సంగారెడ్డి,జనవరి 28: ఫిబ్రవరి 2న జరిగే విఆర్‌ఓ,విఆర్‌ఏ పరీక్షలను పకడ్బంధీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ స్మితా సభర్వాల్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో చీఫ్ సూపరింటెండెంట్లు,సహాయ చీఫ్ సూపరింటెండెంట్లు,లైజన్ ఆఫీసర్లు, సహాయ లైజన్ ఆఫీసర్లతో అవగాహాన సదస్సు నిర్వహించారు.ఈ సదస్సులో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విఆర్‌ఓ,విఆర్‌ఏ పరీక్షలను పకడ్బంధీగా నిర్వహించాలని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండ ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పరీక్షా కేంద్రాలలో అవసరమైన వసతులు సమకూర్చి పరీక్షార్థులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండ చూడాలన్నారు. పరీక్ష చివరి 30,40నిమిషాలలో కొంత మంది ఇబ్బందులు కలగ జేయడానికి ప్రయత్నిస్తారని, ఎవరినీ పరీక్షా సమయం పూర్తయ్యేంత వరకు గదుల నుండి బయటకు పంపకూడదన్నారు. ప్రతి 24మంది పరీక్షార్థులకు ఒక ఇన్విజ్‌లెటర్‌ను నియమించాలని, పరీక్షార్థుల సిట్టింగ్ ఆరైంజ్‌మెంట్ ప్లాన్‌ను పరీక్షా కేంద్రం గేటు బయట, గేటు లోపలి భాగంలో అతికించాలని సూచించారు. పరీక్షార్థులు పరీక్ష గదిలోకి వెళ్లగానే హాల్‌టిక్కెట్ పై ఉన్న ఫోటో, రూల్ నంబర్, నామినల్ రూల్‌లో ఉన్న పరీక్షార్థి సంతకం సరి చూసుకొని పరీక్షార్థి సంతకం,వేలి ముద్రలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పరీక్ష రాసే పరీక్షార్థులు హాల్‌టిక్కెట్, బాల్ పాయింట్ పెన్ను, పరీక్షా అట్ట వెంట తీసుకొని రావాలని, ఇతర వస్తువులు తెచ్చిన యేడల పరీక్ష గదిలోకి అనుమతించవద్దని ఆమె అధికారులను ఆదేశించారు.పరీక్ష గది, ఇన్విజ్‌లెటర్, పరీక్షా కేంద్ర పరిసర ప్రాంతాలను వీడియోగ్రాఫీ తీయించాలని అధికారులను ఆదేశించారు.ఎవ్వరైన పరీక్షార్థి రాసేటప్పుడు ఆనారోగ్యానికి గురైతే వెంటనే సిబ్బందితో ఆసుపత్రికి పంపించి చికిత్సలు చేయించాలని సూచించారు.జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ మాట్లాడుతూ పరీక్ష రాసే అభ్యర్థుల సౌకర్యార్థం ఈ నెల 30నుండి ప్రయాణికుల ప్రాంగణంలో విఆర్‌ఓ,విఆర్‌ఏ పరీక్షా కేంద్రాలు, రూట్ మ్యాప్‌లు ప్రదర్శించడం జరుగుతుందని తెలిపారు. అభ్యర్థులు ఒక రోజు ముందుగానే తమ పరీక్ష కేంద్రాలను చూసుకొని వెళ్లాలని సూచించారు. చీఫ్ సూపరింటెండెంట్లు పరీక్షల నిర్వహణకు అప్రమత్తంగా ఉండి సజవుగా జరిగేట్లు చూడాలని ఆదేశించారు.ఎంత మంది పరీక్షకు హాజరైతే అన్ని జవాబు పత్రాలు అభ్యర్థుల నుండి తిరిగి తీసుకున్నారో లేదో సరిచూసుకున్న తదుపరి అభ్యర్థులను గది నుండి బయటకు పంపించాలని ఆదేశించారు. పరీక్ష పూర్తయిన ఆరు కవరులను సరి చూసుకొని ఏ కవరులో ప్యాక్ చేయాల్సినవి ఆ కవరులో ప్యాక్ చేసి సంబంధిత అధికారులకు అందజేయాలని సూచించారు. ఇన్విజ్‌లెటర్లు 30నిమిషాల ముందే పరీక్ష గదులకు చేసుకొని, పరీక్ష సమయానికి 5నిమిషాల ముందు అభ్యర్థుల ముందు ప్రశ్న పత్రాల షీల్ విప్పి ఎబిసిడి ప్రకారం అభ్యర్థులకు అందజేయాలన్నారు.ఈ సదస్సులో జిల్లా రెవెన్యూ అధికారి సాయిలు, సంగారెడ్డి,మెదక్,సిద్ధిపేట రెవెన్యూ డివిజనల్ అధికారులు ధర్మారావు, వనజాదేవి, ముత్యంరెడ్డి, ఎపిపిఎస్‌సి నుండి వచ్చిన ప్రతినిధులు, కలెక్టరేట్ పరిపాలనాధికారి శివకుమార్ పాల్గొన్నారు.
కొండపోచమ్మ క్షేత్రంలో భక్తజన కోలాహలం
జగదేవ్‌పూర్, జనవరి 28: తెలంగాణ జిల్లాల్లో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న తీగుల్‌నర్సాపూర్ శ్రీ కొండపోచమ్మ క్షేత్రం మంగళవారం భక్తులతో కోలాహలంగా మారింది. వరంగల్ జిల్లా చేర్యాల మండలం కొమురవెల్లి శ్రీమల్లికార్జున స్వామిని దర్శించుకున్న వారు శ్రీ కొండ పోచమ్మను దర్శించుకోవడం అనవాయితీగా వస్తుండడంతో భక్తుల రద్ధీ విపరీతంగా పెరిగింది. జిల్లాలోని వివిధ ప్రాంతాలతోపాటు నల్గొండ, రంగారెడ్డి, హైద్రాబాద్, సికింద్రాబాద్‌ల నుండి భక్తులు, పర్యాటకులు విశేష సంఖ్యలో తరలివస్తుండడంతోపాటు మొక్కులు చెల్లించుకునేందుకు పవిత్ర స్నానాలు ఆచరించి తెల్లవారుజామునుండే అమ్మవారి దర్శనం కోసం బారులు తీరారు. అలాగే శివశత్తుల శిగాలూగుతు వెంట రాగా, మహిళలు ఊరేగింపుగా తరలిరావడంతో ఆలయ పరిసర ప్రాంతాలు జన సంద్రంగా మారింది. కాగా 2వ మంగళవారం కావడంతో ఉత్సవాలకు క్షేత్ర నిర్వాహకులు ముందస్తు ఏర్పాట్లు చేయగా, సమీప కొండలు అమ్మవారి నామస్మరణతో మార్మోగాయి. ముఖ్యంగా భక్తుల రద్ధీని అసరా చేసుకున్న వ్యాపారులు నిత్యావసర వస్తువుల ధరలు కొండెక్కించ డంతోపాటు కల్తీ మధ్యం ఏరులై పారుతోంది. ఆలయ ప్రాంగణంలోనే మధ్యం విక్రయాలు జరుగుతుండడంతో భక్తుల నుండి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది.
ధర్మరక్షణ కరువు
* హైందవ క్షేత్రాలపై పెరుగుతున్న దాడులు
* సేవ ముసుగులో హిందూయేతరుల అరాచకం
* బిజెపి, బజరంగ్‌దళ్ నేతల ఆగ్రహం
గజ్వేల్, జనవరి 28: యూపిఎ పాలనలో హిందూ ధర్మంపై దాడులు మితి మీరగా, పుణ్యక్షేత్రాలకు రక్షణ కరువైనట్లు బిజెపి జాతీయ కౌన్సిల్ సభ్యులు డాక్టర్ నరేష్‌బాబు, బజరంగ్‌దళ్ జిల్లా ప్రముఖ్ శ్రీరాం సంగ మేశ్వర్, కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎల్లురాంరెడ్డి, బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పేర్ల శ్రీనివాస్‌లు విమర్శించారు. మంగళవారం గజ్వేల్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడారు. సేవ ముసుగులో హిందూ యేతరులపై అరాచకానికి పాల్పడుతుండగా, మత మార్పిడీలు ప్రోత్సహిస్తూ తీరనిద్రోహం తలపెడుతున్నట్లు ఆరోపించారు. ముఖ్యంగా హిందు సంస్కృతి, సాంప్రదాయాలను ప్రపంచ దేశాలు ఆచరిస్తున్న క్రమంలో దేశంలో అందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొన డానికి పాలకుల చర్యలే కారణం కాగా, పరిస్థితి ఇలాగే కొనసాగితే తీవ్ర ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. కాగా రామసేతువు భారతావనికే రక్షణ కాగా, బంగ్లా, పాక్ చొరబాట్లు నివారించడంలో కేంద్రం ఘోరం గా విఫలమవుతున్నట్లు ఎద్దేవాచేశారు. అయితే హిందూ దేవాలయాల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ దృష్టి సారించాల్సిన అవసరం ఉండగా, రామాయణ, మహాభారతాలు కల్పితగాదలుగా పేర్కొంటుండడం సిగ్గుచేటని నిలదీశారు. అయితే దుబ్బాక పట్టణంలో నడిబొడ్డున ఉన్న నల్లపోచమ్మ దేవాలయాన్ని అన్యమతస్తులకు అంటగట్టాలని చూస్తుండడం దురదృష్టకర మని స్పష్టం చేయగా, విరమించుకోని పక్షంలో ఆందోళన చేపట్టనున్నట్లు హెచ్చరించారు. సమావేశంలో కిసాన్ మోర్చా జిల్లా కార్యదర్శి కుడిక్యాల రాములు, బిజెపి పట్టణ అధ్యక్షులు మధుసూదన్, నేతలు రాకేష్, రమేష్, నాగరాజు, రాంచంద్రం, నర్సింలు, కృష్ణమూర్తి పాల్గొన్నారు.
అక్రమ స్కానింగ్ కేంద్రాలపై నిఘా:ఎజెసి
సంగారెడ్డి,జనవరి 28: జిల్లాలో అక్రమంగా స్కానింగ్ చేస్తున్న కేంద్రాలపై నిఘా ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ బి ఎస్ వివి ఎస్ మూర్తి ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్‌లో పిఎన్‌డిటి యాక్టుపై అడ్వయిజరీ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. 114 అల్ట్రా సౌండ్ స్కానింగ్ కేంద్రాలు ఉన్నాయని ఇందులో 105 ప్రైవేట్‌లో 9 చోట్ల ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయన్నారు. కొత్తగా ఈ కేంద్రాల అనుమతికి దరఖాస్తులు వస్తే అన్ని రకాలుగా తనిఖీ చేసి ఇవ్వాలని సూచించారు. అలాగే రినూవల్ సమయంలో కూడా అన్ని పరిశీలించిన తర్వాతే అనుమతి ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి పద్మ, ఇతర అధికారులు వీణాకుమారి, విజయలక్ష్మీ, అడిషనల్ ఎస్పీ మధుమోహన్‌రెడ్డి, రహీం, సుధారాణి, చిన్నయ్య, మహిళ సమతా సభ్యులు శైలజ, విజయరేఖ, వజజారెడ్డి, డి ఎస్పీ వెంకటేష్, డిపివో జగన్నాథ్‌రెడ్డి, ఐ సిడి ఎస్ పిడి శైలజ పాల్గొన్నారు.
విద్యుదాఘాతంతో కార్మికుడు మృతి
సదాశివపేట, జనవరి 28: విధుల్లోకి వెళ్లిన ఓ కార్మికుడు దురదృష్టవశాత్తు విద్యుత్ ప్రమాదానికి గురై మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని ఎనె్కపల్లి గ్రామ శివారులో మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. ఎనె్కపల్లి గ్రామానికి చెందిన పుప్పిరాటి లాలప్ప (33) గత ఆరు నెలలుగా గ్రామ శివారులో వెలసిన ప్రైవేట్ లిమిటెడ్ జిన్నింగ్ మిల్లులో కార్మికుడిగా పని చేస్తున్నారు. రోజువారిగనే మంగళవారం ఉదయం 9 గంటలకు విధుల్లోకి చేరాడు. ఉదయం పది గంటల ప్రాంతంలో విద్యుత్ షాక్‌కుగురై కిందపడిపోయాడు. తీవ్రగాయాలైన లాలప్పను చికిత్స నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిక తరలిస్తుండగ మార్గమధ్యలో మృతి చెందాడు. ఈ విషయం తెలియడంతో గ్రామ సర్పంచు రాములు, మాజీ సర్పంచ్ ఖాలీద్‌బాబ, ఎల్లారం సర్పంచ్ యశ్వంత్‌రావు, టిడిపి మండల పార్టీ అధ్యక్షులు అమరేందర్‌రెడ్డి, బిజెపి, సిపిఎం, సిపిఐ నాయకులు మిల్లువద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. మృతుడి కుటుంబ సభ్యులకు 15 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేసారు. ఈ విషయమై యాజమాన్యం పక్షాన అధికారులు అంత పెద్దమొత్తంలో పరిహారం చెల్లించడానికి సుముఖతను వ్యక్తం చేయకపోవడంతో ఆందోళనకారులు మృతదేహాన్ని తీసుకువచ్చి మిల్లుముందు కూర్చుండి బైఠాయిస్తామని హెచ్చరించారు. ఓదపా పరిస్థితి ఉద్రిక్తతకుదారితీయడంతో పోలీసులు నచ్చజెప్పడంతో గొడవ సద్దుమనిగింది. చివరకు యాజమాన్యం 5.25 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించడానికి అంగీకరించడంతో బంధువులు ఆందోళన విరమించారు. మృతుడు లాలప్పకు భార్య గిరిజతో పాటు ఆరు, నాలుగు సంవత్సరాల వయస్సు గల కూతుళ్లు, యేడాదిన్నర కుమారుడున్నాడు. మృతదేహానికి సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఇన్స్‌పెక్టర్ శ్రీనివాస్‌నాయుడు తెలిపారు.