దౌల్తాబాద్, జనవరి 28: రైతులు ఉమ్మడి సైద్యంతో వ్యవసాయం చేస్తే అధిక లాభాలు పొందవచ్చునని జిల్లా కలెక్టర్ గిరిజాశంకర్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంతో పాటు మండల పరిధిలోని చెల్లాపూర్, తిమ్మారెడ్డిపల్లి, బాలంపేట, గోకఫస్లాబాద్ గ్రామాలలో కలెక్టర్ పర్యటించారు. ఉపాధిహామీ, వాసన్ సంస్థ, వాటర్‌షెడ్ పథకాలలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. చెల్లాపూర్ గ్రామంలో ఐదుగురు రైతులు కలిసి 24 ఎకరాలలో చేపట్టిన ఉమ్మడి వ్యవసాయాన్ని చూసి కలెక్టర్ పరిశీలించారు. ఉమ్మడి వ్యవసాయం గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. మండలంలోని అన్ని గ్రామాల రైతులు ఉమ్మడి సేద్యం చేసేలా అవగాహన కల్పించాలని అన్నారు. కాగా మండల కేంద్రంలో ఉన్న వైశ్య బ్యాంకు అధికారులు రుణాలు ఇవ్వడం లేదని రైతులు, మహిళా సంఘాల సభ్యులు కలెక్టర్ గిరిజాశంకర్‌తో మొరపెట్టుకున్నారు. బ్యాంకు సౌకర్యం సరిగా లేకపోవడంతో ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీలు తమకు అందడం లేదని వారు వాపోయారు. బుడగజంగ కులస్థులు తమకు ఇళ్ల స్థలాలు కేటాయించి ఇందిరమ్మ పథకంలో ఇళ్లు నిర్మించి ఇవ్వాలని కోరారు. ఇందుకు కలెక్టర్ స్పందిస్తూ అర్హులైన వారికి ఇళ్ల స్థలాలతో పాటు ఇళ్లు నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని తహశీల్దార్ వెంకటయ్యను ఆదేశించారు. అనంతరం దౌల్తాబాద్‌లో సునందిని దూడల అభివృద్ధి పథకాన్ని కలెక్టర్ ప్రారంభించారు. తిమ్మారెడ్డిపల్లి గ్రామంలో వాసన్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విత్తన బ్యాంకును పరిశీలించి రైతులను పలు విషయాల గురించి అడిగి తెలుసుకున్నారు. అంగన్‌వాడీ కేంద్రాన్ని కూడా కలెక్టర్ తనిఖీ చేశారు. అనంతరం గోకఫస్లాబాద్ గ్రామంలో ఏర్పాటు చేసిన జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహాన్ని కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ గిరిజాశంకర్ మాట్లాడుతూ మహాత్ముడు కలలు కన్న గ్రామస్వరాజ్యం కోసం మనమంతా అభివృద్ధి పథంలో పయనించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌డిఎ పిడి చంద్రశేఖర్‌రెడ్డి, జెడ్పీ సిఇఓ రవీందర్, వాటర్‌షెడ్ ఎపిడి హుస్సేన్‌బాబు, ఉద్యానవన పథకం సంచాలకులు సోమిరెడ్డి, తహశీల్దార్ వెంకటయ్య, ఎంపిడిఓ వెంకటమ్మ, హౌజింగ్ ఎఇ బాలయ్య, ఆర్‌డబ్ల్యుఎస్ ఎఇ వెంకటేష్, ఐకెపి ఎపిఎం అంజిలయ్య, సర్పంచ్‌లు పార్వతమ్మ, విజయ్‌కుమార్, నర్సప్ప పాల్గొన్నారు.
* కలెక్టర్ గిరిజాశంకర్
english title:
girija shankar
Date:
Wednesday, January 29, 2014