విశాఖపట్నం, జనవరి 25: రాష్ట్ర విభజన విషయంలో గిరిజన సంక్షేమశాఖ మంత్రి బాలరాజు చేసిన వాఖ్యలు దురదృష్టకరమని అనకాపల్లి ఎంపి సబ్బం హరి అన్నారు. స్థానికంగా ఉన్న రాజకీయ వైషమ్యాలను దృష్టిలో పెట్టుకుని అధిష్టానం నిర్ణయానికి కట్టుబడతానంటూ సీమాంధ్రకు ద్రోహం చేసే చర్యలు భావ్యం కాదన్నారు. వ్యక్తిగతంగా ఎవరికైనా స్పర్ధలుంటే వాటిని బహిర్గతం చేసుకునేందుకు వేరే వేదిక చూసుకోవాలని హితవు పలికారు. కేవలం ఒక వర్గం సమైక్యాంధ్రకు మద్దతిస్తోంది కాబట్టి తాను అందుకు వ్యతిరేకంగా ఉండాలన్న ధోరణి వల్ల నష్టపోయేది రాష్ట్ర ప్రజలేనన్న వాస్తవాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. ఇక సీమాంధ్రలో కొంతమంది కాంగ్రెస్ వాదులు అధిష్టానం వద్ద పరపతి పెంచుకునేందుకు తాపత్రయపడుతున్నారని, ఈక్రమంలో వారు మెజార్టీ సీమాంధ్ర ప్రజానీకానికి ద్రోహం చేస్తున్నారన్న వాస్తవాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు.
ఏలేరు కాలువ నిర్వాహణ పనుల వాయిదా
* స్టీల్‌ప్లాంట్, ఎన్టీపీసీల్లో నీటి కొరతే కారణం
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, జనవరి 25: నగర తాగునీటి అవసరాలతో పాటు పారిశ్రామిక రంగానికి నీటిని అందిస్తున్న ఏలేరు కాలువ మూసివేత వాయిదా పడింది. ప్రత యేటా రిజర్వాయర్ హెడ్స్‌తో పాటు కాలువ నిర్వాహణ, లైనింగ్, ఇతర పనుల నిమిత్తం రెండు నెల్లపాటు మూసివేయడం జరుగుతుంది. గతేడాది కొన్ని అనివార్య పరిస్థితుల కారణంగా నిర్వాహణ పనులు చేపట్టలేదు. దీంతో రెండేళ్లుగా నిర్వాహణ పనులు చేపట్టలేదు. దీంతో ఈసారి కాలువతో పాటు రిజర్వాయర్ వద్ద పనులు చేపట్టాలని విస్కో నిర్ణయించింది. ఈపనులు చేపట్టేందుకు నీటిపారుదల శాఖకూడా సిద్ధ పడింది. ఈనేపధ్యంలో విస్కో, ఇరిగేషన్, స్టీల్‌ప్లాంట్, ఎన్టీపీసీ, ఎపిఐఐసి, జివిఎంసిల నుంచి ప్రతినిధులతో శనివారం నాడిక్కడ సమావేశం నిర్వహించారు. అయితే ఏలేరు కాలువను నిర్వాహణ నిమిత్తం రెండు నెల్ల పాటు మూసివేస్తే పారిశ్రామిక అవసరాలకు నీటి లభ్యత కష్టమవుతుందన్న వాదన లేవనెత్తారు. గతంలో కురిసిన భారీ వర్షాల కారణంగా కాలువకు పడిన గండ్లను పూడ్చేందుకు రెండు నెల్లపాటు నీటి సరఫరా నిలిపివేశారు. దీంతో విస్కో ద్వారా నీటిని తీసుకుంటున్న స్టీల్‌ప్లాంట్, ఎన్‌టిపిసి, ఎపిఐఐసిలకు నీటి ఇక్కట్లు తప్పలేదు. విశాఖ స్టీల్‌ప్లాంట్ రోజుకు 70 ఎంజిడిలు, ఎన్‌టిపిసి 7 ఎంజిడిలు, ఎపిఐఐసి 5 ఎంజిడిల నీటిని ఏలేరు కాలువ ద్వారా వాడుకుంటున్నాయి. ఈపరిశ్రమల్లో నీటిని నిల్వచేసుకునే వనరులున్నప్పటికీ గత రెండు నెల్ల కాలంలో నిల్వలు మొత్తం తరిగిపోయాయి. ఈసమయంలో కాలువను మూసివేస్తే తమకు నీటి కొరత ఏర్పడుతుందని పరిశ్రమల ప్రతినిధులు వాదించారు. మరో రెండు నెల్లపాటు నిరంతరం నీటిని సరఫరా చేస్తేనే నీటి నిల్వలు ఆశించిన మేర సాధ్యమని లేనిపక్షంలో తమకు నీటి ఇబ్బందులు తప్పవని స్పష్టం చేశారు. దీంతో కాలువ మూసివేత నిర్ణయాన్ని అధికారులు వాయిదా వేశారు. తొలుత మే నెలలో కాలువను మూసివేసి నిర్వాహణ పనులు చేపట్టాలని ప్రతిపాదించినప్పటికీ వర్షాలు కురిసే అవకాశాలు ఉండటంతో కాంట్రాక్టర్లు ముందుకు రారని ఇరిగేషన్ అధికారులు తెగేసి చెప్పారు. దీంతో మరోసారి సమావేశం ఏర్పాటు చేసి చర్చించాలని నిర్ణయించారు.
గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు పూర్తి
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, జనవరి 25: గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. పోలీసు బ్యారెక్స్‌లో ఆదివారం నాటి గణతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించి వేదిక, స్టాళ్ల ఏర్పాటు, ప్రభుత్వ శాఖ శకటాల ప్రదర్శన, ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించి ఆస్తుల పంపిణీ వంటి అంశాలను పూర్తి చేశారు. అలాగే బాలలతో ఏర్పాటు చేసే విన్యాసాలు, సాంస్కృతిక ప్రదర్శనలకు సంబంధించి రిహార్సల్స్ పూర్తి చేశారు. వేడుకలను తిలకించేందుకు హాజరయ్యే ప్రేక్షకులు కూర్చునేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.