
హైదరాబాద్, ఫిబ్రవరి 1: ఆంధ్రప్రదేశ్ విభజన విషయంలో తెలంగాణ అంశంపై తమ వైఖరి ఏం మారలేదని సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ అన్నారు. శనివారం నాడిక్కడ ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ విభజనను తాము వ్యతిరేకిస్తున్నామని వెల్లడించారు. సిపిఎం రాష్ట్ర కమిటీ సమావేశాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన కారత్ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు వై వెంకటేశ్వరరరావుతో కలిసి పాత్రికేయులతో మాట్లాడారు. పార్లమెంటు సమావేశాలు ముగిసిన తర్వాతనే రాష్ట్ర రాజకీయాలపై స్పష్టత వస్తుందని అన్నారు. ఇంతవరకూ మూడో ఫ్రంట్ ఆలోచన ఏమీ లేదని అన్నారు. కాంగ్రెస్, భాజాపా యేతర పార్టీలతో కలుపుకుని తృతీయ ప్రత్యామ్నాయ వేదిక ఏర్పాటు యోచన ఉందని అన్నారు. రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికల వ్యూహంపై సైతం పార్లమెంటు సమావేశాల అనంతరమే నిర్ణయిస్తామని అన్నారు. కాంగ్రెస్, బిజెపి యేతర పార్టీలతో కలిసి పనిచేసేందుకు తాము ప్రయత్నిస్తున్నామని చెప్పారు. 8 రాష్ట్రాల్లో పోటీ చేసే లోక్‌సభ స్థానాలపై చర్చించామని అన్నారు. ఇంతవరకూ 35 స్థానాల్లో పోటీకి ప్రాథమికంగా నిర్ణయించామని, మిగిలిన రాష్ట్రాల్లో పోటీ చేసే స్థానాలపై త్వరలోనే ఒక నిర్ణయానికి వస్తామని అన్నారు. వారం రోజుల్లో తాము పోటీ చేయబోయే లోక్‌సభ స్థానాలపై స్పష్టత వస్తుందని పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల లబ్ది కోసమే మత హింస నిరోధక బిల్లు, మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకువచ్చిందని చెప్పారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా, సెక్యూలర్ పార్టీగా తాము గుర్తించామని అన్నారు. జాతీయ విషయాలపై స్పందిస్తూ, యుపిఎ హయాంలో ధరలు, అవినీతి విపరీంగా పెరిగాయని విమర్శించారు. ధరల పెరుగుదల సామాన్యులపై పెనుభారం మోపిందని అన్నారు. సిపిఐ, సిపిఎం పొత్తులపై ఆయా రాష్ట్ర కమిటీలు నిర్ణయిస్తామని అన్నారు. టిడిపి మతతత్వ బిజెపితో దోస్తీకి ఆసక్తి చూపుతోందని విమర్శించారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీకే పరిమితం అవుతుందని, ఆ పార్టీ ప్రభావం దేశంలో ఎక్కడా ఉండకపోవచ్చని పేర్కొన్నారు. (చిత్రం) శనివారం హైదరాబాద్‌లో సిపిఎం పార్టీ కమిటీ సమావేశంలో మాట్లాడుతున్న ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్