హైదరాబాద్, ఫిబ్రవరి 1: ఉద్యోగుల ఆందోళనలు, ఒకరిపై ఒకరు దాడులు చేసుకునేంత వరకు చేరుకోవడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. సచివాలయంలో గత నెల 28న తెలంగాణ, సీమాంధ్ర ఉద్యోగుల మధ్య రేగిన వివాదం తోపులాటకు దారితీయడం, తరువాత ఏకంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఛాంబర్ వద్దకు చేరుకోవడంపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సిఎస్ మహంతి ఇరు పక్షాలపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. అలాగే భద్రతను కట్టుదిట్టం చేయాలని, ఎవరు పడితే వారు సి-బ్లాక్‌లోకి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించడంతో సచివాలయం భద్రతను పర్యవేక్షించే ఎస్పీఎఫ్ బలగాలు ఆప్రమత్తమయ్యారు. మొత్తం సి-బ్లాక్ (సమత బ్లాక్) చుట్టూ బారికేడ్లను మూసివేశారు. ఎవరు లోపలకు వెళ్లాలన్నా వారి గుర్తింపు కార్డులను తనిఖీచేసిన తరువాతే లోపలకు పంపిస్తున్నారు. ఇలా ఉండగా, తోపులాట జరిగిన రోజు ఉద్యోగులను నియంత్రించడంలో విఫలమైనట్లు ఆరోపణలు రావడంతో ఏకంగా 26 మంది ఎస్పీఎఫ్ కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లపై బదిలీ వేటు పడింది. వారిని సోమవారం సచివాలయ విధుల నుంచి రిలీవ్ చేయనున్నట్లు ఎస్పీఎఫ్ అధికారులు వెల్లడించారు. ఇదే సమయంలో ఉద్యోగులపై పెట్టిన కేసులను ఎత్తి వేయాలంటూ సిఎస్‌పై వత్తిళ్లు వస్తున్నట్లు సమాచారం. రెండు ప్రాంతాల నుంచి ఈ మేరకు వత్తిళ్లు వస్తున్నప్పటికీ సిఎస్ మాత్రం కేసుల ఉపసంహరణకు అనుమతి ఇవ్వడం లేదని తెలుస్తోంది. అయితే కొన్నాళ్లపాటు ఉద్యోగులు క్రమశిక్షణతో, సత్ప్రవర్తనతో ఉన్నట్లు కనిపిస్తే అప్పుడు ఆలోచించవచ్చునన్నది సిఎస్ మహంతి ఆలోచనగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆ సమయంలో తాము లేకపోయినా తమపై కేసులు పెట్టారంటూ కొంతమంది ఉద్యోగులు సిఎస్‌ను ఆశ్రయిస్తున్నారు. ఇలా వచ్చేవారు కూడా ఐదు మంది కన్నా ఎక్కువగా ఉంటే అనుమతి ఇవ్వడానికి సిఎస్ నిరాకరిస్తున్నారు.
సచివాలయ ఉద్యోగులపై ఆంక్షలు! బారికేడ్లు మూసేసిన భద్రతా సిబ్బంది ఉద్యోగులపై కేసుల రద్దుకు రాజకీయ ఒత్తిళ్లు సత్ప్రవర్తన కలిగి ఉంటేనే రద్దు అంటున్న సిఎస్ 26 మంది ఎస్పీఎఫ్ కానిస్టేబుళ్లపై బదిలీ వేటు
english title:
samatha
Date:
Sunday, February 2, 2014