ఇందూర్, జనవరి 27: మహిళల అత్యాచార కేసుల పరీక్షలకు వైద్యాధికారులు వెంటనే హాజరై నివేదికలు అందించాలని జిల్లా కలెక్టర్ పిఎస్.ప్రద్యుమ్న ఆదేశించారు. సోమవారం ప్రభుత్వ ఆసుపత్రి సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ఆసుపత్రి అభివృద్ధి సొసైటీ సమీక్షా సమావేశానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహిళల సంరక్షణకు నిర్భయ చట్టం అమలులోకి వచ్చినందున, ఇందుకు సంబంధించిన కేసుల్లో అధికారులు మరింత శ్రద్ధతో పనిచేయాలని సూచించారు. మహిళలపై జరిగే అత్యాచారం, దాడులు, వేధింపులపై అటు పోలీసు అధికారులు, ఇటు వైద్యాధికారులు విధి నిర్వహణలో అప్రమత్తంగా మెలుగాలని ఆదేశించారు. నివేదికలు అందించడంలో ఎలాంటి జాప్యానికి తావివ్వవద్దని అన్నారు. ఆసుపత్రిలో పోలీసు హెల్ప్‌డెస్క్‌లో రిజిస్ట్రర్‌ను ఏర్పాటు చేసి, ఫిర్యాదుల నమోదుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సదరం క్యాంప్‌నకు హాజరయ్యే వికలాంగులకు అదేరోజు విధుల్లో డాక్టర్లు, సిబ్బంది ధ్రువపత్రాలు జారీ చేయాలన్నారు. వైద్య పరీక్షలు నిర్వహించి, జారీ చేయని సమారు 11 వేల ధ్రువపత్రాలను సంబంధిత వైద్యుల నుండి సంతకాలు సేకరించి, బాధితులకు అందేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ధ్రువపత్రాలు ప్రింట్ తీసేందుకు అవసరమైన 8 ప్రింటర్లను వెంటనే ఖరీదు చేసి ఇవ్వాలని ఐకెపి ప్రాజెక్టు డైరెక్టర్‌కు సూచించారు. ఈ సందర్భంగా పలు ఎజెండా అంశాలకు ఆమోదం తెలిపారు. 1.53 లక్షలతో విద్యుత్ పరికరాల కొనుగోలు, వాహనాల మరమ్మతులు, సదరం ఫారాలు, పుస్తకాలు, సిటీ స్కాన్ పరికారాలు కొనుగోలు చేయాలన్నారు. డెంగీ, చికున్ గున్యా పరికరాలను అందుబాటులో ఉంచేందుకు అవసరమైన ఫ్రీజ్ కొనుగోలుకు, డిఎంహెచ్‌ఓ ద్వారా 10 మంది నర్సుల బదిలీకి, ఏజెన్సీ ద్వారా సిబ్బంది నియామకానికి అనుమతి ఇచ్చారు. లాప్రోస్కోప్ సర్జరీకి 12 లక్షల రూపాయలతో అవసరమైన వస్తువులను కొనుగోలు చేయాలని, ఆర్థోపెడిక్ డిపార్ట్‌మెంట్‌లో సుమారు 3.05 లక్షల రూపాయలతో అవసరమైన పరికరాల కొనుగోలు ఆమోదం తెలిపారు. క్యాంటీన్, సైకిల్‌స్టాండ్ లీజ్‌కు ఇవ్వడానికి, సులభ్ సొసైటీకి 9.12 లక్షల రూపాయలు, శానిటేషన్ చార్జీల చెల్లింపునలకు, ఉద్యోగుల ఆరోగ్య పథకానికి ఫర్నిచర్, 10ఎయిర్ కండిషన్ల కొనుగోలుకు కమిటీ ఆమోదం తెలిపింది. ఈ సమావేశంలో డిఎంహెచ్‌ఓ గోవింద్ వాగ్మారే, డిసిహెచ్‌ఎస్ బాలకృష్ణారావు, ఇఇ జైపాల్‌రెడ్డి, ఐకెపి పిడి వెంకటేశం, ఆర్‌ఎంఒ శ్రావణ్‌కుమార్, సిఎస్‌ఎస్‌డిహెచ్ భీంసింగ్, ఆరోగ్యశ్రీ సమన్వయకర్త సుభాష్‌చంద్రరెడ్డి, వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.
వైద్యులకు కలెక్టర్ ప్రద్యుమ్న ఆదేశం
english title:
a
Date:
Tuesday, January 28, 2014