
నిశిరేయి నిద్దుర గాయపడ్డప్పుడు
పసి తలపు సలుపు కోత పెడుతుంది
అదృశ్యమైన అల్లరి జాడ గుర్తొచ్చి
దేహం చిగురుటాకై వణుకుతుంది
పటమైన పసితనం ఎదుట
జ్ఞాపకాలన్నీ పోగుచేసుకుని కుములుతుంది
కలడో, లేడో తెలియని గారాల కూనకై
వెతికిన దారుల్లో పదేపదే వెతుకుతూ
తనే తప్పిపోతుంది
ఏ దిక్కున పసి పలుకులు విన్నా
వెలుతురు పిట్టల కులుకులు కన్నా
మంచు నీడై పోరాడుతుంది
గలగల ప్రవహిస్తోన్న రూపాల్లో
కనుమరుగైన రూపం కానరాక
ఆకురాలిన అడివై చెమరుస్తుంది
ఫొటోకు మాల... అన్న
నాలుగు పొడి మాటలకు
ఒక పలుచటి నమ్మకం
గాలిలో దీపమై రెపరెపలాడుతుంది
ఏ గోరువెచ్చని సమయానో
కలల రంగులపై వాలే పసి మొలక
పాలపిట్టై వాలుతాడని
గోధూళి వేళను
గోరింట నవ్వై వెలిగిస్తాడని
ఒక శ్వాస...
ఎదురుచూస్తూనే ఉంది గుమ్మమై.
నిశిరేయి నిద్దుర గాయపడ్డప్పుడు
english title:
pasi jeda
Date:
Monday, January 27, 2014