హైదరాబాద్, జనవరి 1: భారత మాజీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ బ్యాంక్ ఖాతా నుంచి ఓ దుండగుడు 10 లక్షలు కొట్టేశాడు. కలకత్తాకు చెందిన అజీజ్ ఉల్ అనే వ్యక్తి లక్ష్మణ్ మెయిల్ ఐడిని హ్యాక్ చేసి బ్యాంక్ నుంచి డబ్బులను ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాడు. లక్ష్మణ్ ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన సైబరాబాద్ పోలీసులు, కలకత్తా పోలీసుల సహకారంతో వలపన్ని నిందితుడ్ని అరెస్ట్ చేశారు. సైబరాబాద్ క్రైం డిసిపి జానకీ షర్మిలా కథనం ప్రకారం.. ఎస్‌ఆర్ నగర్‌లోని డిసిబి బ్యాంక్‌లో లక్ష్మణ్‌కు ఖాతా ఉంది. బ్యాంక్ మేనేజర్ లక్ష్మణ్‌కు స్నేహితుడు. దీంతో ఎవరికైనా డబ్బులు చెల్లించాల్సి ఉంటే లక్ష్మణ్ ఆ వివరాలతో మేనేజర్‌కు మెయిల్ చేస్తుంటారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మెయిల్ ఐడిని హ్యాక్ చేసిన నిందితుడు కలకత్తాలోని బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన గెలాక్సీ ఎంటర్‌ప్రైజేస్‌కు 10 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేయాలని మెయిల్ చేశాడు. దీంతో బ్యాంక్ మేనేజర్ సదరు సంస్థకు డబ్బులు పంపించారు. 10 లక్షలు ట్రాన్స్‌ఫరైనట్లు వచ్చిన మెసేజ్ చూసుకుని షాక్‌కు గురైన లక్ష్మణ్ వెంటనే బ్యాంక్ మేనేజర్‌ను సంప్రదించారు. లక్ష్మణ్ పేరు మీద మెయిల్ వచ్చినట్లుగా మేనేజర్ చెప్పడంతో లక్ష్మణ్ శనివారం సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించారు. సైబరాబాద్ పోలీసులు కలకత్తా పోలీసుల సహాయంతో నిందితుడ్ని వలపన్ని అరెస్ట్ చేశారు. కాగా నిందితుడు 20 వేల చొప్పున రెండు సార్లు డబ్బులు డ్రా చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ వివరాల ఆధారంగా శనివారం మొత్తం డబ్బును డ్రా చేయడానికి బ్యాంక్‌కు వచ్చాడు. బ్యాంక్ వద్ద కాపుకాసిన పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. సైబరాబాద్ పోలీసులు ప్రత్యేక విమానంలో కలకత్తాకు చేరుకుని నిందితుడ్ని అరెస్ట్ చేశారు. నిందితుడు ఆజీజ్ ఉల్‌పై 419, 420 సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసినట్లు ఆమె తెలిపారు.
పోలీసుల అదుపులో నిందితుడు
english title:
cricketer
Date:
Sunday, February 2, 2014