కలెక్టరేట్, జనవరి 28: పులిచింతల ముంపు బాధితులకు సహాయ పునరావాస పనులు చేపట్టడంలో జాతీయం చేసే అధికారులను ఎంత మాత్రం ఉపేక్షించేంది లేదని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ హారజవహర్‌లాల్ అన్నారు. మంగళారం తన చాంబర్‌లో పులిచింతల ప్రాజెక్టు పునరావాస పనులను అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ముంపు బాధితుల సమస్యలకు తక్షణమే పరిష్కార మార్గాన్ని చూపాలని పునరావాస గ్రామాలలో ప్రజల సమస్యలపై స్పందించకుంటే ఎలానని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌లను ప్రశ్నించారు. కాలయాపన చేస్తూ రెండు రోజులు చేయాల్సిన పనులు 20రోజులు చేయడాన్ని సహించేది లేదన్నారు. లబ్దిదారులకు పట్టా సర్ట్ఫికెట్లు త్వరితగతిన పంపిణీ చేయాలని ఆదేశించారు. గృహానిర్మాణాలు వేగవంతం చేయాలని గృహనిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్‌ను ఆదేశించారు. వచ్చే ఖరీఫ్‌కు ప్రాజెక్టులో నీరు నింపే సమయానికి బాధిత కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించాలని కోరారు. సమావేశంలో పులిచింతల ప్రాజెక్టు స్పెషల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, రోడ్డు భవనాల శాఖ ఎస్ ఇ లింగయ్య, గృహనిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ శరత్‌బాబు, గిరిధర్, స్పెషల్ డిప్యూటి కలెక్టర్ రాములు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
నకిలీ పట్టాదార్ పాస్ పుస్తకాలు సరఫరా చేసిన నిందితుల అరెస్టు
మహబూబ్‌నగర్ కలెక్టర్ కార్యాలయం నుండి చోరీ చేసి సరఫరా
దేవరకొండ, జనవరి 28: నల్లగొండ జిల్లా దేవరకొండ సిసి బ్యాంక్‌లో నకిలీ పాస్‌పుస్తకాలను పెట్టి కోట్ల రూపాయలను కాజేసినట్లు అధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీస్‌లు దళారులకు పట్టాదార్ పుస్తకాలను సరఫరా చేసిన నలుగురు నిందితులను మంగళవారం అరెస్ట్ చేశారు. స్థానిక డిఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో నిందితులను మీడియా ఎదుట ప్రవేశపెట్టి కేసుకు సంబంధించిన వివరాలను డిఎస్పీ మనోహర్ వెల్లడించారు. దేవరకొండ సహకారబ్యాంక్‌లో నకిలీ పాస్‌పుస్తకాలను పెట్టి కోట్ల రూపాయలను కాజేశారని దీనికి బాధ్యుడైన ఎజిఎం బొల్లికొండ రామయ్యపై చర్య తీసుకోవాలని మూడు మాసాల క్రితం బ్యాంక్ ఉన్నతాధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రామయ్యను అదుపులోకి తీసుకొని విచారణ చేసినట్లు చెప్పారు. మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తోటమాలిగా పని చేసే మెట్టెరాములు అనే వ్యక్తి రెండు సంవత్సరాల క్రితం కలెక్టర్ కార్యాలయం స్టోర్‌రూంలో ఉన్న రెండు బస్తాల కొత్త పట్టాదార్‌పాస్‌పుస్తకాలు, టైటిల్‌డీడ్‌లను అపహరించి అదే జిల్లా కల్వకుర్తి తహశీల్ కార్యాలయం పరిధిలో విఆర్‌ఏ గా పని చేస్తున్న పోలె నాగయ్యకు 150 రూపాయలకు విక్రయించేవాడని చెప్పారు. పోలెనాగయ్య తన వద్ద ఉన్న పాస్‌పుస్తకాలను మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్‌కు చెందిన మాడుగులపల్లి వెంకటయ్యకు 200 రూపాయలకు విక్రయించేవాడని డిఎస్పీ చెప్పారు. వెంకటయ్య ఆ పుస్తకాలను రఘుపతిపేటలో వైద్య ఆరోగ్యశాఖలో హెల్త్‌అసిస్టెంట్‌గా పని చేస్తున్న రమావత్ అర్జున్‌కు విక్రయించేవాడని తెలిపారు. అర్జున్ తన వద్ద ఉన్న పాస్‌పుస్తకాలు, టైటిల్‌డీడ్‌లపై మిర్యాలగూడ ఆర్డీవో కార్యాలయం ముద్రతో పాటు కార్యాలయం సీల్, చందంపేట మండల తహశీల్దార్ ఫోర్జరీ సంతకాన్ని చేసి కార్యాలయం ముద్ర వేసి తన చిన్ననాటి స్నేహితుడైన నల్లగొండ జిల్లా చందంపేట మండలం తెల్దేవర్‌పల్లికి చెందిన నేనావత్ చిన్నా, దేవరకొండ మండలం ముదిగొండకి చెందిన రమావత్ కిషన్‌నాయక్‌కు విక్రయించేవాడని చెప్పారు. చిన్నా, కిషన్‌నాయక్ ఈ పాస్‌పుస్తకాలను చందంపేట మండలం తిమ్మాపురం సొసైటీలో పెట్టి అక్రమంగా 1.06 కోట్ల రూపాయలను స్వాహా చేశారని చెప్పారు. తిమ్మాపురం సొసైటీలో మొత్తం 3,41,39,937 రూపాయల అక్రమాలు జరిగాయని బ్యాంక్ జిల్లా అధికారులు చందంపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని చెప్పారు. అరెస్ట్ చేసిన ముగ్గురు నిందితులు ఇప్పటి వరకు 241 నకిలీ పట్టాదార్‌పాస్ పుస్తకాలను సరఫరా చేశారని ఆయన చెప్పారు. ఈ కేసులో ఉన్న మరిన్ని అక్రమాలను వెలుగులోకి తీసుకొచ్చేందుకు పోలీస్‌లు పని చేస్తున్నారని త్వరలో ఈకేసులో మరికొంత మందిని అదుపులోకి తీసుకుంటామని డిఎస్పీ వెల్లడించారు. ఈ విలేఖరుల సమావేశంలో దేవరకొండ ఎస్‌హెచ్‌వో జె భాస్కర్, చందంపేట ఎస్ ఐ మైనోద్దిన్ పాల్గొన్నారు.
రేషన్ డీలర్లకు బీమా పథకం
పైలట్ ప్రాజెక్టుగా నల్లగొండ ఎంపిక
నల్లగొండ, జనవరి 28: రేషన్ డీలర్లకు బీమా పథకం(ఇన్సూరెన్స్) వసతి కల్పించే దిశగా రాష్ట్రంలో నల్లగొండ జిల్లాను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. లక్షలాది మంది నిరుపేదలకు ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా నిత్యావసర సరుకులు అందించే రేషన్ డీలర్ల సంక్షేమం కోసం ఇటీవలే వారికి కమిషన్ పెంచిన ప్రభుత్వం తాజాగా మరో అడుగు ముందుకేసి గ్రూప్ ఇన్సూరెన్స్ ప్రయోజనం అందించాలని నిర్ణయించింది. ఎల్‌ఐసి, ఎస్‌బిఐ రేషన్ డీలర్లకు ఇన్సూరెన్స్ కల్పించేందుకు ముందుకువచ్చాయి. ఈ నిర్ణయంతో జిల్లాలోని 2063 మంది రేషన్ డీలర్లకు త్వరలో గ్రూప్ ఇన్సూరెన్స్ ప్రయోజనం అందుబాటులోకి రానుంది. మంగళవారం కలెక్టరేట్‌లో ఇన్‌చార్జి కలెక్టర్ హరిజవహర్‌లాల్ జిల్లా రేషన్ డీలర్లు, బ్యాంకర్లు, పౌరసరఫరాల శాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో డీలర్లకు ఇన్సూరెన్స్ పథకం అమలుపై చర్చలు జరిపారు. 150 రూపాయలు లేదా 250రూపాయల ప్రీమియం చొప్పున డీలర్లకు గ్రూపు ఇన్సూరెన్స్ కల్పించే విషయమై వారం రోజుల్లో తుది నిర్ణయం తీసుకోనున్నట్లుగా హరిజవహర్‌లాల్ తెలిపారు.
మళ్లీ సూపర్ ఫైన్ బియ్యం కేంద్రాలు
రాష్ట్రంలో సూపర్ ఫైన్ బియ్యం విక్రయ కేంద్రాలు మళ్లీ ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. ఫిబ్రవరి మొదటి వారంలో జిల్లా వ్యాప్తంగా కిలో 30 రూపాయలకు సూపర్ ఫైన్ బియ్యం విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించి ముందుగా నల్లగొండ, మిర్యాలగూడ, సూర్యాపేట, దేవరకొండ, కోదాడ, నకిరేకల్, హుజూర్‌నగర్, భువనగిరిలో ఈ కేంద్రాలను ప్రారంభించనున్నారు. ఇన్‌చార్జి కలెక్టర్ హరిజవహర్‌లాల్ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్‌లో పౌరసరఫరాలు, మిల్లర్లు, రేషన్ డీలర్లతో జరిగిన సమావేశంలో సూపర్‌ఫైన్ బియ్యం కేంద్రాల ప్రారంభంపై చర్చించారు. సన్న బియ్యం ధరలు పెరిగిపోతున్న సందర్భాల్లో ధరల నియంత్రణకు ప్రభుత్వం బహిరంగ మార్కెట్‌లోకి అడుగుపెట్టి కిలో 30 రూపాయలకే సూపర్ ఫైన్ బియ్యం విక్రయ కేంద్రాలు తెరుస్తుండటం విశేషం. రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి సూపర్‌ఫైన్ బియ్యం తెరువాల్సివున్నందున అందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని హరిజవహర్‌లాల్ సూచించారు. కాగా ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల మేరకు మిల్లర్లు 25 శాతం బియ్యం బయట మార్కెట్‌లో విక్రయించుకుని 75 శాతం ప్రభుత్వానికి లేవి పెట్టాలని ఇన్‌చార్జి కలెక్టర్ మిల్లర్లకు సూచించారు. మిగిలిపోయిన 80 వేల పచ్చిబియ్యం లెవీ సైతం పూర్తి చేయాలని ఆయన మిల్లర్లను కోరగా వారు అందుకు సానుకూలంగా స్పందించారు. సమావేశంలో పౌరసరఫరాల శాఖ అధికారులు నాగేశ్వర్‌రావు, వెంకటేశ్వర్‌రావు, మిల్లర్లు, డీలర్లు పాల్గొన్నారు.
నకిలీ కరెన్సీ తరలిస్తున్న నిందితుడి అరెస్టు
రూ. 3.88 లక్షలు స్వాధీనం
భువనగిరి,జనవరి28: కొంత కాలంగా నకిలీ కరెన్సీని చలామణి చేస్తున్న నిందితుడిని భువనగిరి రూరల్ పోలీసులు చాకచక్యంతో వల పన్ని పట్టుకున్నారు. మంగళవారం భువనగిరి రూరల్ సిఐ నరేందర్‌గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ వారసిగూడకు చెందిన మహ్మద్ షరీఫ్ అనే యువకుడు కొంత కాలంగా పశ్చిమబెంగాల్ రాష్ట్రం నుంచి నకిలీ కరెన్సీని హైదరాబాద్‌కు చేరవేస్తున్నాడు. దీనిలో భాగంగా పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి చెందిన జుబేర్ అనే వ్యక్తి షరీఫ్ ద్వారా నకిలీ కరెన్సీని హైదరాబాద్‌లోని మరో వ్యక్తి శ్రీకాంత్‌కు అందజేస్తున్నాడు. శ్రీకాంత్ ఈ కరెన్సీని హైదరాబాద్ పరిసర ప్రాంతాలతోపాటు వివిధ జిల్లాల్లో ఈకరెన్సీని చలామణిలోకి తీసుకువస్తున్నాడు. కాగా సోమవారం రాత్రి షరీఫ్ పశ్చిమబెంగాల్ నుంచి 3.88 లక్షల నకిలీ కరెన్సీని తన కాళ్లకున్న షూ కింద దాచుకొని గూడూరు సమీపంలో గల టోల్‌ప్లాజా వద్ద శ్రీకాంత్ కోసం నిరీక్షిస్తున్నాడు. ఇదే క్రమంలో వాహనాల పెట్రోలింగ్ చేస్తున్న రూరల్ సిఐ నరేందర్‌గౌడ్‌కు షరీఫ్ అనుమానాస్పదంగా తచ్చాడుతూ కనబడడంతో వెంటనే సిఐ అతడిని అదుపులోకి తీసుకున్నాడు. అనంతరం విచారణ జరపగా షరీఫ్ కొంత కాలంగా పశ్చిమబెంగాల్‌లోని జుబేర్ వద్ద నుంచి నకిలీ కరెన్సీ తీసుకుని హైదరాబాద్‌లోని శ్రీకాంత్ అనే వ్యక్తికి అందజేస్తున్నట్లు తేలింది. ఇప్పటికే కోట్లాది రూపాయల నకిలీ కరెన్సీని హైదరాబాద్‌కు పలుమార్లు తరలించినట్లు షరీఫ్ విచారణలో పోలీసులకు తెలిపాడు. ఈమేరకు నిందితుడి షూలో దాచి వున్న 3.88 లక్షల నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నట్లు సిఐ తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి మిగతా నిందితులైన జుబేర్, శ్రీకాంత్ కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయని సిఐ పేర్కొన్నారు.
విద్యార్థులు తల్లిదండ్రుల కలలు సాకారం చేయాలి
డిఇవో ఆచార్య జగదీష్
నల్లగొండ , జనవరి 28: తల్లిదండ్రుల కలల సాకారానికి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని జిల్లా విద్యాశాఖాధికారి ఆచార్య జగదీష్ అన్నారు. మంగళవారం స్థానిక చిన్నవెంకట్‌రెడ్డి ఫంక్షన్‌హాల్‌లో పదవతరగతి విద్యార్థులు పరీక్షల సంసిద్దత అవగాహన సదస్సు ప్రైవేటు పాఠశాలల ఐక్య కార్యచరణ సమితి, ఐబిసి చానల్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సదస్సుకు డిఇవో ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ పరీక్షల ముందు పిల్లలు ఎలాంటి ఒత్తిళ్లకు గురికాకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు. మొదటి తరగతి నుండి 9వ తరగతి వరకు జరిగే పరీక్షలు కేవలం తరగతిని పెంచేందుకు ఉపయోగపడతాయని కాగా పదవ తరగతి వార్షిక పరీక్ష ప్రమాణికతతో కూడుకుందన్నారు. ఈ పరీక్షలకు విద్యార్థులు మానసికంగా సిద్ధ కావాలన్నారు. పరీక్షల సమయంలో సమయపాలన తప్పనిసరిగా పాటించాలని పేర్కొన్నారు. బట్టి చదవులు ఫలితాలు ఇవ్వవని విద్యార్థి వికాసవంతమైన అభివృద్ధిని చూకూర్చుకోవాలని సూచించారు. ఉపాధ్యాయుల తోడ్పాటు విద్యార్థులకు ఎంతో అవసరమని వారి బోధనలు తరగతిలో ప్రతి విద్యార్థికి అవగాహన కల్పించేలా ఉండాలన్నారు. ఉత్తమమైన ఫలితాలు సాధించేందుకు జిల్లాలో 90 రోజుల ప్రత్యేక ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. ఇక పరీక్షలు 60రోజులకు మాత్రమే చేరాయని విద్యార్థులు పరీక్షలకు సిద్ధం కావాలన్నారు. జిల్లాలో 48వేల మంది పదవతరగతి రెగ్యులర్ విద్యార్థులు, 4వేల మంది ప్రైవేటు విద్యార్థులు మొత్తం 52 వేల మంది పరీక్షలకు హాజరుకానున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ట్రస్మా జిల్లా అధ్యక్షుడు యానాల ప్రభాకర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి రాంరెడ్డి, కోశాధికారి కొలనుపాక రాంకుమార్, ఐబిసి చానల్ చైర్మన్ ఏచూరి భాస్కర్, పర్సనాలిటీ డెవలప్‌మెంట్ ట్రైనర్ గంప నాగేశ్వర్‌రావు, వైద్యుల వెంకటేశ్వర్లు, నర్సింహ్మరావు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
వ్యవసాయ సహకార సంఘాలను బలోపేతం చేయాలి
కలెక్టరేట్, జనవరి 28: వ్యవసాయ అనుబంధ శాఖల సమిష్టి కృషితో వ్యవసాయ సహకార సంఘాలను బలోపేతం చేయాలని ఇన్‌చార్జి కలెక్టర్ హరిజవహర్‌లాల్ కోరారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశం మందిరంలో సమిష్టి వ్యవసాయ, సహకార సంఘాల సభ్యులతో సమావేశంలో ఏర్పాటు చేసి సంఘాల బలోపేతానికి సలహాలు, సూచనలు స్వీకరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ అనుబంధ శాఖల సేవలను సొసైటీలు సద్వినియోగ పరచుకుని సమిష్టి వ్యవసాయం చేయడం ద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం పొందవచ్చన పేర్కొన్నారు. శాస్ర్తియ సాంకేతిక పరిజ్ఞానాన్ని సంఘాలలోని రైతులు పరస్పరం పంచుకుని సేంద్రియ ఎరువుల వాడకంతో పలు రకాల అంతర్యాన పంటల ద్వారా ఆదాయం పెంపొందించుకోవాలని సూచించారు. ప్రభుత్వ పరంగా వ్యవసాయ అనుబంధ శాఖల ద్వారా అన్ని విధాలుగా తోడ్పాటునందిస్తామన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా రైతులు వ్యక్తిగతంగా పనిచేయడం వల్ల గిట్టుబాటు చేకూరడం లేదన్నారు. ఉపాధిహామీ పథకం వచ్చాక వ్యవసాయ రంగానికి కూలీలు దొరకడం కష్టసాధ్యమైందని ఈ నేపథ్యంలో రైతులు సమిష్టి సేద్యం ద్వారా వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా చేసుకుని సామూహిక అభివృద్ధి సాధించాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో పశుసంవర్థక శాఖ జాయింట్ డైరెక్టర్ ఖదీర్, వ్యవసాయ శాఖ జెడి ఎ నర్సింహ్మరావు, నాబార్డు ఎజి ఎం వీరశంకర్, డ్వామాపిడి కోటేశ్వర్‌రావు, జిల్లా సహాకార అధికారి ప్రసాద్ పాల్గొన్నారు.
అభివృద్ధికి ప్రణాళికలు మార్గదర్శకం
జిల్లా ముఖ్య ప్రణాళికాధికారి నాగేశ్వరరావు
కలెక్టరేట్, జనవరి 28: దేశాభివృద్ధికి, ప్రభుత్వం చేపట్టేటువంటి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రణాళికలు, గణంకాలు మార్గదర్శకమని జిల్లా ముఖ్య ప్రణాళికాధికారి పి.నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని ఆ శాఖ జిల్లా కార్యాలయంలో తెలంగాణ ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్ సబార్డినేట్స్ అసొసియేషన్ సెంట్రల్ ఫోరం ముద్రించిన డైరీని ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. ప్రభుత్వం చేపట్టే ప్రతి అభివృద్ధి కార్యక్రమానికి ప్రణాళికలు అవసరమని, నిధుల వెచ్చింపు, వ్యయాలకు సంబంధించిన గణాంకాలు సదరు పథకాల పురోగతిని, సాధించిన అభివృద్ధిని వెల్లడిస్తాయన్నారు. ప్రణాళిక, గణాంక శాఖల ఉద్యోగుల సేవలు దేశ, రాష్ట్ర ప్రగతిలో విస్మరించలేనివన్నారు. శాఖ ఉద్యోగుల సమస్యలపై సాగర్ డిక్లరేషన్ మేరకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రణాళిక, గణంకాశాఖల లక్ష్యాలను చాటే విధంగా శాఖ డైరీని రూపొందించిన టెస్సా నేతలను ఆయన అభినందించారు. కార్యక్రమంలో డిడి మోహన్‌రావు, ఎస్‌వో బాలశౌరి, టెస్సా రాష్ట్ర కార్యదర్శి జి.వెంకటేశ్వర్లు, అసోసియేషన్ అధ్యక్షులు అశోక్, జిల్లా అధ్యక్షుడు ముత్తయ్య, టిఎన్‌జీవో జిల్లా కోశాధికారి సురభి వెంకటేశ్వర్లు, డిఎస్‌వో రామారావు, శ్యామ్ ఉన్నారు.
ఆర్థిక కుల గణన సవరణ వేగవంతం చేయాలి
* వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రిన్సిపల్ సెక్రటరీ
నల్లగొండ టౌన్, జనవరి 28: ఆర్థికాభివృద్ధి అందించి పేదరిక నిర్మూలనకై కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సామాజిక, ఆర్థిక, కులగణన కార్యక్రమాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రిన్సిపల్ సెక్రటరీ రెమాండ్ పీటర్ కోరారు. మంగళవారం జిల్లా కలెక్టర్‌లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సామాజిక ఆర్థిక కుల గణన సవరణ కార్యక్రమాల ప్రగతిని సమీక్షించారు. ప్రజల నుండి క్లెయిమ్‌లు, ఆక్షేపణలు స్వీకరించి గ్రామ పంచాయతీలు, సంఘబంధాలు, తహశీల్ కార్యాలయాల వద్ద ముసాయిదా ప్రతులను ప్రచురించాలని ఆదేశించారు. సామాజిక, ఆర్థిక కుల గణన వివరాలను నిర్దిష్టమైన తేదీన మున్సిపాలిటీలు, అన్ని మండల కేంద్రాలలో ప్రచురించాలని సూచించారు. ప్రజల నుండి ఆక్షేపణలు స్వీకరించేందుకు నిర్ధిష్టమైన ఫారాలు వినియోగించాలని తుది జాబితాలను ఎన్‌ఐసి ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ హరిజవహర్‌లాల్ మాట్లాడుతూ జిల్లాలో సమాజిక, ఆర్థిక , కులగణన, ముసాయిదా సవరణ కార్యక్రమం 88శాతం పూర్తయినట్లు వివరించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో డి ఆర్‌డిఎ ప్రాజెక్టు డైరెక్టర్ సుధాకర్ పాల్గొన్నారు.
కృష్ణాడెల్టాకు నీటి నిలిపివేత
నాగార్జునసాగర్, జనవరి 28: నాగార్జునసాగర్ జలాశయం నుండి కృష్ణాడెల్టాకు విడుదల చేస్తున్న నీటిని మంగళవారం తెల్లవారు జాము నుండి డ్యాం అధికారులు నిలిపివేశారు. దీంతో సాగర్‌లోని ప్రధాన జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో ఉత్పత్తి నిలిచిపోయింది. ప్రస్తుతం సాగర్ జలాశయంలో 590 అడుగులకుగాను 540 అడుగుల నీటిమట్టానికి తగ్గిపోయింది. సాగర్ జలాశయానికి శ్రీశైలం నుండి 12,229 కూసెక్కుల నీరు వస్తుండగా కుడికాల్వ ద్వారా 9వేలు, ఎడమకాల్వ ద్వారా 12,059, ఎస్‌ఎల్‌బిసి ద్వారా 1650, రివర్సబుల్ టర్భైన్ల ద్వారా సాగర్ జలాశయం నుండి శ్రీశైలం జలాశయానికి 196క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 885 అడుగులకుగాను 878 అడుగుల నీటిమట్టం ఉంది.
నిందితుడికి ఆరేళ్ల జైలు
మిర్యాలగూడ టౌన్, జనవరి 28: ప్రేమ పేరుతో మోసం చేసి, ఆత్మహత్యకు ఉసిగొల్పాడన్న ఆరోపణలు రుజువు కావడంతో నిందితుడు షేక్‌మహ్మద్‌కు ఆరేళ్ల కఠిన కారాగారశిక్ష, 5,000 రూపాయలు జరిమానాను స్థానిక అసిస్టెంట్ సెషన్స్ జడ్జి నర్సింహాచారి మంగళవారం విధించారు. మేళ్లచెరువు మండలం వేపల మాధారంకి చెందిన పి.పిచ్చమ్మ అలియాస్ నాగమల్లేశ్వరి షేక్‌మహ్మద్ గత రెండు సంవత్సరాలుగా ప్రేమించుకుంటుండగా, షేక్‌మహ్మద్ పెళ్లి నిర్ణయం కావడంతో మనస్తాపానికి గురై నాగమల్లేశ్వరి మే 27, 2009న క్రిమిసంహారక మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడింది. అప్పటి హుజూర్‌నగర్ సిఐ హరికుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపారు. మోసం చేసిన ఆరోపణలు కూడా రుజువు కావడంతో మరో ఏడాది కఠిన కారాగార శిక్ష, 5,000 రూపాయలు జరిమానా, జరిమానా చెల్లించని పక్షంలో నెల రోజులు జైలు శిక్ష అనుభవించాల్సి వుంటుందని పేర్కొన్నారు. ప్రాసిక్యూషన్ తరఫున ఎపిపి ఎలిషారావు వాదించారు.