.......................
స్థానిక వ్యక్తీకరణలో అనుకరణ తగ్గి సహజత్వం పెరిగిన కొద్దీ అది జీవన వాస్తవికతని ప్రతిబింబించిన రచనగా విశ్వసనీయతని పొందుతుంది. మానవ జీవితం నుంచి తాను గ్రహించిన సారాన్ని సాధారణీకరించి దానిని కళాత్మకంగా చెప్పడానికి స్థానికతని చాలా ప్రేమగా స్వీకరించాడు చాసో.
.....................
సాహిత్యం, వౌఖిక రూపంలో ఉన్న దశ నుండీ యిప్పటివరకూ స్థలకాలాదుల స్పృహతోనే నడుస్తోంది. ఈ స్పృహని సాహిత్య నిర్మాణ సూత్రాల రీత్యా నేపథ్యం, వాతావరణం అంటున్నాము. వివిధ సాహిత్య ప్రక్రియల ముఖ్య లక్షణాల్లో నేపథ్యానికీ స్థానం ఉంది. నేపథ్యం సూచించే అంశాల్లో స్థానికత ప్రధానమయినది. స్థల కాలాదుల నిర్దిష్టత సాహిత్య వస్తురూపాలను ప్రభావితం చేయడం ఆధునిక సాహిత్య లక్షణం. కొన్ని వర్గాలకు, ప్రాంతాలకు మాత్రమే పరిమితమయిన ప్రాచీన సాహిత్యాన్ని విస్మృత వర్గాలకు చేరువ చేయడంలో స్థానికతా భావన కూడా దోహదకారి అయింది. ప్రాబల్య శక్తుల నుంచి విముక్తి పొందిన సాహిత్య వస్తువు. గ్రాంధిక సంకెళ్లను తెంచుకుని వ్యావహారికం, మాండలికంవైపు ప్రవహించిన భాష, స్థల కాలాదుల నిర్దిష్టతకు లోబడినవే.
ఆధునిక సాహిత్యంలో స్థానిక వ్యక్తీకరణను ప్రభావవంతంగా ప్రవేశపెట్టిన అడుగుజాడ గురజాడదే. వ్యావహారిక భాషకు కూడా కావ్య గౌరవం లేని రోజుల్లో మాండలిక భాషలో కన్యాశుల్కాన్ని రాసి భవిష్యత్తరాలకు కొత్త తోవని వేశాడు గురజాడ. ఆ తోవని అంది పుచ్చుకున్న అభ్యుదయ రచయిత చాసో, సాహిత్యానికి అనంత జీవన వైవిధ్యం ప్రామాణికమని నిరూపించాడు.
చాగంటి సోమయాజులు రచనల్లోని స్థానికత - సార్వత్రికతలను విశే్లషించేపుడు తప్పనిసరిగా గుర్తించవలసిన విషయం ఒకటి ఉంది. తెలుగు సాహిత్యంలో స్థానికతని నిర్దిష్ట రాజకీయార్థంలో 1980ల తర్వాతనే వాడుతూ వస్తున్నాము. అయితే అంతకుముందు తరాల వారి రచనల్లోనూ స్థానిక జీవనం అనివార్యంగా ప్రతిఫలిస్తూనే వచ్చింది. సాధారణీకరించిన ఏ జీవన సూత్రాన్ని చెప్పడానికయినా జీవితమే ప్రమాణం కనుక ఆ జీవితాన్ని ఆశ్రయించుకుని ఉండే భౌగోళిక ప్రత్యేకతలు, సాంస్కృతిక వాతావరణం, వనరులు, భాష, భిన్న వ్యక్తిత్వాలు, వివిధ సామాజిక వర్గాలూ వాటి సహజ లక్షణాలతో సాహిత్యంలోకి చేరతాయి. స్థానిక వ్యక్తీకరణలో అనుకరణ తగ్గి సహజత్వం పెరిగిన కొద్దీ అది జీవన వాస్తవికతని ప్రతిబింబించిన రచనగా విశ్వసనీయతని పొందుతుంది. మానవ జీవితం నుంచి తాను గ్రహించిన సారాన్ని సాధారణీకరించి దానిని కళాత్మకంగా చెప్పడానికి స్థానికతని చాలా ప్రేమగా స్వీకరించాడు చాసో.
కథ చెపుతాను వూ కొడతారా? అంటూ పలకరిస్తాయి చాసో కథలు. వౌఖిక కథన సంప్రదాయం చాలా కథల్లో అంతర్లీనంగా ఉండటంవల్లనే చాసో కథలకి చదివించే గుణం, చకచక సాగే నడక అమిరాయి. ‘‘స్థానికత బలంగా వ్యక్తమయ్యేది వౌఖిక కళారూపాల్లోనే. అట్లాంటి వౌఖికతని అనుసరించే ప్రయత్నమే స్థానికీకరణ’’ అంటారు అఫ్సర్. కథనంలో వౌఖిక సంప్రదాయ లక్షణాలను మేళవించడం ద్వారా రూపంలో స్థానికీకరణను చాలా కథల్లో చాసో సాధించారు.
ఉత్తరాంధ్ర ప్రాంతపు భౌగోళిక ప్రత్యేకతలు చాసో కథల్లో చాలాచోట్ల కనిపిస్తాయి. దుమ్ముల గొండె కథంతా ప్రాదేశిక సొగసుతో పరిమళిస్తూనే ఉంటుంది. ‘‘కుమిలీ ఘాట్ మీది ఏకాంతంలో సోపానాలు, వెనె్నట్లో మనోజ్ఞంగా కోనాడ సముద్రతీరం దాకా కనపడే విశాల దృశ్యం, సర్పంలాగా మెలికలు తిరిగిపోతూ కనపడే చంపావతీ నది చూసి అనుభవానికి తెచ్చుకునే అవకాశం’ లేకపోయిందని ఒక పాత్ర చేత అనిపించినా చెప్పకనే చెప్పిన సౌందర్యం ఆ వాక్యాల్లో కనిపిస్తుంది. ఘనమయిన భ్రాంతి మదలంకారపు అనుభవాన్నిచ్చిన దుమ్ముల గొండెని తెలుగు పాఠకులు అంత త్వరగా మరిచిపోలేరు. ఈ కథలోనే ఒక పాత్ర కుమిలీఘాట్‌కి షికారు వెళ్ళినపుడు ఎదురైన ఒక చెట్టు గురించి చెపుతూ శనివృక్షం కింద నిలబడిన నల మహారాజుకి శనిదేవత ఆవహించిందనీ, ఆ కారణం చేతనే ఆ చెట్టు కిందకి ఎవరూ వెళ్ళకూడదనే నిషేధం ఉందనీ అంటుంది. ఈ విషయాన్ని చెప్పడం ద్వారా స్థానికుల నమ్మకాలూ, విశ్వాసాలపట్ల, తనకున్న అవగాహనని వ్యక్తం చేయగలిగారు చాసో. అదే సమయంలో ఒక అభ్యుదయ రచయితగా మూఢ విశ్వాసాలను నిరసించాలనే లక్ష్యంతో ఆ నిషేధం ‘పిచ్చి నిషేధం’ అని కూడా అనిపించారు.
గుడిసె - దీర్ఘరోగి కథలో ప్రధాన పాత్ర తన సౌందర్య దృష్టిని ప్రస్తావిస్తూ ‘‘ఏళ్ళ తరబడి శిల్పులంతా చేరి కట్టిన తాజ్‌మహల్ గోరీ కన్నా పాడేరు కొండ చరియల్లో సవరవాడి గుడిసె నన్నాహ్లాద పరుస్తుంది’’ అంటుంది. మనిషిలో అంతర్గతమై ఉన్న సౌందర్య పిపాసని గుర్తించడమనే సార్వత్రిక కథాంశంలో కూడా రచయిత తన స్థానిక వ్యక్తిత్వాన్నుంచి సంపూర్ణంగా విడివడి రచన చేయడం కష్ట సాధ్యం అన్నది అర్థమవుతుంది.
‘జంక్షనులో బద్దీ’ 1969లో రాసిన కథ. విజువల్ డెవలప్‌మెంట్ స్వరూపానే్న, మునిసిపాలిటీ రాజకీయాలను, ప్రజల అమాయకత్వాన్ని ముప్పేటగా చేసి కథ అల్లారు’’ అసలా గొందిని వెడల్పు చేయవలసి ఉంది. గుడిసెలు అడ్డం లేకపోతే రోడ్డు వెడల్పు అయిపోయేది. మునిసిపాలిటీకి డబ్బు లేదు గానీ గుడిసెలు పీకేసి రోడ్లు విశాలంగా చెయ్యవలసిన పథకాలు ఉండటం ఉన్నాయి. ఇళ్ళనే పీకెయ్యవలసి ఉంటే బడ్డీల నుంచుతారా?’’ 1990ల తర్వాత వేగవంతమయిన అభివృద్ధి పథకాల మూలాలను అప్పటికి రెండు దశాబ్దాల ముందే గుర్తించి దానిపట్ల ఒక వైఖరి తీసుకుని జంక్షనులో బడ్డీ కథ రాసారు చాసో. దీనికి నేపథ్యంగా స్థానిక రాజకీయాలు, గ్రామదేవత, ఇలవేలుపు ఎల్లమ్మ తల్లి ప్రస్తావన, బంధుత్వాలూ, పిలుపులూ, స్థానిక మాండలికం, యాస అన్నింటిలో ఉత్తరాంధ్ర ముద్ర చూపారు.
ప్రియుని వియోగం కన్నా మాతృధర్మం ఎంతో బలీయమైనదీ ప్రతీకాత్మకంగా చెప్పిన కథ మాతృధర్మం. కథని నడపడానికి ఎంచుకున్న వాతావరణంలో ఎన్నో రకాల పిట్టలూ, పురుగులూ, ప్రకృతిలో వాటి పోరాటం, సహజీవనం చదువరులను ఆ లోకంలోకి తీసుకుపోతాయి.
బహు చమత్కారి అయిన సీతాకోక, మెరుపు తీగకన్నా కదలికగల కత్తెర దూర, నువ్వు పువ్వులో తొందాం పెట్టి మధుపానం చేస్తూ మత్తెక్కిన నెమలి రెక్కల దీపపు పురుగు, చక్రాయుధంలాగా విసురుకొచ్చి రాచగువ్వని తన్నుకుని కొండమీదకి ఎగిరిపోయే డేగ, చితికిన కత్తెరల గుడ్డునందుకుని పాలముంజిలాగా తినేసే ముంగిస, పొలంలోకి వెళ్ళి హల్వాలాంటి ఆకు పురుగుల్ని, వేడివేడి పెంకు పురుగుల్ని ఏరుకుని తినే ఆదకత్తెరల్ని ఈ కథలో చూపినపుడు అనుభూతి ఐక్యత సిద్ధిస్తుంది. ప్రతీకగా ఎంచుకున్న జీవుల సహజ లక్షణాల్లోంచి కథని నడపడం వల్లనే అది సాధ్యపడింది.
‘కొండగెద్ద’ నాలుగు పేజీల చిన్న కథే గానీ ఉత్తరాంధ్ర గ్రామాల్లోని భూసంబంధాల్లో వచ్చిన మార్పులు, ప్రాజెక్టు నిర్మాణ దశల్లో ఉండే సవాలక్ష రాజకీయాలు, సామాన్యుడి తిరుగుబాటు కథని నడిపించాయి. వానలు కురవ్వు / వరి చేలు పండవు / మా అమ్మ వండదు / మా పొట్ట నిండదు / బడుగో బడుగో అంటూ రైతు పిల్లలు గుడిసెల్లో పాడుకునే పాటల ద్వారా వ్యవసాయ స్థితిగతుల్ని తెలియచెపుతారు చాసో. ‘‘గెద్ద నిండా ఇసుక చాళ్లలో తోకాడింపు పిట్టలు పరిగెడతాయి. పిగిలి పిట్టలు ఈల వేస్తాయి. ఆకాశంలో మేఘాలు లేస్తాయి. కొండంతా వర్షంతో నాని ముద్దవుతుంది. మా కొండవాగు ఉరకలు వేస్తూ నురగలు కక్కుతూ గట్లు కూల్చేస్తూ గడ్డి మేట్లు ఎత్తుకుపోతూ కదం తొక్కుతుంది...’’ అంటూ భౌగోళిక వనరుల్లో గొప్ప సౌందర్యాన్నీ సొగసునీ ఆవిష్కరిస్తూ ప్రేమతో గర్వంతో ఉప్పొంగిపోతూ ఎంతో ఎత్తుకి తీసుకువెళ్ళాక అక్కడ, ఆ వనరుల దోపిడి గురించి కొండవాగు ఉద్రేకంతో చెప్పారు చాసో.
ఆ తీవ్రతని అందుకోక తప్పని స్థితిలో పాఠకులు ఉక్కిరి బిక్కిరి అవుతుంటే తాను చేయిపట్టి కడకంటా నడిపించారు.
‘ఊహా ఊర్వశి’ కథ పట్టణ ప్రాంతాలకి కూడా ప్రత్యేకంగా ఉండే కొన్ని స్థానిక లక్షణాలను చెపుతుంది విశాఖపట్నం హార్బరు మీదా, వాల్తేరు విశ్వవిద్యాలయం మీద అరగంట హస్కుకొట్టే ప్లీడరుగారు స్థానిక పాత్రే... భావకవుల ఊహా ప్రేయసి మీద ఉత్తరాంధ్రకే ప్రత్యేకమయిన వ్యంగ్యపు విరుపుల్ని ప్రయోగించారు చాసో. ‘‘సంసారికి ఊర్వశి దరిద్ర దేవతా, దుఃఖ కారణమూ అవుతుంది. ఊహా ఊర్వశి మాత్రం రాజయోగాన్ని సిద్ధింపిస్తుంది. ఊహా ఊర్వశిని పట్టుకుని ‘చింబరేబో’ అగ్ని పర్వత శిఖరాంచలాలకి షికార్లు పోవచ్చు. ఆఫ్రికా ఎడారిలో బిదారి ప్రయాణం చేసి తోవలో నువ్వూ నీ ఊర్వశీ గుడారం వేసుకుని హుక్కా పీలుస్తూ లొట్టిపిట్ట పాలతో కాఫీ పెట్టుకోవచ్చు’’ అంటూ భావకవిత్వంలోని కాల్పనికత మీద తిరుగుబాటు చేశారు చాసో.
ఉత్తరాంధ్రలో వెలమలు ఒక ప్రత్యేక సామాజిక వర్గంగా తమదయిన చరిత్ర సంస్కృతిని కలిగి ఉన్నారు. చాసో రాసిన వెలంవెంకడు కథ వ్యవసాయ రంగంలో వెలమల స్థితిగతుల్ని ఒక చిన్న కుటుంబపు ఒడిదుడుకుల ద్వారా విశే్లషిస్తుంది. కథా శీర్షికలోనే ఒక సామాజిక వర్గాన్ని స్ఫురింపజేయడం శ్రమని నమ్ముకుని బతికే కులంగా ఎస్టాబ్లిష్ చేయడం కథకి స్థానిక గౌరవాన్ని తెచ్చిపెట్టాయి. ఈ కులాల నుంచి విద్యాధికులు తయారైన క్రమాన్ని చాసో బాగా పట్టుకోగలిగారు. వెలమ, కాపు కులాల యింటి వాళ్లని ‘నాయురాలు’ అనడం ఒక వాడుక. సూక్ష్మ పరిశీలన ఉన్న చాసో ఈ కథలో వెలం వెంకడి భార్యని ‘నాయురాలు’ అన్న పేరుతోనే వ్యవహరించారు. మాండలికాల్లోని భిన్న భేదాలని అనుసరించి ఈ కథలో వెలమ సామాజిక వర్గ మాండలికాన్ని వాడారు. ‘బబ్బబ్బా’ కథ చిన్న పిల్లల్లో ఉండే స్పర్థని అందంగా ఆవిష్కరిస్తుంది. పిల్లలు ఒకరినొకరు ఎగతాళి చేసుకోడానికి మందమీద వోరుపెట్టి ‘బబ్బబ్బా’ కొట్టడం దగ్గర్నుంచి పోటాపోటీగా వ్యవహరించే ప్రతి అంశంలోనూ పాఠకులు చిన్న పిల్లలై తమ చిన్ననాటి వైరాలను తవ్వి చూసుకుని ఆనాటి మనల్ని చూసుకుని ఈనాటి మనం నవ్వుకుంటాం.
స్థానికత - సార్వత్రికత రెండూ స్పష్టమయిన నిర్వచనాలకి అందేవి కావు. ప్రాంతాలని బట్టి కాలాన్ని బట్టి మారుతూ ఉంటాయి. 1980ల తర్వాత స్థల కాల నిబద్ధతల విషయంలో ప్రాంతీయవాదులు స్పష్టంగా ఉన్నారు. సాధారణీకరించదగిన సాహిత్య నిర్మాణ సూత్రాలపట్ల విమర్శనాత్మకంగా ఉంటున్నారు. విశ్వజనీనత, సార్వత్రికతల్ని తిరస్కరిస్తూ, వాటిని ఆదర్శ భావనలుగా పరిగణిస్తూ విశ్వం మొత్తానికీ ఒకే విధంగా వర్తించే విలువలు ఉండవని చెపుతున్నారు. ఈ అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుని మనకున్న గొప్ప సాహిత్యాన్ని రీవిజిట్ చేయడం ద్వారా మరిన్ని కొత్త విషయాలను వెలుగులోకి తెచ్చే అవకాశం ఉంది.