
రుచిగా ఉండే జామపండ్లు తింటాం. కానీ జామ ఆకు గురించి ఎప్పుడయినా ఆలోచించారా.. వాటిల్లో ఉండే పోషకాల గురించి విన్నారా? ఈ ఆకుల్లో పలు ఆరోగ్య సమస్యలు రాకుండా చేసే యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. నొప్పులూ, వాపులను నివారించే గుణాలూ అధికమే! నీటిని మరిగించి, శుభ్రంగా కడిగిన జామ ఆకులను అందులో వేసి చల్లారిస్తే, జామాకుల టీ తయారవుతుంది. దీంతో ఎన్నో రకాల ఫలితాలను పొందొచ్చు. ఈ టీ తాగడంవల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అదుపులో ఉంటాయి. దీన్లోని పోషకాలకు బరువు తగ్గించే గుణం కూడా ఉంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఎరిగి బాధపడేవారు ఈ టీని నెలకోసారి తాగినా ఫలితం కనిపిస్తుంది. అజీర్ణ సమస్యలు తగ్గుతాయి. జామాకు టీని తాగితే శ్వాస సంబంధ సమస్యలు తగ్గుతాయి. జలుబూ, దగ్గూ నెమ్మదిస్తాయి. శుభ్రంగా కడిగిన జామాకులను నమలడంవల్ల పంటి నొప్పులు దూరమవుతాయి. చిగుళ్లనొప్పీ, నోటిపూతా తగ్గుతాయి.