...........................................................
కవితలు, సాహిత్య నానీలు, సినారెపై కవితలు ప్రచురించి కూడా కవి నామానికి, తన ప్రియ మిత్రుడు గోపీనుండి బేషరతు అంగీకారం
పొందలేకపోవటం చర్చించవలసిన విషయమే.
............................................................
ద్వానాశాస్ర్తీ ఇటీవల వెలువరించిన కవితా సంపుటి ‘మనిషిలోకి ప్రవహించాలి’ అనే 43 కవితల సంకలనానికి ఆచార్య గోపి ముందుమాట రాశారు. ‘అక్షర యాత్రలో కవిత్వం మజిలీ’ శీర్షికన రాసిన ఆ పరిచయ వ్యాసం ‘ద్వానాశాస్ర్తీ కవి కాడు, భావుకుడు’ అని ప్రారంభమవుతుంది. అంటే ప్రధాన వర్గీకరణలో కవిగా లేకున్నా మంచి సృజనాత్మక ఆలోచనలు కలవాడు అని అర్థం వస్తుంది. ‘అందుకే మంచి విమర్శకుడు’ అనటం తొలి అభిప్రాయాన్ని సమర్థిస్తుంది. 'Failed poets are critics' అన్న ఆంగ్ల నానుడిని పరోక్షంగా గుర్తుకుతెస్తుంది. అయితే దశాబ్దాల క్రితమే ‘సమాధిలో స్వగతాలు’ అనే కవిత్వాలు పలికించిన ద్వానా; కవితలు, సాహిత్య నానీలు, సినారెపై కవితలు ప్రచురించి కూడా కవి నామానికి, తన ప్రియమిత్రుడు గోపీనుండి బేషరతు అంగీకారం పొందలేకపోవటం చర్చించవలసిన విషయమే.
నిజమే. కవితాత్మ, సున్నితమైన భావం, సునిశితమైన ‘సెన్సిబిలిటీ’లు పుష్కలంగా వున్నా అది కవిత్వానికి దగ్గరగా వచ్చి ఆగిపోవటం కద్దు. అనేకమార్లు అలా జరుగుతుండటం వల్లనే విమర్శక విచికిత్సలు వారు తప్పటమో, మూడో తరగతి మార్కుల్తో ఆగిపోవటమో జరుగుతుంది. లేదా నడుం బిగించి పట్టు వదలని విక్రమార్కుల్లా పది, పనె్నండు కావ్యాలు ప్రజలపై వదిలి కవి అని అంగీకరించే దాకా పీడించిన వారూ ఉన్నారు. అంతటి అఘాయిత్యానికి శాస్ర్తీ పూనుకోలేదు కాని, ‘మనిషి లోకి ప్రవహించాలి’ కావ్యంలో ముచ్చటైన భావాలు అనేకం కనిపిస్తాయి. గతంలో కనిపించని ‘నభూతో’ పలుకులు ఒకటి రెండు కనిపిస్తాయంటే ఆశ్చర్యం లేదు. గర్భస్రావాలను సూచిస్తూ... ‘మన నిర్లక్ష్యం వల్ల, మన స్వార్థం వల్ల, శిశువును చిదిమేస్తున్నాం... గర్భకోశాన్ని మిగులుస్తున్నాం... శిశుమరణం ఓ మేధావి మరణం కావొచ్చు. శిశువు ఆనందాల హరివిల్లు.. అనుభూతుల విరిజల్లు... బాధల్ని మటుమాయం చేసే సంజీవని...’ అన్నప్పుడు మొదలైన భావుకత పత్రికలపైకి పొంగి ‘‘ఒక్కోసారి పత్రిక అక్షరాల మంజుల మాలిక, విశిష్ట అనుభూతుల పాలవెల్లిక... మత్తకోకిల కూజితం, ఒక్కోసారి హరీంద్ర గర్జన... మరోసారి మనుసును నగిషీ చెక్కే చిత్రిక... మా నరమేధకు తలఎత్తిన పతాక’’ అంటూ ప్రవహించింది. అమ్మమీద చాలామంది రాశారు. రాయనివాళ్లే అరుదు. ‘నన్ను అందరూ గంజాయి మొక్కలా చూస్తున్నప్పుడు... తులసి మొక్కవు నాన్నా అని అక్కున చేర్చుకుంది... ఆమె నీళ్ల మజ్జిగై నన్ను గడ్డ పెరుగులా పెంచింది. ఆమె పచ్చడి మెతుకులై నన్ను వేపుడు కూరగా పెంచింది... ఆమె మేదురు చాపయి, నాకు పూలపాన్పు పరిచింది...’ అనే వాక్యాలు ఏ ఉత్తమ కవితా ప్రవచనానికి తీసిపోవు.
‘పెళ్లి’ మీద కూడా కలం విదిలించని కవి ఉండడు. ఆడ-మగల సంగమావస్థను తాకని పెన్నూ, దాంపత్యంలోని వైరుధ్యాలపై ఎక్కుపెట్టని గన్నూ ఉండవు. కాని పెళ్లిపై ద్వానా... ‘ఒకరిలోకి ఒకరు ప్రవహించకపోతే ఆ దాంపత్యం - వాసన లేని పువ్వు... అచ్చుతప్పుల కావ్యం... ఆహార్యం లేని రూపకం... అప్పుడది నిప్పుల మీద నడక... పులిమీద సవారీ... నాగరికతకు మచ్చుతునక పెళ్లి... మానవ మనుగడకు చుక్కాని పెళ్లి...’ అని ఎంత సశాస్ర్తియతను వాచ్యంగా చెప్పినా, వచనంలో చెప్పినా, ఏ అలంకారికుల అత్తెసరు మార్కుల్తో కూడినా అరవై దాటి ఫస్టుక్లాసు కవితగా కొట్టివేయవలసిన అవసరం వుంది గోపీగారూ! అబ్బా, ధ్వనిరాయుళ్ళ కవితల్లో డబ్బా సూచనలెన్ని లేవూ... ఇమేజరీ దొంగజరీ నేతల్లో పిగిలిపోయిన దారాలెన్ని లేవూ... కావాలంటే అంకితం పుచ్చుకున్న శివారెడ్డికి సెకండ్ వాల్యుయేషన్‌కు పంపి చూడండి... ఏమంటాడో... ఈ క్రింది కవితకు ఎన్ని మార్కులు వేస్తాడో...’ నేత్రపర్వంలో -
‘కన్ను ఒక అద్భుత నిర్మాణ శిల్పం
అపూర్వమైన డిజిటల్ కెమేరా
కన్ను విశిష్టం... విలక్షణం - కవికి మరో నేత్రం
కవి కన్ను అందరి కన్నా మిన్న... కన్నుకి పాస్‌వర్డ్
కన్నీరు మాత్రమే... దుఃఖంలోనే కాదు ఆనందంలోనూ ఏడ్చే కన్ను జీవిత తత్వాన్ని బోధిస్తుంది... సార్థకం చేసుకోమంటుంది... కన్నున్న దివాంధం కన్నా... కన్ను లేని ప్రేమమూర్తి మిన్న...’ కళ్లపై యింత రాసి కళ్లు లేని ప్రేమమూర్తిని ప్రశంసించడం కావ్యస్పర్శకు అంతర్నేత్రం. కవి పాలిట నేత్ర ధనుస్సు...! కళ్ళ సొగసు సావిత్రిలోనూ, మయసభలో సుయోధన ఎన్టీఆర్ నేత్ర నృత్యంలోనే కాదు... నర్తనశాలలో భీముడ్ని చూసిన ఎస్వీఆర్ కీచక అర్ధనిమీలిత నేత్రాల్ని గుర్తుకుతెచ్చుకోవాలి.
‘కొందరికి బాల్యం మంచు తడిసిన మల్లె... మరికొందరికి మందార మకరందం... ఇంకొందరికి క్రీడాభిరామం... నాకు మాత్రం వడ్డించిన విస్తరి... పగిలిన అద్దం... (అర్థం స్ఫురించని) ఒక ‘మో’ కవిత... గాసట బీసటగా నిలిచిన శాసనభాష... బ్రాహ్మణేతరుల్తో జత కట్టినందుకు నాన్నగారి చాంతాడు దెబ్బలు... హరిజన మిత్రుల్ని కలిసినందుకు చలిలో సచేల స్నానాలు... నా బాల్యం ఒక వియోగ గీతిక... ఒక కన్నీటి చార... ఒక నూతిలో గొంతుక... (నత్తి వాడినైన నన్ను)... మూడో కొడుకునైనా మా నాన్న పంచముడిగా చూసిన వైనం...!!’’ ఈ కవిత చదివి పాఠకుడు చచ్చిందాకా మర్చిపోలేని గుర్తుగా మిగిలిపోవటం ఖాయం... తన ‘నత్తి’పై శాస్ర్తీ రాసుకున్న కవిత, కవితా చరిత్ర పుటల్లోకి ఎక్కక తప్పదు... ఆత్మన్యూనతా భావం లేకుండా ఉదాత్తతవేపు మళ్లించిన వైనం.