మచిలీపట్నం, జనవరి 25: ఓటుహక్కు ప్రతిఒక్కరి జన్మహక్కు అని జిల్లా కలెక్టర్ ఎం రఘునందనరావు అన్నారు. మన దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే పాలకులను ఎన్నుకునేందుకు ఓటుహక్కు దోహదపడుతుందన్నారు. మచిలీపట్నం ఆశీర్వాద భవన్‌లో శనివారం జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ ఓటుహక్కు విశిష్టతను వివరించారు. భారత రాజ్యాంగం ప్రసాదించిన ఓటుహక్కును ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఓటుహక్కు ప్రాధాన్యతను ప్రజల్లో అవగాహన కల్పించటంతోపాటు ఓటు వేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలియజేయడం జాతీయ ఓటర్ల దినోత్సవం ముఖ్యఉద్దేశమన్నారు. జిల్లాలో గత 45రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం కలిసి ఓటర్ల సమ్మరీ రివిజన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇంకా 50వేల మంది 18-25 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన యువతీ యువకులు ఓటరుగా నమోదుకావాల్సి ఉందన్నారు. ఓటర్ల జాబితా సమ్మరీ రివిజన్‌లో 2.50లక్షల మంది మాత్రమే ఓటర్లుగా నమోదయ్యారని తెలిపారు. ఓటర్లుగా నమోదు కావడానికి ఇంకా సమయం ఉందన్నారు. ఫిబ్రవరి నెల మొత్తం ఓటరుగా నమోదు కావచ్చని తెలిపారు. 18సంవత్సరాలు నిండిన ప్రతిఒక్కరూ తమ దగ్గరలోని బిఎల్‌ఓ, తహశీల్దార్ కార్యాలయాల్లో దరఖాస్తులు అందించాలన్నారు. ఆన్‌లైన్‌లో కూడా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పించిందన్నారు. మరో మూడు నెలల్లో సాధారణ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని, వచ్చే ఐదేళ్లు మన దేశాన్ని, రాష్ట్రాన్ని ఎవరు పాలించాలలనే విషయాన్ని నిర్ణయించేది ఓటర్లేనని ఆయన గుర్తుచేశారు. ఎన్నికల పోటీలో ఉన్నవారు ఇచ్చే వాగ్దానాలు అవగాహన చేసుకుని నీతివంతమైనవారిని ఎన్నుకోవాలని కోరారు. ఓటింగ్ బాధ్యత, ఇన్‌ఫార్మ్‌డ్, ఎత్నిక్ ఓటింగ్‌పై రానున్న 50రోజుల్లో రాష్ట్ర ఎన్నికల కమిషన్‌తో కలిసి ప్రచార కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ రఘునందనరావు వివరించారు. కృష్ణా విశ్వవిద్యాలయం ఉప కులపతి ఆచార్య వి వెంకయ్య మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 15సార్లు పార్లమెంట్, 350సార్లు వివిధ రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరిగాయన్నారు. భారత రాజ్యాంగానికి ప్రపంచంలో మంచి గుర్తింపు ఉందన్నారు. భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. జిల్లా పోలీసు సూపరింటెండెంట్ జె ప్రభాకరరావు మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడంలో పోలీసులతోపాటు ప్రతిఒక్కరిపై బాధ్యత ఉందన్నారు. ఎన్నికలు నిర్వహిస్తున్నప్పుడు ఏవైనా అవకతవకలు జరుగుతున్నట్లు ప్రజల దృష్టికి వస్తే అధికారులకు తెలియచేయాలన్నారు. ఎక్కువ శాతం ఓటింగ్ జరిగితే విలువలు కలిగిన ప్రజాప్రతినిధులు ఎన్నికవుతారన్నారు. జాయింట్ కలెక్టర్ జె మురళి మాట్లాడుతూ యువత ఓటు చేయడంతోపాటు తమ తోటివారితో కూడా ఓటు వేయించాలన్నారు. కార్యక్రమంలో డిఆర్‌ఓ విజయచందర్, ట్రైనీ కలెక్టర్ కాళీచరణ్, డిపిఆర్‌ఓ సదారావు, ఆర్డీవో సాయిబాబు, పద్మశ్రీ గొరిపర్తి నరసింహరాజు, అధికారులు, అనధికారులు, పురప్రముఖులు పాల్గొన్నారు.
జిల్లాలో శిక్షణ పూర్తయిన
38మంది ఎస్‌ఐలకు పోస్టింగ్
మచిలీపట్నం టౌన్, జనవరి 25: జిల్లాలో శిక్షణ పూర్తి చేసుకున్న 38 మంది సబ్ ఇన్‌స్పెక్టర్లకు జిల్లా పోలీసు సూపరింటెండెంట్ జె ప్రభాకరరావు శనివారం పోస్టింగ్‌లు ఇచ్చారు. జిల్లా పోలీసు కార్యాలయం పరిధిలో 24మంది, విజయవాడ నగర పోలీసు కమిషనరేట్ పరిధిలో 12మందికి పోస్టింగ్‌లు ఇచ్చారు. పామర్రు ఎస్‌ఐగా విల్సన్ బాబు, వీరుళ్ళపాడు ఎస్‌ఐగా ఐ అవినాష్, చిల్లకల్లు ఎస్‌ఐగా పేరూరి నాగరాజు, అవనిగడ్డ ఎస్‌ఐగా దేశంశెట్టి వి కుమార్, జగ్గయ్యపేట ఎస్‌ఐగా ఎంవికె షణ్ముక సాయి, ముసునూరు ఎస్‌ఐగా పసుపులేటి శోభన్‌కుమార్, కైకలూరు రూరల్ ఎస్‌ఐగా సిహెచ్ రంజిత్‌కుమార్, కూచిపూడి ఎస్‌ఐగా పివిఎస్‌ఎస్‌ఎన్ సురేష్, ఘంటసాల ఎస్‌ఐగా తాటిపత్రి వివి రావు, కైకలూరు టౌన్ ఎస్‌ఐగా ఎండి షబ్బీర్ అహ్మద్, కంచికచర్ల ఎస్‌ఐగా బి ప్రసాదరావు, గూడూరు ఎస్‌ఐగా అడపా ఫణిమోహన్, కలిదిండి ఎస్‌ఐగా వి యేసుబాబు, పెడన ఎస్‌ఐగా మణికుమార్, చాట్రాయి ఎస్‌ఐగా చంటిబాబు, తిరువూరు ఎస్‌ఐగా ఎం కన్నప్పరాజు, నందివాడ ఎస్‌ఐగా పి రాంబాబు, బంటుమిల్లి ఎస్‌ఐగా ఎం చిరంజీవి, నూజివీడు టౌన్ ఎస్‌ఐగా షేక్ జబీర్, మైలవరం ఎస్‌ఐగా వై దుర్గారావు, విస్సన్నపేట ఎస్‌ఐగా చింతపల్లి కెడి ప్రసాద్, గుడివాడ తాలుకా ఎస్‌ఐగా పిఎస్‌వి సుబ్రహ్మణ్యం, నాగాయలంక ఎస్‌ఐగా నరేష్, మచిలీపట్నం టౌన్ ఎస్‌ఐగా జి శ్రీహరిబాబు, ఎ.కొండూరు ఎస్‌ఐగా పి ఉమామహేశ్వరరావు, బందరు తాలుకా ఎస్‌ఐగా జి అనిల్ నియమితులయ్యారు. విజయవాడ నగర పోలీసు కమిషనరేట్ పరిధిలో శిక్షణ పూర్తి చేసుకున్న 12మంది పిఎస్‌ఐలకు జిల్లాలో పోస్టింగ్ ఇచ్చారు. వీరవల్లి ఎస్‌ఐగా పి వాసు, కృత్తివెన్ను ఎస్‌ఐగా కెవిజివిఎస్ నారాయణ, గుడ్లవల్లేరు ఎస్‌ఐగా గణేష్‌కుమార్, గంపలగూడెం ఎస్‌ఐగా ఎం మహాలక్ష్మి, మండవల్లి ఎస్‌ఐగా ఎ మణికుమార్, పెదపారుపూడి ఎస్‌ఐగా ఎస్‌ఎల్‌ఆర్ సోమేశ్వరరావు, వత్సవాయి ఎస్‌ఐగా మహేశ్వరరావు, జి.కొండూరు ఎస్‌ఐగా రవివర్మ, రెడ్డిగూడెం ఎస్‌ఐగా నాగరాజు, ముదినేపల్లి ఎస్‌ఐగా సతీష్, చల్లపల్లి ఎస్‌ఐగా సుధాకర్, కోడూరు ఎస్‌ఐగా ఎజి సత్యనారాయణ మూర్తి నియమితులయ్యారు.
పోలీసులు, ప్రాసిక్యూటర్లు సమన్వయంతో వ్యవహరించాలి
మచిలీపట్నం టౌన్, జనవరి 25: పోలీసులు, ప్రాసిక్యూషన్ అధికారులు సమన్వయంతో వ్యవహరించి దోషులకు శిక్షపడేలా చూడాలని డెప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ రామకోటేశ్వరరావు అన్నారు. స్థానిక జెడ్పీ సమావేశ మందిరంలో శనివారం జిల్లాలోని వివిధ కోర్టుల పిపిలు, ఎపిపిల సమావేశం జరిగింది. ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ చాలా కేసుల్లో ఫిర్యాదుదారులు ముద్దాయిలతో రాజీ పడుతున్నారని, ఫలితంగా కేసులు వీగిపోతున్నాయన్నారు. ఇకపై అలా జరగకుండా ఫిర్యాదుదారుల్లో చైతన్యం కల్పించాలన్నారు. జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ప్రభాకరరావు, డిఎస్పీ డా.కెవి శ్రీనివాసరావు, ఎస్‌బి సిఐ మురళీధర్, డిసిఆర్‌బి సిఐ బాలరాజు, సిఐలు మూర్తి రాజు, కె వెంకటేశ్వరరావు, పలువురు ప్రాసిక్యూటర్లు పాల్గొన్నారు.
పదో తరగతి విద్యార్థి అదృశ్యం
కూచిపూడి, జనవరి 25: పాఠశాలకు వెళ్ళి అదృశ్యమైన ఒక్కగానొక్క కుమారుడి కోసం తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు. మొవ్వ మండలం చినముత్తేవి గ్రామానికి చెందిన కూనపరెడ్డి శ్రీనివాసరావు కుమారుడు కులదీప్(15) పామర్రు ఎఎన్‌ఎం పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. ప్రతిరోజూ స్టడీ అవర్ అనంతరం చినముత్తేవికి బయలుదేరే సమయంలో తండ్రికి ఫోన్ చేస్తే అయ్యంకి అడ్డ రోడ్డుకు వచ్చి బైక్‌పై ఇంటికి తీసుకెళతాడు. గురువాం కుమారుడి నుండి ఫోన్ రాకపోవటం, స్విచ్చ్ఫా కావటంతో ఆందోళన చెందిన శ్రీనివాసరావు పామర్రులోని పాఠశాలలో విచారించాడు. కులదీప్ పాఠశాల నుండి వెళ్ళినట్లు తెలిపారు. స్నేహితులను విచారించిన ఆయన చివరికి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఘనంగా సమైక్యత, శాంతి ప్రదర్శన
తిరువూరు, జనవరి 25: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరువూరులో శనివారం జాతీయ సమైక్యత, శాంతి ప్రదర్శన జరిగింది. 170 మీటర్ల జాతీయ పతాకాన్ని చేతబూనిన విద్యార్థులు రాజుపేట నుంచి పట్టణంలోని ప్రధాన వీధుల్లో కదంతొక్కారు. తొలుత ఆంధ్రప్రదశ్ మార్కెఫెడ్ చైర్మన్ కంచి రామారావు, తిరువూరు సిఐ శ్యామ్‌కుమార్‌లు సంయుక్తంగా జెండా ఊపి ప్రదర్శనను ప్రారంభించారు. భరతమాత వేషధారణతో జాతీయపతాకాన్ని చేతబూని ఒక విద్యార్థిని నిలువగా మహాత్మ గాంధీతో పాటు విభిన్న వేషధారణలతో మరికొందరు విద్యార్థులు ప్రదర్శన ఆగ్రభాగంలో నిలిచారు. స్థానిక లక్ష్మి సెంటర్‌లో మార్కెఫెడ్ చైర్మన్ రామారావు, సిఐ ఎం శ్యామ్‌కుమార్, ఎఎంసి చైర్మన్ కోటగిరి వెంకటరావు, మాజీ చైర్మన్ కంచర్ల ముత్య ప్రసాద్‌లు గౌరవ వందనం స్వీకరించారు. ప్రపంచ శాంతిని కోరుతూ పావురాలను ఎగురవేశారు. ఈసందర్భంగా కంచి రామారావు మాట్లాడుతూ జాతి ప్రతిష్ఠ, ఔన్నత్యానికి ప్రతీకైన జాతీయ పతాకాన్ని ప్రతి ఒక్కరు గౌరవించాలన్నారు. జాతి నేతలను ఆదర్శంగా తీసుకుని దేశాభివృద్ధికి కృషి చేయాలని కోరారు. విజన్ హైస్కూల్ ఆధ్వర్యంలో జరిగిన ఈకార్యక్రమంలో ఎంఇఓ కె రామజోగేశ్వరశర్మ, శ్రీవాహిని ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ పసుమర్తి వెంకటేశ్వరరావు, మాజీ వైస్ ఎంపిపి దుబ్బాక వెంకటేశ్వర్లు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ప్రతినిధులు పాల్గొన్నారు.