హైదరాబాద్, ఫిబ్రవరి 1: అసమగ్రంగా ఏకపక్షంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు మెజారిటీ శాసన సభ్యులు శాసన సభ ఆఖరి రోజును తిరస్కరించారని, ఇది తొండి తీర్మానం కాదని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఏకపక్షంగా ఉన్న తీర్మానాన్ని తిరస్కరించారని అన్నారు. తిరస్కరించే హక్కు శాసన సభ్యులకు లేదని ఢిల్లీ నుంచి షిండే, దిగ్విజయ్‌సింగ్, అభిషేక్ సింఘ్వీ, జైపాల్‌రెడ్డిలు మాట్లాడడం దురదృష్టకరమని అన్నారు. గత ఐదేళ్లుగా రాష్ట్రంలో రెండు ప్రాంతాలు ఉద్యమాలతో నాశనం అవుతుంటే వౌనంగా ఉన్న జైపాల్‌రెడ్డి ఇప్పుడు గొంతు చించుకోవడం ఆశ్చర్యంగా ఉందని అన్నారు. మూజువాణి తీర్మానానికి చట్టబద్ధత లేదని అంటున్నారు, ఇటీవల లోక్‌పాల్ బిల్లు , ఆహార భద్రత బిల్లు మూజు వాణి ఓటుతోనే ఆమోదించారని అన్నారు. అసెంబ్లీలో మూజువాణి ఓటు తీర్మానం చెల్లనప్పుడు లోక్‌పాల్ బిల్లు, ఆహార భద్రత బిల్లు కూడా చెల్లదని అన్నారు. శాసన సభ, శాసన మండలి తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాయని జైపాల్‌రెడ్డి చేసిన వాఖ్యలు సభా హక్కుల ఉల్లంఘన కిందకు వస్తాయని అన్నారు. క్యాబినెట్ మంత్రిగా ఉన్నందున తెలంగాణపై మాట్లాడనని గతంలో అన్న జైపాల్‌రెడ్డి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దల మాటలు చూస్తుంటే దక్షిణ భారత దేశం అన్నా తెలుగు జాతి అన్నా వారికి ఎంత వివక్షతనో అర్ధం అవుతుందని అన్నారు. రాజధాని, నిధులు, హక్కులపై స్పష్టత లేని బిల్లును జైపాల్‌రెడ్డి సమగ్ర బిల్లు అని ఎలా అంటారని ప్రశ్నించారు. ఏకపక్ష బిల్లుకు వ్యతిరేకంగా ఏ పోరాటానికైనా సిద్ధం అని, అంతిమంగా బిల్లును రాష్టప్రతి తిరస్కరించాల్సిందేనని అన్నారు.
ఆ ప్రతులు ఇవ్వండి: యనమల
ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లుపై అసెంబ్లీలో జరిగిన చర్చల సారాంశంతో రూపొందించే నివేదిక ప్రతి ఒకటి తనకు అందజేయాలని కోరుతూ టిడిపి నేత, శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడు యనమల రామకృష్ణుడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి శనివారం లేఖ రాశారు. చర్చల సారాంశం సంక్షిప్తంగా కేంద్రానికి పంపించనున్నారు. దానికి సంబంధించి ఒక ప్రతి తనకు ఇవ్వాలని యనమల కోరారు.
ఏకపక్ష బిల్లును వ్యతిరేకించే తీర్మానం: సోమిరెడ్డి
english title:
tondi
Date:
Sunday, February 2, 2014