శ్రీకాకుళం, ఫిబ్రవరి 4: ఆదిత్యుని దర్శించుకునేందుకు వస్తున్న భక్తులకు ఈ సారి కూడా కష్టాలు తప్పేటట్లు లేదు. రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఏటా లక్షలాది మంది భక్తులు ఆదిత్యుని దర్శించుకునేందుకు అరసవల్లి పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఉండేందుకు ఏర్పాట్లన్నీ పూర్తి చేశామని కమిటీ ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల సహకారంపైనే ఆధారపడుతున్నామంటూ భక్తులు చెప్పడం విశేషం. రథసప్తమికి గడువు సమీపిస్తుండడంతో యంత్రాంగం తలమునకలై ఉంది. బుధవారం రాత్రికే దూరప్రాంతాల నుంచి భక్తులు అరసవల్లి చేరుకోనున్నారు. వీరందరికి అరసవల్లి పరిసర ప్రాంగణాలే వేదికగా మారనున్నాయి. మంచినీళ్ల ప్యాకెట్ల దగ్గరనుంచి స్వామి దర్శనం చేసుకుని తిరిగి వచ్చేవరకూ స్వచ్ఛంద సంస్థలు కీలకపాత్ర పోషించనున్నాయి. ఇదిలా ఉండగా కొందరు ప్రముఖులు టిక్కెట్ల కోసం దేవాదాయ శాఖ, పోలీసు, అర్చకులపైనే ఆధారపడి ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. దీంతో సామాన్య భక్తులకు దర్శన టికెట్లు లభిస్తాయో లేదోనన్న అయోమయం నెలకొంది. ఈ సారి క్షీరాభిషేక సేవ(216 రూపాయలు), వందరూపాయల దర్శనం టిక్కెట్లు ముందుగా విక్రయించకపోవడంతో ఈ మూడుశాఖలు అయోమయంలో పడ్డాయి. ఆలయ అభివృద్ధికి దాతలే ప్రముఖ పాత్ర పోషిస్తారు. విరాళాలు, చందాల రూపేణా ఆలయ అభివృద్ధికి సహకరిస్తుంటారు. అలాంటిది స్వామివారి దర్శన భాగ్యం తమకు లభిస్తుందో లేదోనన్న మీమాంసలో దాతలు ఉండడం గర్హనీయం. క్షీరాభిషేక సేవ 216 టిక్కెట్లకు బుధవారం రాత్రి 11 గంటల నుంచి రథసప్తమి పర్వదినం(గురువారం) ఉదయం ఐదు గంటల వరకు అనుమతిస్తుండడంపై దాతలు గుర్రుగా ఉన్నారు. ఆలయ అభివృద్ధిలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న తమకు క్షీరాభిషేక సేవలో అవకాశం కల్పించకుండా గురువారం ఉదయం ఐదు గంటల నుంచి పది గంటల వరకు ప్రత్యేక సమయాన్ని కేటాయిస్తుండడంపై వారు ఇప్పటికే అసంతృప్తితో ఉన్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా ఒక డోనర్ పాసుపై నలుగురి వరకు దేవాదాయశాఖ స్వామి దర్శనానికి అనుమతిస్తోంది. ఎప్పటిలాగే డోనర్ పాసులను అరసవల్లి వచ్చి తీసుకోవలసిందిగా తగు సూచనలు జారీ చేసినట్లు దేవాదాయ శాఖ చెబుతుండగా, ఈసారి మాత్రం డోనర్ పాసులను 50కు పైగా ఒకే వ్యక్తికి అందించినట్లు దేవాదాయ శాఖ సిబ్బంది నుంచే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ కమిటీ ప్రతినిధుల మధ్య సమన్వయం కొరవడడం, రథసప్తమి పర్వదినంపై పక్కా ప్రణాళిక లేకపోవడంతో ఆదిత్యున్ని దర్శించుకునే తమకు ఈ సారి ఇబ్బందులు తప్పేలా లేవని భక్తులు ఆందోళన చెందుతున్నారు.
ఆదిత్యుని దర్శించుకునేందుకు వస్తున్న భక్తులకు ఈ సారి కూడా కష్టాలు
english title:
ratha sapthami
Date:
Wednesday, February 5, 2014