మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 3: జిల్లా ప్రజలకు రక్షణ కల్పించడమే పోలీసుల ప్రధాన కర్తవ్యమని, ప్రజలతో మమేకమై శాంతి భద్రతల పరిరక్షణ ధ్యేయంగా జిల్లా పోలీస్ యంత్రాంగం పని చేస్తోందని, పోలీసులకు కూడా ప్రజల సహకారం ఎంతో అవసరమని జిల్లా ఎస్పీ నాగేంద్రకుమార్ అన్నారు. సోమవారం ప్రజా ఫిర్యాదుల దినం సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయానికి జిల్లాలోని పలు ప్రాంతాల బాధితులు జిల్లా ఎస్పీని కలిసి నేరుగా తమ ఫిర్యాదులను అందజేశారు. ఇందులో భాగంగా ఎస్పీ నాగేంద్రకుమార్ వివిధ పోలీస్ స్టేషన్ల అధికారులతో మాట్లాడారు. కేసుల విషయాలపై కూడా ఆరా తీశారు. అపదలో ఉన్న అబాగ్యుల బాధలు తీర్చే బాధ్యత పోలీసులపై ఉందని అన్నారు. కేసుల విషయాల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసుకోవాలని, బాధితులకు అండగా నిలవాలని అన్నారు. అదే విధంగా ఫిర్యాదు దారులతో ఎస్పీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. మీ గ్రామాలకు పోలీసులు వస్తున్నారా అంటూ ఫిర్యాదుదారుల నుండి ఆరా తీశారు. ఆయా పోలీస్ స్టేషన్ల ఫోన్ నెంబర్లు, ఫిర్యాదు సెల్ నంబర్ 100 మహిళలకు ప్రస్తావిస్తూ అపద సమయాల్లో ఈ నెంబర్‌కు ఫోన్ చేయవచ్చునని అన్నారు. మహిళలు, యువతులు పోలీస్ నెంబర్లు తమ వద్ద పెట్టుకోవడం వల్ల అత్యవసర సమయాల్లో ఉపయోగపడతాయని ఎస్పీ తెలిపారు. మహిళలకు రక్షణ కల్పించడానికి జిల్లా పోలీసులు అదునాతన పరిజ్ఞానంతో కూడా రక్షిత విభాగం ఏర్పాటు చేసిందని తెలిపారు. పోకిరీలు యువతుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే అరదండాలతో పాటు కఠిన శిక్షణలు తప్పవని మహిళలకు ఎస్పీ భరోసా ఇచ్చారు. అనంతరం జిల్లా ఎస్పీ ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. దొనూరు గ్రామానికి చెందిన రమేష్ అనే వ్యక్తి మృతికి కారకులైన వ్యక్తులను అరెస్టు చేయాలని మృతుడి భార్య ఉమ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తెలకపల్లి మండలం గట్టుమేలికూదురు గ్రామానికి చెందిన ఈశ్వరమ్మ తమ కుటుంబ సభ్యులపై దాయాదులు దాడులకు పాల్పడుతున్నారని, హత్య చేస్తామని బేదిరిస్తున్నారని ఎస్పీ ముందు వేడుకున్నారు. వివిధ గ్రామాలకు చెందిన ఫిర్యాదుదారులు అందించిన ఫిర్యాదులను ఎస్పీ స్వీకరించారు. ఫిర్యాదులపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని బాధితులకు ఎస్పీ హామీ ఇచ్చారు. అనంతరం పోలీస్ శాఖకు సంబంధించిన 2014 సంవత్సరం డైరీని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ప్రదీప్‌రెడ్డి, డిఎస్పీలు మల్లికార్జున్, ఆంథోనప్ప, పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్, సభ్యులు అప్పలనాయుడు, తిరుపాజీ, గుణవర్దన్, పిఆర్‌ఓ రంగినేని మన్మోహన్ తదితరులు పాల్గొన్నారు.
* జిల్లా ఎస్పీ నాగేంద్రకుమార్
english title:
p
Date:
Tuesday, February 4, 2014