మహబూబ్‌నగర్, జనవరి 28: తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి మహబూబ్‌నగర్ జిల్లా ఆ పార్టీకి కంచుకోటగా ఉంటూ వచ్చింది. ప్రజలు కూడా తెలుగుదేశం పార్టీకి అండగా నిలుస్తూ రాష్ట్రంలోనే జిల్లాలో అధికంగా ఎమ్మెల్యేలను గెలిపించిన చరిత్ర కూడా ఉంది. అయితే ఎన్నడు లేని విధంగా ప్రస్తుతం ఆ పార్టీ మూడడుగులు ముందుకు, ఏడడుగులు వెనక్కి అన్న చందంగా కొట్టుమిట్టాడుతోందని చెప్పవచ్చు. కొందరు సీనియర్ నాయకులు పార్టీని వీడడంతో తీవ్ర నష్టమే జరిగిందని చెప్పవచ్చు. ప్రస్తుతం జిల్లాలో తెలుగుదేశం పార్టీ క్యాడర్‌ను నియోజకవర్గాల వారిగా ఒక తాటిపై నడిపించే జిల్లాకు చెందిన బడా నాయకుడు లేకపోవడంతో కొందరు ఎమ్మెల్యేలు భవిష్యతు ఎన్నికలు తమకు సవాలేనని బహిరంగంగా చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం జిల్లాలో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్నప్పటికీ ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. ఇద్దరు, ముగ్గురు ఎమ్మెల్యేలు కార్యకర్తలకు దూరమయ్యారనే ప్రచారం కూడా ఊపందుకుంది. జిల్లాలో కొడంగల్, నారాయణపేట, మక్తల్, దేవరకద్ర, వనపర్తి, అచ్చంపేట, కల్వకుర్తి, జడ్చర్ల నియోజకవర్గాలలో టిడిపి ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అయితే తెలంగాణ ఉద్యమం జిల్లా టిడిపికి షాక్‌ను ఇచ్చిందని చెప్పవచ్చు. కొందరు టిడిపి ఎమ్మెల్యేలు సైతం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తమ వాణిని బలంగా వినిపిస్తున్నప్పటికినీ రాష్ట్ర రాజకీయాలు, రాష్ట్ర స్థాయిలో జరుగుతున్న పరిణామాలు జిల్లా టిడిపి ఎమ్మెల్యేలపై ప్రభావం పడుతుండటంతో భవిష్యత్తు రాజకీయాలు ఎలా ఉంటాయోనని మల్లగుల్లాలు పడుతున్నారు. ఒకపక్క రాజకీయ ఎత్తుగడలు వేస్తూ మరోపక్క నియోజకవర్గంలో కింది స్థాయి నాయకులు, కార్యకర్తలు చేజారకుండా కాపాడుకునే పనిలో కూడా పడ్డారు. కొల్లాపూర్, అలంపూర్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గాలలో కొంత నాయకత్వ లోపం కనబడుతుంది. ఆయా నియోజకవర్గాలలో కింది స్థాయి కార్యకర్తలు డైలమాలో పడ్డారు. అదేవిధంగా నారాయణపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎల్లారెడ్డి, మరో నాయకుడు రాజేందర్‌రెడ్డి మధ్య గ్రూపు కుంపట్లు మొదలైనట్లు స్పష్టంగా కనబడుతున్నాయి. గద్వాలలో మాజీ మంత్రి డికె సమరసింహారెడ్డి టిడిపిలోకి వచ్చాక ఆ నియోజకవర్గంలో పాదయాత్ర ప్రారంభించడంతో తెలుగు తమ్ముళ్లకు కొంత ఉపశమనం లభించిందని చెప్పవచ్చు. భవిష్యత్తు ఎన్నికలు ఎలా ఉన్నప్పటికినీ ఒక నాయకుడు అండగా ఉండటంతో కింది స్థాయి కార్యకర్తలకు భరోసా దక్కినట్లు చెప్పవచ్చు. కాగా 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఒకవేళ బిజెపితో పొత్తుంటే తప్పనిసరిగా 7-8 అసెంబ్లీ స్థానాలు, ఒక పార్లమెంట్ స్థానాన్ని వదులుకోక తప్పదని ఆ పార్టీ సీనియర్ నాయకులే బహిరంగంగా చెబుతున్నారు. అయితే 2014 ఎన్నికల్లోపు రాష్ట్రం విడిపోతే జరిగే రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయోనని టిడిపి ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ప్రచారంలో బిజెపితో పొత్తు దాదాపుగా ఖరారు అయిందనే విషయాన్ని ఆ పార్టీ కింది స్థాయి కార్యకర్తలు కూడా భావిస్తుండటం, దాంతో ఎన్నికల సమయంలో ఎలా జరుగుతుందోనని గ్రామ స్థాయి నాయకులు సైతం ఆందోళన చెందుతున్నారు. అయితే పరిస్థితులు ఎలా ఉన్నప్పటికినీ టిడిపి ఎమ్మెల్యేలు మాత్రం డైలమాలో పడ్డట్లుగా కనబడుతుంది. పార్టీ క్యాడర్‌ను కాపాడుకుంటూనే ముందుకు వెళ్లాలనే భావనతో టిడిపి ఎమ్మెల్యేలు ఉన్నట్లు తెలుస్తుంది.
* భవిష్యత్తు రాజకీయాలపై మల్లగుల్లాలు * క్యాడర్‌ను కాపాడుకునేందుకు తర్జనభర్జన * పలు నియోజకవర్గాల్లో నాయకత్వ లోపం * అయోమయంలో కార్యకర్తలు
english title:
dilema
Date:
Wednesday, January 29, 2014