లీలం గేల నమర్చి మత్త గజ కేళీ సుందరోల్లాస మా
భీలత్వం బలరింప ఁ ద్రిప్పుఁ జదలం ; బృథీవస్థలిన్ వైచు; ముం
కాలం ద్రోచు ; మొగంబు వ్రేయు; దెస లుగ్రస్ఫూర్తి వీక్షించు; మోఁ
కాలూఁదుం బయఁ; గ్రమ్మఱంగ మెడ చిక్కంద్రొక్కి నిల్చున్; నగున్
భావం: భీమసేనుడపు విలాసంగా మదించిన ఏనుగు ఆడుకొంటు న్ప్పటి అందచందాలతో కూడిన విజృంభణ భయం గొల్పిపే విధంగా తనను పొంగ జేస్తుండగా దుశ్శాసనుణ్ణి చేతిలో చక్కగా అమర్చుకున్నాడు. మింటివైపు ఊపుతూ గిరగిరా త్రిప్పు తున్నాడు. నేల మీదకు విసిరి కొడుతున్నాడు. కాలితో తోస్తున్నాడు. మొగం మీద తంతున్నాడు. ప్రళయ కాల రుద్రునిలా దిక్కులు చూస్తున్నాడు.గుండె మీద మొకాలు పెట్టి నొక్కు తున్నాడు. మెడ వాలిపోయేట్టుగా చూస్తూ బలమంతా ఉపయోగించి త్రొక్కి నిలుస్తున్నాడు. వికటంగా అట్టహాసం చేస్తున్నాడు. పరాక్రమంలో మేటి ఐన భీమసేనునికి కురుక్షేత్ర సంగ్రామంలో దుశ్శాసనుడు చిక్కాడు. ఇక ఏముంది తన పంతం పట్టింపు గుర్తుకువచ్చి వారి దుష్టచేష్టలు మదిలో మెదిలి అతడాతనితో కసితీరా ఆడుకున్నాడు. దాన్ని తిక్కన అక్షరాలలో పొదిగారు.
మహాభారతములోని పద్యమిది ( కూర్పు శలాక రఘునాథశర్మ )