
‘‘సింధూ! నువ్వు చాలా అమాయకంగా మాట్లాడుతున్నావ్? మనమధ్య వున్నది ప్రేమ కాదు. వయసు తెచ్చిపెట్టే ఆకర్షణ మాత్రమే! ఈ సమయంలోనే మనం మనసుల్ని అధీనంలో వుంచుకోవాలి! అలా అయితే యుక్త వయస్సు వచ్చాక, మనం ఎంత పిచ్చిగా ఆలోచించామో అర్థమవుతుంది!’’ అన్నాడు అనునయంగా.
‘‘అంటే నాపట్ల నీకూ ఆకర్షణలాంటిది వున్నట్టేగా?’’ మెరుస్తున్న కళ్ళతో అంది సింధూర.
గతుక్కుమన్నాడతను.
‘‘నాకు తెలుసు. నువ్వూ నన్ను ప్రేమిస్తున్నావ్. మనమధ్య వున్న అంతరాలకి భయపడి బైటపెట్టడంలేదు.
చూడు చంద్రా! నాకే రాకుమారుడూ వద్దు. ఏ రాజ్యాలూ వద్దు! నువ్వుంటే చాలు! అడవులకైనా, ఎడారికైనా ఆనందంగా వస్తాను! నువ్వు ‘ఊ.. అను!’’ అంది అతని చెయ్యి పట్టుకుని.
‘‘నీకు పిచ్చెక్కింది!’’
‘‘అవును! అది నీ పిచ్చే!’’
‘‘బాబా లేరా ఇంట్లో?’’ మాట మార్చాడతను.
‘‘లేరు.. అందుకే ధైర్యం చేసి ఇలా వచ్చాను.’’
చంద్రా! బాబా నన్ను యువరాజుకిచ్చి చేసెయ్యాలని తెగ ఉబలాటపడుతున్నారు. చేసేస్తారు కూడా. అందుకే ఇంక మనం ఆలస్యం చెయ్యకూడదు.’’
‘‘అంటే!’’ కళ్లు చిట్లించాడు చంద్ర.
‘‘మనం ఈ రాత్రి ఎక్కడైనా పారిపోదాం! ఈ దేశానికి దూరంగా పారిపోయి పెళ్లి చేసుకుని హాయిగా బతుకుదాం! నా మాట కాదనకు!’’ అతని కళ్ళమీద పడి దీనంగా అంది సింధూర.
అతను కొయ్యబారిపోయాడు.
‘‘్ధర్మరాజులాంటి ఓ మహామంత్రి కడుపున పుట్టిన నువ్వు ఇంత హీనంగా ఆలోచిస్తున్నావా? అన్నం పెట్టిన చేతిని నరికెయ్యమంటావా? లేదు సింధూ! ఆ పాపం నేను చెయ్యలేను. క్షమించు’’ అన్నాడు ఆమెకు కాస్త దూరంగా జరిగి.
బుసలు కొడుతున్నట్టు చివ్వున లేచింది సింధూర.
‘‘అంతేనా?’’ అంది తీక్షణంగా.
‘‘అంతే!’’
‘‘అయితే తెల్లారేలోగా నా శవాన్ని చూస్తావ్!’’ బెదిరించింది సింధూర.
‘‘ఆత్మహత్య చేసుకుంటావా? అలాగే!... ఎప్పుడో చెప్పు! నేనూ నీతోపాటే వస్తాను. నా మూలంగా ఓ ప్రాణం పోతే నేను మాత్రం ఎలా బతికుండగలను?’’ అన్నాడు చంద్ర తాపీగా.
బిత్తరపోయింది సింధూర.
***
‘‘ఏవిటలా చూస్తావ్! నీ మాత్రం తెగింపు నాకు లేదనుకున్నావా?’’ ఆమె వౌనం చూశాక కాస్త ధైర్యం వచ్చింది చంద్రకి.
‘‘నీకు తెగింపు వుందా?’’
‘‘నీకన్నా ఎక్కువ తెగింపు, పట్టుదలా నాకున్నాయి!’’ గంభీరంగా అన్నాడు చంద్ర. సింధూర పక్కున నవ్వింది.
‘‘ఎందుకా నవ్వు?’’ చిరాగ్గా అన్నాడతను.
‘‘తెగింపు వుందంటేను!’’
‘‘అవును! నాకూ తెగింపు వుంది!’’
‘‘అయితే పద!’’
‘‘ఎక్కడికి?’’
‘‘ఎక్కడికైనా దూరంగా, ఎవరికీ కనిపించనంత దూరంగా వెళ్లిపోదాం. నీతో కలిసి అడవులకి, ఎడారికి ఎక్కడికి రమ్మన్నా వస్తాను. ఇద్దరం కలిసి హాయిగా బతుకుదాం. బతకలేకపోతే ఇద్దరం కలిసే చద్దాం!’’ ఒకలాంటి ఉద్వేగంగా అంది సింధూర.
‘‘మళ్ళీ మొదటికొచ్చావా?’’ తల బాదుకున్నాడు చంద్ర.
‘‘నేను ఎప్పుడూ మొదట్లోనే వున్నాను. నువ్వే, ముందుకి వెనక్కి డోలాయమానంగా ఆలోచిస్తున్నావ్!’’
‘‘సింధూ!’’
‘‘అవును. నేనంటే నీకిష్టమే. నా సాన్నిధ్యంలో వుండాలని నీకూ వుంది. కానీ నాకున్న చొరవ నీకు లేదు’’ రెచ్చగొడుతున్నట్టు అంది సింధూర.
‘‘నీకు పిచ్చి పట్టింది!’ కస్సుమన్నాడతను.
‘‘అది నీ పిచ్చే అని నేను చాలాసార్లు చెప్పాను!’’
‘‘అయితే ఇప్పుడేమంటావ్?’’
‘‘మనం ఏ అడవుల్లోకి పోయి, పెళ్లి చేసుకుని హాయిగా బతుకుదాం అంటున్నాను.’’
‘‘అసంభవం!’’
‘‘అయితే.. నా చావే చూడాలనుందన్నమాట!’’ అంతకన్నా మొండిగా అంది సింధూర.
అతని మొహం కఠినంగా అయిపోయింది.
ఆమె రెక్క పట్టుకుని- ‘‘పద!’’ అన్నాడు విసురుగా.
‘‘ఎక్కడికి! అడవికేనా!’’ ఉత్సాహంగా అంది సింధూర.
‘‘కాదు!’’
‘‘మరి? ఇంకేదేశమైనా పోదామా? పర్లేదు. ఈ దేశపు పొలిమేరలు దాటితే ఇంక మనకేం భయంలేదు. ఇద్దరం ఎలాగైనా బతికెయ్యచ్చు. ఊ... పద!’’ తొందరపెట్టింది సింధూర.
‘‘అడవికీ కాదు ఇంకో దేశానికీ కాదు. శివాలయపు కోనేటి దగ్గరికి!’’
‘‘అమ్మో! ఇంత రాత్రప్పుడు అక్కడికా? ఒకవేళ ధైర్యం చేసి వెళ్లినా తెల్లారేసరికి మనల్ని పట్టుకుని ఉరితీస్తారు.
‘‘తియ్యరు. ఎందుకంటే మనిద్దరం అక్కడ కోనేట్లో దూకి చస్తాంగా! అంతకన్నా మార్గంలేదు!’’ స్థిరంగా వుంది చంద్ర గొంతు.
‘‘చద్దామంటావ్! అంతే తప్ప నన్ను తీసికెళ్ళవన్నమాట!’’ రోషంగా అంది సింధూర.
పసిపిల్లలా అడుగుతున్న ఆమెని చూసి జాలేసిందతనికి
‘‘చూడు సింధూ! నువ్వు దూరంగా ఆలోచించడం లేదు. కుశాంక దేశపు సంబంధం గురించి చెప్పేటప్పుడు ఆయన మొహం ఎంత వెలిగిపోయిందో గమనించావా? ఓ పెద్ద చక్రవర్తికి వియ్యంకుణ్నవుతాననే గర్వం ఆయన మొహంలో కనిపించలేదూ?
నీకు చిన్నతనంలోనే మీ అమ్మగారు పోయారు. అయినా ఆయన పునర్వివాహం చేసుకోవడంగానీ, మరో స్ర్తివైపు కనె్నత్తి చూడలేదన్న సంగతి నీకు తెలుసు. తల్లి తండ్రి తానే అయి నిన్నింతదాన్ని చేశారు. నీమీదే ప్రాణాలు పెట్టుకుని జీవిస్తున్నారు. నిన్నో పెద్దింటి కోడలిగా చెయ్యాలని కలలు కంటున్నారు. నీమీది నమ్మకంతోనే ఆ చక్రవర్తి కుటుంబాన్ని ఆహ్వానించారు.
వాళ్ళు రేపొస్తారు. నువ్వు కనిపించవు.
అప్పుడాయన ఏమైపోతారు. ఆయన పరువు మర్యాదలేమవుతాయి! లోకమంతా ఆయన్ని వేలెత్తి చూపితే ఆయన భరించగలరా? ఆ వేదనతో ఆత్మహత్య అయినా చేసుకుంటారు. అవమానంతో గుండె ఆగిపోనైనా పోతారు.
అప్పుడు నువ్వు సుఖంగా ఉండగలవా? ఆనందంగా కాపురం చెయ్యగలవా?
- ఇంకా ఉంది