కరీంనగర్, ఫిబ్రవరి 3: సమన్యాయం పేరు చెబుతూ చంద్రబాబు తెలంగాణకు వ్యతిరేకంగా చేపట్టిన ఢిల్లీ పర్యటనలో సీమాంధ్రకు చెందిన పయ్యావుల కేశవును మాత్రమే వెంట తీసుకెళ్లడం వెనుక ఆంతర్యమేంటని, సమన్యాయం ముసుగులో ఇన్నాళ్లు జపం చేస్తూ వచ్చిన చంద్రబాబు సమైక్యవాదిగా వ్యవహరిస్తున్నారని కరీంనగర్ ఎంపి పొన్నం ప్రభాకర్ ధ్వజమెత్తారు. సోమవారం ఉదయం కరీంనగర్ ఆర్ అండ్ బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సమన్యాయం అన్నప్పుడు తెలంగాణకు చెందిన ఎర్రబెల్లి దయాకర్ రావును ఢిల్లీకి ఎందుకు తీసుకెళ్లలేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా చంద్రబాబు నిజస్వరూపాన్ని తెలుసుకుని టి-టిడిపి నేతలు నిలదీయాలని సూచించారు. ఇంత జరుగుతున్నా టిడిపి జిల్లా అధ్యక్షుడు చింతకుంట విజయరమణారావు పాదయాత్ర పేరుతో గ్రామాల్లో తిరుగుతున్నారని, అసలు ఆయన ఉద్ధేశ్యమేంటో చెప్పాలన్నారు. సమన్యాయం పేరు చెబుతూ తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్ని టిడిపిలో ఉంటారా? లేదా కాంగ్రెస్‌లోకి వెళ్లే ఉద్ధేశ్యమేమైనా ఉందా? అని ప్రశ్నించారు. రాష్ట్ర విభజన అంశంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రాన్ని విభజింజే హక్కు ఢిల్లీ పెద్దలకెక్కడిదంటున్నప్పుడు తెలంగాణను అడ్డుకుంటామని చెప్పేందుకు కిరణ్ కుమార్ రెడ్డి ఎవరని? మండిపడ్డారు. తెలంగాణ బిల్లు విషయంపై మాట్లాడడం కోసం దిగ్విజయ్‌సింగ్ తనను ఆహ్వానించారని, అందరం కలిసి కేంద్ర స్థాయిలో ప్రతిపక్షనేతలను సంప్రదించి భారీ మెజారిటీతో తెలంగాణ బిల్లును గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఇంకా ఈ సమావేశంలో పిసిసి కార్యదర్శులు, మాజీ మెయర్ డి.శంకర్, వై.సునీల్ రావు, కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు కన్న కృష్ణ తదితరులు ఉన్నారు.
కలెక్టరేట్ ఎదుట
అంగన్‌వాడీల ధర్నా
కరీంనగర్ టౌన్, ఫిబ్రవరి 3: తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎపి అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో సోమవారం స్థానిక కలెక్టరేట్ ఎదుట అంగన్‌వాడీలు ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. ధర్నా అనంతరం ఆ సంఘం నాయకులు కరీంనగర్ తహశీల్దార్‌కు ఏడు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గత 37 సంవత్సరాలుగా సమగ్ర శిశు అభివృద్ధి పథకం (ఐసిడిఎస్) కింద గర్భిణీ, బాలింతలకు సేవలందిస్తున్నారన్నారు.
తెల్లబడ్డ ‘పసుపు’ రైతు..!
ధర నిర్ణయంలో దళారులదే పైచేయి..
పాలకులతీరుపై అన్నదాతల ఆగ్రహం
మూడేళ్ల క్రితం క్వింటాల్‌కు 14వేలు
ప్రస్తుతం క్వింటాల్‌కు రూ. 6500లు
చేతికొచ్చే సమయంలో పడిపోతున్న పసుపు ధరలు
జగిత్యాల, ఫిబ్రవరి 3: రైతే దేశానికి రాజు అనే పాలకుల మాటలు ప్రకనలకే పరిమితమవుతన్నాయ. ఎన్నో కష్టనష్టాలకోర్చి పండించే పంటకు గిట్టుబాటు ధరలేక రైతులు విలవిలలాడుతున్నారు. పంటపండించే అన్నదాతకే తగు మద్దతు ధర నిర్ణయించే అధికారం లేకపోగా.. దళారుల చేతుల్లో పంటపోతుందని పసుపురైతు వాపోతున్నాడు. మద్దతు ధరలేక, గిట్టుబాటు ధర నిర్ణయంచలేక పసుపు వలే తమ బతుకులు తెల్ల బడుతున్నాయని రైతులు మదనపడుతున్నారు. గత మూడేళ్ల క్రితం క్వింటాలు పసుపు ధర రూ. 14వేలు పలుకగా, ప్రస్తుతం మార్కెట్లో రూ. 6500ల నుండి 6800ల వరకు మాత్రమే పలుకుతుంది. పసుపు అధిక దిగుబడి రావడంతో పంట చేతికొచ్చే సమయాల్లోనే ఆమాంతం ధరలు తగ్గిస్తూ దళారులు రైతుల బతుకులతో చెలగాటమాడుతున్నారని రైతులు ఆందోళవ్యక్తం చేస్తున్నారు. పసుపుకు మద్దతు ధరపై ప్రభుత్వ నిఘా, నియంత్రణ కరువై దళారులు నిర్ణయంచిన ధరకే విక్రయించే దుస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది సంభవించిన నష్టం పూడ్చుకొని లాభాలు పొందాలని ముందు చూపుతో వేసిన పసుపు పంటలు కొన్ని ప్రాంతాల్లో తవ్వకం చేపట్టగా మరికొన్ని చోట్ల పసుపు తవ్వకాలు చేపట్టి ఉడకబెట్టి విక్రయించే పనుల్లో రైతులు నిమగ్నమయ్యారు. కాగా శాస్తవ్రేత్తల సలహాలు పాటిస్తూ పసుపును తవ్వి ఉడికించే రైతులు కొమ్ముల్లో విషపదార్థాలను తగ్గించవచ్చని, పసుపులోని కొమ్ములుగా వేరుచేశారు. దుంపల మట్టివేళ్లను తొలగించి కడాయిలో ఉడికించేటప్పుడు మంచినీటిని పోసి, సోడియం కార్బోనెట్ కలిపి కలిపితే కొమ్ములకు నారింజ రంగు పెరిగి నాణ్యమైన పసుపు వస్తుందని రైతులు శ్రమిస్తున్నారు. నాణ్యమైన పసుపుతో అధిక లాభాలు పొందే అవకాశం ఉంటుందని శాస్తవ్రేత్తల సూచనలను పాటిస్తే శ్రమకు తగిన ఫలితం లభించడంలేదని రైతులు వాపోతున్నారు. రైతులను పట్టించుకోకుండా వ్యవసాయ మార్కెట్ కమిటీలు అలంకార ప్రాయంగానే మారాయని రైతులు ఆరోపిస్తున్నారు. గత్యంతరం లేక దళారులు నిర్ణయించిన ధరకే పసుపు పంట అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని రైతులు వ్యధ చెందుతున్నారు. దళారుల బారీన పడి ఆర్థికంగా నష్టపోకుండా ప్రభుత్వం కనీస మద్దతు ధరతో పసుపు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి తమను ఆదుకోవాలని రైతులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.