బూపాలపల్లి, జనవరి 28: తీర్థయాత్రలకు వెళ్లి తిరిగి వస్తూ మంగళవారం తెల్లవారు ఝామున కరీంనగర్ జిల్లా మేడిపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో జిల్లాలోని భూపాలపల్లికి చెందిన ఆరుమాసాల పాపతో పాటు మరో ముగ్గురు మృత్యువాత పడడంతో కోల్‌బెల్ట్ ప్రాంతంలో విషాదం నెలకొంది. పట్టణంలోని సాయిశ్రీ రెడీమేడ్ షోరూం, సాయి మణికంఠ ఎలక్ట్రానిక్ షాపును నడిపే గోనె సురేష్, మహేందర్, సంజీవు సొంత వాహనంలో షిర్డీ వెళ్లారు. తిరిగి వస్తున్న క్రమంలో 63వ జాతీయ రహదారి మేడిపెల్లి వద్ద చెట్టును ఢీకొనగా గోనె వీరయ్య (60), సరోజన (54), అనూష (24), ఆరు మాసాల నిష్యు అక్కడికక్కడే చనిపోయారు. వాహనంలో ప్రయాణిస్తున్న మిగతా 10మంది గాయపడ్డారు. ఉమ్మడి కుటుంబానికి చెందిన వారు దైవ దర్శనానికి వెళ్లి వచ్చే క్రమంలో ప్రమాదం జరిగి మృత్యువాత పడడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఈ వార్త తెలుసుకున్న పలువురు పట్టణంలోని వారి దుకాణాల వద్దకు పరుగులు తీశారు. బంధువులు సంఘటాస్థలానికి తరలి వెళ్లారు.
కొమాల లోతు వాగు వద్ద ఇద్దరు మృతి
రఘునాథ్‌పల్లి: వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారిపై మండలంలోని కోమాల లోతు వాగు సమీపంలో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. పోలీసుల కథనం ప్రకారం ఎపి 36ఎపి 6309 నెంబర్ గల టివి ఎస్ స్పోర్ట్ మోటారుసైకిల్‌పై వెళుతున్న చెటుకూరి కుమారస్వామి (25), మధు (22)ను గుర్తుతెలియని వాహనం ఢీకొంది. ఈ సంఘటనలో మోటారుసైకిల్‌పై వెళ్తున్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మృతుల వద్ద లభించిన గుర్తింపు కార్డుల ప్రకారం వరంగల్ మీరసాబ్‌కుంటలోని మెడికేర్ ఆసుపత్రి దగ్గరలో బిఆర్ నగర్, కరీమాబాద్‌లకు చెందిన వారుగా గుర్తించారు. జనగామ నుండి వరంగల్ వైపు వెళ్తున్న గుర్తుతెలియని వాహనం వరంగల్ నుండి జనగామ వైపు వెళ్తున్న మోటారుసైకిల్ ఎదురెదురుగా ఢీకొన్నట్లు సంఘటన స్థలం వద్ద పరిస్థితులను బట్టి తెలుస్తోంది. స్థానిక ఎస్సై వై.సత్యనారాయణ సంఘటన స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా సత్వర చర్యలు తీసుకుని మృతదేహాలను జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించారు.
బైక్ అదుపుతప్పి...
తొర్రూరు: బైక్ అదుపుతప్పి ఆకేరువాగులో పడి ఒకరు మృతిచెందారు. తొర్రూరు ఎస్సై కరుణాకర్‌రావు కథనం ప్రకారం తొర్రూరు మండలం మడిపెల్లి గ్రామానికి చెందిన కినె్నర గంగారాం (33) గత కొన్ని సంవత్సరాలుగా తొర్రూరులో నివాసం ఉంటున్నాడు. మంగళవారం తన దగ్గరి బంధువు రెబెల్లి విష్ణుతో కలసి నెల్లికుదురు మండలం నైనాల గ్రామానికి వెళ్లి వస్తుండగా సాయంత్రం ఆకేరువాగు బ్రిడ్జిపై నుండి బైక్ అదుపుతప్పి వాగులో పడిపోయారు. విష్ణు వెంటనే తెరుకుని పరుగెత్తుకుంటూ వచ్చి విషయం బంధువులకు, పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు, బంధువులు ఆకేరువాగు వద్దకు వెళ్లి చూడగా వాగులో పడిన గంగాధర్ మృతదేహం కనిపించింది. మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టమ్ నిమిత్తం మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు.
ఏ మండలంలోని ఇసుక ఆ మండలంలోనే వినియోగం
* ప్రభుత్వ పథకాలకు నిబంధనలు సడలింపు
* కలెక్టర్ కిషన్ వెల్లడి
వరంగల్, జనవరి 28: జిల్లాలోని ఆయా మండలాల్లో ఉన్న ప్రైవేటు ఇసుక క్వారీల నుంచి తీసే ఇసుకను సంబంధిత మండలాల్లోనే ఉపయోగించవలసి ఉంటుందని కలెక్టర్ జి.కిషన్ తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో ఉన్న ఇసుక క్వారీలను గిరిజన సంఘాలకే అప్పగిస్తామని చెప్పారు. ఇసుక అక్రమ రవాణాను అరికట్టడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో నదులు, వాగుల ద్వారా ఇసుక తీయడానికి అనుమతులపై విధివిధానాలు నిర్ణయించడానికి మంగళవారం కలెక్టర్ అధ్యక్షతన రెవెన్యూ, పోలీసు, భూగర్భ జలాలు, మైనింగ్ తదితర అధికారులతో సమావేశం జరిగింది. జిల్లా రూరల్ ఎస్పీ కాళిదాసు, జాయింట్ కలెక్టర్ పౌసమిబసు పాల్గొన్నారు. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పట్ట్భాముల్లో ఉన్న ఇసుక తవ్వకాలకు అనుమతి కోసం తిరిగి దరఖాస్తులు చేసుకోవాలని తెలిపారు. పట్ట్భాముల్లో ఇసుక తీయడానికి గతంలో 154 జిఓను అనుసరించి దరఖాస్తులు చేశారని, అయితే జిఓ 186 ప్రకారం నిబంధనను అనుసరించి తిరిగి కొత్తగా దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. ప్రభుత్వ పథకాలకు జిల్లాలో ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతానికైనా ఇసుక తీసుకు వెళ్లవచ్చని తెలిపారు. మండలస్థాయిలో తహశీల్దార్, నీటిపారుదల శాఖ ఎఇ, మండల వ్యవసాయ అధికారి, సర్వేయర్, ఎండిఓ సభ్యులుగా ఉన్న కమిటీ ఇసుక రీచ్‌ల కేటాయింపులను ప్రతిపాదిస్తారని చెప్పారు. రూరల్ ఎస్పీ కాళిదాసు రంగారావు మాట్లాడుతూ జిల్లాలో ఇసుక అక్రమ రవాణా జరుగుతోందని, దీంతో పర్యావరణ సమతూల్యత దెబ్బతినే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. నర్సింహులపేట మండలంలో వాగు నుండి ఇసుక అక్రమ రవాణాకు ఖమ్మం నుండి కూడా లారీలు, ట్రాక్టర్లు వస్తున్నాయని అన్నారు. ఇసుక మాఫియా అనేది సమాజానికి కొత్త బెడదగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. జాయింట్ కలెక్టర్ పౌసమిబసు మాట్లాడుతూ గోదావరి ఇసుక తవ్వకాలకు అనుమతి లభించిందని, ఎస్‌ఎస్‌ఆర్ రేటర్లకు అదనంగా 20శాతం ధరను నిర్ణయించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో జిల్లాపరిషత్ సిఇఓ ఆంజనేయులు, డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్ హైమావతి, ఆర్డీఓలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
ఉద్యానవన పంటల ద్వారా ఆదాయం పెంచుకోవాలి
* జెసి పౌసమిబసు సూచన
వరంగల్, జనవరి 28: సమిష్టి వ్యవసాయ సహకార సంఘాలు ఉద్యానవన పంటలైన పూలు, పండ్లు, ప్రాసెసింగ్ ఉత్పత్తుల ద్వారా ఆదాయం పెంచుకోవాలని జాయింట్ కలెక్టర్ పౌసమిబసు సూచించారు. మంగళవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో సమిష్టి వ్యవసాయ సహకార సంఘాలు- అభివృద్ధి అనే అంశంపై జరిగిన సమావేశంలో జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ సమిష్టి వ్యవసాయ సహకార సంఘాల సభ్యులకు రెవెన్యూ సదస్సులలో పట్టాదారు పాస్‌పుస్తకాలు ఇస్తామని, వ్యవసాయ భూముల లేవలింగ్, నీటి వసతులు కల్పిస్తామని అన్నారు. సమిష్టి వ్యవసాయ సహకార సంఘాల భూములు సర్వే చేయించి సమగ్ర నివేదిక రూపొందించడం ద్వారా భూముల అభివృద్ధికి తోడ్పడతామని చెప్పారు. సమిష్టి వ్యవసాయ సహకార సంఘాల సభ్యులకు ప్రభుత్వం అసైన్డ్భూములు కేటాయించిందని, ఈ భూములను అన్యాక్రాంతం చేస్తే పిఓటి ఆక్ట్ కింద బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ ఎస్.విజయ్‌గోపాల్ మాట్లాడుతూ సమిష్టి వ్యవసాయ సహకార సంఘాల భూములను గ్రామీణాభివృద్ధి పథకాల ద్వారా అభివృద్ధిపరుస్తామని, అందుకు భాగంగా అన్ని భూములను సర్వే చేయడం ద్వారా పథకాలను వర్తింపచేస్తామని తెలిపారు. డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్ హైమావతి మాట్లాడుతూ ఇందిర జలప్రభ ద్వారా సమిష్టి వ్యవసాయ సహకార సంఘాలకు సాగునీటి సౌకర్యాల కల్పిస్తామని చెప్పారు. జిల్లా సహకార అధికారి బి.సంజీవరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో 51 సమిష్టి వ్యవసాయ సహకార సంఘాలు ఉన్నాయని, వీటిలో 4500మంది సభ్యులకు 9892ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించిందని చెప్పారు. 15రోజుల్లో డివిజన్‌స్థాయి సదస్సులు ఏర్పాటు చేసి అన్ని సంఘాలకు ఎన్‌ఆర్‌ఇజిఎస్, ఎపిఎంఐపి ద్వారా వౌళిక వసతులు, సాగునీటి సౌకర్యాల కల్పనకు ఆర్థిక సహాయం అందజేస్తారని తెలిపారు. జిల్లా సహకార బ్యాంకు జనరల్ మేనేజర్ సురేందర్ మాట్లాడుతూ ఈ సంఘాల సభ్యులను జాయింట్ లయబిలిటి గ్రూపులుగా ఏర్పాటు చేసి అన్ని సంఘాలకు ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పారు. ఈ సదస్సులో జిల్లా ఆడిట్ అధికారి కరుణాకర్, ములుగు, మహబూబాబాద్ డివిజనల్ సహకార అధికారులు పూల్‌సింగ్, నాగమణి, సంఘాల అధ్యక్షులు, డైరెక్టర్లు పాల్గొన్నారు.