హైదరాబాద్, ఫిబ్రవరి 1: రాష్ట్ర శాసన సభ, మండలి తిరస్కరించిన తెలంగాణ బిల్లు ఏ రకంగానూ పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు అర్హత లేదని సమైక్యాంధ్ర ప్రజా సంఘాల జెఎసి పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం మొండిగా బిల్లును ప్రవేశపెడితే పెద్దసంఖ్యలో పార్లమెంటును ముట్టడిస్తామని జెఎసి హెచ్చరించింది. ఇందుకుగాను అన్ని ప్రజా సంఘాలు ఈ నెల 3న తిరుపతిలో ప్రత్యేకంగా సమావేశమై భవిష్య కార్యచరణ ప్రకటిస్తాయని పేర్కొంది. శనివారం ఇక్కడ విలేఖరుల సమావేశంలో జెఎసి చైర్మన్ కారెం శివాజీ మాట్లాడుతూ ఆర్టికల్ 371డి, 3లను దుర్వినియోగం చేస్తూ కాంగ్రెస్ ఓట్లు, సీట్లే లక్ష్యంగా రాష్ట్రాన్ని విభజించాలని చూస్తోందని ధ్వజమెత్తారు. అసెంబ్లీ తిరస్కరించిన బిల్లును దొడ్డిదారిన పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు యత్నిస్తే కాంగ్రెస్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. రాష్ట్రంలో అన్ని ప్రతిపక్ష పార్టీలను తుడిచిపెట్టి, మరోసారి అధికారంలోకి రావాలన్న దురుద్దేశంతోనే కాంగ్రెస్ విభజనకు తెర తీసిందని విమర్శించారు. విభజనను అడ్డుకునేందుకు సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి అసెంబ్లీలో ఎంతో కృషి చేశారని, అందుకు ఆయన్ను ప్రజా సంఘాల జెఎసి పక్షాన అభినందించారు. అలాగే సమైక్య ఉద్యమంలో పాల్గొన్న పలు ప్రజా సంఘాల ప్రతినిధులపై అనంతపురం, కడప, చిత్తూరు, విశాఖపట్నం, గుంటూరు తదితర ప్రాంతాల్లో 16 వేల కేసులు నమోదయ్యాయని చెప్పారు. ఆ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని ఇటీవలే ముఖ్యమంత్రిని కోరామని, అందుకు ఆయన సానుకూలంగా స్పందించి ప్రత్యేక ఆదేశాలు జారీ చేసినట్లు శివాజీ వివరించారు. దిగ్విజయ్ వ్యాఖ్యలు సీమాంధ్ర ప్రజల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని మండిపడ్డారు. దిగ్విజయ్‌ను వెంటనే రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి పదవీ నుంచి తప్పించేందుకు సీమాంధ్రకు చెందిన ఎంపిలు, కేంద్ర మంత్రులు కృషి చేయాలని కోరారు. సమైక్య ముసుగులో రాష్ట్ర విభజనకు సహకరిస్తున్న ప్రతీ ప్రజాప్రతినిధికి రాజకీయ సన్యాసం తప్పదని హెచ్చరించారు. రానున్న ఎన్నికల్లో ఇంటింటా ప్రచారం నిర్వహించి సమైక్యవాదాన్ని బలపర్చినవారికే ఓట్లు వేయాలని ప్రజలను కోరుతామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జెఎసి వైస్ చైర్మన్ శంకర్ నాయక్, రాయలసీమ జిల్లాల మాల మహానాడు ఇన్‌చార్జి కొరపాటి శరత్‌బాబు, సమైక్యాంధ్ర విద్యార్థి జెఎసి నేత కె. సుధీర్, ప్రసాద్, గోవింద్ నాయక్ పాల్గొన్నారు.
రేపు తిరుపతిలో కార్యాచరణ ప్రకటిస్తాం కేంద్రం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు సమైక్యాంధ్ర ప్రజా సంఘాల జెఎసి
english title:
jac
Date:
Sunday, February 2, 2014