రాజమండ్రి, ఫిబ్రవరి 2: పార్లమెంటు సమావేశాలు ముగిసే వరకు అన్ని రాజకీయ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపిలు, నాయకులు పార్టీలను పక్కనపెట్టి ఐక్యంగా ఉద్యమించాలని రాజమండ్రి ఎంపి ఉండవల్లి అరుణకుమార్ పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల ఫోరం ఆధ్వర్యంలో ఆదివారం రాజమండ్రిలో జరిగిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పార్లమెంటు సమావేశాలు ముగిసిన తరువాత ఎవరి రాజకీయాలు వారు చేసుకోవచ్చని, ఎవరేం చేశారో పోస్టుమార్టం చేసుకోవచ్చన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో అన్ని పార్టీలు ఎలాంటి ఐక్యతను ప్రదర్శించి బిల్లును తిరస్కరించారో, అలాగే లోక్‌సభ, రాజ్యసభలో కూడా ఐక్యంగా పోరాటం సాగించాలన్నారు. తాజా పరిణామాల్లో రాష్ట్ర విభజన సమస్య కన్నా, భారత దేశ ప్రజాస్వామ్యంపై అఘాయిత్యం జరిగే ప్రమాద తీవ్రతే ఎక్కువ ఉందన్నారు. ఈ అఘాయిత్యాన్ని ఆపి, దేశాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. అసెంబ్లీ తిరస్కరించిన బిల్లును పార్లమెంటులో ఎలా ప్రవేశపెడతారని ఉండవల్లి ప్రశ్నించారు. అసలు అసెంబ్లీకి పంపిన బిల్లు వేరు, పార్లమెంటులో ప్రవేశపెట్టే బిల్లు వేరని కేంద్ర హోం శాఖ కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వ ముఖ్యకార్యదర్శికి పంపిన లేఖలో స్పష్టంగా పేర్కొన్నారన్నారు. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 3ని ఏ ఉద్దేశ్యంతో పొందుపరిచాన్న దానిపై చర్చ జరగాలన్నారు. శ్రీకృష్ణ కమిషన్ నివేదికను ఎందుకు పార్లమెంటు ముందుకు తీసుకురాలేదన్న విషయంపై జిఓఎంకు సమాచార హక్కు చట్టం కింద తాను దరఖాస్తు చేస్తే, జిఒఎంకు అసలు అడ్రస్ లేదని తనకు సమాధానం వచ్చిందన్నారు. అంటే అడ్రస్ లేని జిఒఎం ఆంధ్రప్రదేశ్‌ను విభజించే ప్రయత్నం చేయటం ఎంత వరకు సమంజసమని ఉండవల్లి ప్రశ్నించారు.
విభజన బిల్లు అసలు పార్లమెంటులో ప్రవేశపెట్టకుండానే పోరాటం చేస్తామని, తొలి రోజే మళ్లీ అవిశ్వాస నోటీసు ఇస్తామని ఉండవల్లి చెప్పారు. అవిశ్వాస నోటీసు ఇస్తే, దానిపై చర్చించకుండా ఇతర అంశాలపై చర్చించటం సాధ్యంకాదన్నారు. సమైక్యవాదులు కావటం వల్లే రాజ్యసభ ఎన్నికల్లో కెవిపి రామచంద్రరావు, సుబ్బిరామిరెడ్డికి కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం టిక్కెట్లు ఇచ్చిందన్నారు. కెవిపి కన్నా బలమైన సమైక్యవాది ఎవరున్నారని ప్రశ్నించారు. ఎన్నికల్లో పోటీచేయకూడదన్న నిర్ణయానికి తాను కట్టుబడే ఉన్నానని, 20ఏళ్లుగా పోటీచేస్తున్న తాను కొత్తవారికి అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. ఎన్నికల్లో పోటీచేయకపోయినాగానీ రాజకీయాల్లో ఉంటానని ఉండవల్లి చెప్పారు.
మళ్లీ అవిశ్వాస అస్త్రాన్ని ప్రయోగిస్తాం : ‘మీట్ ది ప్రెస్’లో ఎంపి ఉండవల్లి
english title:
v
Date:
Monday, February 3, 2014