శ్రీకాకుళం, ఫిబ్రవరి 4: రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు మున్సిపల్ కార్మికులు ఈ నెల 8వ తేదీన సమ్మె చేయనున్నట్లు ఎపి మున్సిపల్ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ జిల్లా కన్వీనర్ ఎన్.బలరాం తెలిపారు. మంగళవారం ఈమేరకు సిటు ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మను స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద దగ్ధం చేశారు. అనంతరం కార్యాలయం గేట్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ఉద్ధేశించి ఆయన మాట్లాడుతూ కార్మికులతో ప్రభుత్వం గొడ్డుచాకిరీ చేయించుకుంటూ కనీసవేతనం అమలుచేయకపోవడం అన్యాయమన్నారు. కార్మికులకు కనీసవేతనం 12500 రూపాయలు అందజేయాలని, కరువుభత్యంతోపాటు కాంట్రాక్టు కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ సిబ్బందికి ఇండ్ల స్థలాలు ఇవ్వాలన్న ప్రభుత్వ జీవోను తక్షణమే అధికారులు అమలుచేయాలన్నారు. వివిధ మున్సిపల్ పాఠశాలల్లో పనిచేస్తున్న పుల్‌టైం వర్కర్లగా గుర్తించి వారి సమస్యలు పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు ఎన్.వెంకటరావు, కె.వేణుగోపాల్‌రావు, ఎ.గణేష్, ఆర్.యుగంధర్, ఎ.లక్ష్మి, ఎన్.శ్రీను తదితరులు పాల్గొన్నారు.
జిల్లా సమాఖ్యలో వాదులాట
ఎచ్చెర్ల, ఫిబ్రవరి 4: స్వయం సహాయక సంఘాలకు ప్రభుత్వం అందించే వివిధ కార్యక్రమాల లక్ష్యాలపై సమీక్షించాల్సిన జిల్లా సమాఖ్య సమావేశం వాదులాటకు వేదికగా మారింది. మండల కాంప్లెక్స్ ఆవరణలో ఉన్న డిఆర్‌డిఏ సాంకేతిక శిక్షణా కేంద్రంలో మంగళవారం నిర్వహించిన జిల్లా మహిళా సమాఖ్య సమావేశం రసాభాసకు దారితీసింది. ఐకెపి అధికారులు, జిల్లా మహిళా సమాఖ్య ప్రతినిధులు పరస్పరం దూషణలకు దిగారు. పొందూరు మండలంలో ఎ.పి.ఎం.గా పనిచేస్తున్న ఎస్.వెంకటేశ్వరరావుపై నందివాడ సర్పంచ్ మజ్జి గోపాలకృష్ణ ఇటీవలి దాడి చేసినప్పటికీ జిల్లా సమాఖ్య స్పందించలేదని ఐకెపి సిబ్బంది నిలదీశారు. ఇలా అయితే విధులు నిర్వహించలేమని వారంతా తెగేసి చెప్పారు. దీనిపై తీవ్రంగా స్పందించిన జిల్లా మహిళా సమాఖ్యప్రతినిధులు, సర్పంచ్‌లు ప్రభుత్వానికి, మహిళా సంఘాలకు వారధులు వంటివారని, అటువంటివారిని దూరం చేసుకోవడం సరికాదని హితవుపలికారు. దాడిని ఖండించకుండా సర్పంచ్‌లను మహిళా సంఘం ప్రతినిధులు వెనకేసుకురావడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించగా ఒకానొక దశలో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇదే సమయానికి ఇక్కడకు చేరుకున్న ల్యాండ్ ఎ.పి.డి ధర్మారావు ఇరువర్గాలను శాంతింపజేయడంతో తాత్కాలికంగా వివాదం సద్దుమణిగింది. అనంతరం జిల్లా మహిళా సమాఖ్య సమావేశం యధావిధిగా కొనసాగింది.
అనుచరులతో కలసి వైసిపిలో చేరుతా
- ఎమ్మెల్యే జగన్నాయుకులు
మందస, ఫిబ్రవరి 4: పలాస నియోజకవర్గంలోని సర్పంచ్‌లు, ఎంపిటిసిలు కార్యకర్తలంతా కలసి ఈ నెల 9న శ్రీకాకుళంలో జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసిపిలో చేరుతున్నట్లు పలాస ఎమ్మెల్యే జుత్తు జగన్నాయకులు తెలిపారు. తన అనుచరులతో మంగళవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జగన్నాయుకులు మాట్లాడుతూ ధర్మాన ప్రసాదరావు ఆధ్వర్యంలో మూకుమ్మడిగా పార్టీలో చేరేందుకు కార్యకర్తలంతా ఉత్సాహంగా ఉన్నారన్నారు. పార్టీ కార్యకర్తలకు కేడర్ అంతా ఈ నెల 9న శ్రీకాకుళంలో జరిగే బహిరంగ సభకు తరలిరావాలని పిలుపునిచ్చారు. తనకు దివంగత నేత వై ఎస్ రాజశేఖరరెడ్డి , ధర్మాన ప్రసాదరావు రాజకీయ భిక్ష పెట్టారని, వారి అడుగు జాడల్లో నడవాల్సిన బాధ్యత ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మెట్ట కుమారస్వామి, బి మధు, టి గురుమూర్తి, తేజేశ్వరరావు, జుత్తు విజయలక్ష్మి, ధన లక్ష్మి, జానకిరావు, సర్పంచ్‌లు మాజీ ఎంపిటిసిలు కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆర్వీఎం రాష్ట్ర పరిశీలకునిగా ‘పైడి’
శ్రీకాకుళం, ఫిబ్రవరి 4: రాజీవ్ విద్యామిషన్ పరిధిలోని ఎస్సీఆర్టీ, ఎస్‌ఐఇఎంఎటిలు సంయుక్తంగా నిర్వహిస్తున్న రాష్టస్థ్రాయి సామర్ధ్యాల మదింపు సర్వేకు రాష్ట్ర పరిశీలకునిగా పైడి వెంకటరమణ నియమితులైనారు. ఈ మేరకు మంగళవారం ఆయనకు ఆర్వీయం రాష్ట్ర పథక సంచాలకుల నుండి ఉత్తర్వులు అందాయి. పలాస మండలంలో సైన్సు ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న పైడి రాష్ట్ర పరిశీలకునిగా తూర్పుగోదావరి జిల్లాకు పనిచేయనున్నారు. ఈయన 3,5,8 తరగతులకు సబ్జెక్టుల వారీగా సర్వే చేయడానికి గాను ఈనెల 6,7 తేదీల్లో ఎంపిక చేయబడిన పాఠశాలల్లో సర్వే నిర్వహించబడుతుందన్నారు. పైడి నియామకం పట్ల ఆర్వీయం రిసోర్సు పర్శన్ మహేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు.
తొలిదశలో కేన్సర్ గుర్తిస్తే నివారణ సాధ్యం
శ్రీకాకుళం, ఫిబ్రవరి 4: కేన్సర్ పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, తొలిదశలో గుర్తించడం ద్వారా కేన్సర్‌ను నివారించవచ్చని రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ తెనే్నటి జయరాజ్ అన్నారు. మంగళవారం ప్రపంచ కేన్సర్ దినోత్సవం సందర్భంగా స్థానిక రిమ్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ముందుగా కేన్సర్ వ్యాధిని గుర్తించేందుకు ఈ నెల 8వ తేదీ వరకు స్క్రీనింగ్ క్యాంపులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో కేన్సర్ వ్యాధిని గుర్తించేందుకు అవసరమైన స్క్రీనింగ్ టెస్టులు రిమ్స్‌లో అందుబాటులో ఉన్నట్లు తెలియజేశారు. కేన్సర్ వ్యాధి ముందుగా గుర్తించలేమనే అపోహ, మూడనమ్మకం ప్రజల్లో ఉందని, వాటిని తొలగించేందుకు కృషిచేస్తున్నామన్నారు. తొలిదశలో కనిపించే లక్షణాలను గుర్తించి తగు జాగ్రత్తలతో పాటు చికిత్స అందించడం ద్వారా నివారించవచ్చని తెలిపారు. జిల్లాలో పెద్దప్రేవు కేన్సర్, జీర్ణాశయ కేన్సర్, ఊపిరితిత్తుల కేన్సర్ వంటివి ఎక్కువగా ఉన్నట్లు కేసులు నమోదవుతున్నాయన్నారు. సమతుల్య ఆహారపు అలవాట్ల ద్వారా వాటిని నివారించవచ్చన్నారు. అనంతరం ప్రపంచ కేన్సర్ దినోత్సవ బేనర్‌ను ఆవిష్కరించారు. సమావేశంలో కళాశాల డీన్ డాక్టర్ ప్రసాదరావు, రిమ్స్ సూపరింటెండెంటు ఆర్.అరవింద్, డాక్టర్ అమూల్య తదితరులు పాల్గొన్నారు.
రథసప్తమికి ట్రాఫిక్ ఆంక్షలు
శ్రీకాకుళం, ఫిబ్రవరి 4: పట్టణంలో వేంచేసియున్న అరసవల్ల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దర్శనార్థం రథసప్తమికి విచ్చేసే భక్తులు ట్రాఫిక్ ఆంక్షలు పాటించాలని డిఎస్పీ పి.శ్రీనివాసరావు, ట్రాఫిక్ సిఐ కె.విజయ్‌కుమార్‌లు మంగళవారం వేర్వేరు ప్రకటనల ద్వారా తెలిపారు. లైట్ వెహికల్ వాహనాలు 80 అడుగుల రోడ్డులో పార్కు చేసుకోవాలని, ద్విచక్రవాహనాలను వ్యవసాయ మార్కెట్ యార్డులో పార్కింగ్ చేసుకోవాలని సూచించారు. బందోబస్తు పర్యవేక్షించే అధికారుల వాహనాలు, డోనర్ టిక్కెట్లు కలిగిన వారి వాహనాలు వ్యవసాయ మార్కెట్ యార్డువద్ద మామిడితోటలో పార్కింగ్ చేసుకోవాలన్నారు. వివిఐపిల వాహనాలు తప్ప అన్ని వాహనాలు వ్యవసాయ మార్కెట్ యార్డు దాటి లోపలకు అనుమతించబడవన్నారు. గార, శ్రీకూర్మం నుండి వచ్చు వాహనాలు గ్యాస్ గొడౌన్ వద్ద పార్కింగ్ చేసుకోవాలన్నారు. గార, శ్రీకూర్మం నుండి పట్టణంలోకి రావాలనుకున్న ప్రజలు అంపోలు గ్రామం మీదుగా మల్లించినట్లు తెలిపారు. పట్టణం నుండి అరసవల్లి వచ్చు వాహనాలు ఏడు రోడ్ల కూడలి, జిటిరోడ్డు, సూర్యమహల్ కూడలి మీదుగా మిల్లు కూడలికి చేరుకోవాలన్నారు. తిరుగుపయణం కావాలనుకునే వారు కళింగరోడ్డు మీదుగా వెల్లాలని సూచించారు. ప్రజలు సహకరించాలని కోరారు.
వినియోగదారుల ఫోరం సేవలు ప్రశంసనీయం
శ్రీకాకుళం, ఫిబ్రవరి 4: జిల్లా వినియోగదారుల ఫోరం చైర్మన్ పప్పల జగన్నాధరావు కక్షిదారులకు అందించిన సేవలు ప్రశంసనీయమని, జిల్లా కీర్తిప్రతిష్ఠలను రాష్టమ్రంతా ఇనుమడింపజేశారని జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పి.వి.రమణ అన్నారు. మంగళవారం జిల్లా బార్ అసోసియేషన్ కార్యాలయంలో వినియోగదారుల ఫోరం చైర్మన్‌గా పనిచేసి పదవీ విరమణ చేసిన జగన్నాధరావు అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తి మల్యాద్రి మాట్లాడుతూ జగన్నాధరావు న్యాయమూర్తిగాను, జిల్లా వినియోగదారుల ఫోరం చైర్మన్‌గా అందించిన సేవలు శ్లాఘనీయమని కొనియాడారు. న్యాయమూర్తిగా విధులు నిర్వహిస్తూ పలువురు న్యాయమూర్తులకు, న్యాయవాదులకు ఆదర్శమైన వ్యక్తిగా ఆయనను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ కోర్టు న్యాయమూర్తి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ న్యాయమూర్తిగా సేవలందించడమే కాకుండా ఒక ఆరోగ్యవంతమైన వ్యక్తిగా ప్రతీ మనిషికి ఆదర్శప్రాయంగా నిలబడ్డారు. సీనియర్ న్యాయవాదులు టి.రాధాకృష్ణ, రమణదయాల్, పలువురు న్యాయవాదులు న్యాయమూర్తి సేవలను కొనియాడారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ కార్యదర్శి కృష్ణప్రసాద్, పలువురు సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. అనంతరం పి.జగన్నాధరావును బార్ అసోసియేషన్ మెమోంటోతో సత్కరించగా పలువురు న్యాయవాదులు పూలమాలలు అందించారు. ఇదే కార్యక్రమంలో పదవీ విరమణ చేసిన ఎ.పి.పి కిల్లాన మాధవరావుకు బార్ అసోసియేషన్ ఘనంగా సన్మానించింది. ఈయన జిల్లా బార్ అసోసియేషన్‌లో సభ్యునిగా ఉంటూ ఎ.పి.పి.గా వివిధ కోర్టుల్లో విధులు నిర్వహించి జిల్లా కేంద్రంలో పదవీ విరమణ చేసిన మాధవరావు జిల్లా కీర్తిప్రతిష్ఠలను ఇనుమడింపజేశారని పలువురు న్యాయవాదులు కొనియాడారు.
పార్టీల తాయిళాలకు ప్రజలు లొంగరు
శ్రీకాకుళం, ఫిబ్రవరి 4: రాష్ట్రంలో ప్రజలు తాయిలాల కోసం ఎదురుచూడకుండా ఎదిగే అవకాశాలు కోరుకుంటున్నారని లోక్‌సత్తా పార్టీ జిల్లా అధ్యక్షుడు కొత్తకోట పోలినాయుడు తెలిపారు. మంగళవారం స్థానిక పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో టిడిపి, వైకాపాల అధినేతలు ఆచరణ సాధ్యం కాని వాగ్ధానాలు చేస్తున్నారని, ఆయా హామీలు నెరవేర్చాలంటే రాష్ట్ర బడ్జెట్ ఎంతన్నది ఆలోచించాలని అన్నారు. అధికారం కోసం రాష్ట్ర భవిష్యత్ లేని హామీలు ఎందుకని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రజలకు తాయిలాలు కాకుండా ప్రజలు అభివృద్ధిలో పైకిరావడానికి కృషిచేయాలని పేర్కొన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి పంచాది రాంబాబు మాట్లాడుతూ కొందరు నేతలు రాజకీయాల్లో డబ్బు సంపాదనే ధ్యేయంగా పనిచేస్తున్నారని, సేవకోసం వచ్చిన వారు తక్కువగా ఉన్నారని అన్నారు. నాయకులు సంపాదన చూసుకోవడంతోనే రాష్ట్రం రావణకాస్టంలా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో వి.అప్పలరాజు, బి.వైకుంఠరావు తదితరులు పాల్గొన్నారు.