
డెహ్రాడూన్, ఫిబ్రవరి 1: ఉత్తరాఖండ్ కొత్త ముఖ్యమంత్రిగా కేంద్ర జల వనరుల శాఖ మంత్రి హరీష్ రావత్ (65) శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. విజయ్ బహుగుణ స్థానంలో ఆయన ఈ పదవిని చేపట్టారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ విజయావకాశాలను పెంపొందించుకునేందుకు వీలుగా కాంగ్రెస్ అధినాయకత్వం చేసిన విజ్ఞప్తి మేరకు విజయ్ బహుగుణ శుక్రవారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. దీంతో కొత్త నాయకుడిని ఎన్నుకునేందుకు రాష్ట్ర కాంగ్రెస్ శాసనసభా పక్షం ఐదు గంటల పాటు సుదీర్ఘ సమావేశం జరిపింది. కాంగ్రెస్ సీనియర్ నాయకులు జనార్ధన్ ద్వివేదీ, అంబికా సోనీ, గులాం నబీ ఆజాద్ కేంద్ర పరిశీలకులుగా ఈ సమావేశానికి హాజరయ్యారు. సమావేశం ముగిసిన అనంతరం జనార్ధన్ ద్వివేదీ విలేఖర్లతో మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి హరీష్ రావత్ పేరును సోనియా గాంధీ ఆమోదించినట్టు తెలిపారు. ఆ తర్వాత గవర్నర్ అజీజ్ ఖురేషీ రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో హరీష్ రావత్‌తో పాటు 11 మంది మంత్రివర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. వీరంతా విజయ్ బహుగుణ మంత్రివర్గంలో సభ్యులుగా ఉన్నవారే. గత ఏడాది వరదలతో పెను విధ్వంసానికి గురైన ఉత్తరాఖండ్‌లో విజయ్ బహుగుణ సరైన రీతిలో సహాయ, పునరావాస చర్యలు చేపట్టడంలో విఫలమవడంతో ఆయనపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. దీంతో రాష్ట్రంలో కాంగ్రెస్ తన ప్రతిష్టను కాపాడుకునేందుకు విజయ్ బహుగుణను తొలగించి హరీష్ రావత్‌ను ముఖ్యమంత్రిగా నియమించింది. మొత్తం 70 స్థానాలు ఉన్న రాష్ట్ర శాసనభలో 33 మంది సభ్యులను కలిగివున్న కాంగ్రెస్‌కు ఏడుగురు పిడిఎఫ్ సభ్యులు, ముగ్గురు బిఎస్‌పి సభ్యులు, యుకెడికి చెందిన మరో సభ్యుడితో పాటు మరో ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు మద్దతు తెలియజేస్తుండగా, ప్రతిపక్ష బిజెపికి 30 మంది సభ్యులు ఉన్నారు. (చిత్రం) ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా హరీష్ రావత్ చేత ప్రమాణ స్వీకారం చేయస్తున్న గవర్నర్ అజీజ్ ఖురేషీ