సంగారెడ్డి,జనవరి 28: వచ్చే ఎన్నికల్లో లక్ష మెజార్జీతో గెలిపిస్తే మియాపూర్ నుంచి సంగారెడ్డిలోని శిల్పారామం వరకు మెట్రోరైల్ ప్రాజెక్టును సాధిస్తానని ప్రభుత్వ విప్ తూర్పు జయప్రకాష్‌రెడ్డి తెలిపారు. మంగళవారం స్థానిక ఐబిలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలు ఆదరించి లక్ష మేజార్టీ ఓట్లతో గెలిపిస్తే ఢిల్లీస్థాయిలో లాబీయంగ్ జరిపి మెట్రోలైన్ సాధించడం సులభమవుతుందన్నారు. మెట్రోరైల్ ప్రాజెక్టు కావాలంటే కోట్ల రూపాయలు అవసరమవుతాయి కాబట్టి మేజార్టీ ఎక్కువ వచ్చిన వాడికే విలువ ఉంటుందన్నారు. పాదయాత్రలు, ధర్నాలతో మెట్రోరైల్ లైన్ రాదని, అది జగ్గారెడ్డి వల్లే సాధ్యమవుతుందని తెలిపారు. మనస్సులో ఏది అనుకుంటే అది నెరవేర్చేవరకు వదలనన్నారు. వచ్చే ఎన్నికల్లో తప్పకుండా గెలుస్తానని, కానీ లక్ష మేజార్జి సాధించేందుకు నియోజకవర్గ ప్రజలు తనను ఆదరించాలని కోరారు. పునాది ప్రజల దగ్గరనే ఉందని, ప్రోత్సాహం ఇవ్వాలని, ప్రజల ఆశీర్వాదంతో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. మియాపూర్ నుంచి సంగారెడ్డిలోని శిల్పరామం వరకు ఇచ్చిన మాట ప్రకారం తప్పకుండా మెట్రోలైన్‌ను సాధించే వరకు విశ్రమించనని తెలిపారు. జగ్గారెడ్డి మాటమీద నిలబడే మనిషని నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసని, తాను చేసే పనులు ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉంటాయే తప్ప పదవుల కోసం కాదన్నారు. సమావేశంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ తోపాజి అనంతకిషన్, కాంగ్రెస్ నాయకులు బొంగుల రవి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రామకృష్ణరెడ్డి, పట్టణ అధ్యక్షుడు షేక్ సాబేర్, మందుల సుదర్శన్, టిజెఆర్ యువసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు.
* పాదయాత్రలు, ధర్నాలతో మెట్రోలైన్ రాదు * ప్రభుత్వ విప్ జగ్గారెడ్డి
english title:
jagga reddy
Date:
Wednesday, January 29, 2014