అన్నమయ్య, పోతన, నన్నయ, వేమన మొదలైన వారినందరినీ తన బిడ్డలుగా చూసి మురిసిపోతున్న తెలుగుతల్లికి పదవుల పందేరంలో తనను పంచుకుంటున్న బిడ్డలను చూసి కడుపుకోత మిగులుతోంది. సౌభ్రాతృత్వాన్ని పెంచుకోవాలన్న సద్భావన కొరవడి కుక్కలు చింపిన విస్తరిగా మార్చే, కుయుక్తులు రాజ్యమేలే దుస్థితి దాపురించడం తెలుగు తల్లికి బాధాకరమైన విషయం.
గాసట బీసటే చదివి గాథలు త్రవ్వెడునాడు క్రమ వి
న్యాసము సల్పు శిల్పి యులియంచుల నోంకృతిపల్కినత్తపో
వ్యాసుడు నన్నపార్యునకు పంచమ వేదముగా ధ్వనించు వా
చాసముదాత్తమాంధ్రుల ప్రశస్తికి కైగవ దోయిలించెదన్
- ఈ మాటలు వేంగీ దేశాన్ని పరిపాలించిన రాజరాజనరేంద్రుని ఆస్థాన కవి అయిన నన్నయను గురించి అనంతపురం జిల్లా చియ్యేడు గ్రామంలో జన్మించిన సరస్వతీ పుత్రులు పుట్టపర్తి నారాయణాచార్యులు భక్తితో కొనియాడుతూ చెప్పినవి.
‘చెలువపు మొగ్గలై రసము చిందెడు చందన చారు చర్చలై
నళిన దళంబులై మృదు మృణాళములై నవనందనమ్ములై
జలనిధి వౌక్తికాలయి లసత్తర తారక హారపంక్తులై
తళతళలాడు నన్నయ పదమ్ములపై తలవంచి మ్రొక్కెదన్!
ధర్మజు తితీక్ష - భీష్ముని త్యాగదీక్ష
కర్ణుశౌర్యము - పార్థుని గరువ తనము
చైద్యుని దురుక్తి - కృష్ణుని సహన శక్తి
కదను త్రొక్కెను నన్నయ్య గంటయందు
- ఈ పద్యాలు ఆనందలహరి పద్యగద్య కవితా సంపుటిలోనివి. కరుణశ్రీ జంధ్యాల పాపయ్యశాస్ర్తీ నన్నయ కవితా వైశిష్ట్యాన్ని స్తుతిస్తూ పారవశ్యంతో నమోవాకాలర్పించారు. వీరు జన్మించింది గుంటూరు జిల్లా కొప్పర్రులో.
ఖ్యాతి గడించుకున్న కవులందరు లేరె! అదేమి చిత్రమో
పోతన యన్నచో కరిగిపోవు నెడంద, జోహారు సేతకై
చేతులు లేచు ఈ జనవశీకరణాద్భుత శక్తి చూడగా
నాతని పేరులో గలదొ! ఆయన గంటములోన నున్నదో!
కలము చేతబట్టి కావ్యంబు రచియించె
హలము చేత బట్టి పొలము దునె్న
కలము హలములందు ఘనుడురా పోతన్న
లలిత సుగుణజాల తెలుగు బాల
- అని బమ్మెర (ఓరుగల్లు) జన్మస్థలమైన భక్త కవి పోతనను గురించి రసార్ద్ర హృదయంతో హృదయపూర్వకంగా అభినందిస్తూ చెప్పిన పద్యాలున్నాయి. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఇవి ముఖస్తుతి కోసమో, స్వలాభం కోసమో, ప్రాపకాన్ని కోరుకునో చెప్పిన మెరమెచ్చు మాటలు కావు. ఇటువంటి ప్రశంసల్లో నిజాయతీ కనిపిస్తుంది. ఆత్మీయత వ్యక్తమవుతుంది. అంతేకానీ మరొక కవిని పొగిడితే మన స్థాయి పడిపోతుందేమోనన్న బాధకానీ, మనం పొగిడినందువల్ల వారికేదైనా మేలు జరిగిపోతుందేమోనన్న దుగ్ధ కానీ, మనను మించినవారు లేరనే అహంకారం కానీ లేకపోవడం చేతనేమో నిర్మలమైన హృదయంతో ఇతరులలోని పాండిత్యానికి ఆకర్షితులై ప్రణతులర్పించారు. ఇలా ఎందరో ఉన్నారు. వారు ఎక్కడివారు? ఎప్పటివారు? అని ఆలోచించకుండా నచ్చినదాన్ని చక్కగా మెచ్చుకున్నారు. కుల మత ప్రాంత లింగ వయో వివక్ష లేకుండా నిష్పక్షపాతంతో కూడిన ఈ వైఖరిని మనం ఆదర్శంగా తీసుకోవాలి. ‘విశ్వః శ్రేయం కావ్యం’ - కావ్యం సర్వ మానవాళి శ్రేయస్సునూ కాంక్షించేది. అటువంటి సాహిత్యం ఏ ఒక్కరినో మెప్పించే ప్రయత్నంలో మరొకరిని నొప్పించేలా వుండకూడదు. అందరినీ ఒప్పించేలా ఉండాలి. అన్ని సందర్భాల్లోనూ ఈ పరిస్థితి కుదరకపోయినా ‘సహిత స్వభావం సాహిత్యం’ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. హితంతో కూడినదే సాహిత్యం. సాహిత్యం సమాజానికి మేలు చేయాలి. తిరుపతి వేంకటేశ్వరుడు, భద్రాద్రి రాముడు, సింహాచల నరసింహుడు, శ్రీశైల మల్లికార్జునుడు తెలుగువారిని సమదృష్టితో, దయార్ద్ర దృష్టితో కటాక్షిస్తున్నారు. అన్నమయ్య, పోతన, నన్నయ, వేమన మొదలైన వారినందరినీ తన బిడ్డలుగా చూసి మురిసిపోతున్న తెలుగుతల్లికి పదవుల పందేరంలో తనను పంచుకుంటున్న బిడ్డలను చూసి కడుపుకోత మిగులుతోంది. సౌభ్రాతృత్వాన్ని పెంచుకోవాలన్న సద్భావన కొరవడి కుక్కలు చింపిన విస్తరిగా మార్చే, కుయుక్తులు రాజ్యమేలే దుస్థితి దాపురించడం తెలుగు తల్లికి బాధాకరమైన విషయం. తల్లిమీద దయ చూపి ఆమెకు సంతోషాన్ని కలిగించి గర్వకారణంగా మిగిలేలా పుత్ర సంతతి నడుచుకోవాలని ఆశిద్దాం. ఆనాటి కవులు తమ పాండిత్య ప్రాభవాలతో ఆంధ్ర సరస్వతిని అలంకరించి వనె్నలు చేకూర్చారు. ఆ ఆంధ్ర సరస్వతిపై ప్రాంతాల రంగులు చల్లుతూ, పులుముతూ వికృతంగా మార్చడం తగనిపని.