
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: ప్రముఖ పారిశ్రామిక వేత్త రఘురామ కృష్ణంరాజు వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌ను వీడి, భారతీయ జనతా పార్టీలో చేరారు. శనివారం బిజెపి అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. మొన్నటి వరకూ వైఎస్‌ఆర్‌సిపిలో కీలకపాత్ర వహించిన ఆయనను నర్సాపురం లోక్‌సభ నియోజక వర్గం ఇన్‌చార్జి బాధ్యతల నుంచి ఆ పార్టీ తప్పించిన సంగతి తెలిసిందే. నర్సాపురం ఎంపి, టిటిడి చైర్మన్ కనుమూరి బాపిరాజుతో బంధుత్వం ఉన్న కృష్ణంరాజు కాంగ్రెస్ ఎంపి కెవిపి రామచంద్రరావుకు వియ్యంకుడు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ అనుసరిస్తున్న నియంతృత్వ పోకడలకు నిరసనగానే ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేశానని కృష్ణంరాజు చెబుతున్నారు. బిజెపి రాష్ట్ర విభాగం అధ్యక్షుడు కిషన్‌రెడ్డితో కలిసి ఆయన రాజ్‌నాథ్ సింగ్‌ను కలిశారు. బిజెపిలో తనకు ఎలాంటి బాధ్యతలను అప్పగించినా చిత్తశుద్ధితో కృషి చేస్తానని ఆయన విలేఖరులకు తెలిపారు. రాష్ట్ర విభజన విషయంలో బిజెపి వైఖరి పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. అయితే, రాష్ట్ర విభజన అంశంపై గతంలో సుప్రీం కోర్టులో తాను వేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకునే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు.
రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో నర్సాపురం నుంచి పోటీ చేసేందుకు కృష్ణంరాజు ఆసక్తి చూపుతున్నారు. ఇటీవల తిరిగి బిజెపిలో చేరిన సినీనటుడు, మాజీ కేంద్ర మంత్రి యు.కృష్ణంరాజు ఈసారి కాకినాడ నుంచి పోటీ చేస్తారన్న ఊహాగానాలు ఊపందుకుంటున్నాయి. రాష్ట్రానికి చెందిన మరికొంత మంది నాయకులు బిజెపిలో చేరే అవకాశాలున్నాయి. దివంగత మాజీ మంత్రి కోటగిరి విద్యాధరరావు కుమారుడు శ్రీ్ధర్‌తోపాటు ఒకరిద్దరు మాజీ మంత్రులు తమ పార్టీలో చేరే అవకాశాలున్నాయని బిజెపి నాయకులు చెబుతున్నారు. (చిత్రం) శనివారం ఢిల్లీలో రాజ్‌నాథ్ సమక్షంలో బిజెపిలో చేరిన రఘురామ కృష్ణంరాజు