ఆదిలాబాద్, ఫిబ్రవరి 3: మాజీ మంత్రి అఖిల భారత బంజార సంఘం జాతీయ నాయకులు అమర్‌సింగ్ తిలావత్ సోమవారం బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి సమక్షంలో ఆ పార్టీలో చేరిపోయారు. వంద మంది కార్యకర్తలతో కలిసి హైదరాబాద్ వెళ్ళిన అమర్‌సింగ్ ముహూర్తం చూసుకొని 9.05 గంటలకు బిజెపి తీర్థం పుచ్చుకున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు అయ్యన్న గారి భూమయ్య తెలిపారు. 1978లో బోథ్ ఎస్టీ అసెంబ్లీ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి గెలుపొందగా, ఆయనకు రాష్ట్ర టూరిజం శాఖ బాధ్యతలు అప్పగించారు. మంత్రిగా ఐదేళ్ళు పని చేసిన అమర్‌సింగ్ తిలావత్ బంజారా సేవా సంఘంలో జాతీయ స్థాయిలోనే కీలక పదవులు నిర్వర్తించారు. గతంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చవి చూసిన అమర్‌సింగ్ ఆ తరువాత టిడిపిలో చేరిపోయారు. తెలుగుదేశం పార్టీలో ఐదేళ్ళు పనిచేసిన అనంతరం కొత్తగా ఆవిర్భవించిన ప్రజారాజ్యం పార్టీలో కొన్నాళ్ళపాటు పని చేసి ఆ తరువాత టిఆర్‌ఎస్‌లో కొనసాగుతున్నారు. తెలంగాణకు కట్టుబడి బిజెపి జాతీయ స్థాయిలో ముందుకు సాగుతున్నందున నరేంద్రమోడి నాయకత్వంలో పనిచేసేందుకే తాను బిజెపిలో చేరుతున్నట్లు అమర్‌సింగ్ తెలిపారు. రానున్న ఎన్నికల నేపధ్యంలో ఆయన బోథ్ లేదా ఖానాపూర్ అసెంబ్లీ సీటును ఆశించి బిజెపి తీర్థం పుచ్చుకున్నట్లు తెలిసింది. ఒక వేళ అవకాశం వస్తే ఎంపీగా పోటీ చేసేందుకు కూడా సిద్దంగా వున్నట్లు అమర్‌సింగ్ తెలిపారు. బిజెపి అధిష్టానం నిర్ణయానికి శిరసావహించి కార్యకర్తగా పని చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి బిజెపి కండువా కప్పి అమర్‌సింగ్‌తో పాటు వంద మంది కార్యకర్తలను పార్టీలో చేర్చుకున్నారు. వెనువెంటనే కొంపెల్లిలో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో అమర్‌సింగ్‌కు ఆహ్వానం అందడం గమనార్హం. ఇదిలా వుంటే తూర్పు జిల్లాలోని మంచిర్యాలకు చెందిన టిఆర్‌ఎస్ నాయకుడు, న్యాయవాది కెవి ప్రతాప్ హైదరాబాద్‌లో కిషన్‌రెడ్డి సమక్షంలో బిజెపి తీర్థం పుచ్చుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ తిరుగుబాటు అభ్యర్థిగా పోటీ చేసిన కెవి ప్రతాప్ 32 వేల ఓట్లు సాధించి ఓటమి చవి చూశారు. మంచిర్యాల అసెంబ్లీ టిక్కెట్‌ను ఆశిస్తూ ప్రతాప్ తన అనుచరులతో పార్టీలో చేరినట్లు తెలుస్తోంది.
తెలంగాణపై కుట్రలు జరిగినా రాష్ట్రం ఆగదు
ఆదిలాబాద్ (రూరల్), ఫిబ్రవరి 3: తెలంగాణ రాష్ట్రంపై ఎన్ని కుట్రలు జరిగినా రాష్ట్రం ఆగదని, పార్లమెంట్‌లో బిల్లుతో విభజన ప్రారంభం అవుతుందని బిసి సంక్షేమ శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి బసవరాజు సారయ్య అన్నారు. సోమవారం ఇంద్రవెల్లి మండలం నాగోబా జాతరకు మంత్రి వెళ్తుండగా, ఆదిలాబాద్ డివిజన్‌లోని నేరడిగొండలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి అనీల్ జాదవ్ ఆధ్వర్యంలో స్థానిక నేతలు ఘన స్వాగతం పలికి మంత్రి సారయ్యను సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి సారయ్య మాట్లాడుతూ సీమాంధ్ర నేతలు, ముఖ్యమంత్రి ఎన్ని కుట్రలు చేసినా రాష్ట్రం ఏర్పాటు ఖాయమని, సిడబ్ల్యూసిలో నిర్ణయం తీసుకున్న తరువాత వెనుక వచ్చే ప్రసక్తేలేదని అన్నారు. త్వరలోనే తెలంగాణ రాష్ట్రం అవతరించనుందని, తెలంగాణ ప్రజల చిరకాల కోరిక నేరవేరనుందని అన్నారు. రాష్ట్రం ఏర్పాటుతో సమస్యలన్ని తొలగి తెలంగాణ జిల్లాలు ఇక అభివృద్ది పథంలో పయనిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఉర్దూ భాషను ఉపయోగించుకోవాలి
అఖిల భారతీయ ఎంఐఎం కార్యదర్శి అహ్మద్ పాషా ఖాద్రి
కాగజ్‌నగర్, ఫిబ్రవరి 3: ఉర్దూ బాషను ముస్లింలు ఉపయోగించుకోవాలని, దరఖాస్తులను ఉర్దూలోనే ప్రభుత్వ కార్యాలయాల్లో సమర్పించుకోవాలని అఖిల భారతీయ మజ్లీస్ ఇత్తేహాదుల్ ముస్లిమీన్ పార్టీ ప్రధాన కార్యదర్శి, చార్మినార్ ఎమ్మెల్యే అహ్మాద్ పాషా ఖాద్రీ అన్నారు. పట్టణంలోని ముస్లీం మైనార్టీ ఫంక్షన్ హాలులో సోమవారం జరిగిన ముస్లీం విద్యార్థులకు పాఠ్యాంశాల అల్ ఇన్ వన్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఉర్దు భాషను విద్యార్ధులు వినియోగించుకోవాలని, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉర్దూలోనే దరఖాస్తులను సమరించాలని ఆయన అన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో తెలుగు అనువాదకులను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు. విద్యార్థుల అభివృద్ది కోసం ఎ ఐ ఎం అన్ని చర్యలు చేపట్టుతున్నదని, విద్యార్థులకు ఉపకార వేతనాలను ఇప్పించడంలో తాము ముందు ఉన్నామన్నారు. విద్యార్థులకు 14 సంవత్సరాల క్రితమే తాము హైద్రాబాద్‌లో పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించామని, ఆదిలాబాద్, కాగజ్‌నగర్, ఆసిఫాబాద్‌లో మొదటి సారిగా పుస్తకాల పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణ అధ్యక్షులు ఎండి. ఫారూఖ్ ఆహ్మాద్, కాగజ్‌నగర్ పట్టణ అధ్యక్షులు జాకీర్ ఖురేశీ, కార్యదర్శి అబ్దుల్ మోయిన్, ఆసిఫాబాద్ పట్టణ అధ్యక్షులు శేఖ్ చాంద్, బెల్లంపల్లి అధ్యక్షులు ఇమ్రోజ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
మాజీ మంత్రి అఖిల భారత బంజార సంఘం జాతీయ నాయకులు అమర్‌సింగ్ తిలావత్ సోమవారం బిజెపి రాష్ట్ర
english title:
b
Date:
Tuesday, February 4, 2014