అపుడు దశగ్రీవుడు లంక చొచ్చి ఆనందంగా కాలం గడుపుతున్న సమయంలో- ఆ రాక్షసాధినాథుడి లంకానగరానికి అనిమిష బృందాలతో పద్మసంభవుడు పరమప్రియముతో విజయం చేశాడు.
బ్రహ్మదేవుడు ఇంద్రుణ్ణి విడిపించవచ్చుట
తమ్ములు, తనయులు, బంధువులు, తగు చనవరులు తన్ను ఇమ్ముగా కొలువ కొలువు తీర్చి వున్న రావణుడి సభకి బ్రహ్మ వచ్చాడు. రావణుడు బ్రహ్మదేవుణ్ణి ఆదరించాడు. పిమ్మట నలువ ‘‘రావణా! నీ అగ్రనందనుడి సంగర కౌశలము భావింపగా కడు విచిత్రం. ఈ అమేయ పరాక్రముడు నీకు సరిసాటియో, నీకన్నా అధికుడో, ఆ మేఘనాథుడు భుజళక్తిచే సంగ్రామ రంగంలో దేవేంద్రుడిని జయించాడు. అందువల్ల ఇటుమీద అతను ‘ఇంద్రజిత్తు’ అనే పేర జగములన్నింటా వినుతింపబడతాడు. అజేయుడై అజరామరకీర్తి పొంది పేరు ప్రతిష్ఠలు గడిస్తాడు. రావణా! నీ పుత్రుడితో కూడి అమరేంద్రుడిని గెలిచావు. అమరసేనని పారద్రోలావు. సురలోక సంపదలు, నరలోక సంపదలు, నాగలోక సంపదలు నీకు లభించాయి. నీ ప్రతిజ్ఞ చెల్లింది.
నన్ను వేడుకొని, నిన్ను వేడుకొన ఈ సభకు దేవతలు నా వెనుక చనుదెంచారు. ఈ సురలకి ప్రియంగా, వీరిని మన్నించి దేవేంద్రుడిని విడిచి మేలు పొందు’’ అని వాకొన్నాడు. అప్పుడు మేఘనాథుడు తన తండ్రి రావణుడు ఆలింప, ఇంద్రుడిని విడిచిపెట్టడానికి అమరత్వాన్ని అర్థించాడు. భూతలంతో అమరత్వం లేదు అని బ్రహ్మ చెప్పాడు.
అంత ఆ ఇంద్రజిత్తు ‘‘అనిలో పూర్ణాహుతి అయేవరకు వేల్చిన హోమాగ్ని వల్ల ఉత్తమ హయాలతో ఒక రథాన్ని ప్రసాదించు. ఆ సమయంలో అమరత్వం అనుగ్రహించు. ఒకవేళ హోమం తుదిముట్టకుంటే నాకు శస్త్ర సామగ్రి చెడి పరాజయాన్ని ఒసగు. దారుణమైన ఘోర తపస్సువల్ల అమరత్వం ఎవడూ పొందలేడు. ఈ అమరత్వం నాకు రణరంగంలో సిద్ధిస్తే నాకదే పదివేలు’’ అని మేఘనాథుడు వరం కోరాడు. ఆ వరం బ్రహ్మదేవుడు అతడికి ప్రసాదించాడు.
అనంతరం వేయి కన్నుల దొరవారిని విడిపించి పద్మసంభవుడు తన్ను కొల్చు దశగ్రీవుడికి అనుజ్ఞ ఒసగి, అనిమిషులతో లంకనుంచి బయల్వెడలి వచ్చాడు. పాపం! ఇంద్రుడు వాడిపోయిన, వాసనలు వీడిపోయిన పూలమాలలు, వదులువదులైన వలువ, లజ్జ్భారంవల్ల వినతమైన ముఖం- తన్ను పొందిన దుర్దశకి వలయునట్లు వున్న ఆ ఇంద్రుడిని కాంచి ‘‘దేవేంద్రా! చింతిస్తావెందుకు? నీ చేసిన పాప కర్మల అంతరంగంలో తలచుకో.
ఏ పాపమంటవా? నేను ప్రజలనందరినీ నవవయో రూపాదులు పొందాలో, ఏ జీవజంతువులే కర్మవలన ఏ యోని పడి మగ్నమవుతాయో అని నేను జీవుల్ని వీక్షించి, మనస్సులు పరీక్షింప మదిని విచారించి ఎడపాదడపా నిర్మించి, అందరూ ఒక్క రూపుతోనే తోచగా మిక్కిలీ చింతించాను. అరసిచూడగా సతి కోర్కె తీర్చకతీరదని ఎరిగాను.
అనంతరం మనోహరిణి అయిన తరుణిని సృజింప మదిగోరి, నేనొక్క మానినీమణిని ఒప్పుల కుప్పగా అందరికన్న సౌందర్యంతో మెరయ నవనవమైన నైపుణ్యం వరల ఒక శుభగంగిని నిర్మించి చూద్దాం’’ అని ఎంచి అహల్య అనే అత్యంత రూపవతిని నిర్మించాను. ఏకాంతంగా ఆ యింతిని సృజించి ఈ కాంతని ఏ కాంతుడికి ఇవ్వాలి? ఈ కాంతకి తగు వరుడు ఎవడో అని అనుకొంటూ మదిలో ఎంతగానో ఆలోచించాను. ఆ ఇంతిని కనుగొని అఖిల దిక్పాలురు, అమరులు కోరుకొని ఏతెంచి ఈ కాంతని భార్యగా ఒసగమని కోరారు.
ఆ విధంగా దేవతలు అర్థింపగా వారికి ఒసగక, నువ్వు అపేక్షింపగా నీకూ ఇవ్వక, పవిత్ర చరిత్రుడైన గౌతముడి చెంతకి ఆ పరమ కల్యాణశీలని ప్రీతితో కొంపోయి పెక్కేండ్లు అక్కడ వుంచనిచ్చాను. ఎన్ని ఏండ్లయినా ఆ ఘనుడి చిత్తంలో కామ వికారం పుట్టలేదు. అతడు జితేంద్రియుడని గ్రహించి, ఆతని తపోమహిమకి ఆత్మ మెచ్చి, ఆ కాంతని అతనికి ఒసగాను. అపుడు గౌతముడు ఆమెని అనురాగంతో పత్నిగా చేపట్టాడు. ఆమె యందు అనురక్తితో వున్నాడు.
-ఇంకాఉంది
అపుడు దశగ్రీవుడు లంక చొచ్చి ఆనందంగా కాలం గడుపుతున్న
english title:
ranganatha ramayanam
Date:
Tuesday, January 28, 2014