
డైరీ రాయడమంటే మన దినచర్యను ప్రతిరోజూ రాయడం. ప్రతిరోజూ మనం ఎన్నో పనులను చేస్తూంటాం. ఎంతమంది వ్యక్తులతోనో సంభాషిస్తూంటాము. మనకు ఎన్నో అనుభవాలు కుటుంబ సభ్యులతోనూ, ఇతరులతోనూ కలుగుతాయి. మనకు నచ్చని వ్యక్తులు, మనం ఇష్టపడే వ్యక్తులతోనూ మాట్లాడవలసి వస్తుంది. ఆ సమయంలో ఎదుటివారిపట్ల మన మనస్సులో మెదిలే భావాలేమిటన్నదీ, వారిపట్ల మనకున్న అభిప్రాయమేమిటన్నదీ డైరీలో రాయవచ్చు. ఇలా వ్యక్తిగత విషయాలను రాసేవి, పర్సనల్ డైరీలు. మనల్ని మనం తరచి చూసుకోవటానికీ, మనల్ని మనం తీర్చిదిద్దుకోవటానికి, మన పొరపాట్లను, ప్రవర్తనలోని లోపాలను సరిదిద్దుకోవటానికీ, మనల్ని మనం సంస్కరించుకోవటానికి ఉపయోగపడుతుంటుంది డైరీ. కళాకారులు, రాజకీయ నాయకులు, విద్యార్థులు, సామాన్య కుటుంబీకులు, వివిధరంగాలలో పనిచేసే ఉద్యోగులు, కొందరు ప్రముఖులు, పారిశ్రామిక రంగంలోని నేతలు వారి వృత్తులకు సంబంధించిన చర్యను ప్రత్యేకంగా డైరీల్లో రాస్తారు.
కొంతమంది వ్యక్తులు, తమ వ్యక్తిగత విషయాలను, సమస్యలను, కుటుంబ విషయాలనేకాక, ఇతరులకు చెప్పుకోలేని తమ రహస్యాలను డైరీలో రాసుకుంటారు. వారి తప్పొప్పులను కూడా అందులో నిర్భయంగా రాసుకుంటారు. ఇటువంటి పర్సనల్ డైరీలను ఇతరులు చదవకుండా భద్రపరచుకోవాలి. ఇతరులు ఆ డైరీలను చదవడంవల్ల కలతలకు, మనస్పర్థలకు, కలహాలకూ, ఘర్షణ పడటానికీ కారణమవుతాయి.
యుద్ధ రంగంలో పనిచేసే సైనికుల డైరీలు వ్యవహారిక భాషలో ఉండవు. వారు కోడ్ భాషను ఉపయోగిస్తారు. తమ డైరీ ప్రమాదవశాత్తూ శత్రువుల చేతికి చిక్కినా వారి వ్యూహాలు, ఎత్తులు ఎదుటివారికి అర్థం కాకుండా ఎంతో జాగ్రత్త వహిస్తారు. యాత్రికుల డైరీలు తాము చూసిన ప్రదేశాలు, యాత్రానుభవాలతో కూడి ఉంటాయి. తాము దర్శించిన ప్రదేశంలోని విశేషాలను, అక్కడి ప్రాముఖ్యతను తమ డైరీలోకి ఎక్కిస్తారు. వాటిని చదివినవారు, వాటిని మార్గదర్శకంగా తీసుకుని యాత్రలను చేస్తారు. అక్కడి ప్రజల పద్ధతులు, ఆచార వ్యవహారాలు, సంస్కృతి, సంప్రదాయాలను ఇటువంటి డైరీ రాతల ద్వారా తెలుసుకోవచ్చు. రాజకీయ నాయకుల డైరీ ద్వారా ఆ నాటి రాజకీయ వ్యవహారాలు, దేశ కాల పరిస్థితి, సాంఘిక ఆచారాలు తెలియచేయబడతాయి. శాస్తజ్ఞ్రుల డైరీలో వారి పరిశోధనలు, అమూల్య విషయాలు, వారు చేసే పరిశోధనలు, వాటి ఫలితాలు ఎప్పటికప్పుడు తెయచేయబడుతాయి. అవి భవిష్యత్తు తరంవారికి ఉపయోగించవచ్చు. రచయితలు డైరీలలో సమాజానికి ఉపయోగించేటటువంటి, నవతరానికి నాంది పలికేటట్లుగానూ విషయాలు ఎన్నో ఉంటాయి. రచయితను స్పందింపజేసే ఏ చిన్న సంఘటన, అనుభవం, మనస్సులో కదలాడే ఊహలు వెంటనే కలం ద్వారా బయటకు వచ్చేస్తాయి. ఏ విషయానికయినా స్పందించిన మనస్సు, ఆ విషయాన్ని బహిర్గతం చేయటానికి వెంటనే సాధ్యపడదు కనుక, డైరీలో భద్రపరచుకుని, ఆ తర్వాత తీరిగ్గా రచన సాగిస్తారు. ఇటువంటి డైరీలు సాహిత్య విలువలను కలిగి ఉంటాయి. రష్యన్ గ్రంథకర్త టాల్‌స్టాయ్ అసంఖ్యాకంగా డైరీలను రచించారు. అన్నా కెరీనా డైరీ సాహిత్యంలో గొప్ప కీర్తిని ఆర్జించింది. బ్రిటీష్ శాస్తవ్రేత్త ఛార్లిన్ డార్విన్ పసిఫిక్ దీవులలో పర్యటిస్తూ, పశుపక్ష్యాదుల పరిశోధనలు జరిపి, తన యాత్రాను భవాలను ‘వాయేజ్ రౌండ్ ది వరల్డ్’ అన్న పేరుతో రచించిన డైరీ ద్వారా జీవశాస్త్రానికి చెందిన అనేక విషయాలు ప్రపంచానికి వెల్లడయ్యాయి. ఉర్దూ కవి గాలిబ్ డైరీలూ, గురజాడ అప్పారావు డైరీలు ఎంతో సాహిత్యపు విలువను సంతరించుకున్నాయి. మహాత్మాగాంధీ దినచర్య ప్రపంచానికే ఆదర్శవంతమయినది.
డైరీ రాయడమన్నది చాలా మంచి అలవాటు. పిల్లలకు కూడా బాల్యంనుంచే డైరీ రాయడాన్ని అలవాటు చేయాలి. నేటి బాలలే భావి భారత ప్రముఖ వ్యక్తులవుతారో, దేశానికి ఎంతటి పేరు తెస్తారో, ఎంతటి ఉన్నత స్థితిని పొందుతారో మనకు వారి బాల్యంలోనే తెలియదు. డైరీ మనిషికి మానసిక దర్పణం. చిన్నతనం నుంచే పిల్లలకు డైరీ రాయడం అలవడితే, వారి డైరీ వారి ఆశలకు, కోరికలకు మానసిక ప్రతిబింబం కనుక, మన పిల్లలు ఏ విషయం పట్ల ఆకర్షిలవుతున్నారో, ఆసక్తిని పెంచుకుంటున్నారో, మనం బాల్యం నుంచే వారి మేధస్సును, ఆలోచనలను, వివేకాన్ని, జిజ్ఞాసువు పెంపొందించేందుకు తోడ్పడవవచ్చు. అందుకే, చాలా స్కూళ్ళల్లో డైరీ, క్యాలెండర్ లాంటి పుస్తకాలను ఇచ్చి వారి చేత వారి దినచర్యను, వారి ఏ విషయంపట్ల కుతూహలం చూపుతున్నదీ రాయించి, తదనుగుణంగా వారా రంగంలో రాణించేలా, పెద్దలకు తెలియజేసి, శిక్షణ నిప్పిస్తున్నారు. ఈనాటి మన బిడ్డ మరోనాడు చిత్రకారుడు, గాయకుడు, రచయిత, రాజకీయవేత్త, శాస్తజ్ఞ్రుడు, దేశానికే ప్రముఖ వ్యక్తిగా మారవచ్చు. మరోనాటి వారి భవిష్యత్తుకు ఈనాడు మన బిడ్డ రాసే డైరీయే పునాది. మన బిడ్డ ఆలోచనలను కోరికలను ప్రతిబింబచేసే డైరీ అతని పురోభివృద్ధికి కారణమవుతుంది. డైరీ రాయడమన్నది వ్యక్తి మానసిక ఎదుగుదలకు, పురోభివృద్ధికి దోహదపడుతుంది.
కొత్త సంవత్సరంలో డైరీని మిత్రులకు, సన్నిహితలకు గ్రీటింగ్ కార్డుతోపాటు కొంతమంది కానుకగా ఇస్తారు. డైరీ రాసే సంవత్సరమంతా ఆ డైరీ ఇచ్చివారిని మరచిపోరు, గుర్తుచేసుకుంటూనే ఉంటారు.