగడానికి కారణమైన ఆశ్లీలతను సమూలంగా రూపుమాపాలన్నారు. హజరయ్య పాఠశాలల నిర్వాహకులు గోవాడ దైవాశీర్వాదం మాట్లాడుతూ బలహీన వర్గాలకు చెందినప్పటికీ అత్యున్నత చదువును అభ్యసించి పలువురికి ఆదర్శప్రాయమైన అనూహ్య కిరాతకంగా హత్యకు గురికావడం శోచనీయమన్నారు. దోషులను శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరుతూ వినతిపత్రాన్ని సబ్ కలెక్టర్‌కు సమర్పించారు. ఈ వౌన ప్రదర్శనలో పాఠశాల కరస్పాండెంట్ రమణి రమ్యకృప, పాఠశాల ప్రిన్సిపాల్ కె సంధ్య, ప్రధానోపాధ్యాయుని స్వర్ణకుమారి, మేనేజర్ వైజె ప్రసన్న తదితరులు పాల్గొని అనూహ్య ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థనలు చేశారు.
సంగీత సద్గురువుకు స్వరహారతులు
విజయవాడ (కల్చరల్), జనవరి 25: సంగీత సన్మండలి ఆధ్వర్యంలో వారం రోజులపాటు ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల ప్రాంగణంలోని కళావేదికపై నిర్వహిస్తున్న సంగీత సద్గురువు, ఆద్యుడు, ఆరాధ్యుడు త్యాగరాజస్వామివారి ఆరాధనోత్సవాల్లో శనివారం 6వ రోజు సంగీత విద్వాంసులు, ఔత్సాహిక, వర్థమాన కళాకారులు పాడిన ఘనరాగ పంచరత్న కీర్తనలు త్యాగబ్రహ్మకు స్వర హారతులు అందించాయి. వర్ణాలు రాయని లోటును ఈ పంచరత్న కీర్తనలతో భర్తీ చేసిన త్యాగరాజు లయ, సాహిత్య, సంగీత ప్రధానంగా ఘన రాగాల్లో పాడిన ఈ కీర్తనలతో శ్రీరాముని అందచందాలు, గుణగణాలను కీర్తిస్తూ నాటరాగంలో జగదానంద కారక, గౌళరాగంలో దుడుకుగా ప్రవర్తించి చేసిన తన తప్పులను క్షమించమని దుడుకుగల, శ్రీకృష్ణుని లీలలు అవతార విశేషాలను కీర్తిస్తూ, వర్ణిస్తూ ఆరభిరాగంలో సాధించెనే ఓ మనసా, వరాళి రాగంలో శ్రీరాముని నామాన్ని ఎన్నిసార్లు శ్రవణం చేసినా, పలికినా సౌందర్యాన్ని వీక్షించినా తనివితీరదని కనకనరుచిరా కనకవసనా రామా, శ్రీరాగంలో భాగవతోత్తములై సంగీత సేవలో తరించి ముక్తిని, మోక్షాన్ని పొందినవారిని స్మరించుకుంటూ ఎందరో మహానుభావుల కీర్తనలను సంగీత విద్వాంసులు, కళాకారులు దాదాపు నూట ఏభై మంది పాడి త్యాగరాజస్వామి వారికి స్వర నివేదన చేశారు.
ఘనంగా నూతన గురుపట్ట్భాషేక మహోత్సవం
పటమట, జనవరి 25: క్రీస్తురాజుపురంలోని క్రీస్తురాజు దేవాలయంలో శనివారం నూతన గురుపట్ట్భాషేక మహోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కపూచియన్ సభకు చెందిన తురక ప్రవీణ్‌కుమార్‌ను విజయవాడ కతోలిక పీఠం అపోస్తోలిక పాలనాధికారి, బిషప్ గోవిందు జోజి తమ పవిత్ర హస్తాలతో అభిషేకించి, కతోలిక సంప్రదాయ పద్ధతిలో ప్రమాణం చేయించి నూతన గురువుగా ఆయనను ఎంపిక చేసినట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా బిషప్ గోవిందు జోజి మాట్లాడుతూ గురు జీవితం ఎంతో ఔన్నత్యంతో కూడుకుందన్నారు.