జీడిమెట్ల, ఫిబ్రవరి 2: మొక్కై వంగనిది. మానై వంగదని పెద్దలు చెబుతుంటారు. అందుకే చిన్నారులకు ఆట, పాటలతో బాల్యం నుంచే సంస్కారాలు, దేశభక్తి అలవడేలా బాలగోకులం అనే స్వచ్ఛంద సంస్థ యత్నిస్తోంది. స్వామి వివేకానందుడి స్ఫూర్తి దాయకంతో క్షణం తీరిక లేని సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, సామాజిక కార్యకర్తలు బాలగోకులం సంస్థను స్థాపించి చిన్నారులను ఉత్తమ పౌరులుగా తయారు కావాలన్న లక్ష్యంతో సంస్థ సాగుతోంది. ఇందులో భాగంగానే నిత్యం బిజీగా ఉండే విలేఖరులు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఈ బాల సంస్కార కేంద్రాలు నిర్వహిస్తూ అందరి జేజేలను అందుకుంటున్నారు. జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని ఎస్‌ఆర్ నాయక్ నగర్‌లోని పోచమ్మ దేవాలయ ప్రాంగణంలోని సుందరమైన పార్కుకు కాలనీలోని చిన్నారులంతా ప్రతి ఆదివారం ఉదయం ఏడున్నర గంటలకు చేరుకుంటారు. వారానికి ఒకేసారి రెండు గంటల పాటు సాగే బాలగోకులానికి వచ్చేందుకు, ఆడిపాడేందుకు చిన్నారులు వారమంతా ఎదురుచూస్తుండడం విశేషం. ఏడాది కాలంగా సాగుతున్న బాలగోకులంలో మొదటి గంట ఆటలకే కేటాయిస్తారు. ఆ తరువాత సూర్యనమస్కారాలు, దేశభక్తి గీతాలు, క్విజ్ ఇతర పోటీలు నిర్వహిస్తారు. దేశభక్తుల చరిత్రలను, వారి జీవితాల్లో స్ఫూర్తిదాయక ఘట్టాలను నిర్వాహకులు చిన్నారులకు ఆసక్తికరంగా చెబుతున్నారు. భగవద్గీత శ్లోకాలను, వాటి తాత్పర్యాలను నేర్పిస్తున్నారు. రామాయణం, మహాభారతంలోని ప్రధాన ఘట్టాలను కథలుగా చెబుతూ చిన్నారుల్లో వాటి పట్ల ఆసక్తి పెంపొందేలా చేస్తున్నారు. వారం వారం క్రమం తప్పకుండా కరెంట్ ఎఫైర్స్‌తో పాటు వివిధ పరిణామాలపై ఆసక్తికర చర్చలు కొనసాగిస్తారు. క్విజ్ కాంపిటేషన్స్ నిర్వహిస్తూ పిల్లలు కొత్త విషయాలు తెలుసుకునేలా ఆరోగ్యకరమైన పోటీ ఏర్పడేలా బాలగోకులంలో చర్యలు తీసుకుంటున్నారు నిర్వాహకులు. వివిధ రంగాల్లో ప్రముఖులను పిలిచి విద్యార్థులకు పలు అంశాల పై లోతైన అవగాహన, ఆసక్తి కలిగేలా బోదిస్తున్నారు. వివిద చానల్స్, పత్రికల్లో పనిచేసే వారు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు కొంతకాలంగా హైదరాబాద్ జంటనగరాల్లో 30 చోట్ల ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
మియాపూర్, హఫీజ్‌పేట్, సనత్‌నగర్ తదితర ప్రాంతాల్లో ప్రతి ఆదివారం బాలగోకులాలు నిర్వహిస్తున్నారు. సమాజసేవ చేయాలంటే నిధులు తప్పనిసరి కావాలనే వారి ఆలోచన తప్పని బాలగోకులం నిర్వాహకులు నిరూపిస్తున్నారు.
కేవలం వారానికి రెండు గంటల సమయం కేటాయిస్తే చాలని నిర్వాహకుడు, మైక్రో సాఫ్ట్ ఉద్యోగి విశ్రాంత్‌షా తెలిపారు. చిన్నతనం నుంచే దేశభక్తి, సంస్కారం అలవడి ఉత్తమ పౌరులుగా తయారైతే దేశంలో సగానికి పైగా సమస్యలు తొలుగుతాయని మరో నిర్వాహకుడు ప్రదీప్ భావిస్తున్నాడు. యవ్వనం దేశ సేవకేనన్న స్వామి వివేకానంద పిలుపే తమకు స్ఫూర్తి అని బాలగోకులం నిర్వాహకుడు నారాయణరావు చెప్పాడు.
బాలగోకులంలో ఆటలు, పాటలు, క్విజ్‌తో పాటు ఇతన పోటీలు తమకెంతో ఆనందాన్ని కలిగిస్తున్నారని ఇక్కడికొచ్చే చిన్నారులంటున్నారు. చిన్నారుల ఉజ్వల భవిష్యత్తుకు పాటుపడుతున్న బాలగోకులం నిర్వాహకులను విద్యార్థుల తల్లిదండ్రులు అభినందిస్తున్నారు.
క్షణం తీరిక లేకుండా గడిపే ఉద్యోగులు బాలగోకులం నిర్వహణకు పూనుకుని చిన్నారులకు ఉజ్వల భవిష్యతు అందించేందుకు పాటుపడటం నిజంగా అభినందనీయం.
మొక్కై వంగనిది. మానై వంగదని పెద్దలు చెబుతుంటారు.
english title:
bala gokulam
Date:
Monday, February 3, 2014