
రంగు వెలిసి చారగిలబడిన
పిట్టగోడల సందుల్లోంచి
అతను నడుస్తున్నాడు
అద్దంలా మెరిసిపోతున్న
రాజభవనాల ముందు
రంగుల ముస్తాబుల్లో మునిగిన
నల్లని తారు దారిదాటి
మట్టిరోడ్డెక్కి మరీ నడుస్తున్నాడు
కుడి ఎడమల కరెంటు తీగల మీద
చిరిగి కొట్టుకుంటున్న గాలిపటాలు
వాడి పారేసిన దూది ముద్దల్లా
రెపరెపలాడుతున్న ప్లాస్టిక్ కవర్ల నడుమ
ఏదో దొరుకుతుందని
ఏదీ అందుకోలేని గొర్రె పిల్లలు
పాడుకొట్టుకుంటున్న
ఆకుపచ్చని దర్వాజల ముందు కూడా
అతను
నడక ముఖ్యం కాని
చింత కాదంటాడు
సామాన్యుల వాకిళ్ళలో
అసామాన్యుల లోగిళ్ళలో
సమాన వేగంతో నడిచాడు
సామాన్యుల అవసరాల కోసం
వాళ్ళ అవకాశాల కోసం
మిన్ను విరిగి మీద బడ్డట్లు
రాజధాని రాజకీయం నోరెళ్ళబెట్టింది
కాషాయం కూడా ఖంగుతిన్నది
ఇప్పుడతను - నిజాయితీ నిప్పు మీద
వెలిగి అలా నడుస్తున్నాడు
ఏదో ఆశ మళ్ళీ
తిరగాడుతున్న అలజడి అతని చుట్టూ
సామాన్యుల రాజ్యపు
ఆకాశ కిరణం నింగికి వస్తుంది
కులాన్నో, మతాన్నో, వాదాన్నో, వివాదాన్నో
అడ్డుపెట్టకండి
ఎందుకంటె ఎక్కడ మొదలుపెట్టాలో
తెలియని ఒక యుద్ధం మొదలయింది
దేశమంతటా విస్తరణ కోసం కాపు కాద్దాం.